Menu Close
Uma-Bharathi-HG-02
హృదయగానం (ధారావాహిక)
నేడే విడుదల
కోసూరి ఉమాభారతి

10

hrudayagaanam-10

చర్చి మ్యూజికల్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా నుండి నేథన్, లహరీలు క్రిస్మస్ కి మూడు రోజుల ముందుగా హైదరాబాదుకి వచ్చారు. పారూతో కలిసి ప్రోగ్రాంని సమన్వయ పరుచుకున్నారు. ముగ్గురూ కలిసి వెళ్లి స్టేజి, సౌండ్ సిస్టమ్ ఏర్పాట్లు చూసుకున్నారు.

క్రిస్మస్ ముందు రోజు జరగనున్న ప్రోగ్రాంకి రంగం సిద్ధమైంది.

కాకినాడ లోని అన్ని సమాజాల నుండి ముఖ్యంగా యువత వేలసంఖ్యలో హాజరయ్యారు. ఊహించని విధంగా కిటకిటలాడింది సభాప్రాంగణం. అన్ని భాషల్లో, అన్ని రీతుల్లో బాంగ్రా నుండి పాపులర్ పాటలవరకు... మెలోడీస్ నుండి జానపదాల వరకు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా కూర్చి పాడారు యువ గాయనీ గాయకులు.

కమ్యూనిటీ చర్చికి నిధుల సేకరణార్ధం ఏర్పాటయిన 'గ్రాండ్ మ్యూజికల్ నైట్' అత్యంత విజయవంతంగా జరిగింది.

మాలిని ఆహ్వానంపై కిరణ్ హైదరాబాదు నుండి కాకినాడకి వచ్చి, యువ గాయకుడిగా పరిచయమయి... నేథన్, లహరి, పారూ లకి మోమెంటోలని అందించి అభినందించాడు.

ప్రోగ్రాం తరువాత మాలిని ఇంట విందులో… తన వద్దకి వచ్చి కూర్చున్న కిరణ్ తో "నువ్వు బాగా నచ్చావురా అబ్బాయ్. మ్యూజిక్ అంటే నీకున్న ఆసక్తి బాగుంది. మొత్తానికి విశ్వనాధం తాతగారి నుండి సంగీతం పట్ల అభిలాషని, నైపుణ్యాన్ని పుణికి పుచ్చుకున్నావన్నమాట." అన్నారు సీతమ్మ.

"నానమ్మగారు, మా రామనాధం తాతగారే అసలు నాలో ఈ ఆసక్తి నింపారు. కాకపోతే నాకు పాశ్చాత్య సంగీతం ఇష్టం. ఆరేళ్ళ వయసు నుండీ ట్రైనింగ్ పొందాను. పాశ్చాత్య సంగీత రీతుల్లో కాలేజీ కోర్స్ చేసాను." అన్నాడు కిరణ్.

"సంతోషం బాబు. మరైతే, జనవరిలో జరిగే పారూ గాన కచేరికి మీ తాతయ్య, నువ్వూ వస్తే బాగుంటుంది.  సాంప్రదాయ సంగీత రీతి పై కూడా ఓ అవగాహన వస్తుంది. పారూని ఓ ధీటైన గాయనిగా తీర్చిదిద్దగల వరస కచేరీల్లో అదే మొదటిది." అన్నారు ఆమె.

“తాతగారితో మాట్లాడుతాను. తప్పక వస్తాము." అంటూ అందరి వద్దా సెలవు తీసుకుని హైదరాబాదు ఫ్లైట్ కి బయలుదేరి పోయాడు కిరణ్.

***

వాద్య బృందంతో జరుగుతున్న పారూ కచేరీ సాధనకి ఆస్ట్రేలియా నివాసులు అయిన యువ సంగీతకారులు నేథన్, లహరీలు రిక్వెస్ట్ చేసి మరీ వచ్చారు. రెండు గంటల పాటు చాపపై కూర్చుని అసాంతం ఆలకించారు.

"మాకు తెలియని ఓ కొత్త సంగీత ప్రపంచంలో హాయిగా విహరించినట్టుగా ఉంది పారూ. నీ గానం అద్భుతం. మెలోడీయస్ వాయిస్." అంటూ అభినందించాడు నేథన్.

"మార్వెలస్ సింగింగ్." అంది లహరి.

"థ్యాంక్యూ సో మచ్, మీతో కలిసి ప్రోగ్రాం చేయడం ఓ గొప్ప అనుభూతి." అంది పారూ.

ముగ్గురి సంభాషణ వింటున్న సీతమ్మ గారికి ముచ్చటేసింది. "తోటి సింగర్ పై ఇంతటి అభిమానాన్ని చూపడం మీ సంస్కారానికి నిదర్శనం." అంటూ ఆ యువతీ, యువకులకు ఆశీస్సులు అందించారు ఆమె.

వెళ్లే ముందు పారూని ఆస్ట్రేలియాకి ఆహ్వానించారు. “నీవు ఆస్ట్రేలియా వచ్చి ప్రోగ్రాములు చేయాలి. మాకక్కడ ‘వరల్డ్ మ్యూజిక్ నెట్వర్క్ ఉంది. వాళ్ళతో మాట్లాడి మీకు తెలియజేస్తాను. నీతో పాటుగా పునీత్, జననీలకి కూడా మా సాదర ఆహ్వానం." అన్నాడు నేథన్.

"అంతకన్నానా? తప్పకుండా వస్తాము." అంటూ వీడ్కోలు చెప్పింది పారూ.

****

వెనక్కి తిరిగి చూసేలోగా రెండు వారాల సమయం యిట్టే గడిచింది. 'శ్రీ దశావతార వెంకటేశ్వర ఆలయం' వారి సమ్పర్పణలో 'కుమారి పరమేశ్వరి రామ్‌కుమార్ గాన కచేరి' కి రంగం సిద్దమయింది.

సీతమ్మ స్వయంగా కోరడంతో హైదరాబాదు నుండి రామనాధం గారు, కిరణ్ ముందు రోజు సాయంత్రమే వచ్చి ఆలయం దగ్గరలోని రాడిసన్ హోటల్లో బస చేశారు.

సంక్రాంతి పండుగ థీమ్ గా కచేరీ వేదికని ఆలయ శిల్పులు అత్యంత సుందరంగా అలంకరించారు. కార్యక్రమానికి చుట్టుపక్కల ఊళ్ళ నుండి కూడా సంగీతాభిమానులు, ఆలయ పోషకులు, భక్తులు, అసంఖ్యాకంగా విచ్చేసారు. ప్రేక్షకులతో ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. అందరూ పండుగ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.

రామనాధం గారు కూడా 'ఆలయ నిర్మాణ నిధి'కి విరాళాన్ని అందించారు.

కార్యక్రమం మొదలయ్యే ముందు వరకు కిరణ్ గ్రీన్-రూమ్ లో పారూ పక్కనే ఉన్నాడు. "హైదరాబాదులో జరిగే మ్యూజిక్ కాన్సర్ట్స్ లో కన్నా మిన్నగా ఉంది నీ ఫాలోయింగ్ ఇక్కడ పారూ. అస్సలు ఊహించలేదు.  ‘టీనేజ్ స్టార్ సింగర్ పరమేశ్వరి’లా ఉంది నీ సంగతి" అంటూ పారూని నవ్విస్తూ, కవ్విస్తూ గడిపాడు.

పక్కనే కూర్చుని వింటున్న సీతమ్మ "చూడు కిరణ్ బాబు, మీరు ఒకరికొకరు సరైన సంగీత జోడీ. ఒకరు సాంప్రదాయ సంగీతకారిణి. ఒకరు పాశ్చాత్త సంగీత కారుడు - పాప్ సింగర్. నిజంగానే మీరివురూ కలిసి ఒక జుగల్బందీ కార్యక్రమం చేయాలి." అని వ్యాఖ్యానించారు.

"కానైతే, నానమ్మగారు, మీ పారూ గానం ముందు నా నైపుణ్యం వెలవెల పోకుండా చూసే బాధ్యత మీరు తీసుకుంటారా?" నవ్వుతూ ప్రశ్నించాడు ఆ మనవడు.

కార్యక్రమం మొదలవుతుందని కబురందుకుని "అల్ ది బెస్ట్" చెప్పి హాల్లోకి వెళ్ళాడు కిరణ్. వేదిక దిశగా నడిచారు పారూ, శాంత, సీతమ్మ గారు.

సభా ప్రారంభ ప్రసంగంలో సుసర్ల శర్మగారు కార్యక్రమం ఏర్పాటు చేయడంలోని ఉద్దేశాన్ని సభికులకు వివరించారు. తరువాత పరమేశ్వరి గాన కచేరి మొదలయింది.

తొలుతగా విఘ్నేశ్వరుని ప్రార్థించి, కర్ణాటక గాన కచేరీ సంప్రదాయాన్ని అనుసరిస్తూ క్లిష్టమైన అంశాలని గానం చేసి, మీనాక్షి కళ్యాణంలోని చరణాలు, భగవద్గీత లోని శ్లోకాలతో సభికులను అలరించింది యువగాయని. ఇంపైన గానంతో ఆహుతులను మరో రమణీయ లోకంలోకి తీసుకెళ్ళింది ఆమె గానం.

విరామ సమయంలో తాము చేపట్టదలచిన కళ్యాణ మండపం, యువ కేంద్రాల నిర్మాణ ప్రాజెక్టు గురించి సభికులకు వివరించారు శర్మగారు.

విరామం తరువాత, అయిగిరినందిని స్తోత్రం, అన్నమాచార్య కీర్తనలు ఆలపించి, కదనకుతూహల రాగంలో కూర్చిన మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారి తిల్లానా పాడి, శ్రీరామునికి నీరాజనాలతో కచేరీ ముగించింది పరమేశ్వరి.

అప్పటివరకూ మంత్రముగ్ధులై కూర్చున్న శ్రోతలు ఒక్కసారిగా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. కరతాళ ధ్వనులు మిన్నంటాయి.

సభికుల అభినందనలని, ప్రశంసలని స్వీకరించేందుకు వినమ్రతతో చేతులు జోడించి వేదికపై నిలబడింది పదిహేడేళ్ల పరమేశ్వరి. సీతమ్మ గారిని, శాంతని కూడా వేదికపైకి ఆహ్వానించి పారూ గురువులుగా సభకి పరిచయం చేసారు ఆలయ చైర్మన్. ఆమె తండ్రి రామ్‌కుమార్‌ కి అభినందనలు తెలిపారు. స్పందించవలసిందిగా గాయని పరమేశ్వరిని కోరారాయన.

మైక్ అందుకుని "అందరికీ నమస్కారం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆలయ కమిటీకి ధన్యవాదాలు. ఇలా మీ ముందు పాడగలిగే వీలు కల్పించినందుకు మా అమ్మమ్మకి నమస్కారాలు.

నన్ను ప్రేమగా పెంచి పెద్దచేసి, నా మంచి చెడ్డలు చూసే అమ్మానాన్నలకి నమస్కారాలు. ఇంత మంచి తల్లిదండ్రులను ఇచ్చిన ఆ దేవుడికి కోటి నమస్కారాలు. ఇంతసేపూ నా సంగీతం విని, మీ చప్పట్లతో అభినందనలు తెలిపినందుకు మీకందరికి మరోసారి ప్రణామాలు" అంటూ ‘ఎన్నగాను రామభజన’ అనే కీర్తన పాడి సభికులకు నమస్కరించి వేదికపై నుండి నిష్క్రమించింది.

ఆడిటోరియం లోనికి వచ్చి రామనాధం గారికి, జోసెఫ్‌ దంపతులకి నమస్కరించి ఆశీస్సులందుకుంది. వారి పక్కనే ఉన్న కిరణ్ "గ్రేట్ జాబ్. నువ్వు నా కజిన్ అవ్వడం గర్వంగా ఉంది పారూ, కాంగ్రాట్యులేషన్స్!" అన్నాడు.

పారూతో మాట్లాడేందుకు ప్రేక్షకులు చుట్టుముట్టారు. ఆమె గాత్రాన్ని మెచ్చుకున్నారు. "పరమేశ్వరి భావిభారత గానకోకిల" అని ఓ పెద్దాయన అంటే, "మరో ఎం.ఎస్. సుబ్బలక్ష్మి అవుతుంది" అన్నారో సంగీత అభిమాని. "నటి, గాయని భానుమతి రామకృష్ణలా ... పరమేశ్వరి మంచి పేరు తెచ్చుకోవాలి." అంటూ ఆశీర్వదించింది మరో మహిళ.

ఆ మెప్పు, అభినందనలు పారుని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కూతురి భుజాల చుట్టూ చేతులు వేసి, జనాలనుంచి తప్పిస్తూ, కారు వద్దకి తీసుకువెళ్ళాడు రామ్.

***

మరునాడు పొద్దుటే, ఎనిమిదిన్నరకి రామనాధం, కిరణ్ ల ఆహ్వానంపై వారుంటున్న రాడిసన్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ హాల్లో కలిశారు రామ్ కుటుంబం, జోసెఫ్ దంపతులు. అందరి ముఖాల్లో ఉత్సాహం ప్రస్ఫుటంగా కానవస్తున్నది.

పిల్లలు ఓ టేబుల్ వద్ద, పెద్దవాళ్ళందరూ పక్క టేబిల్ వద్ద కూర్చుని బ్రేక్-ఫాస్ట్ చేస్తూ కబుర్లలో మునిగారు.

'కిరణ్ బావా!' అని కిరణ్ని సంభోదిస్తూన్న జననీ పిలుపుకి అందరూ అటుగా చూసారు.

"ఇదేదో బాగానే ఉందే? ఇప్పటివరకు మా మామయ్య కూతురు మీనా ఒక్కతే నన్నలా పిలుస్తుంది. ఇప్పుడు ఈ చిట్టి జననీ కూడా బావా అంటుందా? ఒకే... నో ప్రాబ్లెమ్. పునీత్, పారూ కూడా అలాగే పిలుస్తారా?" అడిగాడు కిరణ్.

"అంతేగా కిరణ్ బాబు! నిన్ను ఇకనుండి 'బావా' అని గౌరవంగా పిలవమని నేనే చెప్పాను. తప్పదు మరి. అయితే మీనా ఎవరు?" అని అడిగారు సీతమ్మ.

"మా అమ్మ అన్నగారైన శ్రీనివాస్ మామయ్య కూతురు మీనాక్షి. మాదాపూర్ లో ఉంటారు. బి.ఏ మొదటి సంవత్సరం చదువుతుంది. మ్యూజిక్ పై అంతగా ఆసక్తి  లేకున్నా మా క్లబ్ బ్యాండ్ తో నేను రాసిన లిరిక్స్ పాడుతుంది.

మీతో ముందునుండే పరిచయం ఉండుంటే, పారూలా నేను కచేరీ చేసే వాడినేమో తెలీదు కానీ… ఎప్పటికైనా పారూ చేత మాత్రం పాప్, జాజ్ మ్యూజిక్ పాడిస్తాను... నానమ్మగారు." అన్నాడు కిరణ్ నవ్వుతూ.

"అదో పెద్ద ఛాలెంజ్ అనుకోడమెందుకు? నేను అన్నీ పాడగలను. అమ్మమ్మ, అమ్మ నాకు అలాంటి శిక్షణ నిచ్చారు." అంది పారూ కూడా నవ్వేస్తూ.

"సరే, బాగుంది మీ సంభాషణ. అప్పుడప్పుడైనా మనం ఇలా కలుస్తూ ఉండాలి. చూడండి రామ్, హైదరాబాదులో ఏదైనా పనున్నా, ఎటువంటి సలహా సహకారాలు అవసరమైనా చెప్పండి." అన్నారు రామనాధం రామ్ తో.

"బాబు రామనాధం! అల్లుడు గారి సంగతి నన్నడుగు. ఎవరినీ ఎటువంటి సహాయం చేయనివ్వడు, సహకారం కోరడు. స్వయంగా ఇంట చేసిన సున్నుండలు, కజ్జికాయలు మాత్రమే ఇష్టంగా స్వీకరిస్తాడు. రామ్ ఓ శ్రమ జీవి. అభిమానవంతుడు. అప్పట్లో కట్న కానుకలు కూడా వద్దన్నాడు." అంది ప్రశంసగా సీతమ్మ గారు.

ఫక్కున నవ్వాడు రామ్. "అత్తమ్మగారు కూడా అంతే లెండి రామనాధం గారు. మా వద్ద ఉండనంటారు. బాసరలోనే నివాసముంటారు. ఆవిడ ఎప్పటినుండో అక్కడ ఆలయ పోషకురాలు కావడంతో, ఆమెకి అనువైన విశాలమైన నివాసాన్ని, గౌరవ వేతనాన్ని కేటాయించింది ఆలయ వ్యవస్థ. అత్తమ్మగారికి ఆ స్వతంత్రత ఇష్టం. మొత్తానికి ఆమె ద్వారా మీతో పరిచయం, ఏర్పడిన సత్సంబంధాలు కొనసాగడం చాలును మాకు." అన్నాడు సవినయంగా రామ్.

"బాగుంది రామ్ అంకుల్. నానమ్మగారి గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. నానమ్మగారి నివాసం చూసేందుకు ఓ మారు బాసరకు వెళదామా తాతగారు?" అడిగాడు కిరణ్.

"ఉండరా కిరణ్! ఊపిరాడనిస్తావా లేక ఈ వయసులో నన్నో సూట్-కేసులా అటూ, ఇటూ లాక్కెళతావా? మెల్లగా వెళదాములే." అని జవాబిచ్చిన రామనాధం గారి మాటలకు అందరూ నవ్వారు.

మరో గంటకి అందరికీ వీడ్కోలు చెప్పి ఎయిర్పోర్ట్ కి బయలుదేరిపోయారు కిరణ్ వాళ్ళు.

***

ఆలయంలో చేసిన కచేరి పదిహేడేళ్ల పరమేశ్వరిని సంగీత రంగంలో ఓ మంచి స్థాయికి తీసుకెళ్ళిందనే చెప్పాలి. తాను తలపెట్టిన కార్యం సిద్దించినందుకు సీతమ్మగారు, కూతురు పొందుతున్న గుర్తింపుకి పారూ తల్లితండ్రులు కళామతల్లికి శతకోటి వందనాలు సమర్పించుకున్నారు.

తరువాతి రెండు నెలలు ఊపిరాడనంత బిజీ అయిపోయారు రామ్ కుటుంబం. 'ఆలయ నిధుల సేకరణార్ధం’ తత్తిమా వరస కచేరీలకి సాధన ... తప్ప మరో ప్రపంచమే లేకపోయింది వారికి. అనుకున్న క్రమంలోనే అంచనాలని మించి విజయంతంగా ముగిసిన ఆలయ కార్యక్రమాల వల్ల ఆశించిన దానికన్నా ఎక్కువ నిధుల సేకరణతో సంతృప్తిగా ఉన్నారు ఆలయసంస్థానంవారు.

****సశేషం****

రచయిత్రి పరిచయం ....

‘నాట్యభారతి’ ఉమాభారతి - నర్తకి, నృత్య గురువు, నటి, రచయిత్రి, టీ.వి చిత్ర దర్శక-నిర్మాత

కూచిపూడి, భరతనాట్యం నృత్యాలలో నిష్ణాతురాలు ఉమాభారతి. నాలుగు దశాబ్దాలుగా దేశవిదేశాల్లో కూచిపూడి నృత్య విస్తరణకు కృషి చేసి ఆ కళకు వన్నె తెచ్చిన మేటి నర్తకిగా, గురువుగా ఖ్యాతి గడించారు ఆమె. పద్నాలగవ యేట అఖిలభారత కూచిపూడి నృత్య పోటీలో గెలుపొంది, 1977 లో ప్రపంచ సాంస్కృతిక సభలచే ఆహ్వానింపబడి, ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక విభాగం వారిచే సాంస్కృతిక రాయబారిగా పరిగణింపబడిన అప్పటి యువ నర్తకి, ఉమాభారతి.

1970 లో ‘కూచిపూడి రంగప్రవేశం’ గావించి, 20 సంవత్సరాల వయసుకే విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు, సినీ రంగ ప్రవేశం, చిత్ర నిర్మాణం కూడా చేపట్టి కళారంగంలో ఎనలేని కీర్తినార్జించింది ఉమాభారతి.

బాలనటిగా ‘సుడిగుండాలు’ చిత్రంలో, కథానాయకిగా ‘చిల్లరదేవుళ్లు’ చిత్రంలో, ఊర్వశి గా NTR సరసన ‘యమగోల’ చిత్రంలో నర్తించిన ఉమాభారతి 1976 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం విద్యార్ధి దశలోనే ‘భారతీయ నృత్య రీతులు’ అనే 30 నిముషాల డాక్యుమెంట్రీ నిర్మించారు.

సేవే ధ్యేయం, నృత్యం మార్గంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా… విద్యానిలయాల నిర్మాణాలకి, వరద బాధితుల నిధికి, నేత్రదాన శిబిరాలకి, 2 వ తెలుగు ప్రపంచ సభలకు, ‘రామసుబ్బయ్య పేద విద్యార్ధుల స్కాలర్షిప్ ఫండ్’ కు స్వచ్చందంగా నృత్య కార్యక్రమాలను చేసారు.

సౌతాఫ్రికా, మారిషస్, సెషిల్స్ ఆంధ్ర మహాసభల నిర్వహణలో నృత్య ప్రదర్శనల ద్వారా ఆలయ నిర్మాణ నిధులకి, తెలుగు భాషా-సంస్కృతి ప్రాచుర్యం పెంపొందించే కార్యక్రమాలకి నిధులు సేకరణకి నృత్య ప్రదర్శనలు చేశారు.

అమెరికా లోని వివిధ (25)  దేవాలయ నిర్మాణ సంస్థల నిధుల సేకరణార్ధం సాంస్కృతిక పర్యటనలు నిర్వహించారు. 1982 లో హూస్టన్ లో అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ స్థాపించి ప్రవాసాంధ్రుల యువతకి నృత్యశిక్షణ కొనసాగిస్తూ జెమిని టి.వి కి ‘అలయనాదాలు’ టెలీ సీరియల్ నిర్మించి దర్శకత్వం వహించారు.

ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న కృషికి గుర్తింపు:
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి చేతుల మీదగా స్వర్ణకంకణం, ‘నాట్యభారతి’ అనే బిరుదు, పాండుచేరి గవర్నర్ నుండి L.V.R ఫౌండేషన్ వారి ‘రాజ్యలక్ష్మి అవార్డ్’. ‘వంశీ’ వారి ‘ఉత్తమ ప్రవాసాంధ్ర కళాకారిణి’ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ వారి ‘జవహర్లాల్ నెహ్రూ సెంటినియల్ అవార్డ్, U.S.A హూస్టన్ ‘ఏషియన్ విమెన్స్ వారి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్ ’ అవార్డ్, ‘TANA’ వారి సాంస్కృతిక పురస్కారం... ఆమె అందుకున్న కొన్ని పురస్కారాలు.

రచయిత ఉమాభారతి:
తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువతో 2012 నుండీ నృత్యేతర రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టి ఉమా రాసిన కథానికలు, కవితలు, నృత్యనాటికలు తెలుగునాట  ప్రముఖ పత్రికల్లోను, పలు అంతర్జాల పత్రికల్లోను ప్రచురించబడ్డాయి. విదేశీ కోడలు – కధా సంపుటి (2013), ఎగిరే పావురమా – నవల (2015), సరికొత్త వేకువ – కధా సంపుటి (201 7), వేదిక – నవల (2016), నాట్యభారతీయం – వ్యాసా సంపుటి (2018) ..ఇప్పటివరకు పుస్తక రూపంగా వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణాలగా వెలువడిన గ్రంధాలు. నాట్యభారతి ఉమాభారతి కధలు – కధా సంపుటి (2023) లో వెలువడింది.

ఆమె తాజా నవల ‘హృదయగానం – నేడే విడుదల’ – నవల (2024) లో సిరికోన సాహిత్య అకాడెమీ వారి ఉత్తమ నవలగా గెలుపొంది, ‘జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక పురస్కారం’ అందుకుంది.

నృత్య నాటికలకు గుర్తింపు:
ఆమె రచించి, నిర్వహించిన  ‘భరతముని భూలోక పర్యటన’ ‘పెళ్లి ముచ్చట’, ‘మానసపుత్రి’, ‘లయగతులు’, ‘తెలుగింటి వెలుగు’ నృత్యనాటికలకి అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డు, సృజనాత్మకతకి గుర్తింపు పొందారు.

విద్యాభ్యాసం: M.A (Pol. Science) – Osmania Universisity
కుటుంబ నేపధ్యం: తల్లితండ్రులు: కీ. శే. మేజర్  సత్యనారాయణ, కీ. శే. శ్రీమతి శారద.
భర్త: డా. మురళి మోహన్ కోసూరి, సంతానం: డా. సత్యజిత్, డా. శిల్ప-సంతానం.
కూచిపూడి గురువులు – పద్మశ్రీ వెంపటి చిన్నసత్యం, ‘కళాప్రపూర్ణ’ శ్రీ వేదాంతం జగన్నాధ శర్మ
భరతనాట్యం గురువులు – పద్మశ్రీ ఫకీరుస్వామి పిళ్ళై, కళైమామని శ్రీ. టి.ఆర్. రాధాకృష్ణన్

Posted in July 2025, కథలు

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *