ఇండియన్ హెర్క్యులెస్ - కీ శే శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు గారు
మన పురాణాలలో బలానికి మారుపేరు శ్రీ ఆంజనేయుడు, మరియు భీముడు. అలాగే గ్రీక్ పురాణాలలో బలానికి పేరు గాంచిన వారు హెర్క్యులస్ కాబట్టి పాశ్చాత్యులు అప్పట్లో ఇండియన్ హెర్క్యులెస్ గా బ్రిటన్ పాలకులైన కింగ్ జార్జ్, క్వీన్ మేరీలచే బకింగ్ హమ్ ప్యాలెస్ లో వారితో విందు తీసుకొని బిరుదు పొందిన మహానుభావుడు శ్రీ కోడి రామ్మూర్తి గారు. ఇంకా కలియుగ భీమ, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీర కంఠీరవ వంటి బిరుదులను కూడా సొంతం చేసుకున్నారు. కోడి రామ్మూర్తి నాయుడు గారి పారు నేటి యువతకు అంతగా పరిచయం లేకపోవచ్చు. ఈయన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు. మల్ల యోధులు అంటే పురాణాలలో భీముని గురించి విన్నాము గాని చూసే అదృష్టం లేదు కానీ కలియుగ భీముడిగా ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాలలో ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు రామ్మూర్తి నాయుడు గారు. ఈయన శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు. తెలుగు దేశంలో ప్రఖ్యాత తెలగ (కావు) వీర యోధ వంశాలలో కోడి వారి వంశం ఒకటి. ఈ వంశ పరంపరలోని శ్రీ కోడి వెంకన్న నాయుడు వీరి తండ్రి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేరణతో విజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణస్వామి దగ్గర పెరిగారు.
అక్కడ ఒక వ్యాయామశాలలో చేరి దేహ దారుఢ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు. 21 సంవత్సరాల వయసులో ఇతడు ఛాతీ పై 1 1/2 టన్నుల భారాన్ని మోసేవాడు. తర్వాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగాడు. మద్రాసులో సైదాపేట కాలేజిలో ఒక సంవత్సరం వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని విజయనగరానికి తిరిగి వచ్చి విజయనగరం శిక్షణ తర్వాత వ్యాయామోపాధ్యాయుడుగా సర్టిఫికేట్ అందుకుని, విజయనగరంలో తాను చదివిన హైస్కూలులో వ్యాయామ శిక్షకుడు గా చేరాడు.
విజయనగరంలో పొట్టి పంతులు అనే మిత్రుని సహకారంతో సర్కస్ కంపెనీ నెలకొల్పాడు. తుని రాజా గారి నుండి సంపూర్ణ సహకారం లభించింది. రామ్మూర్తి సర్కస్ సంస్థ పలుచోట్ల ప్రదర్శన లిచ్చి మంచి పేరు తెచ్చుకున్నది. సర్కస్ కంపెనీ బాగా పెరిగింది. తెలుగు జిల్లాల్లో ప్రదర్శనల తర్వాత 1912లో మద్రాసు చేరారు. పులులు, ఏనుగులు, గుర్రాలు, చైనా, జపాన్ కళాకారుల సహకారం తదితర అంశాలతో ఆయన ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి. శరీరమునకు కట్టిన ఉక్కు గొలుసును, ఊపిరితిత్తులలో గాలిని పూరించుకుని ముక్కలుగా తుంచి వేశారు. రెండు కార్లను రెండు భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకుని కార్లను శరవేగంగా నడపమనేవాడు. కార్లు కదిలేవి కావు. ఛాతీ పై పెద్ద ఏనుగును ఎక్కించుకునేవాడు. ఐదు నిమిషాల పాటు, రొమ్ముపై ఏనుగును అలాగే ఉంచుకునేవాడు. తండోపతండాలుగా ప్రజలు వారి ప్రదర్శనలు చూడటానికి వచ్చేవారు. దేశ విదేశాల్లో ఈయన ప్రతిభ మారుమోగటంతో పూనాలో లోకమాన్య తిలక్ గారి కోరిక మేరకు ప్రదర్శనలిచ్చారు. తిలక్ రామమూర్తి గారికి మల్ల మార్తాండ, మల్లరాజ తిలక్ బిరుదునిచ్చారు. హైదరాబాద్ లో ఆంధ్రభాషా నిలయం పెద్దలు ఘనసత్కారం చేసి జగదేక వీర బిరుదునిచ్చారు. విదేశాల్లో భారత ప్రతిభను ప్రదర్శించమని తిలక్ ప్రోత్సహించారు. ఈయన ప్రతిభ విన్న అప్పటి వైస్ రాయ్ లార్డ్ మింటో రామ్మూర్తి గారి ప్రదర్శన చూడాలని వచ్చి ఆయన ఆంజనేయ స్వామి ఉపాసనలో ఉన్నందువల్ల కొంత సమయం వేచి ఉండి రామ్మూర్తి గారి ప్రదర్శనలను చూచి ముగ్దుడైనాడు. తాను నడుపుతున్న కారును కూడా ఆపవలసిందిగా కోరాడు. అప్పుడు రామ్మూర్తి గారు తాళ్లతో కారును తన భుజాలకి కట్టుకొని కారును స్టార్ట్ చేయమంటే కారు అంగుళం కూడా కదలలేదు. ఈ సంఘటనతో వైస్రాయి ప్రశంసలను, దేశమంతా గొప్ప పేరును సంపాదించాడు రామమూర్తి నాయుడు.
అఖిల భారత కాంగ్రెస్ సభ అలహాబాద్ లో జరిగేటప్పుడు రామమూర్తి సర్కస్ అక్కడ ప్రదర్శనలిచ్చింది. ఇది చూసిన జాతీయ నాయకులెందరో ఆనందించి ప్రశంసించారు. పండిత మదనమోహన మాలవ్యా రామమూర్తి గారిని ఎంతగానో మెచ్చుకుని విదేశాలలో ప్రదర్శనలివ్వమని ప్రోత్సహించారు. పండిత మదన మోహన మాలవ్య గారి అతిథిగా ఏడాదిపాటు బెనారస్ లో రామమూర్తి గారు ఉన్నారు.
1600 మంది గల తన బృందంతో రామమూర్తి గారు లండన్ వెళ్ళి ప్రదర్శనలిచ్చారు. సుప్రసిద్ధ మల్లుడైన గామా పహిల్వాన్ తమ్ముడు ఇమామ్ బక్షీ ఆ బృందంలో వుండేవాడు. లండన్లో రాజదంపతులు జార్జి రాజు, రాణి మేరి, రామమూర్తిగారి ప్రదర్శనలను చూచి తన్మయులయ్యారు. రామమూర్తి గారిని తమ బకింగి హామ్ రాజభవనానికి ఆహ్వానించి, విందు ఇచ్చిన తర్వాత 'ఇండియన్ హెర్కులస్' బిరుదంతో సత్కరించారు. ఆ విధంగా బ్రిటిష్ రాజదంపతులచే గౌరవించబడిన భారతీయులలో మొదటి వాడు కోడి రామ్మూర్తి నాయుడు. రామమూర్తి గారు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలలో పలు ప్రదర్శనలిచ్చారు. స్పెయిన్ దేశంలో 'కోడె పోరాటం' (బుల్ ఫైట్) చాలా ప్రసిద్ధమైంది. ఈ పోరాటం చాలా భీకరంగా ఉంటుంది. రామమూర్తి గారిని ఆ పోరులో పాల్గొనమన్నారు. అట్టి పోరాటంలో ఏలాటి అనుభవం లేని రామమూర్తి గారు రంగంలో దూకి దూసుకుని వస్తున్న కోడె కొమ్ములను పట్టుకుని క్షణాల్లో క్రింద పడవేశారు. కోడె చిత్తుగా పడిపోయింది. వేలాది ప్రేక్షకుల హర్షధ్వానాలతో స్టేడియం మార్మోగింది. ఆ విధముగా స్పెయిన్ బుల్ ఫైట్ లో కూడా పేరు సంపాదించాడు. ఆ తరువాత జపాన్, చైనా, బర్మాలలో రామమూర్తిగారి ప్రదర్శనలు ఎంతో వైభవంగా సాగాయి. బర్మాలో వున్నపుడు రంగూన్లో ప్రదర్శనలిచ్చారు. అసూయగ్రస్తులు కొందరు రామమూర్తిగారిని చంపాలనుకున్నారు. ఎలాగో ఈ విషయం గ్రహించిన రామమూర్తిగారు ప్రదర్శనను ఆపి మరుసటి రోజే మాతృదేశం వచ్చారు. కోడి రామమూర్తి గారు కోట్లు గడించారు. అంత కంటే గొప్పగా దాన ధర్మాలకు, జాతీయోద్యమాలకు ఖర్చు చేశారు. భారతదేశం అంతటా రామమూర్తి గారి పేరు ప్రతిధ్వనించింది. అమెరికా వెళ్లి అక్కడ కూడా తన ప్రతిభను ప్రదర్శించాలి అనుకున్నారు. కాని వెళ్ళలేదు. ప్రతిరోజూ పత్రికల్లో రామమూర్తిగారి ప్రశంసల పరంపర ఉండేది.
రామ్మూర్తి నాయుడు గారు పూర్తిగా శాకాహారి. భారతదేశంలో అతి విశిష్టమైన వ్యాయామ విద్యాసంస్థను ప్రారంభించాలనుకున్నారు. కాని ఆ ప్రయత్నం ఫలించలేదు. రామమూర్తిగారు కాలిపై రాచపుండు లేచినందున కాలు తీసి వేయవలసి వచ్చింది. సేకరించిన ధనం కరిగిపోయింది. శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఎటువంటి మత్తుమందును (క్లోరోఫామ్) తీసుకోకుండా ప్రాణాయామం చేసి నిబ్బరంగా శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
చివరి రోజుల్లో బలం ఘర్, పాట్నాలో కలహండి (ఒరిస్సా) పరగణా ప్రభువు పోషణలో వుండి 16.1.1942 తేదీన కన్ను మూశారు నాయుడు గారు. తెలుగువారే కాక భారతీయులందరూ గర్వించదగిన మహనీయుడు, దేశభక్తుడు, 'కలియుగ భీమ' కోడి రామ్మూర్తి నాయుడు గారు. వరవిక్రయం, మధుసేవ వంటి గొప్ప సాంఘిక నాటకాల రచయిత, విఖ్యాత నాటక కర్త కాళ్ళకూరి నారాయణ రావు గారు, కోడి రామ్మూర్తి గారు ఆప్త మిత్రులు. నాయుడు గారిని ప్రశంసిస్తూ "సాధు పథవర్తి సన్మిత్ర చక్రవర్తి రమ్యతరకీర్తి శ్రీ కోడి రామమూర్తి" అని అన్నారు నారాయణ రావు గారు. మన పురాణాలలో బల శబ్దానికి భీముడు, ఆంజనేయుడు పర్యాయ పదాలైనట్లు ఆంధ్ర ప్రదేశంలో ఇతడి పేరు బలానికి దేహ దారుఢ్యానికి పర్యాయపదంగా పరిగణించబడింది కానీ దురదృష్టం ఏమిటి అంటే అంత గొప్ప వాడికి ప్రస్తుతము సరి అయిన గుర్తింపు లేదు. ఆయన పేర సరి అయిన స్మారక చిహ్నాలు లేవు. ఆయన తీరని కోరిక అయిన విశిష్టమైన వ్యాయమ విద్య సంస్థను ప్రారంభించి యివతకు మంచి శారీరక పటిష్టతను పెంపెందించే దిశగా ప్రభుత్వాలు పని చేయాలి. అదే ఆయనకు మనం అందించే సరైన నివాళి.