ఆంధ్రజ్యోతి వార పత్రిక ’డ్యాన్సింగ్ బీస్’ ను ’ఈ వారం కథ’ శీర్షిక క్రింద వేశారు. ఈ కథ వ్రాసిన 1992 కాలంలో వార పత్రికలు విరివిగా వస్తుండేవి, కనీసం ప్రతి పత్రికలో మూడో నాలుగు కథలు పడుతుండేవి. వాటిలో ’ఈ వారం కథ’ గా ఎన్నుకోబడడం, కథలు వ్రాసే వారికి గొప్ప గుర్తింపే.
ఈ కథ వ్రాసేటప్పటికీ నాకు పిల్ల వాడిని పెంచటంలో ఆరేళ్లు, ఉద్యోగం నిర్వహించడంలో ఒక పదహైదేళ్లు అనుభవం సంపాదించుకున్నాను. జీవితంలో గడిపిన మొదటి ఇరవై రెండు ఏళ్ల లో నేర్చుకున్న విద్యకు, కన్న కలలకు, నిజ జీవితం ఎంత దూరంగా ఉంది అన్న విషయం, అప్పటికే మెదడును తొలిచేస్తున్న రోజులవి.
రిజర్వ బ్యాంకు బ్యాంకింగ్ విభాగంలో కొన్ని ఏళ్ళు పని చేసిన తరువాత, నన్ను మరి కొందరు యువతి, యువకులను సెలెక్ట్ చేసి ఆస్ట్రేలియా, అమెరికా పంపించి కంప్యూటర్ విభాగాలను నెలకొల్పడానికి శిక్షణ ఇవ్వడంతో, నా చదువులకు తగిన పనిలోనే 1986 నుంచి చెన్నై లో పనిచేయడం మొదలెట్టాను. కానీ పుస్తకాలు చదవడం, బొమ్మలు వేయడం, ఫోటోలు తీయడం లాంటి పనులిచ్చే ఆనందం, ఎన్ని మార్పులు వచ్చినా, ఉద్యోగంలో అది కరువే అయ్యింది.
ఇక మా అబ్బాయి చదువుల యాత్ర కొత్త అనుభవమే. అప్పటికే, ప్రైవేట్ స్కూల్ లు విస్తరించడం మొదలయ్యింది. పేరున్న బడులలో ప్రవేశం సంగతి వదిలేద్దాం, అప్లికేషన్ లు దొరకడమే గగనమై పోయింది. మా అబ్బాయి ఆదిత్య ఎల్.కె.జి అడ్మిషన్ కి, వాడితో బాటు నేను, నిర్మల కూడా ఇంటర్వ్యూ ఎదుర్కోవడం నాకు ఇప్పటికీ గుర్తున్న చేదు నిజం. వాడు ఆ ఇంటర్వ్యూ లో విజయం సాధించినా, ఆ స్కూల్ పాటిస్తున్న పద్ధతులు నచ్చక, మరో సీదా, సాదా స్కూల్ లోనే చేర్పించాము. నేను బడిలో చదివినప్పుడు పిల్లల జీవితాలు ఆనందంగానే ఉండేవి. కానీ అదే బడులు ఫ్యాక్టరీలు లాగా పని చేయడం, దాని ప్రభావం పిల్లల మీద, పరోక్షంగా పిల్లల తల్లి తండ్రులు మీద పడడం కష్టంగా తోచింది. ఆ అంతర్మధనం నుంచి పుట్టిన కథే ’డ్యాన్సింగ్ బీస్’.
ఈ కథ పడిన తరువాత అమెరికాలో ఒక సంవత్సరం సబ్బాటికల్ కని బ్యాంక్ నన్ను సెలెక్ట్ చేసి అమెరికా పంపించడం, అటు తరువాత ముంబై ట్రాన్స్ఫర్ కావడం తో, మా అబ్బాయి మరో రెండు బడులు మారాల్సి వచ్చింది. అమెరికాలోని బడి లో, అలానే ముంబై లో ఉన్న బడి లో అడ్మిషన్ కోసం ప్రయత్నించడం జరిగింది. అమెరికాలో అడిగిన వెంటనే అడ్మిషన్ దొరకడం, అదే అడ్మిషన్ కోసం, ముంబైలో పడరాని పాట్లు పడడం మరో విచిత్రమైన అనుభవం.
ముంబై వచ్చిన మూడేళ్లకే, మూటాముల్లె కట్టుకుని, అమెరికాకు వలస వచ్చేయడంతో, ఈ కధ ఇక్కడి వారికి వర్తించదు అనుకున్నాను. కానీ అమెరికాలో కూడా పరిస్థితులు బాగా మారాయి. పాతికేళ్ల క్రితం అమెరికా వేరు, ఇప్పటి అమెరికా వేరు.
ఇటీవల మా ఆఫీసులో ఒకతను కొత్తగా ఉద్యోగంలో చేరాడు. వాళ్ళబ్బాయి ఎలిమెంటరీ స్కూల్ లో చదువుతున్నాడట. ఏ బడిలో వాళ్ళబ్బాయిని చేరిస్తే బాగుంటుంది అని వివరాలు అడిగాడు. వాళ్ళు నివసిస్తున్న చోటు దగ్గరి పబ్లిక్ స్కూల్ పేర్లు చెప్పాను. ఇక్కడి పిల్లలు, వాళ్ళు నివసిస్తున్న ఇంటికి దగ్గరున్న బడి లోనే చేరాలి. పిల్లల అడ్రెస్సులు అప్లికేషన్ లో చెక్ చేసిన తరువాతే బడిలో అడ్మిషన్ ఇస్తారు. ”మీరో ఫేవర్ చేయాలి సార్” అన్నాడు నా కొత్త సహోద్యోగి. ఏంటో చెప్పమన్నాను. “మీ ఇంటి దగ్గరున్న స్కూల్ కి మంచి పేరుంది. అప్లికేషన్ లో నా అడ్రస్ బదులు, మీ ఇంటి అడ్రస్ ఇస్తాను. ఆ స్కూల్ లో చేరాలంటే అదొక్కటే మార్గం”, అన్నాడు. వాళ్ళుండే ఇల్లు పది మైళ్ళు అవతల ఉంది. అక్కడి నుంచి పిల్లలు ఇక్కడున్న బడికి రావాలంటే ప్రతీ దినం ప్రయాణంలోనే రావడానికో ఒక గంట, పోవడానికో గంట కోల్పోతారు. అదే మాట అన్నాను. “అదో సమస్య కాదండి. నా లాగానే చాలా మంది మా ఇంటి చుట్టూ ఉన్నారు. వాళ్ళు మీ ఏరియా లో ఉన్న స్నేహితుల అడ్రస్ లు ఇచ్చి మీ ఇంటి దగ్గరి బడిలో వాళ్ళ పిల్లలకు అడ్మిషన్ సంపాదించారు. మాకో కార్ పూల్ ఉంది. మాలో మేమే వంతులు వారీగా పిల్లలను తీసుకెళ్లడం, తేవడం చేస్తున్నాము. పిల్లలు ప్రయాణంలో స్పెల్లింగ్ బీ ప్రాక్టీస్ చేస్తారు. బోర్ కొట్టదు,” అని నాకు తెలియని ఈ కొత్త మార్పులు పరిచయం చేసాడు నా నూతన మిత్రుడు.
మరో కొలీగ్ ఎప్పుడూ టెన్షన్ తో కనిపించేవాడు. వాడు, వాడి కుటుంబం మాకు తెలుసు. వాళ్ళమ్మాయి కాలేజీ లో చదువుతుండేది. మా ముందే వాడు, ఆ అమ్మాయికి ‘మెడికల్ కాలేజ్ లో చదవడం ఎంత గొప్ప విషయమో, అది ఆ అమ్మాయి సాధించి తీరాలి’ అని తెగ మోటివేట్ చేసే వాడు. అప్పటికే మెడికల్ కాలేజీలలో చదువుతున్న, చదివిన ఇరుగు, పొరుగు అమ్మాయిల, అబ్బాయిల పేర్లు ఏకరువు పెట్టేవాడు. ఆ అమ్మాయికి మెడికల్ కాలేజీ పోవడం ఇష్టం లేదని మాకు తెలుసు. ఆ అమ్మాయికి సంగీతం అంటే పిచ్చి. బహుశా తండ్రి కూతుళ్లకు తరచూ జరిగే గొడవల వల్ల, వాడికి టెన్షన్ అని నా అభిప్రాయం. అలాంటిది వాడు ఒక రోజు ప్రశాతంగా కనిపించడంతో “ఏదో సంతోషంగా కనిపిస్తున్నావు. ఏంటీ సంగతి?” అని అడిగాను.
“అమ్మాయికి మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది,” అన్నాడు సంతోషంగా.
“ఎలా? ఎక్కడా?” అడిగాను నేను. అమ్మాయికి కాలేజీలో అత్తెసరు మార్కులే వచ్చాయని తెలుసు. ఒక సెమిస్టర్ రిపీట్ చేసిందని తెలుసు. అలాంటి వారికి మాస్టర్స్ కి సీట్ దొరకడమే కష్టం, మెడికల్ కాలేజీ అంటే అసాధ్యం.
“ఇండియాలో చేర్పించాను. ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయి. అక్కడ డిగ్రీ వచ్చాక ఇక్కడ రెసిడెన్సీ కి అప్లై చేసుకుంటుంది,” అని గర్వంగా చెప్పాడు. రాబోయే రోజుల్లో ఆ అమ్మాయి చేయాల్సిన ప్రయాణం తలచుకుంటే భయం వేసింది. ఆ అమ్మాయి అభిరుచి, తనకు సైన్స్ సబ్జెక్ట్ లా మీదున్న అనాసక్తి తెలుసు కాబట్టి బాధ కూడా వేసింది.
మా నగరంలోనే ఒక యాభై ఏళ్ళ క్రితం వలస వచ్చిన మరో దేశీయుడు, వైద్య వృత్తి మాని వ్యాపార రంగంలోకి గెంతి, కొత్తగా కట్టిన హై స్కూల్, కొన్న పాత ప్రైవేట్ యూనివర్సిటీలో మెడికల్ కాలేజీ కూడా ఉన్నాయి. అక్కడ అడ్మిషన్ దొరకడం కోసం నిలబడే వారిలో నాకు పరిచయస్తులు చాలా మంది ఉన్నారు.
మొత్తానికి వలసతో విడిచి పెట్టాననుకున్న చదువు, ఉద్యోగాల వ్యవస్థ, కొంత సమయం పట్టినా, జనంతో పాటు వలస వచ్చేసింది. గట్టిగా వేర్లు పాతుకుని ఈ దేశంలోనూ పచ్చగా జీవించడం మొదలెట్టింది. అటు భారత దేశంలోనూ, ఇటు అమెరికాలోనూ, బహుశా మన వారు ఎక్కడ ఉంటే అక్కడ వర్ధిల్లే సతత హరిత కథ ‘డ్యాన్సింగ్ బీస్’. ఆలస్యం ఎందుకు, చదివి మీ అనుభవాలు పంచుకోండి.
డాన్సింగ్ బీస్
హోటల్లో నలుదిక్కుల నుంచి చప్పట్లు మ్రోగాయి. శ్రీనివాస్ మెదడుకి హాయి కొల్పించే, శరీరం గగుర్పాటు కల్గించే షాక్ తగిలింది. మనస్సంతా సంతోషంతో, కష్టపడిందానికి ఫలితం దొరికిందన్న సంతృప్తి నిండిపోయింది.
మరో క్విజ్ ప్రోగ్రామ్ తాను అందరూ మెచ్చుకొనేటట్లు నిర్వర్తించగలిగాడు. కార్యక్రమం ముగిసిన వెంటనే కార్యక్రమంలో పాల్గొన్నవారు, ప్రేక్షకులు శ్రీనివాస్‌తో కరచాలనంచేసి ‘బాగా చేశారండి’ ‘మంచి ప్రశ్నలు ఎన్నుకున్నారండీ’, ‘ఎలా సంపాదించారండి ఇంత ఇంటరెస్టింగ్ విషయాలు’ అంటూ మెప్పుకోలుగా మాట్లాడారు. అందరికీ తగిన విధంగా సమాధానం చెప్పి, హాలునుంచి బయటపడ్డాడు శ్రీనివాస్. చివర వరకు ఆగడంవల్ల, అందరూ అప్పటికే హాలు వదిలివెళ్ళిపోయారు. హాలు కేర్టేకర్లు తప్పితే శ్రీనివాస్‌కి ఎవ్వరూ కనపడలేదు. అప్పటికే రాత్రి పది అయినందువల్ల పెద్దగా జన సంచారం కూడా లేదు. హాలు దాటింతరువాత రోడ్డు మీద దీపాలు అక్కడడక్కడ మాత్రమే వెలుగుతున్నాయి. కాని పైన చంద్రుని వెన్నెల వల్ల మిగిలిన దీపాలు కూడా వెలగకుంటేనే బాగుండుననిపిస్తుంది. చల్లటిగాలి. శ్రీనివాస్ సంతోషంగా ఇంటికి నడక సాగించాడు. దారిలో అప్పుడప్పుడు వస్తున్న వాసనలు ఏ పూలవై వుంటాయో అని తన్ని తాను క్విజ్ చేసుకోనారంభించాడు. దాంతో ఇంటికెళ్ళడానికి మరో మూడుమైళ్ళు నడవాలన్న ఆలోచన, దాని వలన అలసట శ్రీనివాస్ దరిదాపులకు రాలేకపోయాయి.
శ్రీనివాస్‌కి నడవడం ఇష్టమని కాదు. మరో గత్యంతరం లేదు. శ్రీనివాస్ చేసేది ఓ గవర్నమెంటు ఆఫీసులో చిన్న గుమస్తా ఉద్యోగమే. ప్రొద్దున పది నుంచి సాయంత్రం ఆరువరకు తన ముందుకు వస్తున్న కాగితాలను నలుపుచేస్తూ, వాటిని వేరే సెక్షన్లుకి లేకపోతే రికార్డు రూములకో పంపించడమో లేక తెప్పించుకోవడమో అనే ‘కాగితాల బాల్ గేమ్’ ఆడుతూ గడిపేస్తుంటాడు శ్రీనివాస్. ఆట అని అలా వర్ణించడం సరికాదేమో. మిగిలినవారంతా అలా ఆడుతూ వుంటే తన రోల్ ఏమిటో తెలియని ఫ్లాగ్ ఆంపైర్లా గ్రౌండ్ పైకి క్రిందకి పరిగెడుతూ, అలిసినప్పుడు నడుస్తూ సమయం గడిపేస్తుంటాడు శ్రీనివాస్ అనడం సబబు. దానికి కారణం శ్రీనివాస్‌కి తను చేస్తున్న ఉద్యోగం ఏ మాత్రం ఇష్టం లేకపోవడం. వేర్వేరు అంశాలపై ఇష్టం ఒకే మనిషికి వుండడం, శ్రీనివాస్ అత్తెసరు మార్కులతో బయటపడింది. ఆ మార్కులకు తగ్గ సీటు, తనకే విధంగా సంబంధం కాని, ఇష్టం లేని ఆర్కియాలజీలో దొరికింది. ఆ సబ్జక్టు మరిన్ని రోజులు వర్థిల్లాలని ఆకాంక్షించే, కొన్ని వందల పెండింగు ఫైళ్లు పేరుకపోయి వున్న డిపార్టుమెంటులో శ్రీనివాస్‌కి ఉద్యోగం దొరికింది. భార్య, ఓ పిల్లాడు - మరో రెండు క్వాలిఫికేషన్లు కూడా ఉద్యోగంతో పాటు త్వరలోనే అందుకున్నాడు.
కానీ ఉద్యోగంలో చేరినా, శ్రీనివాస్ మనస్సు ఊరికే వుండలేకపోయింది.
ఉద్యోగం చేస్తూనే నాటకాలు వేస్తున్న రాయుడు, అలానే కవిత్వం వ్రాస్తున్న కాళిదాసు తనకో స్ఫూర్తినిచ్చారు. తనూ మెల్లగా తీరికచేసుకొని క్విజ్ ప్రోగ్రామ్‌లు కండక్టు చేయడం మొదలెట్టాడు. మొదట స్కూళ్ళలోను, తర్వాత కాలేజీలలోను మంచి క్విజ్ మాస్టర్‌గా పేరు సంపాదించుకోగలిగాడు.
శ్రీనివాస్‌కి ఇలా సాయంకాలాలలో తనకుసమయం గడిచిపోవడం ఆనందంగానే వున్నా, భార్యామణి దగ్గర మాత్రం చివాట్లు తప్పడం లేదు. దానికి కారణం తన ఏకైక సంతానం బుజ్జిగాడి చదువే.
ఇవ్వాళ కూడా శ్రీనివాస్ ఇంటికి చేరేసరికి ఇంట్లోని వాతావరణం, శ్రీనివాస్ సంతోషాన్ని సగం తినేసింది. పిల్లవాడు ఏడ్చి ఏడ్చి నిద్రపోతున్నాడు. వాడికి ప్రోగ్రెసు కార్డు ఇచ్చారు. అన్నిట్లో డెభ్భై శాతం పైనే వచ్చాయి. కాని క్లాసులో 35వ రాంకట. అది వాళ్ళమ్మ అసంతృప్తికి కారణం. వాడి నిద్దట్లో ఎక్కిళ్ళు ఆ అసంతృప్తికి ఫలితం.
శ్రీనివాస్‌కి బుజ్జిగాడి ప్రశ్నలు జ్ఞాపకానికి వచ్చాయి. ‘ఎందుకు ఇదే సమాధానం ఐదుసార్లు వ్రాయడం’. ‘అది హోంవర్కు’ అని తాము సమాధానపరచ ప్రయత్నించడం. స్కూల్లో కనీసం ఏడు గంటలు చదివించి మరో ఏడు గంటలు ఇంట్లో పనిచేయాలని ఆశించడం మంచిదేనా? ఇంతకీ బుజ్జిగాడు చదువుతున్నది ఒకటో తరగతే.
తన కళ్ళ ఎదురుగానే ఓ పర్సనాలిటీని చిత్రవధ చేయడం తాను గమనించాననిపించింది శ్రీనివాస్‌కి. రెండేళ్ళవరకు కావలసినంత తీరికతో అమ్మ నాన్నలతో ఆడుకున్న బుజ్జిగాడు మూడో ఏట్లో పడేసరికే స్కూలు, పుస్తకాలు, హోం వర్కు అంటూ వాడికి తీరిక లేకుండా ఓ వాతావరణం సృష్టించారు. వాడు ఆ వాతావరణంలో వుండి తన మనస్సుకు అర్థం కాని ప్రశ్నలు వేస్తే వాటిని టీచర్లు, తన భార్య, తను అందరూ కలిసి అణచివేశారు. వాటికి జవాబిస్తే వాడు చేయాల్సిన పనులు వెనకపడ్తాయని వాడ్ని బెదిరించినా, అస్సలు వాటికి సమాధానాలు తమ దగ్గర లేవనే విషయం, తను మనస్సులో పైకి రానీయకుండా కొట్టుకుంటున్నామని శ్రీనివాస్‌కి అనిపించింది.
శ్రీనివాస్‌కి తన బాల్యం గుర్తుకొచ్చింది. కనీసం తనకు బాల్యపు తీపి గుర్తులన్నా వున్నాయి. ఈ తరం వాళ్ళు వాటికి కూడా నోచుకోలేదు. పుస్తకాలవల్ల శారీరక బరువు, తల్లిదండ్రులు వల్ల మానసిక వత్తిడులు, వారి బాల్యాన్ని ఓ చేదు అనుభవంగా మార్చేస్తున్నాయా? ‘కాచ్ దెమ్ యంగ్’ అనడం బాగుంది కాని, తాము డిగ్రీలో పడవలసిన బాధలు, కాంపిటీషన్లు ఒకటో తరగతి లోనే పెట్టడం ఎంతవరకు సమంజసం?
శ్రీనివాస్‌కి తన ఇష్టాలు, తన సన్నిహితుల ఆక్టివిటీస్ గుర్తుకొచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితిలో ఎంతమంది తాము చేస్తున్న ఉద్యోగాలు బాగా నచ్చి వాటితో సంతృప్తి పడగల్గుతున్నారు? ఇంత మంది ఇంజనీర్లు, డాక్టర్లు, బాంక్ ఆఫీసర్లు అవ్వడానికి ప్రయత్నించడం, వారికి ఆ ప్రొఫెషన్‌పై గల ఇష్టమా? ఒకవేళ ఈ డాక్టర్ల, ఇంజనీర్ల, బాంక్ ఆఫీసర్ల జీతాలు ఓ ఫ్యాక్టరీ కూలికంటే తక్కువ చేస్తే ఎంతమంది ఆ ఉద్యోగాల కోసం ప్రాకులాడుతారు? ఎంతమంది ఫ్యాక్టరీ కార్మికుడు కావడానికి సుముఖత చూపిస్తారు? అస్సలు ఎంతమందికి తాము చేస్తున్న ఉద్యోగాలపై ఛాయిస్ వుంది? చేతికేది వస్తే అది తీసుకోవడమే తప్పితే, తను, తనవంటి వారు ఉద్యోగం చేస్తూనే తమకిష్టమైన కార్యక్రమాల కోసం సమయం వెదుక్కోవడం, అటు ఉద్యోగానికి ఇటు తమ వ్యాపకాలకు న్యాయం చేయకపోవడం, ఎంత శోచనీయం! శ్రీనివాస్ మనస్సు ఆలోచనలతో నిండిపోయింది.
శ్రీనివాస్ ప్రశాంతత కోసం తన క్విజ్ బాంక్ కోసం మరికొన్ని ప్రశ్నలు సేకరిద్దామని కొన్ని పుస్తకాలు ముందేసుకొని కూర్చున్నాడు. భార్య భోజనం అయిపోవడంతో ఆ రోజు మాటలు చెప్పేసి, ‘‘నిద్ర వస్తూంది. మీరెలాగూ ఇప్పుడే రారుగా’’ అంటూ నిద్రకుపక్రమించేసింది.
పుస్తకాలు తిరగేస్తుంటే ‘‘కలెక్టివ్ నౌన్సు’ కనిపించాయి. ఇంగ్లీషు ఓ తమాషా భాష. ద్రాక్ష గుత్తి ‘బంచ్ ఆఫ్ గ్రేప్సు’ అయితే సింహాల గుంపు ‘ప్రైడ్ ఆఫ్ లయన్సు’ ఇవి క్విజ్‌లో అడిగితే బాగుంటుందని ఆ లిస్టులో వున్న మరికొన్ని పదాలు చదవసాగాడు శ్రీనివాస్... ‘కాలనీ ఆఫ్ ఆన్ట్స్’... ఆగిపోయాడు శ్రీనివాస్. కాలనీ ఆఫ్ ఆన్ట్స్ కాలని, బ్రిటిష్ కలోనియల్స్ను గురించిన జ్ఞాపకాలు గుర్తుకు తెప్పించాయి శ్రీనివాస్‌కు. అన్నట్లు ఇప్పటి ఈ చదువు, విద్యా శిక్షణ విధానం బ్రిటిష్ లెగసీనే కదా. వారు మన దేశాన్ని వదిలేసింతరువాత ఏమైనా మార్పులు వచ్చాయా?
బ్రిటిష్ వారికి కావలసినది మంచి క్లర్కులు. అహర్నిశము పనిచేసే తేనెటీగల లాగా చీమల వంటి మనుషులు. ఆలోచనాశక్తిని ఉపయోగించని మరమనుషుల వంటి కలోనియల్సు. రాణి చీమ, రాణి తేనెటీగ గూడు వదలి బయటికి రానట్టే బ్రిటిష్ వాళ్ళు కూడా తమ తమ హర్మ్యాలలో భవంతులలో కూర్చుని పని మనిష్యులతో పని చేయించుకున్నారు.
మరి ఈనాటి పరిస్థితి ఏమిటి? ఎవరి కోసం ఇప్పటి ఈ విద్యాశిక్షణా వ్యవస్థను పొడిగించాలి? మరోసారి ఆలోచించాడు శ్రీనివాస్. చదువంటేనే కేర్ చేయకుండా బలాదూర్‌గా తిరిగిన తన క్లాస్మేట్లు కొందరు గుర్తుకువచ్చారు. ఇప్పుడు వారంతా ఎక్కడున్నారు? దాదాపు వారందరూ కార్లలో తిరుగుతూ వున్నారు. తాము కనపడకుండా పెద్ద పెద్ద మేడలలో వుంటున్నారు. రాణి తేనెటీగల లాగా మంచి పవర్ఫుల్ పొజిషన్లలో వున్నారు. వారికి చదువు అవసరం లేదు. వారి తల్లిదండ్రులు అప్పటికే రాణి తేనెటీగలు, వాటికింద పనిచేయడానికి పని తేనెటీగలను శిక్షణ సంస్థలు తయారుచేస్తూనే ఉంటాయి, అప్పటికీ ఇప్పటికీ. మొన్న టీవీలో చూసిన డాక్యుమెంటరీ గుర్తుకు వచ్చింది. అందులో తేనెటీగలు ఒకరితో ఒకరు తేనె ఎక్కడ దొరుకుతుందో అన్న సమాచారం అందజేయడానికి కొన్ని పేటర్నులు వచ్చేటట్లు డాన్సు చేస్తాయో చూపెట్టారు. అవి తనలాగా పనిచేస్తూనే ఏదో మనస్సుకిష్టం కల్గించేటందుకు నాట్యం చేస్తున్నాయనిపించింది శ్రీనివాసుకి.
ఈ విద్యాశిక్షణ బాగాలేదు. నిజమే. రేపే బుజ్జిగాడ్ని ఈ ఇంగ్లీషు మీడియం స్కూల్లో నుంచి తీసేసి, వాడి కనుగుణంగా నేనే ఇంట్లో చదువు చెప్తే ఎలా ఉంటుంది. దానికి ధైర్యం కావాలి. నా బుజ్జిగానికి తన స్వశక్తిమీద నిలబడగలిగే కాన్పిడెన్సు ఇవ్వగల్గాలి. చేయగలనా నేను... ఆలోచనలతోనే శ్రీనివాస్ నిద్రలోకి జారుకొన్నాడు.
మరుసటి రోజు పొద్దున ఆఫీసుకు తయారువుతుంటే భయపడుతూ బుజ్జిగాడు ప్రోగ్రెస్ కార్డు తెచ్చి చేతికిచ్చాడు. సంతకం పెడ్తూంటే ‘‘బుజ్జిగాడికి సరిగా మార్కులు రాలేదండి. మీకా ప్రోగ్రాముల పిచ్చి. వాడి కివ్వాళ నుంచి ట్యూషన్ పెట్టాలనుకుంటున్నాను. ఏమంటారు?’’ అంటూ వంటగదిలో నుంచి శ్రీనివాస్ భార్య కేకవేసింది.
‘‘సరే’’ అన్నాడు శ్రీనివాస్.
-ఆంధ్రజ్యోతి, 1992