ఏర్చూరి సింగన్న జన్మస్థానం నల్గొండ జిల్లా లోని ఏర్చూరు గ్రామం. ఆ గ్రామ శాసకుడు ఎర్రాప్రగడ. ఇతడు భారతం పూర్తిచేసిన ఎర్రాప్రెగ్గడ కాదు. ఇద్దరూ వేర్వేరు వ్యక్తులు.
ఈ వంశంలోని కసుమన్న అనే మంత్రి కుమారుడు ఏర్చూరి సింగన్న. ఇతడు తండ్రివలె శివభక్తుడు. అయితే వివిధ గ్రంథాలు చదవడం చేత విష్ణుచరితామృత విష్యంది పటు వాగ్విలాసానందోచిత మానసుడైనాడు (భాగవతం – 6-30).
భాస్కరుని, నాచనసోముని, శ్రీనాథాదులను స్మరించిన సింగన్న శ్రీనాథుని ‘కవి మనోనాథుడు’ అని పేర్కొన్నాడు.
భాగవతంలో బమ్మెర పోతన షష్ఠ స్కందాన్ని అనువదించలేదు. పోతన విడిచి పెట్టిన షష్ఠ స్కందాన్ని ఎందఱో అనువదించినా సింగన రచన పోతన రచనా వైభవాన్ని పుణికి పుచ్చుకొని కొన్ని పద్యాలు పోతనే వ్రాశాడా అన్నట్లు ఉండడం వల్ల సింగన అను పేరు ప్రసిద్ధమైనది.
సింగనకు శారదాంబ కలలో కనుపించి ఎలా సెలవిచ్చిందో ఈ పద్యంలో తెల్పాడు.
“ఉరవడి ప్రాగ్వీధి నుదయించు మార్తాండకోటిబింబచ్చాయ గూడినట్లు
హరిహరబ్రహ్మల యాత్మలలో నుబ్బి కరుణ యొక్కట మూర్తి బెరసినట్లు
ఖరకరకరతీవ్రగతిని గరంగుచు హేమాద్రి సొగపెల్లెగసినట్లు
ఫణిరాజఫణిరాజి మణిగణవిస్ఫూర్తిశిరంబు వెలి దల చూపినట్లు
ఉట్టి పడ్డట్లు కట్టెఱ్ఱ నూదినట్లు – తేజమొసగంగ నామ్రోల దివ్యవాణి
పూని సాష్టాత్కరించి సంపూర్ణ దృష్టి – జూచి ఇట్లని పలికె మంజాలముగను.” - బాగవతం 6-17
సింగన్న సంగీతం, ఆటపాటలు, సాముగరిడీల తో పొద్దుపుచ్చడం చూచినా అమ్మవారు కలలో ఇలా సెలవిచ్చిందట;
ఆటలుపాటలుం జదువు లద్భుతముల్ విననోప్పు వాదయముల్
సాటిదలంపరాని బలుసాములు మున్నగు విద్యార్ధులెల్ల నీ
కాటలు పాటలయ్యె విను మిన్నిటికిన్ మెరుగిడ్డ భంగి నా
చాటున జాటుకార పదసాధుకవిత్వము జెప్పు మింపుగన్ - బాగవతం 6-18
అని అమ్మవారు కలో చెప్పగానే ఆమెయొక్క కృపావలోకన సుశ్లోకుడై సింగన వెంటనే ఒక శ్లోకం చెప్పాడు.
అటుపై పోతన మీదగల అపారమైన భక్తితో “ఎమ్మెలు జెప్పనేల జగమెన్నగ...బమ్మెర పోతరాజు కవిపట్టపు రాజు దలంచి మ్రొక్కెదన్” అంటూ పోతన విడిచిన షష్ఠ స్కందాన్ని అనువదించడానికి పూనుకొన్నాడు.
పోతరాజు తన తల్లిని ప్రస్తుతిస్తూ భాగవతంలో ఒక పద్యం రాసినట్లు సింగన్న కూడా తన తల్లిని గూర్చి “ఆడదు భర్తమాట కెదురాడదు...” అంటూ అమ్మను కీర్తించాడు.
భాగవతంలో అజామిళోపాఖ్యానం ఆంధ్రదేశంలో అందరికీ తెలిసిన కథ. అజామీళుడు అవసానదశలో కూడా కన్నకొడుకు ను నారాయణా అని పిలవడం తప్ప భగవన్నామస్మరణ తలచని పాపాత్ముడు. అయినప్పటికీ అతనికి మోక్షం లభించడం ఈ కథలో విశేషం.
ఆరుద్ర సింగన్న రచనను గూర్చి చెబుతూ తెలుగు కవులందరూ యౌవనం వచ్చిన తరువాత ఆడపిల్లలనే వర్ణిస్తారు. కానీ మన సింగన్న అజామిళుని యౌవన దశను వర్ణించడం చెప్పుకోతగ్గ విశేషం అన్నారు.
“కడగంట యౌవనగర్వంబు వొడగట్టె మదిలోని సుద్రేవమదము దొట్టె...” అంటూ అజామిళునికి యౌవన దశ రావడం, అతను ఒక ప్రేమజంటను చూచి, ఉద్రేకము చెంది తత్ఫలితంగా వేశ్యాలోలుడు కావడం – ఇది వర్ణించే సందర్భంగా సింగన్న, పోతన గారిని అనుసరించి పద్యం చెప్పాడని ఆరుద్ర ఆ పద్యం తెల్పాడు. ఆ పద్యం;
పోతన పద్యం: ‘ఆదిన్ శ్రీపతి కొప్పుపై తనువుపై అంసోత్తరీయంబు పై ...’ అన్న పద్యం వలె సింగన్న ‘ఆ లీలావతి గండపాళికలపై హాసప్రసాదంబుపై...’ అంటూ పోతనను అనుసరించాడన్నాడు ఆరుద్ర.
సింగన్న శ్రీనాథుని రచనలు చదివి ఆయన ప్రభావం వల్ల ఈ అజామిళుని పాత్రను చిత్రించాడని ఆరుద్ర అభిప్రాయపడ్డారు. శ్రీనాథుని శివరాత్రి మహత్యంలో సుకుమారుడు కూడా దారులు కొట్టడం, వ్యభిచారం మొదలైన గుణాలు గలిగిన వాడే. అందుకే సింగన్న కవిజనమనోనాథుడైన శ్రీనాథుని వలె అజామిళుని కథ నడిపాడు. శృంగార వర్ణనలు ప్రాత్రచిత్రణ అజామిళుని కథలో సింగన్న శ్రీనాథుని కొంత అనుసరించాడు. అంతేగాక తర్వాత కథ కశ్యపుని కథను శుకమహర్షి పరీక్షిత్తుకు చెప్పే సందర్భంలో కశ్యపుని భార్యల సంగతి, వాళ్ళ సంవాదం రాసేటప్పుడు శుకయోగి చెప్పిన సహజమైన దానిని (సంస్కృతంలో) సింగన్న శ్రీనాథుని ప్రభావం వల్ల శృంగార భరితంగా రచించాడు.
అలాగే దేవదానవుల యుద్ధం అప్పుడు నాచనసోముని ఉత్తర హరివంశం లోని కొన్ని పద్యాలను అనుసరించాడని ఆరుద్ర తెల్పారు. (స.ఆం.సా పేజీ 929).
యుద్ధ వర్ణనలో నాచనసోముని అనుసరించిన సింగన్న, పాత్ర పోషణ, సంభాషణలలో తిక్కనను అనుసరించాడని ఆరుద్ర తెల్పారు. ఆరుద్ర ప్రతి విషయాన్ని ఉదాహరణ పద్యాలతో చక్కగా వివరించారు. అంతేగాక సింగన్న ఈ విధంగా శ్రీనాథుని, పోతనను అనుకరించినా, సింగన్న చెప్పిన విషయాన్ని ఆరుద్ర ఈ విధంగా తెలిపారు.
“ఇలా పూర్వకవులను అనుకరించిన మాత్రాన ఏ కవీ స్వతంత్ర రచనలు చేయలేదని అనుకోకూడదు. ఏర్చూరి సింగన్న ఒకచోట ఇలా వ్రాసాడు. ‘అవిద్వాంసుడైన వాడ నవవరతంబు దన్ను స్వతంత్రునిగా దలంపుచుండు’ (బాగవతం 6-416)”
సింగన్న విద్వాంసుడేనని కువలయాశ్వ చరిత్ర వ్రాసాడని, దీని కథ మార్కండేయ పురాణంలోనిదని ఆరుద్ర తెల్పారు. ఇందులో 12 పద్యాలు మాత్రమె లభ్యమయ్యాయి. పిసుపాటి జగ్గన్న తన ప్రబంధ రత్నాకరంలో ఈ పద్యాలను చేర్చుకొన్నాడు. అందులోని 7 పద్యాలు, గృహాలను గూర్చి, బ్రాహ్మణుల, పుణ్యకాంతలను గూర్చి, గీరనగింజలాటను గూర్చి తెలుపుతున్నాయని ఆరుద్ర తెల్పారు.
కువలయాశ్వ చరిత్రలో అష్టాదశ వర్ణనలలో ఒకటైన పుత్రోదయాన్ని చంద్రోదయం తో సింగన్న చెప్పిన పద్యం –
తిమిరమంతయు బాసి దిక్కులు తెలివొందె
నమృతాంశువులు చెందె నభ్రవీధి
కువలయానందమై కోరిక లిగురొత్తె
విభుదుల మదిలోన వెట్టలొదవె.
కువలయాశ్యుడు మదాలసను వివాహమాడటం, మదాలస సౌందర్య వర్ణన, గీరన గింజలాట వివరణ, ఈ ఆటనో మరొక ఆటనో గూర్చి పింగళి సూరన, ధూర్జటి శేషము వెంకట కవి మొదలైన వారు చెప్పారన్న విషయం మొదలైనవి ఆరుద్ర చక్కగా తనదైన శైలిలో వివరించారు.