చివరి భాగం
రెండురోజుల క్రితం అక్కడ చక్కని షష్టిపూర్తి మహోత్సవం జరిగి నవ్వులతో, హాస్యాలతో, చతురోక్తులతో గలగల లాడిన సంబరాల కోట లా లేదు.
ఎక్కడ చూసినా విషాదం పరచబడిన ఆనవాళ్ళే!
భయాందోళల్ని కలిగిస్తున్నాయి. నీలి చెయ్యి చంద్రం చేతిలో ఉంది. ఆ పిల్ల కి ఏమీ తెలియడం లేదు. తాను రక్షింపబడే చోటికి వచ్చి చేరానన్న విషయం అందడానికి చాలా కాలం పట్టొచ్చు. చంద్రం లో ఆలోచనల దాడి మొదలయింది. నెమ్మదిగా మాట్లాడడం మొదలు పెట్టాడు.
“ఇదంతా మాంస పోరాటం! అవతలి వ్యక్తి ఎవరూ అనేది చూడకుండా ఆకాశంలో గ్రద్దలూ, డేగలు చాలా ఎత్తున ఎగురుతూ మాంసపు ముక్కను ఏ విధంగా చేజిక్కించు కుంటాయో అలాంటి వాంఛ! తెలుసా? వీళ్ళు చాలా కాలం నుంచి కామం లో అతుక్కుపోయి ఉంటారు. యుక్తవయస్కులవుతుంటే అశ్లీల కామక్రీడల్ని చూసే వీళ్ళ అంతఃకరణ మానసిక స్థితి చౌకబారుగా ఉంటాయి. పశువుల్లా సంచరిస్తారు. కన్నూ,మిన్నూ కానకుండా పెట్రేగిపోతుంటారు. అక్కడి నుంచి తమంతటి లేరని రాక్షస ప్రవృత్తితో రోడ్లమీద పడతారు. చెల్లినంత కాలం చెల్లుబాటు. ఆ తరువాత కలుగుల్లో ఎలుకల్లా చీకటి స్థావరాలు!” అన్నాడు.
అంతా నిశ్శబ్దంగా ఉంది. చంద్రం కి ఊపిరి సలపనంత ఆవేదనగా ఉంది.
“ఏమిటిది? ఒక పక్క మంచిని పెంచే దిశగా సాగుతున్న మహత్తరమైన ముందడుగులు. మరోపక్క లెక్కలేనన్ని హింసాత్మక చర్యలతో చెడు వైపు వెనుకడుగులు.
గాలిని సహితం గుప్పెట్లో బంధించాలనే అవివేకంతో కూడిన ఆలోచన ఈ వాంఛా కోరిక!
పిడికిలి గట్టిగా బిగిస్తే గాలి ఎలా జొరబడుతుంది?
‘పెద్దల మాట చద్ది మూట!’ అని ఉత్తినే అనలేదే? వారి మాటల్ని జాగ్రత్తగా పదిలంగా విని బతుకుని సజీవంగా మలుచుకోమన్నారు, జీవితాన్ని పండించుకోమన్నారు. కాస్త జ్ఞానం, అనుభవం కలిగిన ఉత్తముల మాటల్ని వింటే –
‘కామం కేవలం శరీరాలకి సంబంధించి కాదనీ, భావనలకు, తద్వారా వచ్చే ఆలోచనలకు అనుసంధానానికి ఆలవాలమైనదని తెలుసుకుంటారు. శరీరం, మనసు రెండూ ఏకకాలంలో స్పందించగలిగే చక్కని ప్రక్రియకి అసలు పేరేముంటుంది?
అన్నింటికీ ‘ప్రేమ’ అనే ఒక పేరు పెడతారు. ప్రేమ ఒక భావనా? ఒక ఆంతరంగిక శక్తి!!!
పాపం,ఈ నీలి! ఒక్క క్షణం కూడా ఇటువంటి పువ్వుల గురించి ఆలోచించి ఉండరు.
ఈ పిల్లదానికి ఏమి కావాలి? ఏమడుగుతుంది? మృదువైన, సున్నితమైన పువ్వులివి.
ఉద్యానవనంలోనూ, ఇంటి పెరటిలోనూ, అడవిలోనూ విరబూస్తాయి. అడవిలోనైనా –
“నేను విచ్చుకున్నాను. నన్నెవ్వరూ చూడడం లేదు అని బాధ పడతాయా? తన నేవరైనా చూస్తేనే బాధ. ఎందుకంటే దాన్ని కోసుకోవాలి అనే దుర్భుద్ది పుడుతుంది కనుక!’ నీలిని దగ్గరగా తీసుకుని ఆ పిల్ల తల నిమిరాడు చంద్రం. నీలి అసంకల్పితంగా విదిలించుకుని దూరంగా నిలబడింది. ఒక్కసారిగా విలవిల లాడాడు చంద్రం.
నీలి పరిస్థితి చాలా ఘోరమైనది. అంత చిన్న ప్రాయంలోనే మగవాడి స్పర్శ కేవలం “వాంఛ” గా నాటుకుంది. ఆ భయం ఆ పిల్ల లో ఎప్పటికీ పోతుంది?
ఎందుకో గాలి వీచడం మానేసింది. వాతావరణం ఇంకా చల్లగా మారింది. నేలమీద కాలు మోపడం కష్టంగా ఉంది. ఆకాశం నిండా నల్లమబ్బులు ఆవరించి ఉన్నాయి. లక్ష్మణ్ పల్లె పదాలు అందుకున్నాడు. అందరి మొహాల్లో పోతున్న కళనీ, వెలుగుని తీసుకువచ్చాడు.
“పాట కుండే శక్తే అది. ప్రకృతి లో ని లయతో కలగలిసిన మహా స్వరూపిణి” అన్నాడు మహేంద్ర. వాసంతి చిరునవ్వు నవ్వింది.
నీలి మాత్రం అలాగే స్తబ్ధుగా ఉంది. అది చూసి లక్ష్మణ్ చాలా కదిలిపోయాడు. ఒక గమ్మత్తైన పాటని అందుకున్నాడు. ఆ సారాంశాన్ని విన్న ఎవరికైనా ఏడుపు రావడం ఖాయం.
“ఇదేమిటి? మాదంతా కరుణా, దయ గల లోకం అనుకున్నా! ఇది కూడా అరణ్యమా మిత్రమా? అక్కడ మీ దగ్గర జంతువని, పక్షి అని, చెట్టు అనీ, పుట్ట అనీ విడివిడిగా వేరు వేరుగా ఉంటాయి కదా? కానీ ఇక్కడో? చిరుతలూ, కోతులు, సింహాలు, ఏనుగులు,పులులూ పాములు,,మొసళ్ళు, ముందు చక్కని పిట్టలా మాయ పలుకులు పలికిన మానవుడు ఒకే రూపం లో దర్శనమిస్తాడు. అక్కడ జంతువులు ఎలా ఉంటాయో, వాటి పద్దతులేమిటో అంచనా వెయ్యొచ్చు. కానీ ఇక్కడి మనుషుల గురించే ఏమి తెలియదు!” అనే పాటని హృదయవిదారకంగా ముగించాడు.
చాలా సేపు అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది.
విరించి, లావణ్య లు అందరికీ భోజన సౌకర్యం కలుగజేసినా ఎవ్వరికీ ముద్ద మింగుడు పడలేదు. ప్రతీవారిలో వారి వారి జరిగిన జీవనవిధానాలు జ్ఞాపకాలుగా వచ్చి నీలి నీడలు ముసురుకుంటున్నాయి.
విరించి హఠాత్తుగా మాట్లాడడం మొదలుపెట్టాడు.
“పాశ్చాత్య నాగరికత మన దేశంలో ప్రవేశించినప్పుడు దాని ప్రభావచ్చాయల్లో కాలం కొట్టుకెళ్లి పోతోంది. ఆ మార్పు మానవ జీవితాల మీద, నైతిక ప్రవర్తనల మీదా, వ్యక్తిగత విషయాల మీద ముఖ్యంగా మానసికంగా ప్రభావితం చూపించే సామాజిక వ్యవస్థ వినాశనానికి దారి తీస్తుంది.
ఆధునిక పోకడలు, అలవాట్లు, వేషాధారణ,అవగాహనా శైలి, ఆలోచనా రీతి అంతర్లీనంగా మార్పు చెందుతాయి.
ఆ మార్పే కాలాన్ని మలుపు తిప్పుతుంది.
కాలంతో పాటు మారని వ్యక్తులు,ధృఢమైన, స్థిరమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వలక్షణాలు కలవాళ్ళు ఉండడం వల్ల వ్యవస్థ లో సామూహిక మార్పులు అంత వేగంగా రావు!” అన్నాడు.
ఆ మాటలు ప్రకృతి వింటున్నట్టుగా ఒక్కసారి భయంకరమైన గాలులు భీభత్సంగా ప్రతిధ్వనిస్తూ వీచాయి. తుఫాను తాకిడి మొదలయినట్టుగా ఉంది. ఎవ్వరికీ శాంతిగా లేదు.
సరదా మాటలు, ఆ హాయి, నవ్వులు ఏమయ్యాయి?
కవిత ఇన్నిరోజుల తర్వాత మాట్లాడడం మొదలెట్టింది.
“గత అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకోకుండా మనిషి చేస్తున్నది దుస్సాంగత్యం! గమ్మత్తెమిటంటే మనిషి గమ్యమేమిటో తెలియకుండా జీవితాంతం స్వారీ చేయగలడు. అందుకే చేసిన తప్పులన్నీ పునరావృత మవుతూ వస్తున్నాయి. ఇలా చేయడం వల్ల దిగులు కమ్ముకుని నిరాశా, నిస్పృహల్లో కూరుకుపోవడం. దానివల్ల తాను బాదపడడమే కాకుండా చుట్టూ ఉన్నవారికి కూడా బాధను ట్రాన్సఫర్ చేయడం జరుగుతుంది.
నిజానికి మనిషిలో ఇటువంటి తుఫాను రావడం కూడా ఒక వరం లాంటిదే!
వ్యక్తిత్వ పోరాటాలు, బాంధవ్యాల గొడవలు, భవిష్యత్ గురించి విచారం, అభద్రతాభావం, అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి.
కొత్త పంథా, నూతన వ్యవస్థా నిర్మాణం, జరుగుతాయి. లేకపోతే ఈ అరాచకత్వం ఇలా సాగుతూనే ఉంటుంది!” అంది తుఫానుకి స్వాగతం పలుకుతూ.
ఆశ్చర్యంగా చూసారందరూ!
ఆ మాటల్లో ఎంతో వివేకం, పదును ఉన్నాయి. అందర్నీ ఆలోచనల్లోకి లాగింది కవిత.
“ప్రకృతిలో భీభత్సాలు ఎంత సహజమో అవి చల్లారాక ఎంత ప్రశాంతతని ఇస్తాయో గమనించి తీరాలి. మనుషుల్లో ఈ చిత్ర, విచిత్ర ధోరిణులు తుఫానులు కావా? ఏ విధంగా ఆ తుఫానులు తలెత్తయో అదే విధంగా శాంతించడాన్ని అబ్బురంగా చూడాలి. విశ్వ ప్రకృతిలో ఎంత ఆశ్చర్యకరమైన వ్యక్తిగత ప్రకృతి దాగి ఉందో ఆలోచిస్తే ఆశ్చర్యం ముంచెత్తుతుంది. ఒక గణనీయమైన మార్పుకి ‘నాంది’ కాదా ఆ గాంభీర్యం?” అంది కవిత.
ఆమె ఆలోచనల వైపు దృష్టి సారిస్తున్నారందరూ!
******
లక్ష్మణ్ రేడియో వాల్యూమ్ పెంచాడు. అందరూ వింటున్నారు.
ఆకాశవాణి! విశాఖపట్నం కేంద్రం!
పెనుతుఫాను హెచ్చరిక కేంద్రం!!
ఇది సాదా సీదా తుఫాను కాదు. ప్రకృతి ప్రళయం. సర్వం తుడిచిపెట్టేస్తున్నవిలయం. ఊపిరి బిగపట్టి వినాల్సిన పెనుగాలి చేస్తున్న విలయ తాండవం. ఒకటే గాలి,వాన. గాలి వేగానికి వానచినుకులు నేలను తాకాకుండా గాల్లోనే ఎగిరిపోతున్నాయి. భయంకర మైన శబ్దం చెవులు చిల్లులు పడేలా వికటట్ట హాసాలు చేస్తోంది. వీధుల్లో, రహదారుల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 200 ల కిలోమీటర్ల వేగంతో గాలులు వీచవచ్చు. నిపుణుల అంచనా మేరకు 260 కిలోమీటర్ల వేగం తో సుడిగాలులు వీచే ప్రమాదం పొంచి ఉందని హెచ్చెరిక. వర్షం కన్నా ‘జెట్’ స్పీడుతో వీచే గాలులే పెను ముప్పు కలిగించవచ్చు. రేపు సాయంత్రానికి తీరం దాటవచ్చు. తీరం దాటే సమయంలో అతిభారీ వర్షాలు కురిసే సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి.
గాలి తాకిడికి పెద్ద చెట్లు, టవర్లూ, కరంట్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉంది గనుక పలు జాగ్రత్తలతో మెలగాలి.
ఈ పెను తుఫాను పేరు ‘ప్రేమ!’ అనే పేరు పెట్టబడింది.
వాతావరణ సూచన.తుఫాను హెచ్చెరికలు ఎప్పటికప్పుడు తెలియజేయబడతాయి. అని ముగింపు నిచ్చింది అనౌన్సర్.
******
గంట అయ్యాక –
స్తుతి గొప్ప గాభరా పెట్టేసింది రాకీని.
“ఎవరెన్నయినా చెప్పనీ రాకీ! మానవ సంబంధాలు ప్రేమ వల్లే ఇంకా నిలుస్తున్నాయి.
‘ప్రేమ’ అనే పదం ఎప్పుడు పుట్టిందో వాదన అనవసరం. అది మనిషి పుట్టిన నాడే పుట్టింది. ఇది నేను కచ్చితంగా చెప్పగలను. ఇది మనిషి ఉన్నంతకాలమూ ఉంటుంది. ప్రేమని గుర్తించాలి. అంతే! అంది.
మహేంద్ర, వాసంతి ఒకర్ని ఒకరు చూస్తూ నవ్వారు. స్తుతి ఈ జరుగుతున్న సంఘటనలకి తల్లడిల్లి పోతోంది. మహేంద్ర లేచి వెళ్ళి స్తుతి పక్కన కూర్చున్నాడు ఓదార్పుగా.
‘కరుడుగట్టిన రాక్షసత్వం, యాంత్రికత మనుషుల జీవితాల్లో విషాల్ని కుమ్మరిస్తున్నాయి. స్తుతిని ఎలా ఓదార్చడం? అనుకున్నాడు. సంజన కి స్తుతి మాటలు చాలా నచ్చాయి.
మహేంద్ర స్తుతి మాటలు కొనసాగించాడు.
హాల్లో ఉన్న ప్రతిఒక్కరూ ఎవరేం చెప్తున్నా వింటున్నారు.
“పంచభూతాలకి జీవం ఉంది... ప్రాణం ఉంది స్తుతి. వాటికీ ఆగ్రహం వస్తుంది. అనుగ్రహం ఉంటుంది. మనిషి అదుపు తప్పి వ్యవహరిస్తుంటే ఎప్పుడో ఒకప్పుడు అవీ కోపిస్తాయి. అప్పుడే తుఫానులు, భూకంపాలు, ఉప్పెనలూ ముంచుకు వస్తున్నాయి. మనిషి తాత్కాలిక ప్రయోజనాల కోసం శాశ్వత వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాడు!” అన్నాడు
“అవును కానీ నేనంటున్నది ప్రేమ ఉంది అని!” ఆ అమ్మాయికి ఆపుకోలేని ఏడుపు వస్తోంది. ‘అవును. ప్రేమ ఉంది. ఉంటుంది. కానీ ఎలా మనుషులు దాని స్వరూపాన్ని మార్చేస్తున్నారో మన “బడ్డీ ఎన్ క్లేవ్“ లో జరిగిన విషయాలే ఉదాహరణలు. అక్కడ విషయాలు ఎవరికి తెలియవు? కానీ ఈ అనుకరణ ఒకరిని ఛూసి ఒకరు ఇంగితజ్ఞానం కూడా లేకుండా అనుసరిస్తున్నది. మనుషుల పేర్లు చెప్పకుండా ఆ తిక్కలు చెప్తా విను.
అసలు మనిషి సహజ స్వభావమే ప్రేమ! అది ప్రేమగానే ఉంటే చిక్కు ఎందుకు వస్తుంది?
కానీ అక్కడ ప్రేమలన్నీ తిరగబడ్డ మోహాలు!
ఉదాహరణకి - ఒకరికి మరొకరిపై ప్రేమ ఉంటుంది. వారు ఆ ప్రేమని స్వీకరించకపోతే ఏం చేస్తున్నారు ఇప్పుడు?
మొదట నిరాశ చెందుతారు.
రాను రానూ ద్వేషంగా మార్చుకుని వారిపై కక్ష తీర్చుకుంటున్నారు. రచ్చ చేస్తూ తిక్కగా వ్యవహరిస్తారు. విసుక్కుంటారు. అవమానకరంగా భావించి ప్రేమిస్తున్న వారిని కూడా అవమానాల పాలు చేస్తారు. ఇక ఎన్నటికీ ప్రేమించనని తీర్మానించుకుని ఆ విషయాన్ని ఆ వ్యక్తికి చెప్పి కించపరుస్తారు. హృదయంలో ముల్లు గుచ్చుకుందని విలపిస్తారు. ప్రపంచంలో అందరూ అన్యాయం చేస్తున్నట్లు విరహగీతాలు వ్యంగ్య అర్ధాల్తో పాడుతూ లోకాన్ని కూడా దుమ్మెత్తిపోస్తారు. అసలు నేనేం చేస్తున్నాను? ఓర్పుతో, సహనం తో ఆలోచిస్తే... ప్రేమించే విధానాన్ని మార్చుకోవడం జరుగుతుంది. దాన్నుంచి బయటపడే మార్గాన్ని వెతుక్కోవాలని తమని తాము కాపాడుకోవాలని అనుకున్నారా మన అపార్ట్మెంట్ లో ఏ ఒక్కరైనా? మనమెందుకు సంఘటితమై కొన్ని ఆంక్షల్ని విధించుకున్నాం? మనలోని ప్రకృతికి వ్యతిరేకంగా ఉంటే మనిషికి చెడు జరిగే ప్రమాదం పొంచి ఉంటుంది గనుక!
చేయకూడని వాటినీ చేస్తే అవి పరిస్థితుల్ని చెడగొడతాయి.మనుషులంతా చెల్లాచెదురయిపోతారు
మనమొక కేంద్రం లో ఉండి ప్రేమని పరిమితం చేసుకోవాలి. ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవాలి.
ఎలా? ఎందుకు?
నువ్వూ, రాకీ ఇద్దరూ డబ్బుకోసమే ఒకరి దగ్గర ఒకరు ప్రేమ నటించారు. నిన్ను నువ్వు తెలుసుకుని రాకీని ప్రాదేయపడ్డావ్! రాకీ నిన్ను కాదని వెళ్ళిపోయాడు. నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావ్. రాకీకి ప్రేమ కలగలేదని నిన్ను నువ్వు సమాధాన పరుచుకునే దిశగా నడిచావ్. కానీ మళ్ళీ రాకీ పరుగెట్టుకుంటూ నీ దగ్గరికి వచ్చాడు. అతడికి డబ్బే కావాలనుకుంటే వచ్చేవాడే కాదు.
ఇదంతా ఏమిటి? ప్రేమ తెచ్చుకుంటే వచ్చేది కాదు. కలిగించుకుంటే కలిగేది కాదు.
ప్రేమ సంభవించేది!! మీ అదృష్టం కొద్ది ఇద్దరికీ ఏకకాలం లో ప్రేమ సంభవించింది గనుక ఇద్దరూ ఒక్కటవడానికి... ఈ లోకం లో హాయిగా బతకడానికి కృషి చేస్తున్నారు!’ అన్నాడు. టక్కున వాసంతి మహేంద్ర వైపు చూసింది. ఇద్దరిలో దాచుకోడం సాధ్యం కాని వెలుగు, నవ్వు అది చూసి ఇంకొంత చెప్పాడు మహేంద్ర.
“తెలుసా నీకు?
ఈ గాలి ఇంతగా వీస్తోంది కదా?
ప్రేమ గట్టిగా వీచినప్పుడు అది కోపం.
ప్రేమే లేదు అంటే అది ద్వేషం.
ప్రేమ పులిసినప్పుడు అది ఈర్ష్య.
ప్రేమ జాలువారినప్పుడు అది కరుణ!” అంటూ నీలిని దగ్గరగా తీసుకున్నాడు.
“నీకిప్పుడు ఏమనిపిస్తోంది... వీరంతా క్షేమంగా బయట పడాలని.
ఆ ప్రేమ సంపూర్ణం. ప్రేమని తెలుసుకుంటే అది నువ్వే.
ఇప్పుడు నీ కళ్ళల్లో వెలుగు చూడు. ప్రేమ ప్రకాశించినప్పటి పరమానందం! అంతే!
సింపుల్!” అన్నాడు. చప్పట్లు మారుమోగిపోతుంటే అందరి లో ఏదో తెలుసుకున్నామన్న తృప్తి!!
******
చూస్తుండగానే క్షణాల్లో తుఫాను మొదలయి భీభత్సం సృస్టిస్తోంది. ఆ శబ్దాలకి ఒకటే గుండెదడ! వణుకు!!
ఊరంతా జలమయం అయి ఊరి జనాభా కోటలోకి వచ్చేస్తున్నారు. జనంతో, తొక్కిసలాటలో కోట అంతా చాలా హడావిడిగా గజిబిజిగా ఉంది. అరుపులు, చిన్నపిల్లల ఏడుపులతో దద్దరిల్లిపోతోంది.
చంద్రం వెంటనే లేచి వెళ్ళి కొంతమంది ఆడవాళ్ళ సహాయంతో వంట, వార్పు చేయిస్తున్నాడు. పిల్లలంతా చలికి భోరున ఏడుస్తున్నారు. షష్టి పూర్తికి తెచ్చిన షామియానాల్ని, అద్దెకి తెచ్చుకున్న దుప్పట్లని పంచుతూ... అందరిని చూసుకుంటున్నాడు. మరి కొద్దిసేపటికి ఆవులు, గేదెలు, మేకలు, కుక్కలు కూడా వచ్చేశాయి. వాటిని కోట కొట్టాల్లో కట్టమని... జాగ్రత్తగా చూడామని చెప్తున్నాడు.
మూడు రోజులపాటు పిలల ఏడుపుల్తో, ఆవుల గేదెల అరుపులతో భారంగా సాగింది.
అందరికీ గాభరాగానే ఉంది ఆ ఉధృతి!
మూడోరోజు రాత్రి సుమారు మూడు గంటలు దాటుతుండగా వాతావరణం శాంతించింది.
ఆ సాయంత్రం రేడియో లో _
ఆకాశ వాణి! విశాఖపట్నం!!
‘ప్రేమ తుఫాను నిన్న రాత్రి 11-12 గంటల మధ్య భీమునిపట్నం వద్ద సముద్ర తీరాన్ని దాటింది. “ప్రేమ” ప్రభావం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 250 కిలోమీటర్ల వేగం తో పెనుగాలులు వీచడం వల్ల గ్రామంలోని ఇళ్ళకప్పులు ఎగిరిపోయాయి. పెద్ద వృక్షాలు విరిగిపడి రహదారులకి అడ్డంగా నిలిచిపోయాయి.
“ప్రేమ” సృష్టించిన భీభత్సం వల్ల ప్రజలు తీవ్ర ఆస్తి నష్టాలకు లోనయ్యారు. ఇప్పటిదాకా అందించిన సమాచారం మేరకు సుమారు 80 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇరవై మంది జాడ తెలియరాలేదు. కొంతమంది తమ కుటుంబ సభ్యులెక్కడున్నారో తెలియక ఆందోళన పడుతున్నారు. ప్రేమ తీరం దాటడం వల్ల వర్షాలు భారీగా కురుస్తాయి. పెనుగాలులు వీస్తాయి. రేడియో ఆగిపోయింది.
రెండు రోజుల తర్వాత -
కోట గుమ్మం దగ్గరికి అతి ప్రయాస తో వచ్చింది కవిత. చంద్రం ఊరి జనం అందరూ తమతమ ఇళ్ళకి వెళ్ళేందుకు సహాయ సహకారాలు అందిస్తున్నాడు. చాలా మంది చంద్రానికి దండం పెడుతూ కన్నీళ్లతో శలవు తీసుకుంటున్నారు. ప్రవాహంలో కొట్టుకు పోయిన వస్తువుల్ని, తిరిగి పునర్నిర్మాణం చేసుకోవాలనే తమ గుడిసెల్ని తలచుకుని ఏడుస్తున్నారు. కొందరు. చంద్రం అందరికీ ధైర్యం చెప్తూ పంపిస్తున్నాడు!
వాన వెలిసింది. సన్న గాలి ఉండుండి వీస్తోంది.
పొద్దున్నే పరుగులు తీస్తూ బయిటికి వెళ్ళి చుట్టూ చూసిన నీలి ఎందుకో నవ్వింది. తానూ నవ్వింది కవిత. ‘ఏమిటా?’ అని చంద్రం కూడా చూశాడు.
ఒక చిన్న చెట్టుకి ఒకే ఒక్క కొమ్మ ధీటుగా నిలిచి ఉంది.
ఒక చిన్న పిట్ట దాని మీద వాలి ఊయలలూగుతోంది. కిచ కిచ మని అరుస్తోంది. మళ్ళీ ఉయ్యాలలూగుతోంది.
తూరుపు దిక్కునుంచి సూర్యకిరణమొకటి సూటిగా భూమిని తాకింది.
మళ్ళీ మొదలయింది వెలుగు.
నిన్నటి చీకటిని చీల్చుకుంటూ! అంతటా వ్యాపిస్తూ!!
****సమాప్తం****
రచయిత్రి పరిచయం ..
|