Menu Close
sravanthi_plain
Ayyagari-Suryanarayana-Moorthy
జగన్నాథరథయాత్ర
అయ్యగారి సూర్యనారాయణమూర్తి
తే.గీ. శ్రీజగన్నాథరథయాత్ర చిద్విలాస
        త్రిరథయాత్రోత్సవంబు, పూరీపురానఁ
        దీరి యాషాఢశుద్ధద్వితీయనాఁడు
        జరుపు కొందురు విశ్వప్రశస్తి నొంది

తే.గీ. ఐకమత్యంబు, సాంస్కృతికాతిశయము,
        భక్తికిని చిహ్నమై సాగి ప్రజల నెల్ల
        నొక్క త్రాటిని నిలుపు నీ యుత్సవంబు
        నేల యీనిన రీతి భక్తాళిఁ జేర్చి

తే.గీ. శ్రీజగన్నాథబలభద్రశ్రీసుభద్ర
        లనుచుఁ బేర్గాంచి, పార్శ్వాల నమరు తొమ్మి
        దజరులను(1) గూడి రథముల నధివసించి
        యేఁగు నుత్సవమిదియొక్కటే ధరిత్రి
               (1) దేవతలను

తే.గీ. ఏబదెనిమిదిదినముల నెంతొ శ్రద్ధఁ
        బ్రతిభ జూపించుచును బ్రతివత్సరంబు
        క్రొత్తదారు(1)రథంబులఁ గూర్తు రిది య
        సాధ్య మొరులకు ‘నొడిసా’నె(2) సాధ్య మగును
              (1) కొయ్య (2) ఓఢ్రరాష్ట్రములో మాత్రమే

తే.గీ. అళఁది(1), నీలమ్ము, నలుపులు నరుణవర్ణ
        మిళితములుగాఁగ నమరిన మేలుకట్టు
        లొదవఁ(2) బదియాఱు, పదునాల్గు, పదియురెండు
        చక్రములఁ దాల్చు రథము లవక్రముగను
              (1) పసుపురంగు (2) ఒప్పారగా

ఉ. మువ్వురు దేవతల్ నిలిచి ముచ్చటగాఁ దమ స్యందనమ్ములన్
       నవ్వుల రువ్వు చేఁగెదరు భక్తజనంబులు లాగ రజ్జువుల్
       నివ్వెరబోవు నట్లుఁ గని నేరని రీతిని దేవమానవుల్
       సవ్వడిసేయు దుందుభులు, చక్కని వాద్యములెల్ల మ్రోఁగఁగన్

కం. రథయాత్రను బాల్గొనినన్
       వ్యథలెల్లఁ దొలంగి సఫలమౌ భక్తమనో
       రథములు, తమతమజీవన
       రథములు గమ్యంబుఁ జేరుఁ గ్రమమార్గమునన్
Posted in June 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *