బమ్మెర పోతన మహా భాగవతాన్ని చతుర్థ స్కంధం దాకా అనువదించాడు. 5, 6 స్కందాలను అనువదించకుండా సప్తమ స్కందాన్ని అనువదించడం ఆలోచించవలసిన విషయం.
మన దేశానికి భారతదేశం అనే పేరు రావడానికి కారణమైన భరతుని కథ పంచమ స్కందంలో ఉన్నది. పంచమ స్కందాన్ని పోతన వదిలివేయగా దానిని బొప్పరాజు కుమారుడు గంగన్న అనువదించాడు. ఇతని వివరాలు ఏమీ తెలియవు. తన గోత్రం కూడా చెప్పలేదని ఆరుద్ర తెల్పారు.
గంగన పంచమ స్కందాన్ని రెండు ఆశ్వాసాలుగా విభజించాడు. 1వ ఆశ్వాసం లో 163, 2వ ఆశ్వాసం లో 166 గద్య పద్యాలున్నట్లు ఆరుద్ర తెల్పారు. 1వ ఆశ్వాసం లో 20 కథలు, 2వ ఆశ్వాసం లో 6 కథలు ఉన్నాయని, ఈ 2వ ఆశ్వాసం లోని 6 కథలు ఒక రాజవంశానికి చెందిన కథలే. అందులో ఋషభుడు అనేవానికి నూరుగురు కుమారులున్నారు. అందులో ఒకడు భరతుడు. ఋషభుని తరువాత భరతుడు రాజయ్యాడు. దీనిని గూర్చి తెల్పే పద్యం;
భరతుడాదిగ సుతుల నూర్వురను గాంచె
నట్టి భరతుని పేరను నవనితలము
పురవరాశ్రమ గిరితరు పూర్ణమగును
నమరి భారతవర్ష నామమున మించె (భాగ – 5-1-53)
ఈ భరతుడు సుప్రసిద్ధుడైన జడ భరతుడయ్యాడు అని ఆరుద్ర తెల్పారు. ఇతడు (జడ భరతుడు) తపస్సు చేసుకొంటూ ఒక జింకను పెంచడం వల్ల తపస్సు చెడి మరుజన్మలో ఒక లేడిగా జన్మించాడు.
తర్వాత జన్మలో విప్రుడైనా జడుడు గానే జీవించాడు. రాజుగారి పల్లకి మోసాడని, అతనికి జ్ఞానోపదేశం చేసాడని ఈ పంచమ స్కంధంలో ప్రధమాశ్వాసంలో ఉన్నట్లు ఆరుద్ర తెల్పారు. జడ భరతుని కథ ఇంతటితో సరి. ఇక గంగన రచనా విధానం గూర్చి ఆరుద్ర ప్రస్తావించారు. మధ్యలో సూర్యుని రథవేగం గూర్చి ఆనాడు పురాణాలలో ఉన్న దానిని ప్రస్తావిస్తూ మన పురాణాలలో సైన్సు విజ్ఞానం గూర్చి చక్కగా ఉన్నట్లు శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి గారు ఇచ్చిన వివరణను ఆరుద్ర తెల్పారు.
గంగన్న రచనను గూర్చి చెబుతూ, 14 గద్య పద్యాలను రాసిన గంగన్న వాటిని రక్తి కట్టించలేక పోయాడు అని చెప్పి కరుణరసం పోషించడంలో గంగన్న విఫలుడైనాడని చెప్తూ గంగన్న వ్రాసిన గద్యం తెల్పాడు ఆరుద్ర.
వ. అంత నాభరతుం డొక్కనా డా మహానదిం గృతాభిషేకుండై ముహూర్త త్రయం బంతర్జలంబులందు బ్రణవోచ్చారణంబు సేయుచుండు .....అనే చాలా సుదీర్ఘ వచనాన్ని తెల్పి చివర ఇలా అన్నారు ఆరుద్ర.
“ఇంకొక కవి అయితే ఈ ఘట్టంలో గుండెలు కరిగించే పద్యాలు వ్రాసి ఉండేవాడు. గొప్పరాజు గంగన్న నిస్సారమైన వచనం వ్రాసాడు”
అలాగే భరతుడు సాకిన జింక పిల్ల పారిపోయినప్పుడు కూడా గంగన్న ఒక వచనం ద్వారా భరతుని బాధ తెల్పాడని చెబుతూ ఆ వచనం కూడా ఆరుద్ర తెల్పారు. ఆ వచనం గూర్చి తెల్పుతూ ఈ వచనంలోని భావాలను పద్యాలలో పొదిగివుంటే మంచి కవిత్వం అయి ఉండేదని గంగన్న అలా చేయకుండా వచన రూపంలో మంచి ఘట్టాలను చెప్పడం వల్ల బిగువు తగ్గిందని ఆరుద్ర అభిప్రాయ పడ్డారు.
అయితే బాగా చూస్తె గంగన్న రచన సింగన్ నారయ రచనల కంటే తీసిపోదని చాగంటి శేషయ్య గారు అభిప్రాయపడినట్లు ఆరుద్ర తెల్పారు.
“పోతరాజు గారు పంచమ షష్ఠ స్కందాల జోలికి మొదట్లోనే వెళ్ళదలచుకోలేదేమో అనిపిస్తుంది. పంచమ స్కందం చాలా వరకు జైన పురాణ గాథలకు వైష్ణవత్వపు రంగు పూయడమే” అని అన్నారు ఆరుద్ర.
భగవంతుడు ఋషభావతారము ఎత్తడం యజ్ఞ సంస్కృతిని తిరస్కరించడం తనకు “బహువిధద్రవ్య సంపాదనంబు గలిగి, విభవ యుక్తంబులైన యశ్వమేధాదులు తృప్తికరం కావడం....యజ్ఞయాగాదులు తృప్తికరం కాదనడం, దిగంబరుడై ఉన్మత్తకారుడై దక్షిణ కర్ణాటకలో అర్హనామకుడు అవడం, ఇవన్నీ జైన తీర్థంకరులలో మొదటివాడైన ఋషభనాభుని జీవిత చరిత్రకు మారువేషం వేయడం అన్నారు ఆరుద్ర.
భాగవతం నిజానికి పోతరాజు ఒక్కడే అనువదించలేదు. కానీ ఆంద్ర దేశంలో భాగవతం అంటే పోతన గారొక్కరే గుర్తుకు వస్తారని చెప్తూ ఆరుద్ర ఆ విధంగా తన అభిప్రాయాన్ని తెల్పారు.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు బహు పాదాంతర విపుల పీఠికా సహిత ప్రచురణలో తాము దేశం మొత్తం మీద 257 ప్రతులను సంపాదించి పరిశీలించినట్లు చెప్పారు. చాలా ప్రతులలో పంచమ, షష్ఠ, ఏకాదశ, ద్వాదశ స్కందాలలో పోతరాజు గారి గద్య కనపడుతుందట. అది లేఖకులు భక్తి ప్రపత్తులకే కానీ శ్రద్ధ కు నిదర్శనం కాదు” అని అన్నారు ఆరుద్ర.
ఈ విధంగా భాగవాతానువాదం సాగినా, పోతన గారి భాగ్యం, ఆంధ్రులకు భాగవతం పారాయణ గ్రంథమైంది.