పెదతండ్రి ప్రభాకరుని జ్ఞానభానువులు తాకగా
‘విశ్వనాథు’ని దివ్యాశీర్వచనములు తోడవగా
వేటూరి చేసె గేయ రచనలెన్నో అలవోకగా
వెల్లివాఱెనవి సుందర సినీ గీతికల యేరుగా!
రామచక్కనిది ఆ పదకవితల సింగిడి వన్నెల తోరణం
మన భాష తరమా తీర్చుట ఆయన పట్టిన కలం ఋణం
మౌల్యాభరణమై సింగారించెను వేటూరిని ‘శంకరాభరణం’
మూర్తీభవించిన పుంభావ సరస్వతి ఈ కవికుల భూషణం!
పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలని విచారింపజేసి, అంతలో
అల్లన మోవిపై వాలితే గేయాలని, గాయాలని మరిపించినా,
ఆకుచాటు పిందె తడిసెనని, ఇందువదన కుందరదన అని
కుర్రకారుతో చిందులు వేయించినా, అవి ఈ కవి విరచితాలే!
ఓ సీత కథతో చిత్రసీమలో తన అనిరుద్ధ ప్రస్థానం ప్రారంభించి
కృషి ఉంటే ఋషులవుతారని అడవిరాముడి నోట పలికించి
మాతృదేవోభవతో జాతీయ పురస్కారమును పరిగ్రహించి
బద్రీనాథ్‌తో పయణం ముగించె, యశము ఆచంద్రార్కమవగా!
చదువులజవరాలు విరించికి ఆశువుగా పాట వినిపించగా,
ఆ పాటలో అక్షరమో, పదమో, పాదమో, భావమో తడబడగా,
ఆ తడబాటుని సవరించ, హడావుడిగా మన పాటలూరి మేటి,
వేటూరిని వేల్పుటూరుకి తోడ్కొని వెళ్ళెనేమో ఆ విద్దెలతల్లి!