Menu Close
ప్రేమకానుక (కథ)
-- నూక పెయ్యి రోజ్ సుకేశిని --

అది చేమంతులూ, పూబంతులూ విరబూసే వేళ. లేలేత సూర్యకిరణాలు సోకి, గడ్డిపోచలపై నున్న మంచు బిందువులు వజ్రాల్లా తళతళా మెరుస్తున్నాయి. పక్షుల కిలకిల రావాలతో, ప్రకృతి పరవశిస్తున్నట్లు వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చలికాలం డిసెంబర్ నెల. ఊరంతా క్రిస్మస్ ఏర్పాట్లలో మునిగి ఉంది.

ఆ ఊరిలో డెల్లా, జిమ్ అని ఇద్దరు నిరుపేద దంపతులు ఉన్నారు. వారు గతంలో బాగా బ్రతికినప్పటికినీ ప్రస్తుతం పేదరికములో జీవిస్తున్నారు. కానీ వీరి ప్రేమకు పేదరికం లేదు. భార్యాభర్తలు, ఒకరంటే ఒకరికి అంతులేని అభిమానం, వీరిది 'ఆదర్శ దాంపత్యం’. కాలం కలిసి రాక, వీరు ఒక పాతబడిన ఇంట్లో కాలం వెళ్ళదీస్తున్నారు.

పగిలిన రేకుల సందులో నుండి సూర్యకిరణాలు ముఖంపై పడుతుండగా ఒక్కసారిగా మెలుకువ వచ్చింది డెల్లా కు. వెంటనే లేచి కప్పుకున్న రగ్గు ను మడత పెడుతూ తనలో తాను "ఏమిటో ఈ పాత అద్దె ఇల్లు! సౌకర్యాలు పెంచమంటే పెంచరు గానీ అద్దెలు మాత్రం పెంచుతారు." అనుకున్నది. ఈ రోజు తాను చేయవలసిన పనులను గుర్తు చేసుకుంటూ ఇంటి పనులకు ఉపక్రమించింది డెల్లా.

రేపే క్రిస్మస్. అంతా హడావిడిగా ఉంది - క్రిస్మస్ రోజు అందరూ బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా తనను గాఢంగా ప్రేమిస్తున్న తన భర్తకు ఒక అందమైన బహుమతిని ఇచ్చి ఆశ్చర్యపరచాలని అనుకొని, ఇంటి ఖర్చుల కోసం భర్త ఇచ్చిన డబ్బులలో అడపా తడపా పొదుపు చేసిన డబ్బులు లెక్క చూడగా అవి ఏ మూలకూ సరిపోయేటట్టు లేవు. "ఏమిటో ఈ జీవితం! ఎంత కష్ట పడ్డా లంక మేత, గోదావరి ఈత" అన్నట్లు, దానిది దానికి సరిపోతున్నది గానీ చేతిలో ఏమీ మిగలడం లేదు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి. జీవనం దుర్భరంగా మారిపోయింది." అనుకుంది డెల్లా.

ఏది ఏమైనా, చిన్న చిన్న సరదాలు కూడా తీర్చుకోలేక పోతే జీవితం ‘చప్ప’ గా ఉంటుంది కదా! అందుకే తగినన్ని డబ్బులు తన దగ్గరలేకున్నా ఏమి చేసైనా సరే తన భర్త కొరకు ఒక బహుమతిని కొనాలని దృఢంగా నిశ్చయించుకుంది. అనుకున్నదే తడవుగా లేచి తన కోటు వేసుకొని, టోపీ పెట్టుకొని, సోఫియా దుకాణానికి బయలు దేరింది డెల్లా.

డెల్లా ను చూచి "ఏం పని మీద వచ్చావు?" అన్నది సోఫియా.

"జుట్టు కొంటారట కదా మీరు?” అడిగింది డెల్లా."

"అవును" అన్నది షాపు ఓనర్ సోఫియా. వెంటనే టోపీ తీసి మోకాళ్ళవరకూ వ్రేలాడుతున్న తన పొడవాటి  కురులను చూపించి –

"ఈ జుట్టు  అమ్ముతాను. నా కురులు మొత్తం కొనుక్కొని నాకు కొంత సొమ్ము ఇవ్వండి అన్నది డెల్లా."

“ఆడవాళ్ళకు జుట్టు అంటే ప్రాణం కదా! అందులోనూ, జల జల పారే జలపాతం లా చాలా అందంగా ఉన్నాయి నీ కురులు. నిజముగా అమ్ముతావా?” అన్నది సోఫియా.

"అవును! అమ్ముతాను. నాకు నా అందమైన కురుల కంటే నా ‘'పతి' అంటేనే ప్రాణం" అన్నది డెల్లా. అయితే సరే, అని డెల్లా మోకాళ్ళ వరకూ ఉన్న జుట్టును కత్తిరించుకొని, బేరం కుదుర్చుకున్న ప్రకారం తగిన సొమ్మును డెల్లా చేతిలో పెట్టింది సోఫియా. జుట్టు కత్తిరించుకున్న తర్వాత తన ముఖాన్ని అద్దంలో చూచుకుంది డెల్లా - తన ముఖం తనకే క్రొత్తగా కనిపించింది. తన పొడవైన జడను చూచి ప్రేమించి పెళ్ళిచేసుకున్న తన భర్త ఏమంటాడో నన్నభయం ఒక ప్రక్క ఉన్నా - కత్తిరించుకున్నది జుట్టేకదా! ఎంతలో పెరుగుతుంది? త్వరగానే వస్తుంది..ఈ లోగా ఎలాగోలా భర్తకు సర్ది చెప్పవచ్చు ననుకుంది డెల్లా.

డెల్లా లాగే, జిమ్ కూడా తన డార్లింగ్ కు ఒక ‘ప్రేమకానుక’ ను ఇవ్వాలని తలంచి డబ్బుల కోసం వెతకగా జేబులూ, పర్సూ రెండూ ఖాళీయే!.

"ఏమిటి ఈ నిరుపేద బతుకులు? ఎంత కష్టపడ్డా "గొర్రెకు బెత్తెడుతోక" అన్నట్టు జీవితం ఎదుగు బొదుగూ లేకుండా పోతోంది. ప్రతిపనికీ యంత్రాలు వచ్చాక, చేద్దామంటే పనిలేదు తిందామంటే తిండి లేదు. కుటుంబపోషణ  కష్టంగా మారి, రోజులు చాలా దుర్భరంగా గడుస్తున్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నా క్రిస్మస్ నాడు ఒక మంచి బహుమతి ఇచ్చి నా భార్య ముఖంలో ఆనందం చూడాలి” అని అనుకున్నాడు జిమ్.

అనుకోవడమైతే అనుకున్నాడు గానీ, కానుకలు కొనాలంటే చేతిలో ‘కాసులు' కావాలిగా? ఏమి చేయాలి? అని ఆలోచించగా అతనికి ఒక మంచి ఐడియా తట్టింది. వెంటనే దానిని అమలుచేసి చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరాడు జిమ్. ఆతృతగా ఇంటి గుమ్మం లో ప్రవేశించిన జిమ్ కు, తలకు స్కార్ఫ్ కట్టుకొని ఎదురువచ్చిoది భార్య.

"ఏమయ్యింది? డెల్లా అలా ఉన్నావు? ఈ స్కార్ఫ్ ఏమిటి? అని ఆతృతగా అడుగుతాడు.

“ఏవండీ! మీరు ఏమీ అనుకోనంటే నేను మీకు ఒక విషయం చెబుతాను” అంటుంది. "చెప్పు మరి" అంటాడు జిమ్.

“ఏమీ లేదండీ -నేను మీకు ఒక బహుమతి తెచ్చాను. మీ చెయ్యి ఇలా ఇవ్వండి. ఎప్పటి నుంచో మీ తాతల కాలం నాటి బంగారు వాచీ కి చైను లేదని మీరు జేబులోనే పెట్టుకుని తిరుగుతున్నారు కదా! దానికి ఒక మంచి చైను కొనాలని అనుకొని నా దగ్గర సరిపడా డబ్బులు లేక సోఫియా దుకాణానికి వెళ్ళి నా జుట్టును అమ్మి ఆ డబ్బులతో మీకు వాచ్ చైను తెచ్చాను” అని జరిగినది అంతా పూస గుచ్చినట్లు చెబుతుంది డెల్టా.

“మీకు ఎప్పుడు బహూకరిద్దామా అని ఎదురు చూస్తున్నాను. వాచ్ ఇలా ఇవ్వండి" అన్నది డెల్లా. ఆమెకు తన పట్ల గల అవాజ్య మైన ప్రేమకు ఉప్పొంగి పోయి, ఆమెను దగ్గరకు తీసుకుని, గుండెలకు హత్తుకొని  ---- “నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి అని జరిగినది మొత్తం డెల్లాకు ఇలా వివరించాడు జిమ్.

"నేను కూడా నీకు నా ‘ప్రేమకానుక’ గా ఏదైనా ఇవ్వాలను కున్నాను గానీ మన ఆర్థిక పరిస్థితి నీకు తెలుసుకదా అందుకే  ఇంట్లో వారసత్వంగా తాతల కాలం నుంచీ ఉన్న బంగారు వాచీని అమ్మేసి, నీవు గతంలో క్లిప్పులు అమ్మే దుకాణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అందమైన జడక్లిప్ ను చూచి ముచ్చటపడి ధర ఎక్కువగా ఉంది అని కొనకుండా తిరిగి వచ్చేశావు కదా! అందమైన రంగురంగుల రాళ్ళు పొదిగిన జడ క్లిప్ --- కృష్ణవేణీ తరంగాల లాంటి అందమైన నీవంకీల జుట్టుకు పెట్టుకున్నప్పుడు, క్లిప్ కు ఉన్న రాళ్ళ తళుకుతో పోటీపడే నీ కంటి మెరుపును కనులారా చూడాలని ఆశపడ్డాను. అందుకే నీకోసం దీనిని కొని తీసుకు వచ్చాను. నా ప్రేమ కానుక గా నీకు ఇస్తున్నాను” అన్నాడు జిమ్. భర్త ప్రేమకు డెల్లా మనసు, కళ్ళూ రెండూనిండి పోయాయి.

ఇద్దరి మనసులూ కుదుట పడ్డాక – “జుట్టు అయితే కొన్నాళ్లకు మళ్ళీ వస్తుంది. జడక్లిప్ ఉపయోగపడుతుంది. మరి మీ వాచీ ఎలావస్తుంది?” అని అంటుంది. డెల్లా. దానికి సమాధానంగా, “మళ్ళీ వచ్చే క్రీస్మస్ కి శ్రీమతి గారు బహుమతిగా - ఇస్తే వస్తుంది"అని నవ్వుతూ అంటాడు జిమ్. డెల్లా కూడా "అలాగే చూద్దాం లెండి" అంటుంది. ఇద్దరూ మనసారా నవ్వుకుంటారు! భార్యాభర్తల మధ్య ఇచ్చిపుచ్చుకోవడానికి – ‘ప్రేమానురాగాలకు’ మించిన ‘కానుక'లు’ ఏముంటాయి చెప్పండి!

(Note: Mr. O. Henry గారి కథకు స్వేచ్ఛానువాదం)

****సమాప్తం****

Posted in June 2025, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *