ఆషాఢమాసము
సీ. చుక్క పూర్వాషాఢ శోభిల్లు పున్నమి
కల మాస మాషాఢ; మెలమి సలుప
శరధినదీస్నానజపదానపారాయ
ణ లొసంగు నుత్తమఫలితములను;
కర్కాటకముఁ జొచ్చఁ గమలాప్తుఁ డీ నెల
నారంభ మగు దక్షిణాయనంబు;
వ్యాసపూర్ణిమ తోడ భాసిల్లు మాసంబు;
పితృదేవతలకును బ్రియకరంబు;
పూరీజగన్నాథభూరిరథోత్సవ
స్కందపంచమిషష్ఠికాల మిదియె;
శుద్ధసప్తమినాఁడు చోద్యంబుగా దిన
రాత్రముల్ సరిసమార్థంబు లగును;
మొదటి యేకాదశి ముఖ్యచాతుర్మాస
వ్రతమున కారంభపర్వదివస;
మారోగ్యపరసమస్యలకుఁ గాలము; శూన్య
మాసంబు; స్వస్థతధ్యాస నిలిపి
పల్లెపత్తనముల భామ లెందఱొ కూడి
యాడుచుఁ బాడుచు నమ్మవారి
కతిశ్రద్ధ బోనాల నర్పించెదరు తెలం
గాణప్రజలు; సేద్యకార్యములకు
తే.గీ. నడుము బిగియించి కర్షకుల్ నాందిపలుకు
తరుణ మిది; క్రొత్తకోడళ్ళు తల్లియింట
గడుపు నియమంబు పెట్టిరి గడుసరులగు
పెద్ద లాషాఢవైశిష్ట్య మిద్ది కాదె?