Menu Close
తెలుగు పద్య రత్నాలు 49
-- ఆర్. శర్మ దంతుర్తి --

“దాశరధీ కరుణాపయోనిధీ” అనగానే మనకి గుర్తుకొచ్చేది భద్రాచల రామదాసు కదా? ఆయన ఎటువంటివాడో అనేక పద్యాలలో పాటల్లో మనకి కనిపిస్తుంది. అయితే ఈ రామదాసు రాముణ్ణి పొగడగలడు, ప్రభుత్వం వారి డబ్బులు వాడేసి సీతమ్మకి నగలు చెక్కించనూ గలడు. అంతా అయ్యాక ఓ శతకం రాసి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు నాకు రామా అని నమస్కారం పెట్టనూ గలడు. మరో విషయం ఏమిటంటే ఇన్ని నగలు చేయించాను నీకు, అవన్నీ పెట్టుకుని కులుకుతూ తిరిగేవు కానీ నన్ను జైల్లో పెట్టించావు, భలేవాడివయ్యా అని కసురుకుంటూ తిట్టనూ గలడు. అది ఆయనకే చెల్లింది. అయినా రాముడు కంచెర్ల గోపన్న అనే ఈ రామదాసుని కరుణించాడు.

అనేకమంది నోట మనం అనేకానేక విధాలుగా చూస్తాం రాముణ్ణి అనేక విధాలుగా స్తుతించడం. శ్రీరామ సేవాసమితి, న్యూఢిల్లీ వారు కొంతమంది రచయితలు రాసిన శతకాలని ఒకచోట ఉంచి ‘శతపత్రం’ అనే పేరుతో ప్రచురించారు. అందులో శ్రీమాన్ నరహరి గోపాలాచార్య గారు రాసిన భద్రగిరి దాశరధి శతకం ఒకటి. ఈ నెల పద్యం అందులోనిదే. ఇది కూడా దాశరధీ కరుణాపయోనిధీ అనే మకుటంతోనే సాగుతుంది.

చ.
పిలిచె నమస్కరించె, బలవించెను, తిట్టెను రామదాసు ని
ర్మలమతి యట్టి భాగ్యగరిమల్ వెయిజన్మలకేని నస్మదా
దులకులభింపబొవ ఖిలదోషహరా మముసంక్షమింపగా
దలపగదయ్య భద్రగిరి దాశరధీ కరుణాపయోనిధీ!! (72)

రామదాసు రాముణ్ణి పిలిచాడు, నమస్కారం పెట్టాడు, తిట్టాడు కూడా అయినా రాముణ్ణి వదల్లేదు ఏనాడూ. అటువంటి శుద్ధమైన మనస్సు ఉన్నవాడు కనకే రాముడు ఆయనవెంటే ఉన్నాడు. అయితే అటువంటి అదృష్టం (భాగ్యగరిమల్) వేల సంవత్సరాలకి కూడా అందరికీ కలగదు నావంటివారుకి (అస్మదాదులకు లభింపబోవ). అందువల్ల అన్ని పాపాలనీ హరించే (అఖిలదోషహరా) మమ్మల్ని క్షమించి బ్రోవవయ్యా రామా అంటున్నారు. భగవంతుణ్ణి ఎన్ని విధాలుగా కీర్తించవచ్చు అనేదానికి భాగవతంలో శ్లోకం ఏమి చెప్తోందో చూడండి.

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం

భగవంతుణ్ణి చేరడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి. శ్రవణం - భగవంతుని గురించి కధలు, గాధలు వగైరా వినడం. ఉదాహరణకి సూతుడు పురాణాలు చెప్తూంటే శౌనకాది మునులు, శుకమహర్షి చెప్తూంటే పరీక్షిత్తు మహా భాగవతం వినడం. కీర్తనం - భగవంతుని గుణగణాలని కీర్తించడం. ఈ కోవలోకి వచ్చేవారే రామదాసు, అన్నమయ్య, త్యాగరాజు మొదలైనవారు. మూడోది స్మరణం: భగవంతుని స్మరించే, ధ్యానం చేసే భక్తులు. పాదసేవ – దేవుడికి  రోజువారీ పూజ చేసేవారు. తర్వాతది అర్చన - గుడిలో, ఇంటిలో, మనసులో గాని అనేకవిధాలుగా అర్చన చేయడం. వందనం: నమస్కారం లేదా ప్రణామం చేయడం. దాస్యం – జీవితంలో మనకి ఉన్నవన్నీ కష్టాలే కానీ సుఖం అనేది కాకి బంగారం అని తెలుసుకుని ‘నీవే తప్ప ఇతఃపరంబెరుగని’ అనుకుంటూ భగవంతుడికి దాసుడు అవడం. హనుమంతుడు, ప్రహ్లాదుడు ఈ కోవలోకి చెందినవారే. సఖ్యం - భగవంతుణ్ణి స్నేహితుడుగా చూడడం. ఉదాహరణకి అర్జునుడు. విశ్వరూపం చూపించినా అర్జునుడు తన బావమరిది కృష్ణుణ్ణి, స్నేహితుడిగానే భావించాడు కదా? ఆఖరిది ఆత్మనివేదనం – అంటే తనని పూర్తిగా భగవంతుడికి సమర్పించుకోవడం. ఇందులో ఉదాహరణలు, గోదాదేవి, మీరాబాయి వంటివారు.

ఈ పద్యంలో చెప్పేది, రామదాసు ఇటువంటి సేవలు ఎన్నో చేసాడు కదా అటువంటి మనఃస్థితి మాలాంటివారికి ఎక్కడనుంచి వస్తుంది, దానికెన్నో వేల జన్మలు ఎత్తాలి. అందువల్ల మమ్మల్ని క్షమించి గుర్తుంచుకోవయ్యా రామా అంటున్నారు. శ్రీరామకృష్ణులు అంటారు ఇదే విషయంలో. ఎవరి మీద భగవంతుడి అనుగ్రహం కలుగుతుందో ఆయనకి తప్ప మరొకరికి తెలియదు. ఆ అనుగ్రహం కలిగినపుడు మిగతావన్నీ అవే వస్తాయి. ఈ విషయం మనం భాగవతంలో అనేకచోట్ల చూడవచ్చు. ముచికుందుడనే మహర్షికి కృష్ణుడు చెప్పడం కూడా ఈ కోవలోకే వస్తుంది – “నువ్వు దేవతల సహాయం చేసి పుణ్యం గడించావు సరే, కానీ వినోదం కోసం కొన్ని జంతువులని చంపావు. ఆ పాపం వచ్చే జన్మలో కానీ తీరదు. ఫలానా చోటుకి వెళ్ళి తపస్సు చేయి” అందుకే భగవంతుడి అనుగ్రహం ముఖ్యం; అది రావడం కోసమే నాలాంటివారికి క్షమించేయి రామా అంటున్నారు. ఎందుకు క్షమించాలి? ఎందుకంటే భగవంతుడు కరుణాపయోనిధి (అనంతమైన సముద్రం వంటి కరుణ కలవాడు) కనక.

****సశేషం****

Posted in July 2025, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *