Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
-- మధు బుడమగుంట --
తెలుగుసంస్కృతాలు
ఉ. తేటతెలుంగు సంస్కృతము దివ్యముగా నొక పంక్తిఁ గూర్చొనన్
     మాటల కూర్పు బాట యగు మాధురిఁ బంచు ద్విరేఫపంక్తికిన్
     సాటియె లేని సేకరణచాతురిఁ జూపి మరంద మానఁగాఁ
     దేటుల జన్మ ధన్య మగుఁ దియ్యని పద్యసుమాల సృష్టిచే 216

పదప్రయోగము
చం. పదములు సత్యవిస్తృతప్రభావవిభూతిమయాప్తభావనా
      నదములు భర్గనృత్యభవనాదపదమ్ములు(1) దివ్యవాక్సుధా 
      హ్రదములు నిత్యనూతనశుభాస్పదముల్ రసనర్తకక్షరీ 
      కదములు(2) సూరిరాట్సభల గౌరవ మొందిన శబ్దమంజరుల్
             (1) శివతాండవములో ఉద్భవించిన శబ్దములు గుర్తుగా కలిగినవి
             (2) రసమను నెమలికి వర్షాకాలపు మేఘములు 217

కం. అర్ణార్ణవమునఁ(1) బుట్టిన
     వర్ణనలే యెదలఁ దాఁకు భంగులు(2); కవితల్
     పూర్ణిమవెన్నెల గాఁగాఁ
     గర్ణములే కనుల కన్నఁ గర్వము నొందున్(3)
          (1)అక్షరములనెడు సముద్రములో
          (2)అలలు (3) పున్నమినాడు ఉప్పొంగే అక్షరసముద్రపు
             అలలైన వర్ణనలు హృదయాలను తాకు నపుడు కలుగు శబ్దతరంగాలను
             ఒడిసిపట్టే చెవులు దృశ్యాన్ని చూచే కళ్ళకంటే ఎక్కువ ఆనందము
             అనుభవించి గర్విస్తున్నాయి 218

కవితాసంతర్పణ
సీ. చిన్నివైనను రుచుల్ చిందించు చిట్టికా
       జాలు కందాలు; లడ్డూలు కావె
   ఆటవెలందులు, తేటగీతులు?; జిలే
       బీలు వృత్తా లెన్నొ; వేడివేడి
   బజ్జీలు ద్విపదలు; పాయసా లందించు
       పలువర్ణ(1)సీసాలు; మెలిక లొలుకు(2)
   పేణీలు బంధాలు; ప్రియమైన పూర్ణాలు
       గర్భితపద్యాలు; కడు పొడవగు
   సేమ్యాలు మాలికల్; చిత్రాన్నములు చిత్ర
       కవిత; లిందందునఁ గానుక లగు

తే.గీ. జీడిపప్పులు, ద్రాక్షలతోడి యేల
      కులును మిరియాలు భాష కుజ్జ్వలము(3); లిట్టి
      రసగుళికలైన బహుపదార్థముల(4) విందు
      సుకవికవితలనే చవిచూడ నగును
          (1)రంగుల/రూపముల/జాతుల/అక్షరముల (2)ప్రకటించు 
          (3)అలంకారములు (4)వస్తువులు/శబ్దముల అర్థములు 219
Posted in July 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *