Menu Close
మనోల్లాస గేయం
- మధు బుడమగుంట -
Song

జీవితమంటే అంతులేని ఒక పోరాటం

మానవజన్మనెత్తిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక లక్ష్య సాధనలో జీవితాన్ని నిర్దేశించుకుని తమ జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైననూ కార్యసిద్ధి కొరకు నిత్యం పరితపించడం జరుగుతుంది. అలాగే మనిషి ప్రమేయం లేకుండానే అనేక జీవన్మరణ ఈతిబాధలు ఈ జీవనమార్గంలో తారసపడుతుంటాయి. అటువంటి వాస్తవ విషయాలను ఎంతో నిగూఢ నిజజీవన దృక్కోణం తో కూడిన భావుకతతో అందించిన ఈ సందేశ గీతం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. దానినే మీకు ఈ జూలై సంచిక మధుర గేయంగా అందిస్తున్నాను.

movie

సంబరాల రాంబాబు (1970)

music

రాజశ్రీ

music

వి.కుమార్

microphone

ఎస్.పి బాల సుబ్రహ్మణ్యం

జీవితమంటే అంతులేని ఒక పోరాటం
బ్రతుకు తెరువుకై పెనుగులాడుటే ఆరాటం
కృషి చేశావంటే ఎదురీదేవంటే
సాధించేవు గెలిచేవు నీదే జయం

పాపనుకడుపునమోసే తల్లికి పదిమాసాలు పోరాటం
పుట్టిన పాపకు నడిచేవరకు తప్పటడుగులె పోరాటం
కుటుంబ బారం మోసే తండ్రికి సంసారం ఒక పోరాటం
విద్యార్దులకు పరీక్షవస్తే చిత్రమైనదా పోరాటం, పోరాటం

జీవితమంటే అంతులేని ఒక పోరాటం

కొత్త జంటకు మూడురాత్రులు తనివితీరని ఆరాటం
ఆ తరువాతే మొదలౌతుంది అహోరాత్రులు పోరాటం
లెక్కకుమించిన పిల్లల కంటూ పోషించుటయే పోరాటం
డాబులు కొడుతూ ఓట్లనుకొంటూ డబ్బుదోచుటే పోరాటం, పోరాటం

జీవితమంటే అంతులేని ఒక పోరాటం

న్యాయానికి అన్యాయానికి అనుక్షణం ఒక పోరాటం
మంచిచెడులకు నిజానిజాలకు యుగయుగాలుగా పోరాటం
ఇరుగూపొరుగుల క్షేమం కోరని కాపురాల కధ పోరాటం,
హృదయంలేని మనుషుల మధ్య కలిసి బ్రతకటం పోరాటం, పోరాటం

జీవితమంటే అంతులేని ఒక పోరాటం

బ్రతుకు తెరువుకై పెనుగులాడుటే ఆరాటం
కృషి చేశావంటే ఎదురీదేవంటే
సాధించేవు గెలిచేవు నీదే జయం

జీవితమంటే అంతులేని ఒక పోరాటం

Posted in July 2025, పాటలు