Menu Close
Venkat Nagam
మన ఊరి రచ్చబండ
-- వెంకట్ నాగం --

'ఆపరేషన్ సిందూర్' - ఒక విశ్లేషణ

ఏప్రిల్ 2025లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన విషాదకరమైన ఉగ్రవాద దాడిలో 25 మంది భారత పౌరులు, ఒక నేపాలీ ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు ప్రతినిధిగా ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌ తమదే ఈ బాధ్యత అని ప్రకటించింది. ఈ ఉగ్రదాడికి బదులుగా భారత సైన్యం మే 7న 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సైనిక చర్యల ఫలితంగా జైష్-ఏ-మొహమ్మద్ (జెఎం) నాయకుడు మసూద్ అజార్ బంధువు యూసుఫ్ అజార్ మరియు ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తించబడిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) కమాండర్ అబ్దుల్ రవూఫ్ వంటి కీలక వ్యక్తులతో సహా అనేక మంది ఉగ్రవాదులు అంతమొందించబడ్డారు. పాక్ కు చెందిన 11 వైమానిక స్థావరాలపై భారత క్షిపణులు, డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ఈ సైనిక దాడుల తరువాత, ప్రపంచమంతా ఆశ్చర్యపడే రీతిలో ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన ఉగ్రవాదులకు పాకిస్తాన్‌లో సైనిక లాంచనాలతో ఘనంగా అంత్యక్రియలు జరిగాయి. దాంతో పాక్ "అతి రహస్యం బట్టబయలు" అయింది.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మృతిచెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరు అయిన పాకిస్తాన్ సైనిక అధికారుల పేర్లను మరియు చిత్రాలను భారత్ బయటపెట్టిన తరువాత, ఈ అంత్యక్రియలు ప్రపంచవ్యాప్తంగా వివాదానికి కారణమయ్యాయి. హాజరైనట్లు నివేదించబడిన ప్రముఖ పాకిస్తానీ ఆర్మీ వ్యక్తులలో లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హుస్సేన్ షా, మేజర్ జనరల్ రావు ఇమ్రాన్ సర్తాజ్, బ్రిగేడియర్ మొహమ్మద్ ఫుర్కాన్ షబ్బీర్, ఉస్మాన్ అన్వర్ అనే సీనియర్ పోలీసు అధికారి మరియు రాజకీయ నాయకుడు మాలిక్ సోహైబ్ అహ్మద్ ఉన్నారు. పలు మీడియా నివేదికలు పాకిస్తాన్ జెండాతో అలంకరించబడిన శవపేటికలతో పూర్తి ప్రభుత్వ గౌరవాలతో తీవ్రవాదుల అంత్యక్రియలు ఘనంగా జరిగాయని సూచిస్తున్నాయి.

లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మహ్మద్ (జెఈఎం) వంటి ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తూ, మద్దతు ఇస్తోందని భారత్ పదే పదే తేల్చింది. ఈ సంస్థలకు భారతదేశంలో, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన వివిధ దాడులతో ప్రత్యక్షంగా సంబంధం ఉంది అని భారత్ దర్యాప్తు సంస్థలు బల్ల గుద్ది చెబుతున్నాయి. స్వయం నిర్ణయాధికారం కోసం వాదించే కాశ్మీరీ గ్రూపులకు మాత్రమే రాజకీయ మరియు నైతిక మద్దతు ఇస్తున్నట్లు పాకిస్తాన్ ఎప్పటినుండో "పైకి" చెబుతూనే ఉంది. అయినప్పటికీ, ఆపరేషన్ సిందూర్ సమయంలో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ అధికారులు హాజరయినట్లు భారతదేశం రుజువులతో సహా వెల్లడించడంతో, ఉగ్రవాదం కార్యకలాపాలలో పాకిస్తాన్ నేరుగా పాల్గొంటున్నదనే బలమైన సందేశం ప్రపంచానికి వెళ్ళింది, పాక్ బండారం బయటపడింది.

పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఇటీవల జరిగిన నాలుగు రోజుల యుద్ధం తర్వాత పాకిస్తాన్ భారతదేశంపై తన విజయాన్ని ప్రకటించిందని పలు అంతర్జాతీయ వార్తా సంస్థల నివేదికలతో అయోమయం నెలకొంది. సదరు తప్పుడు నివేదికలను షెహబాజ్ షరీఫ్ నాయకత్వంలో, పాకిస్తాన్ ప్రత్యక్షంగా స్పాన్సర్ చేసిన పాలక పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ తో దగ్గరి సంబంధం ఉన్న వ్యక్తులు, మరి కొంతమంది పాక్ పత్రిక "డాన్" విలేకరులు వండి వార్చి రాసినట్లు తెలుస్తోంది. ఇక పాక్ పత్రికల సంగతి చెప్పనవసరంలేదు - "ఆత్మస్తుతి పరనింద" వాటి కధనాలలో స్పష్టంగా కనిపిస్తుంది. పాక్ ఆర్మీ కనుసన్నలలో ప్రభుత్వమే కాదు, పాక్ మీడియా కూడా ఉందనేది బహిరంగ రహస్యం. ఈ తప్పుడు కధనాల రచయితలు యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో జరిగిన రహస్య చర్చలు మరియు కాల్పుల విరమణ ప్రకటనకు ముందు జరిగిన అనధికారిక చర్చల ఊసెత్తకుండా ఏకపక్షంగా కధనాలు రాయడం జరిగింది. సదరు కధనాలను పలు ప్రపంచ వార్తా సంస్థలు యధాతధంగా ప్రచురించి, ఆనక ఉపగ్రహాల ఛాయ చిత్రాలలో పాక్ వైమానిక స్థావరాలకు జరిగిన భారీ నష్టాన్ని గుర్తించి నాలుక కరుచుకున్నాయి. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది - సదరు అంతర్జాతీయ వార్తా సంస్థల విశ్వసనీయత ఇప్పుడు ప్రశ్నార్ధకమైంది.

పహల్గామ్ ఉగ్రదాడి మరియు భారతదేశం యొక్క తదుపరి ఆపరేషన్ సిందూర్ మధ్య కాలంలో, పాకిస్తాన్ మంత్రులు తరచుగా మీడియాలో కనిపించి, పాక్ పై ఏదైనా సైనిక చర్య లేదా నీటి వనరుల విడుదలలో జోక్యం చేసుకుంటే భారతదేశంపై అణుబాంబు ప్రయోగించడం ఖాయమనే రెచ్చగొట్టే ప్రకటనలు పదే పదే విడుదల చేశారు - తద్వారా తమవంతుగా ఉద్రిక్తతలను వారు మరింతగా పెంచారు. ఏప్రిల్ 27, 2025న, పాకిస్తాన్ మంత్రి ఒకరు భారత్ ను తీవ్ర స్థాయిలో బెదిరించడం జరిగింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కధనం ప్రకారం, షహీన్ మరియు ఘజ్నవితో సహా 130 క్షిపణులు భారతదేశం పై మోహరించడానికి సిద్ధంగా ఉన్నాయని ఆ మంత్రి పేర్కొనడం జరిగింది. పాకిస్తాన్ యొక్క మొదట అణ్వాయుధ వినియోగ విధానం భారతదేశానికి విరుద్ధంగా ఉంది. పాకిస్తాన్ మరియు భారతదేశం మధ్య అణు యుద్ధం సంభవించినప్పుడు, అణుబాంబు తాము మొదట ఉపయోగించకూడదనే విధానాన్ని భారతదేశం ముందస్తుగా ప్రకటించినందున, ఇటువంటి నిబంధనలను పెట్టుకోని పాకిస్తాన్ టెంపరితనంతో ముందుగా అణుబాంబు ప్రయోగించే అవకాశం ఉంది. నిలకడ, నిబద్ధత లేని పాకిస్తాన్ ఎంతకైనా తెగిస్తుందని చరిత్ర మనకు చెప్పిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. భారతదేశంపై సాంప్రదాయ యుద్ధంలో తాము ఎన్నటికీ విజయం సాధించలేమని తెలుసుకున్న పాకిస్తాన్ తన అణ్వాయుధ ప్రయోగ విషయంలో తమ మొండి వైఖరిని మార్చుకునే అవకాశం తక్కువ. అయితే మే 10న కిరానా హిల్స్ పై భారత్ చేసిన భీకర దాడి తరువాత - భారత్ పై అణ్వాయుధ ప్రయోగం సంగతి అటుంచి, ముందు పాక్ కు తన స్వంత అణ్వాయుధాల భద్రత తలకు మించిన భారంగా అయ్యింది అని యుద్ధ నిపుణుల ఉవాచ.

పాకిస్తాన్ అణ్వాయుధాలను తొలుత వినియోగించే విషయంలో పట్టింపులు లేకపోవడం మరియు పాక్ సరిహద్దుల్లో చురుగ్గా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ సైన్యంకు ఉన్న సన్నిహిత సంబంధాల ద్వారా పాక్ అణ్వాయుధాలు ఉగ్ర మూకల చేతుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉండటం - వంటి కారణాలను పరిగణనలోకి తీసుకుని, పాకిస్తాన్ అణ్వాయుధాలను నిర్వీర్యం చేయడానికి ఏతావాతా అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుంటే సముచితంగా ఉంటుంది. మే 10 ఉదయం పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారతదేశం వ్యూహాత్మక దాడుల మూలంగా, కిరనా హిల్స్ వద్ద పాక్ రహస్యంగా దాచి ఉంచిన అణ్వాయుధాల సొరంగ మార్గానికి ఉన్న రెండు ప్రవేశ ద్వారాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని వార్తలు వచ్చాయి. ఒకవైపు పాక్ 11 వైమానిక స్థావరాలు భారత్ దాడులకు కకావికలం అయ్యాయి - మరో వైపు కరాచీ పోర్టును భారత్ దిగ్బంధం చేసింది, మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు పాక్ అణు స్థావరాల సొరంగ ప్రవేశ మార్గాలు రెండూ భారత్ దాడుల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి, పాక్ కు గగనతల రక్షణ వ్యవస్థ లేకుండాపోయింది -  చేసేదేమిలేక పాకిస్తాన్ కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. తమకు భారీ నష్టం జరిగిన విషయం అర్ధమైన పాకిస్తాన్ నేతలు అణ్వాయుధాల ప్రయోగంపై తమ నోటి దూకుడు తగ్గించుకున్నారు. ఒక వైపు చైనా నుండి పాక్ తెచ్చుకున్న హెచ్ క్యు 9 గగనతల రక్షణ వ్యవస్థ రాడార్ ఎక్కడుందో పసిగట్టడానికి భారత్ పంపిన డికాయ్ డ్రోన్లు కూల్చే ఆత్రుతలో భారత్ పన్నిన ఉచ్చులో పాక్ చిక్కుకుంది. ఆనక హెచ్ క్యు 9 రాడార్ ను భారత్ హరోప్ ఆత్మాహుతి డ్రోన్ కూల్చివేయడం, మరో హెచ్ క్యు 16 గగనతల రక్షణ వ్యవస్థ రఫేల్ విమానాల నుండి భారత్ ప్రయోగించిన స్కాల్ప్ క్షిపణులను అడ్డుకోలేకపోవడం, మరో వైపు కిరానా హిల్ల్స్ వద్ద పాక్ రహస్యంగా దాచి ఉంచిన అణ్వాయుధాల సొరంగ మార్గానికి ఉన్న ప్రవేశ ద్వారాలు రెండింటిపై భారత్ "అటునుండి నరుక్కు రా" రీతిలో చేసిన భీకర దాడులతో దారుణంగా దెబ్బతిని అవి రెండూ మూలన పడడంతో - పాక్ అస్త్రాలు సమయానికి అక్కరకు రాక, మహాభారత యుద్ధంలో "కర్ణుడి కధ" లెక్క "పాక్ కధ" కూడా ముగిసి చేతులెత్తేసింది. ఆపరేషన్ సిందూర్ నాల్గవ రోజు మొదటి మూడు గంటలకే 11 పాక్ వైమానిక స్థావరాలు భారత్ వ్యూహాత్మక దాడులకు నిర్వీర్యం అయ్యాయి. పాక్ యుద్ధ విమానాలు కొన్ని భారత్ దాడులలో దెబ్బతినగా మిగతావి అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 'అన్నం పెడితే అరిగిపోతుంది, చీర ఇస్తే చిరిగిపోతుంది, కఱ్ఱుకాల్చి వాతపెడితే కలకాలం ఉంటుంది' అన్నట్లు - ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ కు భారత్ మూలంగా జరిగిన నష్టం బహుశా ఆ దేశానికి ఇంకో 20-30 ఏండ్లు గుర్తు ఉంటుంది.

తమకు జరిగిన నష్టాన్ని ఆలస్యంగా అంగీకరించడం, అదీ తక్కువ స్థాయిలో నష్టం జరిగినట్లు చూపడం పాక్ కు అలవాటు. భారత క్షిపణులు మే 10న తెల్లవారుజామున నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ మరియు పాకిస్తాన్‌లోని ఇతర మిలటరీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి - అని ఒక అయిదు రోజుల తరువాత, మే 15న పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ బహిరంగంగా అంగీకరించారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో, షరీఫ్ తెల్లవారుజామున 2:30 గంటలకు సైన్యాధ్యక్షుడు జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ నుండి తనకు ఫోన్ వచ్చిందని, భారతదేశం ప్రారంభించిన క్షిపణి దాడుల గురించి ఆయన తనకు తెలియజేశారని చెప్పారు. ముఖ్యంగా, గతంలో చక్లాలా ఎయిర్ బేస్ అని పిలువబడే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో కూడా లక్ష్యంగా ఉంది. ఆపరేషన్ సిందూర్ లో  పాక్ నిఘా విమానం అవాక్స్ ను భారత్ కూల్చేసిందని పాకిస్తాన్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ మసూద్ అక్తర్ ఓ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. భోలారి వైమానిక స్థావరంపై భారత్ నాలుగు బ్రహ్మోస్ మిసైళ్లను ప్రయోగించిందని, అందులో నాలుగవది అవాక్స్ విమానం పార్క్ చేసిన హ్యంగర్ని ఢీకొట్టిందని చెప్పారు. దాంతో అవాక్స్ విమానం దెబ్బతినడమే కాకుండా దాన్ని అక్కడి నుండి తరలించడానికి ప్రయత్నించిన  పలువురు పాక్ పైలట్లు కూడా కూడా మృతి చెందారన్నారు మసూద్ అక్తర్. ఈ అవాక్స్ విమానంపై ఇప్పటివరకు పాక్ 1700 కోట్ల రూపాయిలు ఖర్చు చేసి ఉంటుందని ఒక అంచనా.

ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్ ప్రకటించిన సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్ అమలులో ఉంటుందని మరియు కాల్పుల విరమణ ఉన్నప్పటికీ దానిని రద్దు చేయబోమని భారతదేశం పునరుద్ఘాటించింది. ఇంతకు మునుపు పాక్ అభ్యంతరాలతో మొహమాటాలకు పోయి నిలిపివేసిన సింధు నదులపై నీటి నిల్వ, నీటి మళ్లింపు ప్రాజెక్టులను భారతదేశం కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఒప్పందంను భారత్ నిలుపుదలచేయడం కారణంగా దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేయబడిన భారత పరిపాలనలో ఉన్న కాశ్మీర్ ప్రాంతం మరియు పరిసర ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ఒప్పందాన్ని సమర్ధిస్తూ జమ్మూ & కాశ్మీర్ ముఖ్యమంత్రి అబ్దుల్లా, మధ్యలో ఆపేసిన తుల్బుల్ బ్యారేజీని భారత్ పూర్తి చేయడం వల్ల జమ్మూ & కాశ్మీర్ ప్రాంతానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని వాదించారు. 'ఇది జీలంను నావిగేషన్ కోసం ఉపయోగించుకోవడానికి మరియు దిగువ ప్రాజెక్టులకు, ముఖ్యంగా శీతాకాలంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి వీలు కల్పిస్తుంది' అని ఆయన పేర్కొన్నారు. 60 ఏండ్ల క్రితం కుదుర్చుకున్న అన్యాయమైన ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించడం యుద్ధోన్మాద చర్య కాదని, జమ్మూ & కాశ్మీర్ ప్రజలు తమ సొంత నీటి వనరులను ఉపయోగించుకునే హక్కును కోల్పోయిన చారిత్రక తప్పును సరిదిద్దే ప్రయత్నం అని, పెరిగిన జనాభాకు అవసరమైన నీటి వనరులు కల్పించే దిశగా భారత్ ఈ అవకాశం వదులుకోకూడదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు సమీపంలో ఉన్న రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై మే 10న భారతదేశం దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ సైనిక వ్యవస్థలో ఆందోళన పెరిగిందని ది న్యూయార్క్ టైమ్స్ నుండి ఒక వార్తా కధనం వచ్చింది. పాకిస్తాన్ యుద్ధ విమానాలకు ఆకాశ మార్గాన ఇంధనం నింపే సామర్థ్యాల కారణంగా ఈ వైమానిక స్థావరం గణనీయమైన వ్యూహాత్మక విలువను కలిగి ఉంది. మరింత కీలకంగా చెప్పాలంటే, ఇది పాకిస్తాన్ అణ్వాయుధాలను నిర్వహించడానికి బాధ్యత వహించే వ్యూహాత్మక ప్రణాళికల విభాగానికి ఇది సమీపంలో ఉంది. మే 10 న భారత్ దాడులతో ఈ నూర్ ఖాన్ వైమానిక స్థావరం తీవ్రంగా దెబ్బతింది. ఇంకా పాక్ కోల్పోయిన జాబితాలో ఒక అవాక్స్ విమానం, యుద్ధ విమానాలకు గాలిలో ఇంధనం నింపే టాంకర్ విమానం, 12 ఇతర ఫైటర్ జెట్లు, ఈ జాబితా చాలానే ఉంది, ఇంకా చాలా యుద్ధ సామాగ్రిని, సిబ్బందిని కూడా పాక్ కోల్పోయింది. ఆపరేషన్ సిందూర్ తో భారత్ ఆయుధాల ఉన్నత సామర్ధ్యం, వాటిని సమర్ధవంతంగా ఉపయోగించే నైపుణ్యం ప్రపంచానికి తెలిసొచ్చింది అని పలువురు తటస్థ యుద్ధ నిపుణులు, విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. భారత స్వదేశీ రక్షణ, సాయుధ సామర్ధ్యం, ఆధునిక సాంకేతిక సామర్ద్యాలతో అజేయ శక్తిగా ఎదుగుతోందనే నిజం ప్రపంచం గుర్తిస్తోంది. మున్ముందు రక్షణ రంగంలో భారత్ ఎగుమతులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది, తద్వారా మరిన్ని పరిశ్రమలు - ఉద్యోగాలు వచ్చే సూచనలు ఉన్నాయి.

ఏప్రిల్ 23న, బీ యెస్ ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా అనుకోకుండా సరిహద్దు దాటి పాక్ భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత పాకిస్తాన్ అతన్ని పట్టుకుంది. కాల్పుల విరమణ తర్వాత మాత్రమే అంటే మే 14న అతన్ని విడుదల చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం దాడి చేయడానికి ముందు పాకిస్తాన్ సదరు జవాన్‌ను స్వచ్ఛందంగా విడుదల చేసి,  క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించి ఉంటే, పహల్‌ఘామ్ ఊచకోత తర్వాత ఉద్రిక్తతలను తగ్గించి ఉండేది. అందుకు బదులుగా, పాకిస్తాన్ ఘర్షణాత్మక వైఖరిని అవలంబించింది, భారతదేశానికి వ్యతిరేకంగా అణ్వాయుధాల వాడకం గురించి బెదిరింపులు జారీ చేసింది మరియు సింధు జలాల ఒప్పందం తొక్కిపెడితే రక్తం పారుతుంది అని కఠినమైన వ్యాఖ్యలు చేసింది. ఉదాహరణకు, ప్రతిపక్ష పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు బిలావల్ భుట్టో జర్దారీ 'సింధు మాదే అవుతుంది - మా నీరు దాని గుండా పారాలి, లేదా వారి రక్తం' అని ప్రకటించారు. తరువాత అతను ఈ ప్రకటనను వ్యక్తిగతంగా ఉపసంహరించుకున్నప్పటికీ, వేలాది మంది మద్దతుదారులు హాజరైన పెద్ద ర్యాలీలో ఆయన రెచ్చగొట్టే ప్రకటన ముందుగా చేయడం జరిగింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత కొనసాగుతున్న సరిహద్దు వివాదాల మధ్య పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి భారతదేశంతో ఉద్రిక్తతలను మరింత పెంచారు. 'వారు (భారతదేశం) నీటిని ఆపివేస్తే, వారు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. ఘోరీ, షాహీన్ మరియు ఘజ్నవి (పాక్ క్షిపణులు) ప్రదర్శనకు కాదు. మేము వాటిని భారతదేశం కోసం ఉంచాము. మేము 130 అణ్వాయుధాలను ప్రదర్శన కోసం ఉంచలేదు. అవి పాకిస్తాన్‌లో ఎక్కడ ఉన్నాయో మీకు తెలియదు' అని అబ్బాసి చేసిన ప్రకటన సింధు నదిలో రక్తం ప్రవహిస్తుందనే బిలావల్ బెదిరింపు ప్రకటన అనంతరం కొనసాగింపుగా వచ్చింది. ఈ రకంగా భారత్ పై బెదిరింపు ప్రకటనలు చేసే విషయంలో పాక్ అధికార - ప్రతిపక్ష రాజకీయ నాయకులు పోటీలు పడ్డారు అని చెప్పాలి. ఆపరేషన్ సిందూర్ పిదప పాక్ కాళ్ళ బేరానికి వచ్చిన తదుపరి వీరి నోళ్ళకు తాళాలు పడ్డాయి.

మే 10, 2025న ఆపరేషన్ సిందూర్ సందర్భంగా వ్యూహాత్మక నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై భారతదేశం జరిపిన ఖచ్చితమైన దాడుల తర్వాత హడావుడిగా పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్‌ను రావల్పిండిలోని సురక్షితమైన బంకర్‌కు తరలించారని అనేక విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ తేదీన, పాకిస్తాన్ జనరల్ హెడ్‌క్వార్టర్స్ కు సమీపంలో ఉన్న నూర్ ఖాన్ వైమానిక స్థావరం మరియు దేశం యొక్క అణ్వాయుధ సామగ్రికి బాధ్యత వహించే వ్యూహాత్మక ప్రణాళికల విభాగం భవనం తో సహా అనేక కీలకమైన పాకిస్తాన్ సైనిక సౌకర్యాలను లక్ష్యంగా భారత్ మిస్సైల్, మరియూ డ్రోన్లతో చేసిన భీకర దాడుల మూలంగా పాక్ కు గణనీయమైన నష్టం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి నష్టాలను తగ్గించడానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కార్యాచరణ స్థావరాన్ని పూర్తిగా దూరంగా వేరే చోటా మార్చాలని పాక్ ఆలోచిస్తోందని కొన్ని వర్గాలు సూచిస్తున్నాయి. 'వారు రావల్పిండి నుండి ఖైబర్ పఖ్తుంఖ్వా లేదా మరేదైనా సుదూర ప్రదేశానికి తరలించవచ్చు, కానీ అవి కూడా మా దాడి పరిధిలోనే ఉంటాయి' అని భారత ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ సుమెర్ ఇవాన్ మే 20న ఒక వార్తా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెచ్చరించారు, తద్వారా సుదూర లక్ష్యాలను ఛేదించగల భారతదేశ సైనిక సామర్థ్యాలను ఆయన నొక్కి చెప్పారు.

భారతదేశం ఆపరేషన్ సిందూర్ సైనిక చర్యల తరువాత, పాకిస్తాన్ సరిహద్దు ఫిరంగి కాల్పులతో తెగబడింది మరియు డ్రోన్ చొరబాట్లకు ప్రయత్నించింది. దీనికి ప్రతిస్పందనగా, భారతదేశం ఆ డ్రోన్‌లను కూల్చి, సమన్వయంతో కూడిన ప్రతిదాడిని నిర్వహించిందని, దాని మూలంగా పాకిస్తాన్ హెచ్ క్యూ 9 గగనతల రక్షణ వ్యవస్థ రాడార్లు, కమ్యూనికేషన్ కేంద్రాలు మరియు 11 ఎయిర్‌బేస్‌లపై తీవ్ర నష్టం కలిగించిందని తెలిసింది. పాక్ వైమానిక రక్షణ వ్యవస్థలు మరియు దాని వైమానిక శక్తిలో దాదాపు నాలిగింట ఒక వంతు నష్టపోయాయి, అంతేకాక పాక్ గగనతల రక్షణ వ్యవస్థ మరియూ వారి 11 మిలటరీ ఎయిర్ పోర్టులు దారుణంగా దెబ్బతిన్నాయి. నాలుగు రోజుల దుద్ధం మూలంగా పాక్ కు జరిగిన నష్టం మొత్తం దాదాపు 5 బిలియన్ డాలర్ల పై చిలుకు అని ఒక అంచనా. గత్యంతరం లేని పరిస్థితిలో కాళ్ళ బేరానికి వచ్చిన పాకిస్తాన్‌, కాల్పుల విరమణ కోసం భారతదేశంతో దౌత్యపరమైన సంబంధాన్ని ఏర్పాటుచెయ్యమని అమెరికాను అర్ధించవలసి వచ్చింది. కాల్పుల విరమణ పిదప భారతదేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్‌పై తన సైనిక చర్యను కేవలం 'విరామం' చేసిందని మరియు భవిష్యత్తులో భారత్ పై తీవ్రవాద దాడి జరిగితే భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని పాక్ ను హెచ్చరించారు. పాకిస్తాన్‌ కాల్పుల విరమణ వేడికోళ్ళ మధ్య ఆటలో అరటి పండులా ట్రంప్ బడాయి మాటలకు పెద్దగా విలువనివ్వాల్సిన అవసరం లేదు. అంతకు మునుపు భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలపై అమెరికా జోక్యం చేసుకోబోదని అంతర్జాతీయ సంఘర్షణల నుంచి అమెరికా వైదొలగాలని భావిస్తోందని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలను ప్రామాణికంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది 1971 లో భారత్ - పాక్ సిమ్లా ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు ద్వైపాక్షిక చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలనే నిబంధన అనుగుణంగా ఉంది.

పాక్ బండారం మరింత బయటపడే విధంగా రోజుకో కొత్త వార్త బయటకు వస్తుంది. ఈ చర్చను వచ్చే నెలలో కొనసాగిద్దాం. జూలై నెల చర్చలో భారత్ - పాక్ ప్రస్తుత సమస్యలకు ప్రవాసాంధ్రుడి కోణం నుండి కొన్ని పరిష్కార మార్గాలు, మరియూ నాలుగు రోజుల యుద్ధం పై కొత్త సమాచారాన్ని క్రోడీకరించి చర్చకు లాకొచ్చే పూచీ నాది. ఆ మాటకొస్తే పహల్గాం దాడి జరిగిన ఏప్రిల్ 22 నుండి గ్రామ గ్రామాన ఉండే ప్రతి రచ్చబండలో కూడా జరిగే చర్చ చాలా వరకు తాజా వార్తలపై, మరికొంత చర్చ చరిత్ర రంధ్రాన్వేషణపై పై సహజంగా ఉంటాయి.

ఎప్పటిలాగే సిరిమల్లె పాఠకులకు సాహిత్యాభినందనలు అందజేస్తూ...అలాగే పాఠకులందరూ యధావిధిగా క్రింద నున్న కామెంట్ బాక్స్ లో ఆపరేషన్ సిందూర్ రచ్చబండ చర్చపై మీ స్పందనను తప్పక తెలియజేయాలని వారిని అభ్యర్థిస్తూ.. ఈ నెల చర్చ ముగిద్దాం, వచ్చే నెలలో మరో ఆసక్తికరమైన రచ్చబండ చర్చ కు తెర తీద్దాం! అంతవరకూ సెలవు.

-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం

********

Posted in June 2025, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *