"అమ్మా! సాహితీ!.... కణ్వ మహర్షి తాను పెంచిన శకుంతలను దుష్యంత మహారాజు దగ్గరకి పంపిస్తూ, కన్నీరు పెడుతూ, ఎన్నో బుద్ధులు చెప్పి పంపిస్తాడు. కూతురిని అత్త వారి ఇంటికి పంపిస్తూ, ఋషులే అంతగా బాధపడితే... సామాన్య మానవులు, కని పెంచిన తల్లిదండ్రులు ఎంత బాధ పడతారో వేరే చెప్పాలా?
నీవు మాకు అలాంటి బాధ కలగకుండా, నిన్ను ఇరవై సంవత్సరాలుగా అపురూపంగా పెంచిన కన్న వాళ్ళను గాలికి వదిలేశావు. మాకు మాట మాత్రమైనా చెప్పకుండా, ఆరు నెలలుగా పరిచయమైన వాడిని నమ్మి వచ్చి, పోలీసు కంప్లయింట్ ఇచ్చి, మమ్మల్ని ఇక్కడికి రప్పించావు.మీకు పెళ్లి చేయించమని పోలీసులతో చెప్పించావు. ఫేస్ బుక్ లో పరిచయమైన వాడిని నమ్మి వచ్చిన దానివి, నీవే పెళ్లి చేసుకోవచ్చు కదా! మధ్యలో ఈ అమ్మ నాన్నలు ఎందుకు?” అన్నాడు రాజు.
"నాన్నా! మా పెళ్లి జరిపించవలసిన బాధ్యత మీది కదా! పెద్ద వారు మీరు లేకుండా నేనెలా పెళ్లి చేసుకుంటాను"? అంది సాహితి.
“పెళ్లి చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులదని చెప్పే నీవు, ఫలానా వాడిని ప్రేమించానని మాతో చెప్పాలి కదా! నీవు ఇంటికి రాలేదని, మీఅమ్మ, నేను, తెలిసిన వాళ్ళందరికీ ఫోనులు చేసి ఎంత కంగారు పడ్డామో చెప్పలేము. మా మీద నీకు ప్రేమాభిమానాలు ఉంటే, ఇలాంటి పని చేస్తావా? మమ్మల్ని ఈ వయసులో మానసికంగా ఇంత బాధపెడతావా"?
నీ ప్రేమ సంగతి నీవు మాకు ముందే చెప్పి ఉంటే, అతని వివరాలు అన్నీ సేకరించి, అతని ఉద్యోగం, అతని కుటుంబ పరిస్థితులు అన్నీ తెలుసుకుని, నీకు అతను తగిన వాడో కాదో నిర్ణయించేవాళ్ళం. మాకు అలాంటి అవకాశం ఇవ్వకుండా, మమ్మల్ని పోలీసు స్టేషన్ కు రప్పించి, మీ పెళ్లి చేయించమంటావా? మేము ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? నీవు ప్రేమించిన వాడితో వెళ్ళిపోతావా? మాతో వస్తావా"? అన్నాడు రాజు.
"మీ నాన్న అడిగిన దానికి సమాధానం చెప్పు. మాతో వస్తానంటే రా... నీవు ప్రేమించిన వాడితో పోతానంటే పో... ఇక జీవితంలో నీ ముఖం మాకు చూపించకు. నీకు అమ్మా నాన్నా చచ్చారనుకో!" అంది తల్లి జానకి.
"ఏంటమ్మా ఆ మాటలు...మీరు నా పక్కన ఉండి పెళ్లి చేస్తేనే... చేసుకుంటాను. మీ మాట కాదని ఏ పని చేయను. నన్ను క్షమించండి" అంది సాహితి.
“ఇన్స్పెక్టర్ గారూ! విన్నారు కదా! అమ్మాయి మాటలు. సూర్య తన గురించి చెప్పిన వివరాలు అన్నీ నిజం అయితే, అతని తల్లిదండ్రులు కూడా మా అమ్మాయి వారి కోడలుగా రావడానికి ఇష్ట పడితే...తప్పకుండా ఆరు నెలల లోపు పెళ్లి జరిపిస్తాం. ఈ లోపు మా అమ్మాయికి బి.ఇ. పరీక్షలు కూడా ముగుస్తాయి. ఒక వేళ అతను చెప్పిన వివరాలలో ఏ ఒకటి నిజం కాదని తెలిసినా, వీరి పెళ్లి జరగదు. అతను మా అమ్మాయిని మరిచిపోవాలి. ఎలాంటి బ్లాక్ మెయిల్ చేయకూడదు. అలా అని వ్రాసి ఇవ్వమనండి.” అన్నాడు రాజు.
అలాగే! అంటూ అతని దగ్గర లెటరు వ్రాయించి తీసుకుని, ఇన్స్పెక్టర్ సాహితీ తండ్రి రాజుతో...
"మీరు ముందు చూపుతో సాహితీ భవిష్యత్తు కోసం జాగ్రత్త పడుతున్నారు. ప్రతి తండ్రి బాధ్యతతో మీ లాగా ఉంటే బాగుంటుంది". అంటూ సాహితిని తల్లిదండ్రులతో పాటు పంపించాడు.
*************
సాహితి తల్లిదండ్రులతో పాటు ఇంటికి వచ్చింది. దారిలోగాని, ఇంటికి వచ్చిన తర్వాత గాని సాహితితో, తండ్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మౌనంగా ఉన్నాడు. ఇంటికి రాగానే, తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు.
సాహితి తల్లి వైపు చూస్తూ ... "ఏమిటమ్మా! నాన్న నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు" అంది.
బదులుగా జానకి ..."మీ నాన్న నిన్ను చిన్నతనం నుండీ ఎంత ముద్దు చేసేవారో గుర్తు తెచ్చుకో! నీవు ఏది కావాలంటే అది వెంటనే తెచ్చి ఇచ్చేవారు. మీ నాన్న నిన్ను అతి గారాబంగా పెంచబట్టే...నీకు తల్లిదండ్రులు అంటే భయ భక్తులు లేకుండా పోయాయి. నేనేం చేసినా చెల్లి పోతుందనుకున్నావు. నిన్ను నమ్మి మేము నీకు సంపూర్ణ స్వాతంత్ర్యం ఇస్తే, నీవు ఆధునిక పోకడలు పోతూ...మాకు చెప్పకుండా సూర్య మాటలు నమ్మి, మమ్మల్ని పోలీసు స్టేషన్ దాకా తీసుకు వెళ్ళావు. సూర్య మోసగాడైతే, భవిష్యత్తులో నీవు మమ్మల్ని ఎన్ని తిప్పలు పెడతావో అని భయంగా ఉంది. మీ నాన్న కూడా నీ ప్రవర్తనకు చాలా బాధపడ్డారు. ఆయన మనసు శాంతించిన తర్వాత, ఆయనే తలుపు తీసి బయటికి వస్తారు.” అంది జానకి.
“అవునూ! సూర్యతో నీకు ఎలా పరిచయమైంది?” అని ప్రశ్నించింది జానకి.
“మీరు నాకు సంగీతం నేర్పించారు కదా! నేను అన్నమాచార్యుల కీర్తనలు పాడి ఫేస్ బుక్ లో పెట్టేదాన్ని. చాలా మంది మెచ్చుకునే వారు. సూర్య నా పాటలు విని, అద్భుతంగా ఉన్నాయని, పొగుడుతూ ఫోనులు చేసేవాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఒకరి వివరాలు ఒకరం తెలుసుకున్నాం. ఇద్దరమూ ఒకరికొకరు నచ్చాము.
కొంత కాలం క్రితం అతను మన ఊరు వచ్చాడు. మేము ఇద్దరం పార్కులో కలుసుకున్నాము. అప్పుడే మేము ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.” అంటూ వివరించింది సాహితి. మరలా పొడిగిస్తూ,
"మా అమ్మ నాన్నలకు చెప్పి, వారి అంగీకారంతో పెళ్లి చేసుకుందామని నేను అన్నాను. పెద్దలకు చెపితే వారు ఏదో ఒక వంక పెట్టి, మన పెళ్లి జరపకుండా ఆపుతారు. మనం పోలీసులను ఆశ్రయిస్తే, వారు మన పెళ్లి జరిపిస్తారు అన్నాడు సూర్య. కానీ నేను అందుకు ఒప్పుకోలేదు. ఇలా కొద్ది రోజులుగా జరుగుతోంది.
నిన్న సూర్య ఫోను చేసి మా అమ్మ నాన్నలు నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు. నీవు నా మాట వింటే నిన్ను పెళ్లి చేసుకుంటాను. లేక పోతే నన్ను మరిచి పో! అన్నాడు. సూర్యాన్ని మరిచిపోయి బ్రతకలేనని అనిపించింది. అందుకే అతను చెప్పినట్లే చేశాను" అంది సాహితి.
"ఈ కాలపు ఆడపిల్లలందరిలాగే నీవూ ఆలోచించావు. ప్రేమికుల రోజు అంటూ ఆడపిల్లలు తమ బాయ్ ఫ్రెండ్స్ తో షికార్లు కొట్టడం ...ఆ తరవాత ఆ మగాడు మోసం చేసి పారిపోతే, ఆడపిల్ల పిరికిదైతే ఏదో అఘాయిత్యం చేసుకుని చావడం లాంటివి టి.వి. లో చూసి మీ నాన్నా, నేను వణికి పోతుంటాం. ఆలాంటి పని నీవు చేయకుండా ఉండాలనే నీకు చిన్నతనంలో శకుంతలా దుష్యంతుల కథ చెప్పాను. అన్నీ విని, తెలిసీ..నీవు మమ్మల్ని పోలీసు స్టేషన్ దాకా తీసుకు వెళ్ళావు.
సూర్య మంచి వాడైతే ఫర్వాలేదు. అతను మోసగాడయితే, నీతో పాటు మేము బాధపడవలసి వస్తుంది" అంటూ సాహితిని ఏదో అడిగింది తల్లి.
“లేదమ్మా! లేదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు” అంది సాహితి.
“సాహితీ! నీవు ఏ ఆలోచనలు మనసులోకి రానీయకు. రాత్రింబవళ్ళు పట్టుదలతో చదివి, మంచి మార్కులతో డిగ్రీ పాసైతే, నీకు ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. నీకంటూ ఒక జీవితం ఏర్పడుతుంది. ఆడదానికి ఉద్యోగం ఒక భరోసాన్నిస్తుంది. ఆ తర్వాత ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని నీవు సుఖంగా ఉంటే... మిమ్మల్ని చూసి, మేము ఆనందిస్తాం. సూర్య వివరాలు నీవు మాకు చెపితే... మీ పెదనాన్న కొడుకు సురేష్ అవి నిజమో కాదో తెలుసుకుంటాడు” అంటూ వంట గది లోకి వెళ్ళింది జానకి.
**********
మరునాడు రాజు సురేష్ ను పిలిచి, సాహితికి ఒక సంబంధం వచ్చింది. నీవు అతని ఉద్యోగం చేసే ఆఫీసుకు వెళ్ళి, అతని ఉద్యోగ వివరాలు, జీతం విషయాలు తెలుసుకో అని చెప్పాడు. అలాగే వాళ్ళు ఇచ్చిన ఇంటి అడ్రసుకు వెళ్ళి, ఆ చుట్టుపక్కల వారిని, ఆ కుటుంబం గురించిన వివరాలు తెలుసుకొమ్మని చెప్పాడు.
“అలాగే చిన్నాన్నా! సూర్య ఆఫీసులో పని చేసే ఒకతను నాకు బాగా తెలుసు. అతని ద్వారా సూర్య వివరాలు తెలుసుకుని చెపుతాను” అన్నాడు సురేష్.
************"
నెలరోజులు గడిచిన తర్వాత సురేష్ వచ్చి, సూర్య వివరాలు చెప్ప సాగాడు...
"సూర్యకు నెలకు జీతం 25వేల రూపాయలు. ఇప్పటికే ఏవో లోన్లు తీసుకున్నాడు. సూర్య ఆఫీసులో పనిచేసే అమ్మాయిలతో తరచుగా బైకు మీద షికార్లు కొడతాడు. ఈ మధ్యన తననొక ధనవంతురాలైన అమ్మాయి ప్రేమించిందని, ఆమెను పెళ్లి చేసుకోబోతున్నానని" సూర్య తన స్నేహితులకు చెప్పాడు.
ఇక వాళ్ళ ఇంటి విషయాలు చూస్తే...
సూర్య తండ్రికి ఒక కంపెనీలో చిన్న ఉద్యోగం. వారికి స్వంత ఇల్లు లేదు. సూర్యకు పెళ్ళి కావలసిన ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. చిన్నాన్నా! ఇది మన సాహితికి తగిన పెళ్లి సంబంధం కాదు. మీ భార్యాభర్తలు ఇరువురు టీచర్ ట్రైనింగ్ కాలేజీలో అధ్యాపకులు. మీ ఇద్దరికీ నెలకు ఒకటిన్నర లక్ష రూపాయల జీతం వస్తుంది. స్వంత ఇల్లు, స్వగ్రామంలో పొలాలు ఉన్నాయి. మీకు ఇంజినీరింగ్ చదివే కొడుకు నరేష్, కూతురు సాహితి అని ఇద్దరే పిల్లలు.
ఇంత మంచి కుటుంబంలో పుట్టిన సాహితికి ఇది తగిన సంబంధం కాదు. ఈ సంబంధం వదిలేయండి” అన్నాడు సురేష్.
గదిలో చదువుకుంటున్న సాహితి వచ్చి...నీవు చెప్పిన వివరాలు నిజమేనా అన్నయ్యా! అంది.
“నిజమేనమ్మా! మీ అమ్మా నాన్నా ఇద్దరూ ఉద్యోగస్తులు కదా! వారే అతని ఆఫీసుకు వెళ్ళి వివరాలు తెలుసుకోవచ్చు కదా! అన్నాడు. మారు మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది సాహితి.
“సురేష్! ఈ పెళ్లి సంబంధం మంచిది కాదనుకుంటే వదిలేద్దాం. నీ కబుర్లు చెప్పు” అంటూ ఆ టాపిక్ మార్చాడు రాజు. కొంత సేపు ఉండి సురేష్ వెళ్ళిపోయాడు.
**********
"అమ్మా సాహితీ విన్నావు గదా! సురేష్ మాటలు. నేను మీ అమ్మ కూడా ఒక రోజున సూర్య పని చేసే కంపెనీకి వెళ్ళి అతని వివరాలు తెలుసుకుని వస్తాము. పిల్లను ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు, తల్లిదండ్రులుగా మా జాగ్రత్తలు మేము తీసుకోవాలి కదా!" అన్నాడు రాజు.
“సరే నాన్న గారూ! నేను అతని మాటలు అమాయకంగా నమ్మి, పెళ్ళిచేసుకుందామనుకున్నాను...అతను మోసగాడు అయితే అతన్ని పెళ్లి చేసుకుని, జీవితాంతం నేను బాధపడుతూ... మిమ్మల్ని బాధ పెట్ట వలసి వస్తుంది. నేను హైస్కూల్లో చదివేటప్పుడు మాకు తెలుగులో "శకుంతలోపాఖ్యానం" ఉంటే అమ్మ ఆ పాఠం నాకు చెప్పి... ఆడపిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకోకూడదు.
దుష్యంత మహారాజు, శకుంతలను గాంధర్వ వివాహం చేసుకుని, కాపురం చేసి, బిడ్డను కని, నిండు సభలో తాను పెళ్లి చేసుకోలేదని అబద్ధమాడాడు. వెంటనే ఆకాశవాణి దుష్యంతుడు శకుంతలను పెళ్లి చేసుకున్నాడు అని పలికింది.
గాంధర్వ వివాహం అంటే... వధూవరులు ఒకరిని ఒకరు ఇష్టపడి, పెద్దలను సంప్రదించకుండా...తమంతట, తామే పెళ్లి చేసుకోవడం. ఈ కాలంలో ఆకాశవాణి అలా పలకదు. కాబట్టి ఆడపిల్లలు అందరూ తమ జాగ్రత్తలో తాము ఉండాలని అమ్మ చెప్పింది. ఆ మాట నా మనసులో పదిలంగా ఉంది.
మీకు అన్ని విధాలా నాకు సూర్య తగినవాడు అనిపిస్తే, మీ చేతుల మీదుగా మా పెళ్లి జరిపిస్తే...మా పెళ్లి జరుగుతుంది. లేకపోతే లేదు. నేను శ్రద్ధగా చదివి బి.ఇ. పాసవుతాను" అంటూ తన గదిలోకి వెళ్లిపోయింది సాహితి...