ఆశ్రమం దగ్గర ప్రణవీని దించి, రాజన్ దంపతులు అదే ఆటోలో వెళ్ళిపోయారు.
ప్రణవి తనతో వచ్చిన వారిని వెతుక్కుని, వారి దగ్గరికి వెళ్లి కూర్చుంది.
జీయర్ స్వామి గారి ప్రసంగం ముగిసాక, ఆవిడ పక్కకి పిలిచి "ఏం మాట్లాడారు?" అని అడిగింది.
ప్రణవి జరిగిన విషయం చెప్పింది.
"మరీ ఇంత అన్యాయమా? పిలిచి అవమానించడమేమిటి? ఇష్టముంటే మాట్లాడాలి. లేకపోతే వదిలేయాలి. నువ్వేం చేయలేవు అన్న ధీమా వాళ్ళకి. అదే నేనయితే... అంతసేపు వాళ్ళవెనకాతల తిరిగే దానిని కాదు. ఎందుకు పిలిచారు మాట్లాడండి అని నిలదీసేదానిని.
ఇలాంటి వాళ్లని ఊరికే వదలకూడదు. కేసు పెట్టి... నాలుగు దెబ్బలు ఒంటి మీద పడితేనే... దారిలోకి వస్తారు," అంది కోపంగా.
ప్రణవికి వాళ్ళు చేసిన పనికి మనసు కుతకుతా ఉడుకుతున్నది. ఈవిడ కూడా అనేసరికి, తన చేతకానితనానికి తనను తాను తిట్టుకుంది. పైకి ఏం మాట్లాడలేదు. అందరూ రిటర్న్ అయ్యి, ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.
ప్రణవి ఇంటికి వచ్చాక జరిగిన విషయం తల్లికి చెప్పింది.
"నీ మంచితనాన్ని వాళ్లు చేతకాని తనం అనుకుంటున్నారు. నువ్వు మాటిచ్చా... మాటిచ్చా అంటూ... పిచ్చిదానిలా మా నోర్లు ముయించి, మా చేతులు కట్టేసావు. వాళ్లు మాటకు కట్టుబడి ఉన్నారా? నాతి చరామి అన్న నోటితోనే పొమ్మని నడిరోడ్డుపై వదిలేసాడు. నిన్ను మానసికంగా చిత్రవధ చేసిన వారిపై నీకెందుకు ఆ జాలి. కుసంస్కారుల దగ్గర సంస్కారం... గుడ్డివాడి ముందు భరతనాట్యం చేయటం లాంటిది. ఆస్వాదించే నాసిక ఉన్నప్పుడే... మధుర పరిమళాల వాసన తెలిసేది. వాళ్లకి తగిన బుద్ధి చెప్పాలి. ఇక నువ్వు నోరు మూసుకొని కూర్చో." అంది కోపంగా.
అవునక్కా వాళ్ళు నార్మల్ గా లేరు. వాళ్లు తప్పు తెలుసుకుని వస్తారేమోనని చూసాం. మనమే అన్ని మర్చిపోయి, వాళ్ళు చీదరించు కుంటున్నా సిగ్గువిడిచి వాళ్ళ కాళ్ళ దగ్గరకు వెళ్ళి, వాళ్ళకు విలువిచ్చాం. వాళ్లు సాచాటప్పాగా వినే రకాలు కాదు.
పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పోలీసులు భయాని కన్నా సజావుగా ఉంటారు. ఏలుకోవటమా? మానుకోవటమా? అనేది తేలిపోతుంది. ఎటూ ఇప్పుడు ఒంటరిగానే ఉన్నావు కదా! ఇచ్చినందు వల్ల మనకు వచ్చే నష్టమేమీ లేదు. వాళ్లకి కొంచెం భయమొస్తుంది. ఇక నువ్వు అడ్డు చెప్పక." అన్నాడు మూర్తి.
ప్రణవి కూడా ఇంత కాలము...
ఏదో ఒక రోజు భర్త తన తప్పు తెలుసుకుని వస్తాడని ఆశ తో ఎదురుచూసింది. మొన్నటి అతని ప్రవర్తనతో మనసు విరిగిపోయింది. మీ ఇష్టం అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది.
"దీనికి మొగుడు మీద పిచ్చి ప్రేమ. వాడు దీనిని చూడకపోయినా... పిల్లల అతిగతి పట్టించుకోకపోయినా... వాడి మీదే దీనికి ప్రేమ. వాడు ఏ జన్మలో నో పుణ్యం చేసుకుని పుట్టాడు. ఇంతలా ప్రేమించే భార్య దొరికింది. వాడి నెత్తిమీద శని తాండవం చేసి, ఇంతటి ప్రేమను దూరం చేసుకుంటున్నాడు," అంది బాధగా.
"అవును అమ్మా. మీ అమ్మమ్మల కాలంలో పుట్టాల్సింది. ఇప్పుడు పుట్టింది. దీని పిచ్చి ప్రేమే దీని బ్రతుకు నాశనానికి కారణం. దీనికి ఉన్న ఆ వీక్ పాయింట్ పట్టుకునే వాళ్ళు ఆడుతున్నారు. కడుపు తీయిస్తాం అన్నప్పుడే వాళ్ళేంటో అర్థమైపోయింది. ఇది అంగీకరిస్తే కదా! ఇప్పటికి కూడా మనస్ఫూర్తిగా చెప్పలేదు. మళ్లీ మనసు మార్చుకున్న మార్చుకుంటుంది. ఈ లోపలే కేసు పుటప్ చేయాలి. ఈ పట్టణంలో మనకి ఎవరు సపోర్ట్ వస్తారు. ఇక్కడ స్టేషన్లో కూడా ఎవరూ తెలిసిన వాళ్ళు లేరు," అన్నాడు మూర్తి.
"అమృత వరంలో పెడదాం," అంది గిరిజ.
"8 ఏళ్ళు అయ్యింది. దాన్ని తరిమేసి. ఇప్పుడు కేసు పెట్టినా అతను విడాకులు చూసుకోవడానికి ఈజీ అవుతుందేమో! ఎలా ఏం చేద్దాం. విడాకులు గనక అయితే దీంతో పడలేము. మీ వల్లే నాకాపరం పోయింది అంటుంది," అన్నాడు.
"ఆ ఊర్లో ఎవరన్నా పెద్దవాళ్ల సలహా తీసుకుని, కేసు ఎలా పెట్టాలో ఆలోచించి పెట్టు. మనకి ఇలాంటివి తెలియవు. దాని కర్మ ఎలా రాసిపెట్టాడో దేవుడు. అది మనల్ని అంటే అననీలే... మన మనిషే కదా! ఈ దెబ్బతో తాడోపేడో తేలి పోతుంది." అంది.
మరుసటి రోజు మూర్తి అమృతవరం సర్పంచ్ ని కలవడానికి వెళ్ళాడు.
***సశేషం***
రచయిత్రి పరిచయం ..
పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక
రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)
పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్‌ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.
బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద' బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.
సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.
ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.