Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
-- మధు బుడమగుంట --
శ్రీపద్మావతీ అమ్మవారి సహస్రదీపాలంకరణసేవ - శుక్రవారము

కం. మరువము, దమనము, మల్లెల
     మఱవము; విరు లెన్నొ మేన మంజుల మగుచున్
     మురిపింపఁగ, రాయంచలె
     యరుదగు జడతొడవు లయ్యె(1) హరివల్లభకున్ 
          (1) మణిమయమైన జడబిళ్ళలలోని హంసలు 
              జడకు అలంకారము లయ్యెను 211

మ. శతపత్రస్థితమంగళాకరవపుస్సంజాతకాంతిచ్ఛటా
      హృతదాసాఘచయాంధకారవితతిన్ హృన్మధ్యసంవాసినిన్
      స్మితరాకాశశిబింబవక్త్రఁ గరుణాసింధూద్భవన్ బద్మిసే
      వితలావణ్యనిధిన్ బ్రభాతకవితన్ వేనోళ్ళఁ బ్రార్థించెదన్ 212

తే.గీ. తరణి(1) కరములఁ(2) దాఁకఁగఁ దరుణ మరసి
      తనువు పులకించి వికసించు తామరసము
      సృష్టికర్త రచించిన చిత్ర మిద్ది
      ప్రకృతిపురుషల కేళియై ప్రమద మొసఁగు 
            (1) సూర్యుడు (2) కిరణములతో/ చేతులతో 213

భక్తాంజనేయుఁడు
మ. సితరోమాన్వితు మంగళాయతవపుశ్శ్రీరామసంప్రార్థనా
      స్థితసౌఖ్యాసనబద్ధు నిద్ధచరితున్ దేజోమయున్ గాంచితిన్
      గృతకృత్యున్ గరిమాదిసిద్ధినిధి సంగీతప్రవీణున్ బ్రభా
      సితసీతారఘురామధామహృదయున్ జేతోఽక్షిమై వేకువన్ 214

బ్రహ్మముహూర్తము
ఉ. బ్రహ్మముహూర్త మిచ్చుఁ బ్రతిభాసృజనానిశితైకచింతనాఽ
      జిహ్మగబుద్ధికౌశలవిశేషమనోఽబ్జవికాసబృంహణల్;
      బ్రహ్మముఁ జూడఁ గల్గుట కుపాసనకున్ దగునట్టి వేళ; యా
      బ్రాహ్మియె నా యెదన్ నిలిచి పల్క లిఖించెద ముఖ్యవాక్యముల్ 215
Posted in June 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *