Menu Close
Shabdavedhi pagetitle
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

క్రీస్తుకు పూర్వం కాంతి రేఖలు
ఎరాటోస్తనీస్

జ్ఞానములలోకెల్లా ఇంగిత జ్ఞానము శ్రేష్టము మఱియు శ్రేయోదాయకము. ప్రాచీన కాలంలో పెద్దలెందరో ఇంగితజ్ఞానంతో కనుగొన్న విషయాలే ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి పునాదులు.

అలాంటి మన పెద్దల్లో ఒకరే “ఎరాటోస్తనీస్”.

అస్వాన్ దక్షిణ ఈజిప్ట్ లోని ఒక నగరం. ప్రాచీన కాలంలో అస్వాన్ ను "సియెన్" అనేవారు. ఈ నగరం నైల్ నదికి తూర్పు తీరంలో ఉంటుంది.

సుమారు రెండువేల రెండు వందల సంవత్సరాల క్రితం ఓ ఉత్సాహవంతుడు ఎండాకాలంలో ఒకనాడు మిట్ట మధ్యాహ్నం రవి నడినెత్తిన ఉన్నపుడు ఒక కర్రను నిటారుగా భూమిలోకి నాటాడు. అపుడు అక్కడ అతనికి ఎటువంటి నీడా కనిపించలేదు. అదే రోజు అదే సమయంలో అలెగ్జాండ్రియా నగరంలో అదే విధంగా నిలబెట్టబడిన కర్ర యొక్క నీడ మాత్రం కనిపించిందని తెలుసుకున్నాడు. అలెగ్జాండ్రియా వెళ్లి అలా ఉన్న నీడ యొక్క కోణం ఏడు డిగ్రీలు ఉందని పరిశీలించి తెలుసుకున్నాడు. అంటే వృత్తంలో సుమారుగా 1/50 అనమాట. భూమి గనుక చదరంగా ఉంటే సియెన్ లో ఉన్నట్లే అలెగ్జాండ్రియాలో కూడా నీడ ఉండాలి. కానీ అలా లేనందువల్ల భూమి చదరంగా లేదని వంపు తిరిగి ఉందని అతడు భావించాడు. అలెగ్జాండ్రియా నుండి సియెన్ కు 800 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 800ను 50తో గుణించడం వల్ల వచ్చిన 40,000 కిలోమీటర్లను భూమి యొక్క చుట్టుకొలతని ఆ ఉత్సాహవంతుడు అంచనాకట్టాడు. అతడి పేరే ఎరాటోస్తనీస్. ఎరాటోస్తనీస్ కట్టిన భూమి చుట్టు కొలత అంచనా ఆధునిక శాస్త్రజ్ఞుల ప్రయోగాత్మక నిర్ధారణకు కచ్చితంగా సరిపోయింది. ఇక్కడ సత్యాన్ని తెలుసుకోవడానికి ఎరాటోస్తనీస్ కఠోర తపస్సేమీ చేయలేదు, అలాగే ఆధునిక శాస్త్రజ్ఞులకు ఉన్నట్లు అడ్వాన్సడ్ ఎక్విప్మెంట్ ఏమీ అతడికి అందుబాటులో లేదు, కేవలం ఇంగిత జ్ఞానంతో తన కళ్ళెదుట ఉన్న సత్యాన్ని గ్రహించాడంతే.

లూసియా రస్సో తాను రాసిన "The Forgotten Revolution" అనే గ్రంథంలో “How science was born in 300 B.C? and why it had to be reborn?” అనే విషయాన్ని చర్చించారు.

పుస్తక పరిచయంలో రచయిత ఈ విధంగా అంటారు :-

“It is in the so-called Hellenistic period that we see for the first time anywhere in the world – the appearance of science as we understand it now; not an accumulation of facts or philosophically based speculations, but an organised effort to model nature and apply such models, or scientific theories in a sense we will make precise, to the solution of practical problems and to a growing understanding of nature. We owe this approach to scientists such as Archimedes, Euclid, Eratosthenes and many others less familiar today, but no less remarkable.”

క్రీస్తు పూర్వం నాల్గవ శతాబ్దం చివరి నుండి రెండవ శతాబ్దం వరకు గ్రీకు మాట్లాడే దేశాలలో బాహ్య ప్రపంచం గురించి నిష్పాక్షిక జ్ఞానం యొక్క విస్ఫోటనం కనిపిస్తుంది. అయితే ఈ శాస్త్రీయ దృక్పథం కొనసాగలేదు. యూరోప్ వెయ్యి సంవత్సరాలకు పైబడి మేధోవికాసానికి అనేక అడ్డంకులు కల్పించి స్తబ్ధతలో మునిగిపోయింది. గ్రీకుల విజ్ఞానాన్ని అరబ్బులు పరిరక్షిస్తే వారి నుండి యూరోపియన్లు అందుకున్నారు.

మానవజాతికి సత్యాన్ని తెలిపే కాంతిరేఖలు అనేకం క్రీస్త్తుకు పూర్వమే అవతరించాయి. వారిలో ఒకరైన ఎరాటోస్తనీస్ జీవితం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం :-

ఎరాటోస్తనీస్ క్రీ.పూ 276లో లిబియాలోని సైరీన్ పట్టణంలో పుట్టారు. సైరీన్ నగరం అంతకు కొన్ని శతాబ్దాల క్రితం గ్రీకులచే స్థాపించబడింది. సైరీన్ ఐదు నగరాల దేశమైన పెంటాపోలిస్ కు రాజధాని. సైరీన్ ను అలెగ్జాండర్ క్రీ.పూ 332లో జయించాడు. క్రీ.పూ 323లో అతని మరణం తరువాత అతని నాయకుల్లో ఒకరైన టాలెమీ I సోటర్ సైరీన్ కు రాజయ్యాడు. టాలెమిక్ పరిపాలనలో రాజ్యం ఆర్ధికంగా పురోగమించింది. వ్యవసాయం, విద్యకు నిలయమైంది.

అప్పటి గ్రీకు రాజ్యంలో వ్యాయామశాలలో విద్యా నిలయాలుగా ఉండేవి. అందరి పిల్లల్లాగే ఎరాటోస్తనీస్ స్థానిక వ్యాయామశాలలో చదవడం, రాయడం, అంక గణితం, కవిత్వం, సంగీతం, వ్యాయామం నేర్చుకున్నాడు. తరువాత పై చదువుల కొరకు ఏథెన్స్ నగరానికి వెళ్ళాడు. అక్కడ స్టోయిజం అను తత్వశాస్త్ర భావనను దాని వ్యవస్థాపకుడైన జెనో ఆఫ్ సిటియం ద్వారా అధ్యయనం చేశాడు. తరువాత ప్లేటోనిక్ అకాడమీలో చదువుకున్నాడు. కల్లిమేకస్ పర్యవేక్షణలో కవిత్వం గురించి పరిశోధించాడు. ప్లేటో తత్వశాస్త్ర ప్రతిపాదనలకు ఉన్న గణిత పునాదుల గురించి చర్చించే ప్లేటోనికోస్ గ్రంథాన్ని రచించాడు. సైన్స్ చరిత్ర(Scientific Chronology)కు ఎరాటోస్తనీస్ ఆద్యుడు. సంఖ్యా శాస్త్రంలో ప్రధాన సంఖ్యలను, సంయుక్త సంఖ్యలను త్వరగా వేరు చేయడానికి ఎరాటోస్తనీస్ జల్లెడ విధానాన్ని కనిపెట్టాడు. ఇతను భూగలం గురించి చేసిన పరిశోధనలే భూగోళ శాస్త్రంగా రూపుదిద్దుకుంది. అప్పట్లో అతను సృష్టించిన పదజాలాన్ని ఈనాటికీ వాడుతున్నారు.

ఎరాటోస్తనీస్ అర్కిమెడిస్ కు స్నేహితుడయ్యాడు. ఎరాటోస్తనీస్ ప్రతిభను గుర్తించిన 3వ టాలెమీ యూర్జెట్స్ అతనిని అలెగ్జాండ్రియా గ్రంథాలయంలో అధికారిగా నియమించాడు. అపుడు ఎరాటోస్తనీస్ కి ముప్పై ఏండ్ల వయసు. తన మిగతా జీవితమంతా ఇక్కడే గడిపాడు ఎరాటోస్తనీస్. ఐదేళ్ల కాలంలోనే అలెగ్జాండ్రియా గ్రంథాలయానికి ముఖ్యాధికారి అయ్యాడు ఎరాటోస్తనీస్. రాజకుమారులు, అంటే నాల్గవ టాలెమీ ఫిలోపేటర్ కు కూడా చదువు చెప్పాడు ఎరాటోస్తనీస్.

ఎరాటోస్తనీస్ ప్రతి దేశంలోనూ మంచి చెడులుంటాయని చెబుతూ మానవజాతిని గ్రీకులు, అనాగరికులు(Barbarians)గా విభజించాలనే అరిస్టాటిల్ ప్రతిపాదనను విమర్శించాడు. క్రీ.పూ. 195లో కండ్లకలక రావడంతో చూపు కోల్పోయాడు. చదవలేని, ప్రకృతిని గమనించలేని స్థితికి రావడంతో కృంగిపోయిన ఎరాటోస్తనీస్ తన ఎనభై రెండవ ఏట ఉపవాసంతో దేహాన్ని వదిలాడు.

క్రీ.పూ 48లో జూలియస్ సీజర్ అలెగ్జాండ్రియాను ముట్టడించారు. అతని సైనికులు అలెగ్జాండ్రియా ఓడ రేవులోని ఈజిప్షియన్ నౌకలకు నిప్పుబెట్టారు. ఆ అగ్ని శిఖలు క్రమంగా ఓడరేవు చుట్టుప్రక్కల ప్రాంతాలలోకి కూడా విస్తరించాయి. అప్పుడే అలెగ్జాండ్రియా గ్రంథాలయం కూడా తగలబడిపోయింది. తత్వవేత్త సెనెకా రాతల బట్టి అలెగ్జాండ్రియా గ్రంథాలయంలో సుమారు 40 వేల పుస్తకాలు తగలబడిపోయాయి. ఎరాటోస్తనీస్ రాసిన గ్రంథాలు కూడా ఆ అగ్నిలోనే ఆహుతయ్యాయి.

***సర్వే భవంతు సుఖినహా***

Posted in June 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *