Menu Close
Paranandi-Aravindarao
మనసు విప్పిన మడతలు - 17
పారనంది అరవిందారావు

అక్షరాన్వేషణ

Aksaranveshana

ద్రౌపది ఒక్క మెతుకు కోసం
అక్షయ పాత్రలో వెదికినట్లు
నా లేఖని.. శూన్యమేదిరంలో
ఒక్క అక్షరమైనా ఒదిగి
ఎక్కడైనా ఉందేమోనని
తన నునుమెత్తని అధరాల
మధువు నింపి….ఇక తేనీగల్లా
పరుగెత్తుకొస్తాయేమోనని
ఆశగా ఎదురుచూస్తోంది.

మస్తిష్కపు నలుమూలలని
సున్నితంగా ముద్దిడి
రారండీ అని పిలుస్తోంది.
సుషుప్తావస్థ నుండి మేల్కొని
సహకరించమంటోంది.
వెన్ను తట్టి వెన్నముద్ద చూపి
వేగుజాము లేవండి అంది
కొన్ని మెల్లగ కనులు నులిమి
కలం చెంత చేరాయి.
కొన్ని మాధూళి కోసం
దాని మీద ఎగబడ్డాయి
కొన్నిటిని బుజ్జగిస్తే
భుజం మీద ఎక్కాయి
కొన్ని నేరుగా నిలబడి
కిం కర్తవ్యం? అన్నట్లు
కళ్ళెర్రజేసి చూస్తున్నాయి
కొన్ని తుంటరి పిల్లల్లా
నలుదెసల పరిగెడుతున్నాయి

అక్షరాన్వేషణ ముగిసింది…
ఈ సమూహపు సందడి చూసి
నా పాళి పొంగి వరదలై
ప్రతి అక్షరాని పొదివి పట్టుకుని
కవితగా జాలువారింది

స్వగతం

Swagatham

ఏలా ఉన్నావు ఈరోజు?
మళ్ళా ఈరోజు నీ మది మొరోజా!
దిగులా ! గుబులా! పీడకలా!
అని తను కళ్ళెగరేసింది ……

నాకేనా ఈ పలకరింపన్నాను!
అవునన్నట్లు హాలీవుడ్ స్టార్ లా
ఓ చిరునవ్వు పారేసింది
నా బుగ్గని సున్నితంగా తాకి
ఉక్కిరిబిక్కిరి చేసింది.

ఎద నుంచి అరికాలి దాకా పాకిన మంటని
పదే పదే నా కాళ్ళని ముద్దిడి
చల్లని ప్రేమలో ముంచేసింది

విన్నావా నా స్వగతం అన్నాను…
చిలిపి అలలా చేతులెత్తి
గంతులేసి ఒళ్ళో వాలింది

విని విని విసిగిపోయావా అన్నాను..
లేదని కిలకిల నవ్వి నీటి
తుంపరతో మొహం కప్పేసింది.

నీ సరసం కాస్త ఆపని
నీరసంగా వెనుతిరిగాను
వేసుకున్న పైటతో పరుగిడి వచ్చి
నా దేహం ముంచేసింది.

నీ ఆనందం ఆవేదన
నా కొంగులో మూటగట్టి
దాచుకుంటా! వెళ్ళి రా!
రేపటి వ్యధలు కథలు మోసుకుని
నా నది వొడ్డుకి మళ్ళీ రా అంది...

పెదవి విప్పి పలికింది తనా! నేనా ?
లేదా ఇదంతా నా ఊహేనా ?

*****

ముందుమాట

Paranandi-Aravindaraoనాకు చిన్నప్పటినుంచి వచనకవిత్వంలో ఓ రకమైన కుతూహలం ఉండేది. 14-15 ఏళ్ళ వయస్సులోనే కీర్తి శేషులు డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి కవితలు, వారు ఆ కవితలని పఠించే తీరు నన్ను చాలా ఆకర్షించేది. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రసాయనిక శాస్త్రం అభ్యసిస్తున్నప్పుడు వారు తెలుగు శాఖలో రీడర్ గా ఉండేవారు. వారు నన్ను చాలా ప్రోత్సహించేవారు. క్రమేపీ నాకు వచన కవిత, కథానిక ప్రక్రియల్లో అభినివేశం, అభిమానం కలగడం ప్రారంభమైంది. అలాగే ఆ రోజుల్లో All India Radio లో పనిచేస్తున్న కీ.శే. వేలూరి సహజానందం గారు నా కవితలని రేడియోలో చదవడానికి ఎన్నో అవకాశలిచ్చి ప్రోత్సహించేవారు. ఇంగ్లండు లో రసాయనిక పరిశోధన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పుడు నాకు గీతాంజలి అనే బహుభాషా కవుల సంఘంతో పరిచయమేర్పడి వారి ప్రోత్సాహంతో తెలుగు, ఆంగ్ల భాషల్లో కవితలు రాయడం మొదలుపెట్టాను. ఆ సంస్థ అధ్యక్షులు డా కృష్ణకుమార్ గారు ఉత్తరప్రదేశ్ వారైనా తెలుగు భాష మీద మిక్కిలి గౌరవం చూపించి రెండు సంకలనాలలో నా తెలుగు మరియు ఆంగ్ల కవితలు ముద్రించారు. సుమారు 4 సంవత్సరాల క్రితం ఇంకో తెలుగు సాహితీ అకాడెమీ సమూహంతో పరిచయమేర్పడి తెలుగులో మాత్రమే కవితలు రాయడం మొదలెట్టాను. ఆ సమూహ అధ్యక్షులు మాజీ ఉపకులపతులు గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు ఎంతో అభిమానంతో నాకు స్వాగతం పలికి నాకు మార్గదర్శకులుగా నిలబడి నా సాహిత్య పయనానికి దోహదమిచ్చారు.

మార్చి 2023 హైదరాబాదు సిరికోన సాహితీ అకాడమీ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉపకులపతులు ఆచార్య కిషన్ రావు గారు నా కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు ఆవిష్కరించారు. నా కవితా సంపుటిని ప్రశంసించిన పెద్దలందరికీ వినమ్ర నమస్సులు.

ఆచార్య రాణి సదాశివమూర్తి, కులపతి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, తిరుపతి
వీరి కవితలను చదువుతుంటే ఒక భాద్యత గల కవయిత్రి, కనబడని సూత్రధారిణి గోచరిస్తారు. ప్రతి శీర్షికలో ఒక కొత్తదనం, పద పదంలో మెత్తదనం, కవిత కవితలోచిత్తాన్ని కదిలిచే చిత్తరువులు, చిత్ర వైచిత్రిని నింపుకున్న భావ కల్పతరువులు దర్శనమిస్తాయి.

శ్రీ నివర్తి మోహన్ కుమార్, చార్టెడ్ ఎకౌంటెంట్
పురుషాధిక్య సమాజంలో గ్లాస్ సీలింగ్ బ్రద్దలుచేసి తమదైన ప్రత్యేకత నిలుపుకున్న భారతీయ వనితల్లో అరవిందారావుగారు కూడా ఒకరు. వీరు పరస్పర భిన్న ప్రవృత్తులను సమతుల్యము చేసుకుని జీవితాన్ని ఒక కళగా మలుచుకున్నవారు. ప్రస్తుత కవితాకదంబమే అందుకు సాక్ష్యం.

డా శారదాపూర్ణ శొంఠి షికాగో, యు.ఎస్.ఎ.
అరవింద గజల్ రచయిత్రిగా, సృజనాత్మక గేయరచయిత్రిగా, గాయనిగా పేరెన్నికగన్నారు. ఆమె వృత్తి ఉజ్వలం. ప్రవృత్తి అద్భుతం. ఆమె కవితలు భావ కవిత్వ ధోరణిలో సాగుతాయి. చదువరుల అంతరంగాన్ని సుతారంగా తాకి, ఊపి ఆమె అనుభూతిలో భాగమవుతాయి. భావకవిత్వ సమాలోచనకి ఈ కవితా సంపుటి బర్హిపింఛం.

నా ఈ కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు లోని కవితలు ఇకపై సిరిమల్లె పత్రికలో ప్రతినెలా పాటకులను అలరిస్తాయని నమ్ముతున్నాను.

నమస్కారములతో – పారనంది అరవిందారావు

Posted in June 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *