Menu Close
nirmalaadithya author
కథ వెనుక కథ
-- నిర్మలాదిత్య --

బ్యాంకుల జాతీయకరణ 1969 ఇందిరా గాంధీ హయాంలో జరిగిన తరువాత బ్యాంకింగ్ రంగంలో గొప్ప మార్పులే వచ్చాయి. అది వరకు నగరాలకు మాత్రమే పరిమితమైన బ్యాంకులు గ్రామాలకు విస్తరించడం మొదలయ్యింది. 1984 లో నేను రిజర్వ బ్యాంక్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు, అక్కడి బ్యాంకింగ్ రంగం లో పని చేస్తున్న నన్ను టాస్క్ ఫోర్స్ లీడ్ గా, నాబార్డ్, సెక్రటేరియట్ లోని ప్రభుత్వ ఆర్థికాధికార్ల తో కలిసి, రవాణా సదుపాయాలు లేని పలు కుగ్రామాలను జీపులలో తిరిగి బ్యాంక్ బ్రాంచి లు తెరవడానికి అనువుగా గుర్తించాల్సి వచ్చింది. దానికి కారణం, భారతీయ పౌరులందరికీ బ్యాంక్ సదుపాయాలు అందుబాటు లో ఉండాలని, ఎవరూ 10 కిలోమీటర్ లకు మించి బ్యాంక్ బ్రాంచి కోసం ప్రయాణం చేయకూడదన్నది ప్రభుత్వాశయం.

మరత్వాడ లోని అలాంటి ఒక కుగ్రామం, అమళనేర్(బాండ్సాచి). మీరు గూగుల్ మ్యాప్స్ లో వెదికితే దొరుకుతుంది. సజీవమైన గ్రామమే. రాయల సీమలో అలాంటి గ్రామంలోనే పుట్టి, అలాంటి వాతావరణంలో చాలా వేసవి కాలాలు గడిపాను కాబట్టి, కథలో అల్లిన సన్నివేశాలు, కేవలం నవ్వించడానికి వ్రాసినవే. ఈ కథ వ్రాయడానికి, ఎప్పటిలా మెదడు తొలిచే పి. జి. వోడ్హౌస్ తో పాటు మా మామ కొడుకు మహేంద్ర వ్రాసిన నవలిక ‘స్వర్ణ సీమ కు స్వాగతం‘ ప్రభావం కూడా ఉండి ఉండాలి. మహేంద్ర నాకంటే ఒక ఐదేళ్లు చిన్న వాడైనా, అప్పటికే తెలుగులో మంచి యువ రచయితగా పేరు తెచ్చుకున్నాడు. తను వ్రాసిన ‘జర్తె’, ‘హోగినేకల్’ లాంటి కథలు అప్పటికే పాఠకులను కుదించి, మహేంద్ర కు గుర్తింపు తెచ్చాయి. ఆంధ్రజ్యోతి లో ధారావాహికంగా వచ్చిన మహేంద్ర ‘స్వర్ణ సీమకు స్వాగతం’ నేను నవలిక గా పుస్తక రూపంలో వచ్చిన తరువాతే చదివాను. ఆ నవలికలో ఉన్న వర్ణనలు చదివిన తరువాత, చాలా రోజులు అవి దృశ్య చిత్రాలుగా నన్ను వెంటాడుతూనే ఉండేవి. మంచి రచనలు పాఠకులను కొత్త ప్రదేశాలకు తీసుకుపోయి, కొత్త మనుషులను పరిచయం చేస్తూ, వాటిని నిజ జీవిత అనుభవాల లాగా మన జ్ఞాపకాలలో నిక్షేపం చేస్తాయి. ఆ ప్రయత్నం ఈ కథలో కొంత కనిపిస్తుంది.

ఇది ఒక సాదా, సీదా కథ. కాలక్షేపానికి వ్రాసింది. పెద్ద సందేశాలు ఏమీ లేవు. బ్యాంక్ పని కోసం, అదీ పెళ్లి కాని యువకులను తరచూ ఊళ్లు తిప్పే కాలం. నగరంలో పెరిగిన కుర్రాళ్ల దృష్టి తో చూసిన పల్లె వాతావరణం, ఈ కథ.

ఈ కథ 1992 లో వ్రాసి ఆంధ్రప్రభ కు పంపించిన తర్వాత, కథ నచ్చింది రాబోయే సంచికలలో వేస్తాం అన్న జవాబు వెంటనే వచ్చింది. 1993 ఆగస్టు లో నన్ను రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఒక సంవత్సరం సబ్బాటికల్ కని అమెరికాలోని యూనివర్సిటీలో ఒక సంవత్సరం చదువుకోవడానికి పంపించారు. నేను అమెరికా పోతున్నానని, తెలుగు వార పత్రికలు మరో సంవత్సరం వరకు అందుబాటులో ఉండవని, సంవత్సరం పైన కథ తమ వద్ద ప్రచురించకుండా అట్టే పెట్టుకోవడం బాగా లేదని, కొంచెం గట్టిగానే ఉత్తరం వ్రాసాను. మామూలుగా పత్రికలు అంత సమయం తీసుకోవడం నేను చూడ లేదు. విపుల లాంటి మాస పత్రికలే మూడు నెలల లోపు ప్రచురించేవి.బహుశా నా కథ ఎక్కడో తప్పిపోయి ఉండాలి. మొత్తానికి ఈ కథ నేను అమెరికా పోయే ఒకటి రెండు వారాల ముందే వేశారు.

ఈ కథ జరిగిన సమయం 1980 ప్రాంతంలో అయితే, 1990 దశాబ్దం కల్లా, నా పనిలోనూ, ప్రపంచంలోనూ చాలా మార్పులు వచ్చాయి. రిజర్వు బ్యాంక్ వాళ్ళు ఆ కాలంలో చాలా సార్లు, నేను పని చేస్తున్న చెన్నై ఆఫీసు నుండి ముంబై సెంట్రల్ ఆఫీస్ కు పిలిచేవారు. అప్పటికే ఈ నగరాల మధ్య డెడికేటెడ్ కేబుల్ వేయడం వల్ల, నాకు అక్కడి కంప్యూటర్ సిస్టమ్ లు కూడా అందుబాటు లో ఉండేవి. కొన్ని చిన్న పనులు నేను రిమోట్ గానే ముంబై సిస్టమ్ కు లాగ్ అయ్యి చేయడం మొదలెట్టాను. బహుశా అలా రిమోట్ జాబ్ భారత దేశంలోని ప్రభుత్వ సంస్థలలో చేయడం మొదలయ్యింది నాతోనే అనుకుంటాను. దానికి కారణం ఆ రోజులలో అలాంటి సదుపాయం ఒక రిజర్వ్ బ్యాంక్ లో మాత్రం ఉండేది.

సమాజంలో వచ్చిన మార్పుల వల్ల ఈ కథ ’డేటెడ్’ గా అనిపిస్తుంది. ఆ విధంగా నేను సామాన్యంగా వ్రాసే కథల కన్న, ఈ కథ బిన్నమైనదని, నా కథలు చదివే పాఠకులు ఇట్టే పట్టేయగారు.

నిర్మానుష్యమైన అడవి మధ్యలో జీప్ టైర్ ఫ్లాట్ అయ్యి, డ్రైవర్ స్టెప్నీ లేదని, చాలా సేపు తరువాత ఆ దారిలో వచ్చిన లారీ లో వెళ్ళి, మరో ఎనిమిది గంటలకు తిరిగి రాని సమయంలో, అక్కడి నుంచి ఒక ఐదు కిలోమీటర్ లు నడిచి ఒక అగంతకుడిని కలవడం, అతడు ఎంతో ఆప్యాయతతో, ఆతృతతో వాళ్ళావిడని వంటకు పురమాయించి మాకు వడ్డించిన భోజనం రుచి – వర్ణ శక్యమా? అదీ అసలు కథ. ఇంకా వ్రాయవలసి కథ. అలాంటి కథలెన్నో ఉన్నాయి…

అమళనేరు (బాండ్సాచి)

alamaneru-bandsachi

రాజా వయస్సు ఇరవైనాలుగు. మంచి తెలివైనవాడు. ఎమ్‌.ఎస్‌.సి. చదివేటప్పుడు సరదాకని వ్రాసిన ప్రొబేషనరీ ఆఫీసర్‌ పరీక్షలలో నెగ్గడంతో, ఓ బ్యాంక్‌లో చేరి పోయాడు. చిన్నప్పటి నుంచి నగరంలోనే పెరిగాడు. అందుకోసమేనేమో సిటీ కుర్రాడిలాగే మంచి మంచి డ్రెస్సులలో క్రొత్త బ్యాంకు నోటులా మెరిసిపోతుంటాడు.

బ్యాంకులో ఉద్యోగమంటే ఎక్కువగా పల్లెలలోనే పని చేయవలసి వస్తుందని బ్యాంకులో చేరింతరవాతనే తెలిసింది రాజాకు. మొదటి రెండు సంవత్సరాలు శిక్షణ పేరుతో ఓ రెండు పట్టణాలలో, మరో రెండు జిల్లా కేంద్రాలలో పడేయడంతో ఫరవాలేదులే అనుకున్నాడు. దానికి తోడు నెల నెల ఠంచనుగా అందే జీతం, రాజా మరో ఉద్యోగం వెదుక్కోకుండా చేసింది.

అలా రెండు సంవత్సరాలు కులాసాగా గడిపేసిన తరువాత, రాజా చేతికి ఓ బదిలీ ఉత్తర్వు అందించారు. రాజాను అమళనేరు (బాండ్సాచి) కి బ్రాంచ్‌ మేనేజర్‌గా వేశారు. ఆఫీసులో వారిని ఈ బ్రాంచ్‌ ఎక్కడుందని అడిగాడు. వారు పిన్‌కోడ్‌ బట్టి మహారాష్ట్రలో ఉండొచ్చుననుకుంటున్నామన్నారు. ఆ రోజు రాత్రి తన దగ్గరున్న అట్లాసు ముందేసుకుని అమళనేరు (బాండ్సాచి) ని వెదకసాగాడు. మహారాష్ట్ర మొత్తం ఆ రాత్రంతా సర్వే చేసినా రాజాకు తనకు కావలసిన ఊరు దొరకలేదు. మరుసటి రోజు రీజనల్‌ మేనేజర్‌ను కలుసుకుని తనను పోస్టు చేసిన ఊరు అట్లాసులో కూడా లేదని బాధపడితే ‘‘ఇంకా నిన్ను గోదావరి లంకల్లోని  వెంకటాపురంకు వేయలేదు, సంతోషించు’’ అని పంపించేశాడు.

ఆ రోజే మహారాష్ట్ర నుంచి వచ్చిన మరో ఆఫీసరును కలిసి, తను పని చేయబోయే ఊరు బీడ్‌ దగ్గర ఉందని తెలుసుకున్నాడు.

ఆ రోజు సాయంత్రం రాజా అజంతా ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి మరుసటి రోజు ఔరంగాబాద్‌లో బస్సు మారి 12 గంటలకల్లా బీడ్‌ బస్టాండ్‌లో ఉన్నాడు. ఒక చేతిలో సూట్‌ కేసు, మరో చేతిలో బెడ్డింగ్‌. బ్రహ్మచారి కాబట్టి ఇదే అతని ఆస్తి. బస్టాండ్‌లో పోయి అమళనేరు గురించి అడిగాడు.

‘‘ఈ జిల్లాలో పది అమళనేర్లున్నాయి. ఏ అమళనేరు వెళ్లాలి’’ అంటూ తుపుక్కున అక్కడ పక్కనున్న గోడపై ఉమ్మేశాడు, బస్టాపులో ఎంక్వయిరీలో ఉన్నతను. అమళనేరు పక్కన బాండ్సాచి అని ఎందుకు వ్రాశారో ఇప్పుడర్థమయింది రాజాకు.

‘‘అమళనేరు (బాండ్సాచి)’’ అని తిరిగి ప్రశ్నార్థకంగా చూశాడు రాజా. ఎంక్వయిరీ అతను ఉండమన్నట్టు చేతితో సైగ చేసి - జేబులో నుంచి ఓ డబ్బా తీసి, అందులో నుంచి పొగాకు, సున్నం తీసి అర చేతిలో పూసుకుని, ఓ రెండు నిమిషాలు తీరిగ్గా అర చేతిలో ఉన్న మిశ్రమాన్ని రెండో చేతి చూపుడు వేలుతో బాగా కలిపి, నోరు తెరిచి ఓ చెత్తో బుగ్గపట్టుకున లాగి పండ్లకు, బుగ్గకు మధ్య ఉన్న సందులో ఆ పొడి పెట్టుకుని ‘‘ఆ అమళనేరు (బాండ్సాచి) నా? పదిన్నర గంటలకు ఓ ఎర్ర బస్సు వస్తుంది అందులో ఎక్కు. ఆ ఊరికి రోజుకొకటే బస్సు వస్తుంది’’ అన్నాడు.

రాజా అనుమానం వచ్చి ‘‘ఇక్కడున్న బస్సులన్నీ ఎర్రగానే ఉన్నాయిగా’’ అన్నాడు.

‘‘ఈ బస్సు మొత్తం ఎర్ర రంగులోనే ఉంటుందిలేవయ్యా. నీవు పోయి చూడు. సులభంగానే గుర్తుపడతావు’’ అన్నాడు.

పదిన్నర గంటల ప్రాంతంలో ఓ ఎర్ర బస్సు నిజంగానే ఎర్రగా వచ్చి ఆగింది. దీని కిటికీలు డ్రైవరు ముందు అద్దాలు కూడా ఎర్రటి ఎరుపు రంగులోనే ఉన్నాయి. ఆశ్చర్యం ఆ బస్సులో నుంచి దిగుతున్న మనుష్యులు కూడా ఎర్రరంగులోనే ఉన్నారు.

రాజా ఆ బస్సు వైపు నడుస్తుంటే ఆ బస్సులో నుంచి దిగిన ఓ రెడ్‌ ఇండియన్‌ ‘‘మీ పేరు రాజానా’’ అని ఇంగ్లీషులోనే అడిగాడు. రాజా అవుననగానే రాజా చేతిలో నుంచి సూట్‌కేస్‌ లాక్కుని, మరో చేతిలోని బెడ్డింగ్‌ తన తలపై కెత్తించుకుని -

‘‘రండి రాజా గారు మన బస్సు అదే’’ అని ఎర్ర బస్సు వైపు పరుగు తీశాడు. అప్పటికే ఆ బస్సులో ఎక్కడానికి మనుష్యులు తోసుకుంటున్నారు. రాజా సామాన్లు ఆ బస్సులో ఎలానో చేర్చి, ఆ కొత్తతను రాజాకని ఓ సీట్లో తన కర్చీఫ్‌ వేసి, బస్సులో జనాన్ని తోసుకుని దిగి-

‘‘నేనేనండి ప్రస్తుతం అమళనేరు (బాండ్సాచి)కి మేనేజర్‌. బ్రాంచ్‌లో చెక్‌ చేయడానికి ఏమీ లేదు. కాష్‌ లిమిట్‌ కూడా పది వేలే. మీరు ఈ బ్రాంచ్‌ తాళం చెవులు తీసుకున్నారంటే నేను చాలా సంతోషిస్తాను నన్ను ఇక్కడే బీడ్‌ మెయిన్‌ బ్రాంచ్‌లో పోస్టు చేశారు. ఇవ్వాళే జాయిన్‌ అయిపోతాను’’ అని రాజా చేతులకి తాళం చెవులప్పగించేసి, అక్కడి నుంచి క్షణంలో మాయమైపోయాడు.

బస్సు దగ్గర పోయి రాజా ఎర్ర రంగు ఎలా వచ్చిందబ్బా అని బస్సుపై వేలు పెట్టి చూశాడు. ఓ అరంగుళం దుమ్ము రాజా వేలుకంటుకుని వచ్చింది. రాజా తడబడి వేలు విదుల్చుకుని, వేలు ఇంకా ఎర్రగా ఉంటే కర్సీఫ్‌కు తుడుచుకున్నాడు. కర్చీప్‌ మొత్తం ఎర్రగా అయిపోయింది. భలే ఎర్ర మట్టి దుమ్ము ఉందే, ఈ బస్సు నడిచే ప్రాంతంలో అనుకున్నాడు రాజా.

ఎలానో బస్సులో దూరి తన సీటు దగ్గరకు పోబోయాడు. కాలు అడుసులో దిగినట్టు మెత్తగా దిగి పడిపోయింది. ఇందాకా బస్సు దిగిపోయిన రెడ్‌ ఇండియన్‌ యోధులు తిని పడవేసిన సీతాఫలం తొక్కులు, వేరుశనగ పొట్టు కనీసం ఐదారు అంగుళాల మందంతో బస్సు నిండా అలుక్కుని ఉన్నాయి. అలానే తొక్కుకుంటూ పోయి తన సీట్లో కూర్చున్నాడు రాజా.

ఆ బస్సు మరో అరగంటలో బయలుదేరింది. ఇక్కడి నుంచి 80కిలో మీటర్లు అన్నా, మరో రెండు గంటల్లో వెళ్ళిపోవచ్చులే అనుకున్నాడు రాజా. కండక్టర్‌కు డబ్బులిస్తూ అదేమాట అన్నాడు.

‘‘అయ్యో రెండు గంటలేటండి బండి ఆఫీషియల్‌ రన్‌టైమ్‌ 4 గంటలైతే’’ అని నవ్వసాగాడు కండక్టరు.

ఎనభై కిలో మీటర్లు నాలుగు గంటలా అని ఆశ్చర్యపడసాగాడు. రాజా. మిస్టరీ పరిష్కరిస్తూ బస్సు ఓ పది కిలోమీటర్ల తరువాత మట్టి రోడు వైపుకు తిరిగింది. ఇక అక్కడి నుంచి బస్సు నడుస్తుంటే ఓ సుడిగాలి నడుస్తున్నట్లే కనిపించింది రాజాకు. బస్సు లేపిన దుమ్ము కొన్ని సార్లు గాలివేగానికి బస్సు మొత్తం కప్పేసి, డ్రైవరుకు దారి కనపడకుండా ఆపేస్తున్నది కూడా. దానికి తోడు సగం దూరం తరువాత, బస్సు కొండదారుల వెంబడి కూడా పోసాగింది. రాజా సగం దారిలో తన లైట్‌ బ్లూ కలర్‌ షర్ట్‌ కేసి చూసుకున్నాడు. షర్ట్‌ మొత్తం దుమ్ము పేరుకుని ఎర్రగా అయిపోయింది.

మొత్తం మీద సాయంత్రానికల్లా అమళనేరు (బాండ్సాచి)కి చేరుకున్నాడు బస్టాప్‌ దగ్గరున్న ఓ మర్రి చెట్టు అరుగుపై పెద్దమనుష్యులు ఐదారు మంది కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. రాజాను చూస్తూనే, ‘‘బీడ్‌నుంచి వస్తున్నారా?’’ అని అడిగారు. తన డ్రెస్సు స్టైల్‌చూసి గుర్తుపట్టారేమోననుకుని- ‘‘అవునండి. ఎలాగుర్తుపట్టారు?’’ అన్నాడు రాజా.

‘‘ఎవరి షర్ట్‌ మీద ఎంత దుమ్ము పేరుకుందో చూసి మేము ఎవరెంత దూరం ప్రయాణం చేసి వస్తున్నారో ఇట్టే పట్టేయగలము’’ అని గర్వంగా చెప్పారు, ఆ ఊరి షెర్లాక్‌ హోమ్స్‌లు. వాళ్ళలో పెద్దాయన, తనను సర్పంచ్‌గా పరిచయం చేసుకుని - రాజాను గురించి వాకబు చేసి-

‘‘ఓహో కొత్త మేనేజరా!’’ అని రాజాను బ్రాంచ్‌కి తీసుకెళ్లాడు.

‘‘ఈ ఊళ్ళో రెండే రెండు పెంకుటిట్లు ఉన్నాయండి. ఒకటి నా ఇల్లు. రెండోది ఈ బ్రాంచ్‌’’ అంటూ వాచ్‌ మెన్‌ని లేవదీశాడు. వాచ్‌మెన్‌ పేరు ఎక్‌బోటే. ఎక్‌బోటే రాజాను చూస్తూనే సంతోషించాడు. ఇంతకు ముందు మేనేజర్‌ బీడ్‌లోనే ఉండి అప్పుడప్పుడు వస్తూ పోతుండేవాడుట.

వాచ్‌మాన్‌ను పంపించి, కాషియర్‌ను పిలిపించాడు. కాషియర్‌ ఆ ఊళ్లోనే ఉన్నాడారోజు. రాజా తనను తాను పరిచయం చేసుకున్నాడు.

‘‘కొంచెం త్వరగా కాష్‌ వెరిఫై చేశారంటే నేను బీడ్‌ బస్సులో వెళ్ళిపోతాను. ఇవ్వాళ బస్సు తప్పితే రేపే మరి వెళ్లేది సార్‌’’ అని కాషియర్‌ కోరాడు.

అంతకు ముందే టేబిల్‌ డ్రాయర్‌లో వేసిన తాళం చెవుల కోసం టేబిల్‌ డ్రాయర్‌లో చేయి పెట్టాడు. మెత్తగా కదులుతున్నట్లు ఏదో చేతికి తగిలింది. చేయి లాక్కుని రాజా అరుస్తూ వాచ్‌ మాన్‌ని లైట్‌ వేయమన్నాడు.

‘‘ఇక్కడ కరెంటు ఎక్కడుంది సార్‌’’ అని కాషియర్‌ ఓ టార్చి లైట్‌ సంపాదించి దాని డ్రాయర్‌ వైపు వేశాడు.

డ్రాయర్లో ఓ పాము కదుల్తూ కనిపించింది. రాజా కెవ్వున భయంతో కేకవేశాడు.

‘‘అయ్యో! బుల్లిగాడండి. భయపడకండి మనల్నేమీ చేయద’’ని ఆ పామును కట్టెతో తీసి ఆ బాంకు పెరట్లో పారేశాడు వాచ్‌మెన్‌.

‘‘బుల్లిగాడంటే, ఈ పామున్నట్లు నీకు తెలుసా’’ అని అడిగాడు రాజ్‌.

‘‘ఆ బుల్లిగాడు చిన్నవాడండి. వీడి తోబుట్టువులు ఓ ఇద్దరు అమ్మా, నాన్న, నాన్నమ్మ, అమ్మ తాత కూడా ఉన్నారండి ఆ పెరట్లోనే వాటి పుట్ట ఉందండి’’ అని చల్లగా చెప్పాడు వాచ్‌మాన్‌.

రాజా గాబరా పడడం చూసి - ‘‘మరేం భయంలేదండి. ఎంత పాము కాటుకైనా ఈ ఊళ్లో మంత్రాలేసేత్తా రండి. అయినా నేనున్నాను కదండి’’ అని చెప్పాడు ఎక్‌బోటే.

కాషియర్‌ తన బస్సు ఆలస్యమవుతున్నదని పని అయిన వెంటనే పరిగెత్తడంతో రాజా, వాచ్‌‌మాన్‌ మాత్రం మిగిలిపోయారు బ్రాంచ్‌లో. వాచ్‌మాన్‌ ఎక్‌బోటే సాయంత్రం బ్యాంక్‌లోనే ఓ మూల బకెట్లో స్నానానికని చన్నీళ్లు పెట్టాడు. స్నానం తరువాత చీకటిపడడంతో లాంతరు అంటించి రాజా పడుకోవడానికి బ్యాంక్‌లో ఉన్న రెండు టేబుళ్ళను జత చేర్చి పడకేసేశాడు.

ఆ రోజు రాత్రి తిండి అంటే ‘‘ఈ ఊళ్లో హోటలు ఏదీలేదండీ, భోజనం కావాలంటే అవ్వ ఇంటికి పోవాల్సిందే’’ అంటూ రాజాను ఓ గుడిసె దగ్గరికి తీసికెళ్ళాడు. ఆ పేదరాశి పెద్దమ్మ రాజాను అప్యాయంగా పిలిచి కుర్చోబెట్టి జొన్న రొట్టెలు, ఓ ఉల్లిపాయ, రెండు పచ్చి మిరపకాయలు ఇత్తడి గిన్నెలో వేసి ఇచ్చింది. ఆకలితో తినేసేవాడే కానీ ఆ లాంతరు వెలుతురు వెలుగులో రొట్టె వేసేటప్పుడు ఆ ముసలావిడ వేళ్ల మధ్యనున్న గజ్జి చూసేసరికి నోట్లో రొట్టె ముక్క అడ్డుకుంది. ఎలాగో తిండి ముగించేసి, ఆకలి ఆకలిగానే బ్యాంకులో పడుకున్నాడు రాజా. పడక దిగాలంటే పాములు కదలాడుతున్నట్లే ఫీలింగ్‌. అస్సలు టేబిల్‌ డ్రాయర్‌లోనే కదా పామును చూసింది మొదలు, అని గుర్తుకు వచ్చేసరికి తన పడక ఒక్కసారిగా ‘‘అనంత శేషశయన’’మైపోయి - తన తలపై నుంచి వేయి పడగలు ప్రేమతో లాలి పాడుతున్నట్లనిపించసాగింది రాజాకు.

దానికి తోడు ఊళ్లో అడుగుపెట్టినప్పటి నుంచి ‘‘టోక్‌ - టోక్‌ - టోక్‌.. టక్‌... టిన్‌ - టిన్‌’’ అని సుత్తితో ఎవ్వరో కొడ్తున్నట్లు ఒక్కటే చప్పుడు. విరామం లేకుండా వినపడుతున్నది. ఊరంతా అదే చప్పుళ్లు, బ్యాంకు చుట్టున్న గుడిసెల నుంచి అదే చప్పుళ్ళు. ఎక్‌బోటేని ఈ చప్పుళ్లు గుర్తించి అడిగాడు రాజా.

వాడు దానికి - ‘‘అయ్యా ఇది అమళనేరు (బాండ్సాచి) - బాండ్సాచి అంటే మరాఠీలో పాత్రలు అని అర్థం.

ఈ ఊళ్లో ఇత్తడి పాత్రలు తయారు చేస్తారు. ఇదో కుటీర పరిశ్రమ. ఇక్కడ మొదట్లో అలానే ఉంటుంది సార్‌! కొన్ని రోజులు  పోతే ఈ శబ్దం వినపడితే కాని మీకు నిద్రపట్టదులెండి’’ అన్నాడు.

రాజాకు ఆ రాత్రి వచ్చిన కలలలో అన్నీ ఎరుపే. ఎర్రటిపాములు, ఎర్రటి రొట్టెలు, ఎర్రరంగులో పేదరాశి పెద్దమ్మ. అలా కలత నిద్రపోయి మరుసటి రోజు, లేస్తూనే టాయిలెట్‌ ఎక్కడని ఇబ్బందిగానే అడిగాడు. దానికి-

“రండి సార్‌!’’ అని ఖాళీ పామ్‌ అయిల్‌ డబ్బాలో నీళ్లు తీసుకుని బయలుదేరాడు ఎక్‌బోటే. డబ్బాలో నీళ్లు తీసుకుని ఎక్‌బోటే నడుస్తుంటే రాజా ఇబ్బందిగా వాడి వెంట నడవసాగాడు. అలా ఆ ఊరి రాజ మార్గంలో నడుస్తూ నిన్న బస్టాండ్‌లో కలిసిన వాళ్లు కనపడితే ఇబ్బందిగా పలకరింపుగా నవ్వుతూ గబగబా అడుగులు వేయసాగాడు.

ఇంతలో ఆ ఊరి సర్పంచ్‌ కనపడి ‘‘బయలుకే కదా నేనూ వస్తాను  పదండి’’ అంటూ సర్పంచ్‌ జీతగాడు - వాచ్‌మాన్‌ ముందు డబ్బాలలో నీళ్లతో నడుస్తుంటే పిచ్చాపాటీ మాట్లాడుతూ రాజా వెంబడి నడవసాగాడు. రాజాకు ఇలాంటి సువిశాలలాకాశం క్రింద కూర్చుని కాలకృత్యాలు తీర్పుకోవడం అలవాటు లేడు. దానికి తోడు ఈ సర్పంచ్‌ మాటలు అటువైపు పొదలో నుంచి మధ్య మధ్యలో కలవర పెడుతున్నాయి.

ఎలానో ఊరి బయట పని అయ్యిందనిపించి, ఖాళీ డబ్బా వాచ్‌మాన్‌కు తిరిగి ఇచ్చేశాడు. రాజా వెంటనే టెలిగ్రామ్‌ ఫారం తెమ్మన్నాడు. ఇక్కడి పరిస్థితులు బాగాలేవని, తనకు చాలా ఇబ్బందికరంగా ఉందని వెంటనే బదిలీ చేయమని రీజినల్‌ మేనేజర్‌కి టెలిగ్రామ్‌ ఇచ్చేశాడు. దాదాపు వారం అయినా బదులు లేదు. ఇక ఆగలేక పోస్టాఫీసుకు వెళ్లి విచారించాడు. పోస్ట్ మాన్ నవ్వి - ‘‘ఇక్కడ  టెలిగ్రామ్‌ అంటే ఉత్తరంలాగే ఓ రోజంతా ప్రయాణం చేసి బీడ్‌కి వెళుతుంది. ఆ మరుసటి రోజే బీడ్‌ నుంచి టెలిగ్రామ్‌గా మారుతుంది’’ అన్నాడు ఇక మరో రెండు రోజులు ఆగక తప్పలేదు రాజాకు.

వాచ్‌మన్‌ ‘‘టెలిగ్రామ్‌ వచ్చింది. సార్‌’’ అనగానే రాజా ఎగిరి గంతేసి అందుకున్నాడు.

‘‘మీ టెలిగ్రామ్‌ కోరిక మేరకు, మిమ్మల్ని వెంకటాపురం మారుస్తున్నాము. ఇప్పుడున్న వెంకటాపురం మేనేజరు గోదావరిలో నీళ్లు తగ్గిన తరువాత అంటే మరో మూడు నెలల్లో మీ బ్రాంచ్‌కి వచ్చి ఛార్జీ తీసుకుంటాడు. అంత వరకు అమళనేరు (బాండ్సాచి) లో ఉండవలసింది.  విత్‌బెస్ట్‌ విషెన్‌ - రీజనల్‌ మేనేజర్‌’’

.. ఆంధ్రప్రభ, 1993

********

Posted in July 2025, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *