నా పేరు ల్యారి డెరెల్. పూర్తి పేరు చెప్పినా నన్ను గుర్తు పట్టే వాళ్ళు తక్కువే. ల్యారి అనుకోండి, సరిపోతుంది.
“మనూళ్లోనే ఉద్యోగంలో చేరు. పెళ్లి చేసుకొందాం,” అనేది నన్ను వలచిన ఇసబెల్.
“నీకు ఉద్యోగం ఇప్పిస్తాను. చేరి జీవితంలో స్థిరపడు,” అనేవాడు ఇసబెల్ అంకుల్ ఇలియట్.
నేను ఇద్దరి ఆశలను పూర్తి చేయలేకపొయాను. ఇసబెల్ కు పెళ్లి అయ్యిపోయింది. నేను జీవితంలో ఇంకా స్థిర పడలేదు. పెళ్లి కూడా చేసుకోలేదు. ఎక్కడెక్కడో తిరిగాను. ఉద్యోగం కాక పోయిన, చేతికి వచ్చిన పని చేసాను, పొలాలలో, గనులలో, ప్రపంచంలో ఎక్కడ మనసు పడితే, అక్కడ. జీవితాంతం ఉద్యోగం అంటూ ఒక చోట స్థిరపడి పనిచేయడం, నాకు సరిపడదు.
ఈ మధ్య ఒక బార్బర్ దగ్గర అప్రెంటిస్ గా చేరి వ్రెంటుకలు కత్తిరించడం నేర్చుకున్నాను. అక్కడ, ఇక్కడ హెయిర్ కటింగ్ షాప్ లలో నిలకడ లేని పనులు కొన్ని నెలలు చేసాను. అప్పుడే మా ఊళ్ళో ఉన్న పెద్ద ఆసుపత్రి బార్బర్ కోసం వెదుకుతుంటే, నేను ఆ ఉద్యోగం కోసం అప్లై చేసి దొరికిచ్చుకున్నాను. ఏదో కొత్త ఫ్యాషన్ వచ్చిందని అలానే జుట్టు కత్తరించమని గొడవపడే కస్టమర్లు లేరు. టిప్పులు కూడా లేవు. ప్రతి రెండు వారాలకి నా బ్యాంక్ అకౌంట్లో నా జీతం జమ అయ్యి పోతుంది. నా మనస్సు మారి, మరో చోటు పోయే వరకు ఇది సరిపోతుంది. నా మనస్సు మారటం, మరో చోటు మారడం మాత్రం ఖాయం అని నాకు తెలుసు. అలానే నేను ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం మాత్రం ఖాయం కాదని కూడా తెలుసు. నేనింతే.
ఆసుపత్రి లో, ముఖ్యంగా సర్జరీ వార్డ్ లో, పేషంట్స్ కు సర్జరీ ముందు నా అవసరం పడుతుంది. అదేంటో వ్రెంటుకలు కూడా మనుష్యులను బట్టి వేరు, వేరు గా పెరుగుతుంటాయి. మగవారి తలలు లాగానే, శరీరం మీద పెరిగే జుట్టు, కొందరికి వత్తుగా ఉంటే, మరి కొందరికి అసలేమి ఉండదు. ఏది, ఏమైనా సర్జరీ జరిగే ప్రాంతంలో ఏ మాత్రం వ్రెంటుకలు లేకుండా శుభ్రంగా క్షవరం చేయడమే నా పని.
ఆసుపత్రి దగ్గరనే ఒక వన్ బెడ్ రూం అపార్ట్మెంట్ రెంట్ కు తీసుకున్నాను. ఎవరినైనా డేట్ చేసినా, ఆ ఒక్క రాత్రికి ఇంటికి తీసుకొని పోవచ్చు. మినిమలిస్ట్ గా బ్రతకాలనుకున్నాను. నాకు చెప్పుకోదగ్గ స్థిర, చరాస్తులు లేవు. వేసుకోవడానికి ఒక వారం సరిపడ దుస్తులు అంతే. ఫర్నిష్డ్ అపార్ట్మెంట్ కాబట్టి మరే వస్తువులు కొనాల్సిన అవసరం కూడా పడలేదు. ఆఫీసు పోవడానికి ఒక బైసైకిల్ గుడ్ విల్ స్టోర్ లో కొన్నాను. పొద్దున్న, సాయంత్రం ఒక అర గంట ఆసుపత్రి పోయి రావడానికి సైకిల్ తొక్కడంతో నాకు వేరే జిమ్ చేరాల్సిన పని కూడా లేదు.
నన్ను, నా లైఫ్ స్టైల్ తెలిసిన వారు ముందు ఆశ్చర్య పడినా, దాని వెనుకే ఉన్న, వారి అసూయ తన తల ఎత్తి చూడడానికి అట్టే సమయము పడదు.
నాకు ఉన్న ఒకే ఒక పెద్ద ఖర్చు, వీలున్నప్పుడల్లా ప్రపంచంలో పలు ప్రదేశాలు బ్యాక్ పాక్ తో సంచరించడం. ఫ్లైట్, ఉండడానికి వసతి ఖర్చులు బాగానే అవ్వుతాయి. నేను ఆదా చేసిన డబ్బులు ఈ విధంగా ఖర్చు పెట్టడం నాకు గొప్ప ఆనందమే. ఇప్పటికే ప్రపంచంలో చెప్పుకోదగ్గ ప్రదేశాలన్నీ సందర్శించేసాను. కానీ గమ్యం గోచరించలేదన్న అసంతృప్తి, నా జీవిత ప్రయాణాన్ని ఇంకా కొనసాగించడానికి, స్ఫూర్తిగా పనిచేస్తూనే వుంది.
నేను నడుస్తున్నది హాస్పిటల్ లో ఉన్న కాఫెటేరియా లో. పేషంట్స్ చూడ డానికి వచ్చిన జనాలు ఉన్నారు. నాతో పాటు హాస్పిటల్ లో పనిచేస్తున్న నర్స్ లు, ఇతర పని వారు కనిపిస్తున్నారు. చాల మటుకు తెలిసిన ముఖాలే. అలాగే ఒక మూల టేబిల్ దగ్గర ఇద్దరు డాక్టర్లు జాక్, షాన్ కనిపించారు. వారిద్దరూ నాకు తెలుసు. దానికి కారణం డాక్టర్ లు అరుదుగా కాఫెటేరియా కు వస్తారు. వాళ్ళకున్న సమయమంతా పేషెంట్ లను చూడడానికి సరిపోతుంది. అలా పని చేస్తూ వారి రూముల లోనే లంచ్ లాగించేస్తారు. కానీ జాక్, షాన్ ల సంగతి వేరు. లంచ్ కని అరగంట తీరిక చేసుకొని తప్పకుండా ప్రతీ రోజూ ఈ రెస్టారెంట్ లో కలుస్తారు.
వీళ్లిద్దరిలో షాన్ తో నాకు ఎక్కువ పరిచయం ఉంది. నేను పని చేసే సర్జన్ లు తాము ఆపరేషన్ చేసి తీసివేసిన ట్యూమర్లు, శరీర భాగాలను పాథలజీ డిపార్ట్మెంట్ లో ఇవ్వమని నాకు తరచు అప్పగించేవారు. అప్పుడు ఆ డిపార్ట్మెంట్ లో షాన్ ను చూసే వాడిని. మిగతా డాక్టర్లు లాగా కాకుండా, షాన్ నాలాంటి వారితో కూడా ఆప్యాయంగా పలకరించి మాట్లాడే వాడు. పేరు, అతనితో పంచుకున్న విషయాలు కూడా బాగా గుర్తు పెట్టుకునే వాడు. దాని వల్ల కలిసిన ప్రతీ సారి, మాట్లాడడం సులభమై పోయేది. తనకు ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉంది. అందరితో కలిసిపోయే గుణముంది. కాబట్టి షాన్ అంటే ఇష్టపడక పోవడం కష్టమే.
జాక్ సైకియాట్రిస్ట్. తన దగ్గర వచ్చే పేషెంట్ లకు కావలిస్తే అరగంట బదులు, గంట పైన కూడా కూర్చుని, ఓపికగా మాట్లాడి తగిన వైద్యం చేయగలడు. అలా చేయడం వల్ల తన ఆదాయం తగ్గినా సరే. నాకు తెలిసిన కార్డియాలజిస్ట్లు, ఇతర స్పెషలిస్ట్ లు ఇరవై నిముషాల చొప్పున దినానికి, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు, 20 మందికి పైగా చూసి వేలకొద్దీ డాలర్లు సంపాదిస్తుండగా, వీరిద్దరి ప్రవర్తన నాకు ఆశ్చర్యం గానే ఉండేది. డబ్బంటే వీళ్ళకి అవసరం లేదా? వాట్ ఈజ్ డ్రైవింగ్ దెమ్?
నేను అప్పటికే కొన్న సూప్, సాలడ్ తీసుకొని, వారి పక్కనున్న ఖాళీ టేబిల్ దగ్గర కూర్చో బోతుండగా, షాన్ నా పేరు పిలిచి తమ టేబిల్ వద్దకు వచ్చి తమతో బాటు లంచ్ చేయమని అడిగారు.
నేను వారి టేబిల్ దగ్గరికి వెళ్లి కూర్చున్నప్పుడు, వారిద్దరూ నవ్వడం కనిపించింది.
“హల్లో డాక్టర్స్?” పలకరింపుతో బాటు వారి నవ్వుకు కారణం కూడా ఆ రెండు పలకరింపు పదాలతోనే అడిగాను.
“హల్లో, నీ గురించే జాక్ కు ఇప్పుడే చెప్పాను. నువ్వు ఎలా మినమలిస్ట్ గా బ్రతుకుతూ, ప్రపంచమంతా తిరుగ గలుగుతున్నావని, సంతోషంగా ఉన్నావని,” అన్నాడు షాన్.
“అందులో నవ్వడానికి ఏముంది. ఈ లైఫ్ స్టైల్ నాకు నచ్చింది. ఒంటరిగాడినే కాబట్టి నాకు మరే బాధ్యతలు, మరొకరి సమయం కోసం వేచి ఉండటం లాంటి సమస్యలు లేవు,” అన్నాను నేను.
“నీకూ సమస్యలు ఉంటాయని, కాని మాకు నీ గురించి పూర్తిగా తెలియదు కాబట్టి అలా భ్రమ పడగలమని జాక్ చెప్పాడు. అప్పుడే, నేను సైకియాట్రిస్ట్ లు సంతోషంలో దుఃఖం, దుఃఖం లో సంతోషం వెదుకుతారని జాక్ కు నవ్వుతూ చెప్తుంటే, నిన్ను పిలవడం జరిగింది,” అన్నాడు షాన్.
“నేను చెప్పింది సరి కాదా? నీకు వంటరి తనం అనిపించలేదా? నీ చూట్టు పక్కల వారు చక్కగా సంసారాలు చేసుకుంటూ, పిల్లలని పెంచుతూ ఉంటే, నీకూ అలా ఉండాలని పించలేదా? నీ అభిరుచులకు, నీ ఆశయాలకు, నువ్వు చేస్తున్న పని సరిపోలేదన్న ఆలోచనలు రాలేదా? వచ్చి బాధ పడలేదా?” అడిగాడు జాక్.
“అబ్బో చాలా ప్రశ్నలే. ఒంటరితనం, కుటుంబం గురించి ఆలోచనలు రావడం అరుదుగా అయితే జరిగింది. కానీ నాకు అవి సమస్యలు గా తోచలేదు. ఇక నా పని పైన నాకు క్లారిటీ ఉంది. పని నాకిష్టపడి చేయాల్సిన అవసరం లేదు. ఏదో తిండి, గుడ్డ, నీడకు ఒక నైన్ టు ఫైవ్ జాబ్ కావాలి. నాకు అదృష్టవశాత్తు హాస్పిటల్ లో ఉద్యోగం దొరికింది. ఆ ఉద్యోగం నాకిష్టమైన విధంగా బ్రతకడానికి తోడ్పడితే చాలు. అంతకు మించి నేను నా ఉద్యోగం నుంచి ఆశించడం, ఆ ఉద్యోగం గురించి ఆలోచించడం అనవసరం.”
“నీలా ఆలోచించే వారు చాలా మంది ఉన్నా, ఆ ఆలోచనలు అమలు చేసి, ఎలాంటి అసంతృప్తి లేకుండా బ్రతికే వారు అరుదే,” అన్నాడు జాక్.
“ఎంటి నువ్వు కూడా భార్య, పిల్లల్ని వదిలేసి తిరిగితే బాగుంటుంది, అనుకుంటున్నావా?” నవ్వుతూనే జాక్ ను ఆట పట్టించడానికి ప్రయత్నించాడు షాన్.
“అబ్బే దాని గురించి కాదు. ఉద్యోగ నిర్ణయం గురించి చెప్పాను,” అన్నాడు జాక్.
నాకు వారి సంభాషణ ఎందుకో నచ్చలేదు. నేను బార్బర్ ఉద్యోగం వెదుకున్నానని, వారు డాక్టర్లు అని హేళన చేస్తున్నారా?
“నా ఉద్యోగానికి తక్కువేమైంది? ఆ ఉద్యోగం అవసరం ఈ ఆసుపత్రికి, అలానే సంఘానికి ఉంది. నేను కోరుకున్న జీవన విధానాన్ని కావలసిన సంపాదన ఇస్తుంది. ఇంకేమి కావాలి?,” అని నా విసుగును నవ్వుతో ముంచేసి వారితో చెప్పాను.
“ఓహ్ సారి. అలా అనుకోలేదు, అనలేదు నేను. అన్నీ ఉద్యోగాల మీద నాకు గౌరవం ఉంది,” అన్నాడు జాక్.
“నాకు మీ లాగా పదవి, డబ్బు మీద ఆశ లేదు. అందుకే పెద్ద చదువులు చదివి డాక్టర్ అవ్వుదామని అనుకోలేదు. నాకు ఒకటే ఆశయం. ప్రపంచం తిరిగి చూడాలని. దానికి ఏదో ఒక జీవనోపాధి కావాలి. ప్రస్తుతం ఈ బార్బర్ ఉద్యోగం చాలు.”
“నువ్వు చేసింది, నీకు సరి అనిపిస్తే, నీ జీవితమంతా సుఖమే. అది నీ విషయంలో జరగడం సంతోషం.”
జాక్ మాటలలో ఏదో తేడా కనిపిస్తున్నది. నేను చేసింది ఎక్కడో సరి లేదన్నట్లు సూచిస్తున్నారా? దానితోడు బుర్ర కథలో లాగా షాన్ తానా తందానా అంటూ జాక్ మాటలకు తలూపుతున్నాడు.
“నా గురించి, నా జాబ్ గురించి వదిలేద్దాం. మీరు మీ ఉద్యోగాలు ఎలా, ఎందుకు ఎన్నుకున్నారో చెప్పండి. సంఘంలో వచ్చే ప్రతిష్ట, ఉద్యోగంతో పాటు వచ్చే డబ్బే కదా కారణాలు?” నీళ్ళు నమలకుండ, కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పేసాను.
“‘ఎలా, ఎందుకు’ కాదు. ఎవరి వల్ల ఎన్నుకున్నారు అని అడగాలి?” అన్నాడు షాన్.
“అవును, జిల్ లేక పోతే, నేను డాక్టర్ అయ్యే వాడిని కాదు,” అన్నాడు జాక్.
“నా విషయంలోనూ జిల్ పాత్ర ఉంది,” అన్నాడు షాన్.
ఇద్దరూ ఒక క్షణం అర్ధ నిమిలనేత్రులై వారి గతంలో వెళ్లి పోయినట్లని పించింది.
“ఎవరా జిల్? ఆవిడకి మీరు చేస్తున్న ఉద్యోగ నిర్ణయానికి ఏమిటి సంబంధం?” అడిగాను నేను. డాక్టర్లు ఇది వరకే రావడం వల్ల వారి లంచ్ అయ్యిపోయింది. నా ప్లేట్ లో ఉన్న సలాడ్ సగం అయ్యిపొయింది. వీరి సమాధానాలు పూర్తి అయ్యేసరికి నా సలాడ్ కూడా ముగించేయవచ్చు.
సమాధానం ముందు జాక్ నుండి వచ్చింది.
“జిల్, నేను ప్రీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు కలిసే చదివాము. మా చదువులు కూడా అందరి పిల్లల చదువుల లాగానే సాఫీ గా జరిగాయి. ఒక హైస్కూల్ లో తప్పితే.”
“హై స్కూల్ లో ఏమైంది?”
“షూటింగ్ జరిగింది. మా హైస్కూల్ పేరు వినే ఉంటావు. షూటింగ్ వల్ల 17 మంది చనిపోయారు. అంత కన్నా ఎక్కువ మంది గాయ పడ్డారు. ఆ రోజు మేము ఎప్పటిలాగే స్కూల్ కి వెళ్ళాము. క్లాస్ బ్రేక్ అప్పుడు, నేను జిల్ రాబోయే కాయర్ డాన్స్ ప్రోగ్రాం కి ప్రాప్స్ వెదకడానికి మా ఆడిటోరియం దగ్గరున్న రూం కు వెళ్ళాము. అప్పుడే షూటింగ్ మొదలైయ్యింది. షూటర్ కూడా మా హై స్కూల్ స్టూడెంటే. అంతకు ముందు సెమిస్టర్ లోనే స్కూల్ డ్రాప్ ఔట్ అయ్యాడు. దానికి అతని కుటుంబం లో సమస్యలు కారణం అన్నారు. ఏది ఏమైనా, మా కళ్ళ ముందే మా తోటి విద్యార్థులు తీవ్రంగా గాయ పడడం, చనిపోవడం చూసాము. మునుపెరుగని భయం, తరువాత బాధ మాలో తీవ్రంగా చెలరేగాయి. నేను, జిల్ ఒక డ్రామా రూంలో ప్రాప్స్ వెనుక దాంకోవడం వల్ల చావు తప్పించుకున్నాము కాని, ఆ దృశ్యాలు చూసినందువల్ల పోస్ట్ ట్రౌమాటిక్ స్ట్రెస్ కి బాగా గురి అయ్యాము. స్కూల్ వాళ్ళు పిలిపించిన కౌన్సిలర్ ద్వారా కొంత, తర్వాత మేము చూసిన సైకియాట్రిస్ట్ వల్ల మరికొంత ఉపశమనము కలిగింది.”
“అవును. నేనూ మీ స్కూలు షూటింగ్ గురించి విన్నాను. ఆరు నెలలు పైన ప్రెస్, టీ వీ ల లో ఎప్పుడు చదివిన, విన్నా, చూసినా ఆ షూటింగ్ గురించే వార్తలు.”
“మనకు జరిగిన ఘాతుకం మరొకరికి జరగ కూడదని గట్టిగా నమ్మిన వాళ్ళలో నేను, జిల్ కూడా ఉన్నాము. ఆ నమ్మకానికి కార్య రూపం ఇచ్చింది కొందరే. అందులో ముఖ్యురాలు జిల్. నేను, నా లాంటి వారు జిల్ కు కావలసిన సహకారం అందించాము.”
“నాకు మీ స్కూల్ నుంచే ఒక అమ్మాయి ఈ రాష్ట్ర సెనేటర్ ను ఎదుర్కొని గన్ చట్టాల పై, గన్ లాబీల గురించి ప్రశ్నించడం గుర్తుంది. సెనేటర్ ఆ ప్రశ్నలకు, సరైన జవాబులు లేకుండా తడబడం కూడా గుర్తుంది.”
“అవును ఆ ప్రశ్నలు అడిగింది జిల్లే. చాల మందికి, జిల్ గురించి ప్రస్తావించినప్పుడు, ఆ సమావేశం గుర్తుకు వస్తుంది. దానికి కారణం నేషనల్ రైఫిల్ అసోసియేషన్(ఎన్ అర్ ఏ) లాంటి గన్ లాబీ ల వల్ల ఈ సెనేటర్ లకి తమ ఎలెక్షన్ ల కని బాగా డబ్బులు అందాయి. అలాంటి బంగారు బాతులను ఈ రాజకీయ నాయకులు, బంగారం లాగే అపురూపంగా చూసుకుంటారు. అందుకే మితం లేకుండా చంప గలిగే ఆటొ మాటిక్, సెమై ఆటోమేటిక్ గన్ లను బహిష్కరించాలని జిల్, తనతో పాటు నేను, అనేక విద్యార్దులు చేసిన ఉద్యమం బూడిదలో పోసిన పన్నీరైంది.”
“అంటే ఎప్పటి లాగే మీ ఆందోళన కూడా మీరు స్కూల్ మానేసి, కాలేజీ చేరగానే మాయమై పోయిందన్న మాట.”
“కానీ మా స్టూడెంట్ లు కాక కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఈ గన్స్ బహిష్కరించడానికి పాటుపడుతూనే ఉన్నాయి. వాటితో పాటు మాలాంటి వారు పని చేస్తూనే ఉన్నాము. కానీ ఈ గన్ లాబీలు తాము లాభాలు చేసుకోవడానికి, గన్స్ ఉపయోగించడం, రాజ్యాంగం రెండవ సవరణ (అమెండ్మెంట్) ప్రకారం, ప్రజల ప్రాథమిక హక్కు అని ముడిపెట్టి, ప్రజలలో భయం రేకెత్తించి, ఎలాంటి మార్పులు రాకుండా అడ్డుపడుతున్నారు.”
“ఐ యాం సారి. మీ కష్టానికి ఫలితం దొరకటం లేదంటే, నాకు బాధగా ఉంది.”
“అబ్బే మా శ్రమ పూర్తిగా వృధా కాలేదు. సమస్యకు ఒక అడ్డంకి వస్తే, మరో మార్గం వెదుక్కో వలసిందే. మనుష్యులు వద్దకు గన్స్ రావడం ఆపలేకపోతే, మనుష్యులనే గన్స్ దగ్గర వరకు పోకుండా ప్రయత్నించవచ్చు కదా.”
“గ్రేట్ థాట్. ఔట్ ఆఫ్ బాక్స థింకింగ్. అది ఎలా వీలుపడింది.”
“జిల్ నన్ను మెడికల్ స్కూల్ లో చేరి, గ్రాడ్యుయేషన్ తరువాత సైకియాట్రిస్ట్ అవ్వమని ప్రోత్సహించింది. అలా చేయడం వల్ల మానసిక స్థితి సరి లేని వారిని, ముఖ్యంగా విద్యార్థులను, మొదట్లోనే గుర్తించి అలా తప్పుడు దారులు పట్టకుండా వారి ప్రవర్తనలో మార్పులు తెప్పించవచ్చు. అలా ట్రీట్మెంట్ తీసుకున్న ప్రతి మనిషి మంచి వాడై, భవిష్యత్తులో షూటర్ కాకుండా ఆపవచ్చు, అని తను చెప్పేది.”
“అలా మీరు సైకియాట్రిస్ట్ అయ్యారన్న మాట,” మనస్పూర్తిగానే, జాక్ డాక్టర్ గా చేస్తున్న పనికి జోహార్లు అర్పించాను, “షాన్ మరి మీ సంగతేమిటి. జిల్ కు, మీరు చేస్తున్న శవాలు కోసే పనికి సంబంధం ఏమిటి?”
“అంతగా నా పనిని తీసి వేయవద్దు. నాతో చనిపోయిన వారు మాట్లాడుతారు. శవాలే, నాకు చనిపోయిన వారికి, కమ్యూనికేషన్ లైన్ లు.”
“అదెలా? నేను దెయ్యాలు, స్పిరిట్ లు, మీడియం లు అంటే అస్సలు నమ్మను.”
“నువ్వు నమ్మడానికి, నీకో కథ చెప్పాలి. జిల్, నేను స్వచ్ఛంద సేవ చేస్తునప్పుడు, చాల సార్లు గన్ వయోలెన్స్ లో చనిపోయిన వారిని చూసాము. గన్ షాట్ వల్ల చనిపోయారని తెలుసు కానీ ఆ గన్ ఉపయోగించినది ఎవరో అని తెలుసుకోవడం కష్టమై పోయేది. ఆ చనిపోయిన వారి శవాలను కోసి, ఎలాంటి గన్, ఎప్పుడు, ఎన్ని సార్లు ఉపయోగించబడిందో పూర్తి విశ్లేషణతో చెప్పి, ఆ హంతకులకు పట్టుకోవడానికి దోహద పడే కరొనర్ లను చూసి, జిల్ తరచూ నాతో ‘మనిద్దరం మెడిసిన్ చదివి పథాలజిస్ట్ లు అవ్వుదాం’ అనేది. తనే నేను ఈ ఉద్యోగం చేరడానికి నా స్ఫూర్తి.”
“మరి జిల్ ఇప్పుడెక్కడ ఉంది?” అడిగాను నేను.
“జిల్ కు కొండలెక్కడం, కొండలున్న ప్రాంతాలలో హైకింగ్ చేయడం ఇష్టం. అలాంటి జిల్ ఒక సారి బిగ్ బెండ్ పార్క్ లో హైకింగ్ కి పోయి తప్పిపోయింది. మెక్సికో పక్కనే ఉన్న ఆ పార్క్ లో, జిల్ పొరబాటున మెక్సికో లోకి అడుగు పెట్టి అక్కడి వారికి చిక్కి పోయిందా? లేక దారి తప్పి ఎక్కడన్నా పడిపోయి దెబ్బలు తగిలి ప్రాణాలు కోల్పోయిందా? ఎన్నో అనుమానాలు. చాల వెదికారు. చివరికి వదిలేశారు. ఆ సంవత్సరమే, నేను మెడికల్ స్కూల్ లో చేరి, అటు తరువాత పథలజి రెసిడెన్సీ కి అప్లై చేసి ఆ డాక్టర్ గా బోర్డ్ సర్టిఫికేషన్ తెచ్చుకున్నాను.”
“అంటే జిల్ ఆచూకీ దొరకని వారి జాబితాలో చేరిపోయిందన్న మాట.”
“లేదు. రెండు ఏళ్ల క్రితం, సీరియల్ కిల్లర్ చంపాడు అంటూ ఒక శవం నా పరీక్షకు వచ్చింది. శవం మొత్తం వెదికాను. ఎక్కడా నాకు నేను వెదుకుతున్న సమాధానాలు దొరకలేదు. చంపిన వాడు తెలివైన వాడే. ఎక్కడా ఆచూకీ వదలలేదు. చనిపోయిన శవం కూడా నిస్సహాయంగా, మౌనంగా ఉండిపోయింది.
తరువాత ఆ కిల్లర్ చంపినవే మరిన్ని శవాలు వచ్చాయి. అన్ని హత్యలలోనూ కిల్లర్ ఒక్కడే అన్న గుర్తులు వదిలి పెట్టేవాడు. కానీ ఆ హంతకుడిని పట్టుకోవడానికి ఎటువంటి ఆధారాలు ఇవ్వకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకునే వాడు. చివరకు, ఒక శవం మాట్లాడింది. కిల్లర్ అంత వరకు పట్టు బడలేదన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల చిన్న పొరబాటు చేశాడు. ఈ సారి చంప బడిన ఆవిడకు, కిల్లర్ ఉద్దేశం ఒక క్షణం ముందే తెలిసి పోయి ఉండాలి. తిరగబడి పోరాడింది. ఆవిడ చేతి గోళ్లలో హంతకుడి డి.ఎన్.ఏ మార్కులు బయట పడ్డాయి. పోలీసులు డి.ఎన్.ఏ డేటా బేస్ లు విస్తృంగా పరిశీలించి, కిల్లర్ ను పట్టుకో గలిగారు.”
“గ్రేట్. కానీ జిల్ కు ఈ కథకు సంబంధం ఎక్కడుంది?” చూచాయగా సమాధానం తెలుస్తున్నా అడిగాను.
“ఆ సీరియల్ కిల్లర్ అంత వరకు బయట పడని తన హత్యలను గురించి మాట్లాడుతూ, జిల్ ని బిగ్ బెండ్ పార్క్ లో ఎలా, తను స్నేహం చేసి చంపానో కూడా చెప్పాడు. పథలజీ ద్వారా నేరస్తులను పట్టుకోవాలన్న స్ఫూర్తి నిచ్చిన, జిల్ అదృశ్యం అలా పరిష్కారం కావడం, ఆ రోజు నాకొక వైపు అంతులేని దుఃఖం మరో వైపు గొప్ప తృప్తి, క్లోజర్ ఇచ్చింది.”
“మరి మిమ్మల్ని ఇంతగా కదిలించి, స్ఫూర్తి నిచ్చిన జిల్ మీకేమౌతుంది?” అడిగాను నేను.
“నాకు జిల్ కు సంబంధం ఏమి లేదంటే, నీకు నేను చెప్పింది అంతగా హత్తుకోదేమో. జిల్ నాకు చెల్లెలు అనుకో,” అన్నాడు జాక్.
“నాకూ అలానే అనిపిస్తుంది. జిల్ నా గర్ల్ ఫ్రెండ్ అనుకో,” అన్నాడు షాన్.
వాళ్లిద్దరూ నాతో జోక్ చేస్తూనే వుంటారు. వారు చెప్పింది నిజమో, కాదో తెలియదు. అది తెలుసుకోవలసిన అవసరం కూడా లేదని నాకు అర్ధం అయ్యిపోయింది.
మరో విషయం కూడా అర్థం అయ్యింది. ఉద్యోగం కామార్ధాలు తీర్చుకోవడానికే కాదని, అది సరిగా ఎంచుకుంటే, ధర్మ, మోక్షాలకు కూడా ఒక మార్గమని. మరి నా ఉద్యోగం మాటేమిటి? నా జీవన శైలి సరి కాదా?
“జిల్ లాంటి ఆప్తురాలు ఉండటం మీ అదృష్టం. మీ ఉద్యోగాలు ఒక ఉదాత్త గమ్యం ఎంచుకొని ఎన్నుకున్నారు. నేను నా పని నిత్యావసరాలు తీరుస్తే చాలనుకున్నాను. ఆ పని చేయడంలో నాకు ప్రేమ లేదు,” అన్నాను. నామాటలలో వారు చేస్తున్న పని పైన మెప్పు, నా పని పైన నా పెదవి విరుపు బాగానే ప్రస్ఫుటమై ఉండాలి.
“అలా ఎందుకనుకుంటావు ల్యారి. నీ గురించి, నువ్వు చేసిన ప్రయాణాల గురించి సోమర్సెట్ నుంచి ముందే విన్నాను. నువ్వు లేకుంటే సర్జన్ కత్తి పెట్టడు. కాబట్టి రోగి కి వ్యాధి నిర్ములనంలో నీ పాత్ర కూడా ఉంది. పని చేసే వారందరూ ఈ లోక కళ్యాణానికి పాటు పడే వారే,” అన్నాడు జాక్. షాన్ నన్ను చూస్తూ, ఎప్పటిలాగే నవ్వుతూ, జాక్ మాటలకు తల ఊపాడు.
ఈ సారి ఏ సన్యాసిని, గురువును వెదుక్కోకుండానే, నాకు మరో నిజం ప్రత్యక్షమైంది.
********
(సోమర్సెట్ మామ్ నాకు ఇష్టమైన రచయిత. ఆయన వ్రాసిన “ది రేజర్స్ ఎడ్జ్’ నవల లోని పాత్ర లారెన్స్ ఈ రోజులలో ఉంటే ఆయన అనుభవాలు ఎలా ఉండేవి అన్న ఆలోచన తో వ్రాసిన కధలలో ఇది కూడా ఒకటి. లారెన్స్ సత్యాన్వేషి. ఆ ప్రయత్నంలో ప్రపంచం అంతా తిరుగుతుంటాడు. ఆయన జీవితం గురించి తెలుసుకోవడానికి మామ్ నవల చదవండి.)