Menu Close
SirikonaKavithalu_pagetitle

దేశాభివృద్ధి సద్దీప్తినా రోగాలె దినదినముపెరుగు ఘనతచాట,రుజలనుమించి యారోగ్యమందించ నౌ షధములంతకునంత శ్రమనుచాట ,ఔషధమ్ములమించియంతస్థులై వైద్య శాలలు నభమంటు శక్తిచాట,వైద్యశాలలకంటె వైద్యులందని యంత యెత్తు కెదుగుటను సత్తచాట,ఇద్దిపుణ్యాభివృద్ధియౌ ముద్దొ యేమొ!ఇద్ది పాపాభివృద్ధియౌ సద్దొ యేమొ!అహ!ప్రజాస్వామ్యమే పెంపునందు పథమొ!యనుచు ప్రజలు భావింపగా నధికమయ్యె.ఉత్పలమాల;--రోగులు రోగపాళి బహురోచిసుతో నభివృద్ధినందుచున్భోగమునందునట్లు స్తవముంగొనుచుండుటనిత్యకృత్యమౌయోగమొ!నాగరీక సుమహోన్నతియేమొ!మనుష్యజాతిదౌరాగమొ!ప్రాగ్విపర్యయవిలాసమొ యేమొ, రుజాభివృద్ధియౌ.

పూర్తిగా విచ్చుకున్న పెదవులు
దాచుకున్న నవ్వులను
దోచేస్తాయేమో అనీ
నవ్వులన్నీ పొర్లి
నదిలా ప్రవహిస్తాయేమో అనీ
అరవిప్పిన పెదవులతోనే
ఆపి ఆపి నవ్వుతావ్..చూడు
అప్పు డనిపిస్తుంది నాకు
పసితనానికి నామకరణం చేస్తే
అది నువ్వే అవుతావని

నీ గీతాబోధను
నేను అర్జునుణ్ణై ఆచరిస్తుంటే
నీలో నువ్వే నవ్వుకుంటూ
చూపుల్లో వాటిని తొక్కిపెడతావ్ చూడు
అవి నక్కి చూస్తాయేమో అని
రెప్పలల్లార్చుతుంటావ్ చూడు
అప్పుడనిపిస్తుంది నాకు
ముగ్ధత్వానికి మూసకట్టి చూస్తే
అది నీలాగే ఉంటుందని

చిగురుటాకుల మీద
చినుకులు రాలినట్టు
లేతసవ్వడితో
నవ్వుతావు చూడు
నిన్ను నువ్వే మరిచిపోయినంతగా
నిశ్చలపారవశ్యంతో
ముఖమంతా
వెన్నెలవత్తిలా మారిపోతావ్ చూడు
అప్పు డనిపిస్తుంది నాకు
కాలానికి గాలం వేసి
కాసేపు నిలిపేస్తే
అది నీతో పోటీకి దిగుతుందని

వెనక నుంచి దూసుకు వచ్చిన మాట
వెన్నుకే కాదు, గుండెకు కూడా గుచ్చుకుంటుంది

ఆకు రాయిని రాసుకొచ్చిన మాట
బాకులా దిగబడి బాధగా రాజుకుంటుంది

కొందరి నాలుకలు
కత్తుల్లా కసా పిసా కోస్తాయి
కొందరి నొసళ్ళు
ముసుగు తన్నిన కాళ్ళనూ
ముగ్గులోకి దింపేస్తాయి

కొందరు మాటలు నాటితే
చుట్టూ కంచెలు మొలుస్తాయి

పగిలిన మాటకు నలిగిన గుండె మాటున
మౌనం ఘనీభవిస్తుంది

మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు
ఈ స్థితికి మాటే మోసుకు వెళ్లడం విచిత్రం

ఒక చెవిని కొరికిన మాట
గాలి గుండా వచ్చి గాయపరుస్తుంది

పరుషం పడగ నీడలో మాట
ఎప్పటికీ ఎలిగారమే
నాగజెముళ్ల లాంటి మాట కన్నా
నాగ బంధం లా బిగసుకున్న మౌనం బంగారమే

నీవేదో అలవోకగా అన్నాననుకుంటావు
అది కలలో కూడా నన్ను కలవర పెడుతూనే ఉంటుంది

అవునే అమ్మోమ్మా! నువ్వు చెప్పింది నిజమే
ఊరక వుంటే బోడగుండంత మేలు

జీవన యానంలో
ఎందరో సహ చరులు
ఒకరి యాత్రలో మరొకరుచేరి
ఒకరికి ఒకరై కురిపించే
మరవలేని మనోహరాలు ఎన్నో!
ఒక్కసారి కలసినా
జీవితమంతా వెదజల్లే
పారిజాత సుమ పరిమళాలు కొన్నే
పుణ్యక్షేత్ర దర్శనాలు
విజ్ఞానయాత్రలు,వినోద యాత్రలు
తేన చంద్రునికై సాగే యాత్రా
అనుభూతులన్నీ అంతరంగ నిక్షిప్తాలే,
ప్రకృతి సోయగాల విన్యాసాలు
మనసున పది కాలాలు నిలిచేవే
పుణ్యానికి పురుషార్ధానికి
మూలం యాత్రేగా!
జీవితమే ఒక యాత్ర
అనుభూతుల మయం
వదలక వెంటాడి వేటాడితే
ఏముంది?.......
............... మరో జన్మా!

Posted in July 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *