Menu Close
Ghali-Lalitha-Pravallika
కథ మొదలు మాది - ముగింపు మీది
ఘాలి లలిత ప్రవల్లిక

గత సంచిక తరువాయి... ముగింపు కథ కొనసాగింపు .... »

8. నందా త్రినాథరావు

శ్యామలమ్మ తన ఒంటరితనం నుండి తప్పించుకోవడానికి తనకో తోడు కావాలి అనగానే “ఎలాంటి తోడు?” అని అడగకుండానే సరే అన్నారు కొడుకు కోడలు.

ఈ విషయం ఎలాగో తెలిసి చుట్టుపక్కల వాళ్ళు, "ఈ వయసులో ఈవిడకు ఇదేం పోయేకాలం?" అని అన్నారు. విషయం తన కూతురి వరకు పాకి తాను పూర్తిగా చెప్పకుండానే ఫోన్ కట్ చేసేసింది.

కానీ నిజానికి శ్యామలమ్మ కోరుకుంటున్న తోడు మగ తోడు మాత్రం కాదు. తనలాంటి వయసు మళ్ళిన వాళ్ళకి, పిల్లలు విడిచిపెట్టేసి ఎలాంటి ప్రేమానురాగాలకు నోచుకోని, అనాథలుగా కాలం వెళ్లదీస్తున్న ముసలివాళ్ళకి ఆసరాగా తాను ఏదయినా చేయాలనుకుంది.

తనకి వంటలు బాగా చేయడం వచ్చు. రకరకాల వంటలు వండి వాళ్ళకి అందించి వాళ్ళతో పాటూ తానూ అక్కడే వృద్ధాశ్రమంలో గడపాలనుకుంది. అందువలన వారితో పాటూ తనకూ వారందరి సాంగత్యం లభిస్తుంది. అలాగే తను ఒంటరి అనే భావం కూడా ఉండదు. అలా తన శేష జీవితాన్ని వారి కోసం, వారి కళ్ళల్లో కనిపించే మెరుపుల కోసం సాగించాలనుకుంది శ్యామలమ్మ.

అనుకోవడమే కాదు తను వెంటనే ఒక వృద్ధాశ్రమంలో స్వచ్ఛందంగా జేరింది. అక్కడున్న తనలాంటి వృద్ధుల కళ్ళల్లో ఆనందాల్ని చూసింది.

ఇప్పుడు శ్యామలమ్మకు తను ఒంటరి అనే భావం లేదు. రోజూ ఆశ్రమంలోని అందరూ కలిసి వంటలు చేసుకోవడం, తర్వాత కాసేపు విశ్రాంతి! సాయంత్రమైతే భగవంతుని సేవలో ఆధ్యాత్మిక భజనలు, పాటలు పాడుకుంటూ సంతోషకరమైన జీవితాన్ని గడిపేస్తుంది శ్యామలమ్మ.

******

9. లలితా రాయప్రోలు

అంశం: కథ మొదలు మాది - ముగింపు మీది.  శీర్షిక: ఆశ్రయం

ఆరుపదుల వసంతాలు చూసిన శ్యామలమ్మకు, ఒంటరితనం కొత్తేమీకాదు. కానీ ఈ మధ్య కాలంలో... 'తాను ఒంటరి' అనే ఫీలింగ్ పవర్ ఆఫ్ పట్టా పుచ్చుకొని గుండె సింహాసనం మీద, తిష్ట వేసుకుని కూర్చుంది. 'ఇన్నాళ్లు లేని ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది?' అని పదే పదే తన మనసును ప్రశ్నించుకుంది.

అది...

'అప్పుడు బాధ్యతలు తోడుగా ఉండేవి. ఇప్పుడు అవి తీరిపోయాయి. వీటితో పాటుగా అనారోగ్యం...శరీరంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. మరి ఇప్పుడేగా! ఇంట్లో నాకు ఉన్న విలువ నాకు తెలిసేది. మరి ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యాను!?!' అని తనకు తాను జవాబు చెప్పుకొంది.

కంటికొలకుల్లో దాగిన రెండు కన్నీటిబొట్లు ఆమె బుగ్గల పైకి ప్రాకాయి. గతం ఆమె కళ్ళ ముందు మెదిలింది.

***

పెళ్లయిన నాలుగేళ్లకే ఇద్దరు పిల్లల్ని ఒళ్ళోపెట్టి పరారు అయిపోయాడు శ్యామలమ్మ మొగుడు పరాంకుశం.

"నా కొడుకును వీధులపాలు చేసిన నీవు మాఇంటికి ఏ మొహం పెట్టుకొని వస్తావు? నువ్వూ, నీ పిల్లలూ కట్ట కట్టుకొని ఏ చావన్నా చావండి. మాకు మీకు ఎటువంటి సంబంధం లేదు," అని తెగేసి చెప్పేసి, ఆమెను... ఆమె పిల్లల్ని ఇంట్లోకి రానీయకుండా తలుపు మొహం మీదే వేసేసారు ఆమె అత్తింటి వారు.

పుట్టింటికి వెళ్ళటం ఇష్టం లేని శ్యామలమ్మ. ఒక కాన్వెంటులో టీచర్గా జాయిన్ అయ్యి, తినీ, తినక ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని ప్రయోజకుల్ని చేసుకుంది.

ఇప్పుడు పిల్లలు ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ఎవరి సంసారాలు వాళ్ళవి.

***

కళ్ళ నీళ్లు తుడుచుకుంది. మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. ఆ ప్రయత్నంలో సఫలీకృతురాలు అయ్యింది.

తన నిర్ణయం కొడుకూ, కోడలికి చెప్పింది. "నీ ఇష్టం!" అన్నాడు కొడుకు. "మీ ఆనందమే మా ఆనందం!" అని చెప్పి తప్పుకుంది కోడలు.

కూతురుతో ఈ మాటే చెబితే... జవాబు చెప్పకుండా, ఫోన్ కట్ చేసేసింది.

చుట్టుపక్కల వాళ్ళు,

"ఈ వయసులో ఈవిడకు ఇదేం పోయేకాలం?" అని అన్నారు. వాళ్ళందరికీ తాము కులస్త్రీలమనే అహంభావం చాలా ఉంది. ఒళ్ళమ్ముకుని బతికే వాళ్ళంటే చిన్న చూపు!

వాళ్ళ చూపు పడితేనే తమ పాతివ్రత్యం మంట గలిసిపోతుందనే దురభిప్రాయం ఉంది.

శ్యామలమ్మ అలాంటి వారి పిల్లల్ని, నేరస్థుల, హంతకురాళ్ళ పిల్లల్ని చేరదీయడం ఇరుగు పొరుగు వారికి నచ్చలేదు.

ఆ పిల్లల్తో కలిసి ఆడుకుంటే తమ పిల్లలు కూడా చెడి పోతారని మొహం మీదే తిట్టి పోసారు. శ్యామలమ్మ ఎవరేం అన్నా చలించలేదు.  తను కాస్తో కూస్తో చదువుకుంది కనక, అందరూ నిరాదరించినా, ఉద్యోగం చేసి, పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చింది.

కొంతమంది స్త్రీలని భర్త బతికుండగానే, ఇంట్లోంచి వెళ్లగొడుతుంటే, బైటికి వచ్చి, బతికే మార్గం లేక, వేశ్యా వృత్తిని ఎంచుకున్న వాళ్ళ పిల్లల్ని, క్షణికావేశంలో నేరాలు, హత్యలు చేసి జైలు పాలయిన వాళ్ళ పిల్లల్ని ఆదుకుని సరైన మార్గంలో పెట్టాలనే నిర్ణయం శ్యామలమ్మ తీసుకుని, తనకున్న కొద్దిపాటి నగలు అమ్మేసి ఆశ్రయం అనే సంస్థని మొదలుపెట్టింది.

కూతురికి తల్లి నగలు తీసుకుందామనే ఆలోచనలో ఉంది కనక, ఆమెకి శ్యామలమ్మ ఆలోచన నచ్చలేదు.

కొడుక్కి తల్లి బంగారం మీద ఆశ లేదు. కోడలికి కాస్త ఉన్నా, ఆడబడుచు పడనీయదని తెలిసి, ముందునుంచీ వ్యామోహ పడలేదు.

ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, శ్యామలమ్మ తన ఆలోచన మంచిదే అన్న ఉద్దేశంతో ముందుకి సాగిపోతూ ఉంది.

******

****సశేషం****

Posted in June 2025, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *