ఇరవై సంవత్సరాల అబ్బాయి ‘కోటి’ చంద్రం ముందు నిలబడ్డాడు. వాడి మొహంలో కాస్తంత వినయం కూడా లేదు.
తల ఎగరేస్తూ-
“ఏంటీ?” అన్నాడు.
“తులసి వయసెంతో తెలుసా? మనది ‘బంగారు పల్లె!” ఇక్కడ అరాచకాలు జరుగుతున్నాయంటే అర్ధం ఏమిటి?”
ఆ కుర్రాడు నిర్లక్ష్యంగా తల తిప్పాడు.
“నువ్వు ఏ ఊర్నుంచి వచ్చింది? అమ్మమ్మ గారింటికి చుట్టపు చూపుగా కదూ?” అడిగాడు చంద్రం.
“అయితే?”
“ఏం చదువుతున్నావ్?”
“మానేశా! నాకు చదువు అబ్బలేదు. భీమిలి నుంచి వచ్చా. అక్కడ మా నాన్న ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తాడు. అమ్మమ్మ రమ్మంటే తోడుగా ఉండాలని వచ్చా!”
“వచ్చి ఏం పాడు పని చేసావో తెలుస్తోందా?” గద్దించాడు.
“అదే నన్ను కవ్వించింది. మీద మీద పడింది. నన్ను వెక్కిరించి నవ్వింది. దాని సంగతి చెబ్దామని.... మాట పూర్తి కాకుండానే ‘కోటి’ దవడ పేలిపోయింది.
“నన్ను కొట్టావంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలీదు. బొమ్మిడాల్ని ఎక్స్పోర్ట్ చేసినట్టు నువ్వూ ఎక్స్పోర్ట్ అయిపోతావ్. నాజోలికి రాకు!” అన్నాడా కుర్రాడు పౌరుషంగా తల ఎగరేస్తూ!
వాడికి ఒక్క ఛాన్స్ ఇస్తే చంపేసేలా ఉన్నాడు. ఈ లోపున తులసి తల్లీ తండ్రి పరుగుపరుగున వచ్చేశారు. కూతుర్ని బాదిపారేశారు. తులసి తల్లి కూతుర్ని ‘ఎన్నోనెల?‘ అని అడిగి తెలుసుకుని –
“నాయనో చంద్రం! దీనికి అబార్షన్ చేయించడానికి కూడా కుదరదురో! ఇప్పుడేం చెయ్యాలి? జీవితం బుగ్గి పాలు చేసేసుకుంది మొర్రో!” అని ఏడవడం మొదలెట్టింది. కవిత అవాక్కయి చూస్తోంది. చంద్రం గట్టిగా కసిరాడు. ఈ లోగా తులసి గొడకేసి తల కొట్టుకుంటూ తన మాట వినమని గోలెట్టింది.
అందరూ తులసి వైపు తిరిగారు.
“నాకు ‘కోటి’ అంటే ప్రేమ అన్నా!” అంది. కోటి గొప్ప గర్వంగా తల ఎగరేశాడు. వాడి మాడ్రన్ క్రాఫ్ ఎగిరెగిరిపడుతోంది...
“ప్రేమా?” చంద్రం గొంతు తడారిపోతుంటే అడిగాడు.
“అవునన్నా! సచ్చేంత ప్రేమ. అందుకేగా ఏటిలో దూకా. నా పొట్టలో ఉన్న బిడ్డని కూడా లెక్కచేయలేనంత ప్రేమ!” అంది. ఆ పిల్ల మొహం వెలిగిపోతోంది ఆ మాటలు చెప్పినప్పుడు.
బుర్ర గిర్రున తిరిగిపోతోంది చంద్రానికి.
చాలా శాంతంగా ఉండడానికి సకల ప్రయత్నాలూ చేస్తూ-
“ప్రేమ అంటే ఏమిటి తులసి?” అని అడిగాడు.
“ప్రేమ అంటే కోటి తో ఉండడం అన్నా!” అందాపిల్ల. కోటి తమాషాగా నవ్వాడు. భుజాలెగరేశాడు. ఆ పిల్లవాడి తలపొగరు చూస్తూ ఉన్నాడు చంద్రం. ఇరవై యేళ్ళ పిల్లాడిలో ప్రేమని తాను అంచనా వెయ్యగలడు.
“సినిమాలు, టి.వి సీరియల్స్ చూస్తూ ఉంటావా తులసి?”
“తెగ చూస్తా అన్నా! నాకు ప్రతి సీరియల్ లో కోటి కనపడతాడు. ప్రతి ప్రేమలో కోటిని చూడడానికే నేను సినిమాలు చూస్తాను అన్నా!” అంది
“నీ జిమ్మడ! చూస్తే చూసినవ్. మూణ్ణెల్లు రాకుండా సెప్పోద్దా? దీనికి ఇప్పుడు నాలుగోనెల! కడుపు తీయిస్తే చావవా?” అంది తులసి తల్లి. అవునంటూ తలూపాడు తండ్రి. వాళ్ళ ఆలోచనలకి నివ్వెరపోతోంది కవిత. కొన్ని గంటలక్రితం కొండ మాటుకి వెళ్తుంటే చెంప చెళ్ళుమనిపించాడే ఆ పిల్లని అడిగాడు చంద్రం.
“ప్రేమ అంటే ఏంటి కాదంబరి?” అని. కాదంబరి ఇరవై యేళ్ళ పిల్ల. గొప్ప హాయిగా నవ్వింది.
“నువ్వు కొట్టావని నాకేం కోపలేదు చంద్రన్న! “బంగారు పల్లె“ మునుపటిలా ఉందని అనుకోకు. ఇక్కడ విష గాలి ఆగకుండా వీస్తోంది. ఎలా జొరబడి పోయిందో గానీ... నా కథ కూడా వినుకో. నాదీ ప్రేమే అన్న! ఏమన్నా? మా బోటి పేద ఇళ్ళల్లో పెళ్లెప్పడు చేస్తారా అని కాచుకు కూర్చోడమే! నాకయితే ప్రేమ అంటే సరదా అన్నా! అసలు ప్రేమంటేనే సరదా! నాకు దొరబాబు అంటే ఇష్టం. శానా వస్తువులు ఊరికే డబ్బు తీసుకోకుండా ఇస్తాడు. నా కోరిక తీరుస్తాడు. ప్రేమంటే ఇంకేముంటుంది అన్నా! నన్ను ఎవడో ఒకడికి కట్టబెట్టేస్తే... ఆడికి ములుగుకర్ర, సంకటి ముద్ద అందించడమే కదా? అందుకే సరదా పడి కొండల్లోకి రమ్మంటే వెళ్తుంటే నన్ను దొర్కబుచ్చుకుని ఒక్కటిచ్చినవ్!” అంది.
ఆ అమ్మాయి మాటలకి విస్తుబోయి చూస్తోంది కవిత.
“నువ్వు చేస్తున్న పని తప్పని తెలుసా కాదంబరి?” సూటిగా అడిగాడు చంద్రం.
“తెలుసు. కానీ నాకు గొప్పోళ్ళ సోకులు ఇట్టం!”
“ఎప్పటికీ నీతోనే ఉంటాడా దొరబాబు? ఇంకో పిల్ల నచ్చితే అక్కడికి పోతాడు. అప్పుడేం చేస్తావ్?”
ఏమి మాట్లాడలేదు కాదంబరి. ఆ అమ్మాయికి వెంటనే ఏ సమాధానం దొరకలేదు.
“అంత తెగింపు, ధైర్యం ఉన్నదానివి కొండల్లోకి ఎందుకు కాదంబరీ? దొరబాబు ఇంటికే ఎందుకు పోవడం లేదు?” అడిగాడు చంద్రం. అప్పటిదాకా వాడిపోయిన ఆమె మొహం లో వెక్కిరింత చోటుచేసుకుంది. ఫకాలున నవ్వింది.
“నా సంగతి పక్కన పెడితే దొరబాబు నాన్నకి పరువుపోతుందట. ప్రతిష్ఠ దెబ్బ తింటుందట. అందుకే వారింటికి రాకూడదట. పోన్లే అన్నా! రాత్రి, పగలు వాడే కల్లోకొచ్చి సంపుతుంటే తెలిసిందన్నమాట ప్రేమంటే ఏమిటో. ప్రేమ పుట్టాక, లోకాన్ని లెక్కేసిముక్కు మూసుకు కూర్చుంటే బతుకు తెల్లారిపోదా? దొరబాబు, నేనూ ఒకరంటే ఒకరు సరదా పడుతున్నాం. సరదా తీరే వరకు ఉంటాం. అప్పుడు మా నాన్నఎలాగూ ఎవరికో నన్నిచ్చి కట్టబెట్టాలి కదా? అప్పుడు ఏ ఎదవనో కట్టుకుని ఆడి మాట ఇనక తప్పదు కదా?” అంది కొట్టొచ్చినట్టు చెప్పి. కాదంబరి తల్లి గుడ్లురిమి చూసింది కూతుర్ని.
ఈ లోగా పరుగుపరుగున వచ్చిన చంద్రం పాలేరు ఈ మధ్యే ఓట్లు వేసి ఎన్నుకున్న ఊరి పెద్ద ‘శరభలింగం’ గారు వస్తున్నారనే కబురు చెప్పాడు. శరభలింగం కొడుకు శోభనాద్రి కి కూడా తండ్రి పక్కనే కుర్చీ వేశారు. శోభనాద్రి గ్రామీణ బాంక్ లో గుమాస్తా. అతడికి వరలక్ష్మి తో పెళ్ళయి ఆరు నెలలు దాటిందంతే.
వరలక్ష్మి ని శోభనాద్రి గొద్దును బాదినట్టు బాదాడని అభియోగం! ఆపిల్ల బుగ్గ మీద అర చెయ్యి మందానా చేతి వ్రేళ్ళ అచ్చులు ఎర్రగా పొంగి కనిపిస్తున్నాయి. వరలక్ష్మి శోభనాద్రి రెండవభార్య. మొదటి భార్య మొదటిరాత్రే తాను ఇంకెవర్నో ప్రేమించానని చెప్పింది. కొన్నాళ్ళు పోయాక... అదేం లేదని దబాయించి, భర్త హింసిస్తున్నాడని కోర్టులో కేసు వేసి ఎనిమిది లక్షల రూపాయలు తీసుకుని శోభనాద్రి కి విడాకులిచ్చింది. శోభనాద్రి కొంచెం ‘డిమ్’ గా ఉంటాడు. అమాయకపు పక్షి...జరిగిందేదో జరిగిందని శరభలింగం వెదికి వెదికి పేదింటి పిల్లయితే కుదురుగా ఉంటుందనీ, అందులో కాస్త చదువుకున్న పిల్లయితే సంస్కారం తోడయి ఇల్లు చక్కదిద్దుకునే ఓర్పు ఉంటుందని బి.ఎస్.సి చదివిన పిల్లని ఏరీ, కోరీ కోడలిగా తెచ్చుకున్నాడు. ఆపేక్షతో, దయతో, ఆదర్శం తో తెచ్చుకున్న కొరకరానికొయ్య వరలక్ష్మి.
చంద్రం అంటే ఊరంతటికి గౌరవం. అంతే ముక్కుసూటిదానం! విజ్ఞత, ఏ సమస్య కైనా అతడు చూపే పరిష్కారం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది.
“అసలేం జరిగింది?” అడిగాడు చంద్రం.
“వాణ్ణే అడగండి” అంది వరలక్ష్మి. ”చూశావా దాని పొగరు!” అన్నాడు శరభలింగం.
“అదెప్పుడూ అంతే. మర్యాద లేకుండా నన్ను ఒరే, గిరే అంటుంది!’ అన్నాడు శోభనాద్రి.
“అబ్బో! వీడంత మంచివాడు పాపం!” అందామ్మాయి దెప్పుతూ.
“అసలేం జరిగిందో చెప్పండి!” గద్దిస్తూ అడిగాడు చంద్రం.
“అయిదు రోజులుగా సతాయిస్తున్నాడు. నీకు కాలేజీలో ఎవడైన సైటు కొట్టాడా? ఇంతవరకు నువ్వు ఎవరికైనా రాఖీ కట్టావా? నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? అని చంపుకు తింటున్నాడు!” అంది కన్నీళ్ళు తుడుచుకుంటూ.
“అబద్దాలు! నేను ఒకే ఒక్కటి అడిగాను. నువ్వేవరికైనా ఎప్పుడైనా రాఖీ కట్టావా? అని. అదీ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు. ఎవర్నో ‘అన్నయ్య’ అని గ్రూప్ ఫోటోలో చూపించినప్పుడు. మిగిలినవేవీ అనలేదు.” అన్నాడు శోభనాద్రి ఉక్రోషంగా!
వరలక్ష్మి భోరుమంది. అక్కడున్న అందరికి కూడా ఏడుపు వచ్చేంత బిగ్గరగా. అప్పుడు అందరి వైపు చూసి కళ్ళు తుడుచుకుని -
“రెండు రోజులుగా కొడుతున్నారు!” అంది.
“నేనా?” అన్నాడు శోభనాద్రి వెర్రివాడిలా. అతని మొహం పాలిపోయింది.
“సరిసర్లే! ఇది మొదటి తప్పుగా వదిలేయ్ అమ్మా! నేను కూడా బాగా బుద్ది చెప్తాను. ఇంటికి వెళ్ళి హాయిగా ఉండండి తల్లీ!” అన్నాడు చంద్రం.
“ఓయబ్బో! మీరు చెప్తే వాడు వింటాడు. నా కాపురం బాగు పడిపోతుంది!” అంది వరలక్ష్మి ఎకసెక్కంగా.
“బాగుపడుతుంది అమ్మా! నా మీద నమ్మకం ఉంచు!” అన్నాడు చంద్రం.
“నాకవేం ఒద్దండి. వీడితో కాపురం చెయ్యను నేను. నచ్చలేదు వీడు నాకు!” అంది వరలక్ష్మి. శోభనాద్రి బాగా ఉక్రోషపడి _
“దీని సంగతి నీకు తెలియదు మామయ్యా!” అన్నాడు చంద్రాన్ని ఉద్దేశించి.
“ఏటో సెప్మను!” అందాపిల్ల యాసగా.
“నాలుగురోజుల క్రితం దీని ఫ్రెండు ‘కిరణ్మయి’ ట వచ్చింది. అదీ, ఇదీ ఒకటే కబుర్లు ఏసుకున్నారు. నేను గొప్ప సరదాగా మురుకులు, లడ్లు తీసుకుని వెళ్ళబోతుంటే _
వీడికి పది లక్షలని నేనెప్పుడో అనుకున్నానే! ఈ కాలం లో ఈజీగా రెండో పెళ్లి చేసుకోవొచ్చు. పైగా ఆడపిల్లలు తక్కువయిపోయారుగా? గొప్ప డిమాండ్. వీడు నాకు మొదటే నచ్చలేదు. విడాకుల కేసు వేసి పది లక్షలు గుంజుతా. ఈజీ మనీ!” అంటోంది కిరణ్మయి తో
ఆ కిరణ్మయి లకలకా నవ్వింది. ఇదో... పడీపడీ నవ్వింది. వీళ్ళకి పెళ్ళంటే తమాషా అయిపోయింది. అడగండి నిలదీసి!” అన్నాడు శోభనాద్రి.
శరభలింగం నిప్పుల్లో ఆజ్యం పోసినట్టు పెళపెళ లాడిపోయాడు. అతనికి ఈ సంగతి ఇప్పుడే తెలిసింది.
వరలక్ష్మి పెద్ద పెట్టున ఏడ్చింది. తిట్టి తిట్టి పోసింది. ఒక్క క్షణం తను ఉండనంది. తనకి న్యాయం జరిగేట్టు చూడమని అక్కడి ఆడవాళ్ళందర్నీ అడిగింది. వాళ్ళంతా ఆవేశపడిపోతూ గొడ్డును బాదినట్లు బాదాడని అభియోగం చేస్తూ వరలక్ష్మిని బస్ ఎక్కించడానికి వెళ్ళారు.
వెళ్తూ వెళ్తూ వరలక్ష్మి విజయగర్వంతో చూసింది శోభనాద్రి వైపు. శోభనాద్రి మళ్ళీ పదిలక్షల ద్రోహం లోకి తోయబడుతున్నాడు.
బయట గాలి ఈడ్చి కొడుతోంది. ఒక్కసారిగా గాలి శబ్దం చేసీ చేసీ ఆగుతోంది.
మహాలక్ష్మి గుడి దగ్గర పండు ముత్తైదువ చెప్పినట్టు ఏదో జరగబోతోందన్న సూచన? అందుకే ఈ విపరీతమైన గాలులా? అనుకున్నాడు చంద్రం.
******
ఆ సాయంత్రం తిరుగు ప్రయాణం! షష్టి పూర్తి కి వచ్చిన వారంతా తిరిగి సిటీ లోని ‘బడ్డీ ఎన్ క్లేవ్’ కి తిరుగు పయనమవుతారు.
ఆ మధ్యాహ్నం –
కోటలో ఉన్న ఒక చెట్టుని ఆనుకుని వాసంతి తో మాటలు కలిపాడు మహేంద్ర. వాసంతి తండ్రికి విరించి నచ్చజెప్పే ప్రయత్నంలో ఉండగా శంభులింగం ఇంటి గొడవతో ఆగిన చర్చ మళ్ళీ సాగింది.
ఆ యేడు చంద్రానికి పెళ్ళి చేసేయాలన్నాడు చంద్రం తండ్రి. విరించి ని పిలిచి-
“ఏంటిరా! మీ అందరికీ పెళ్ళిళ్ళయి పిల్లలు పుట్టేసిన వీడు పెళ్ళి ఊసేత్తడు. ఏమ్మా కవితా! అదీ సంగతి!” అని కవితని దగ్గరగా తీసుకున్నాడు.
“చంద్రం సీరియస్ నెస్ చూసి విరించి భుజం తట్టాడు.
’పొద్దుటినుంచి ఏం జరుగుతోందో తెలుస్తోంది కదా? ఎప్పుడైనా మన బంగారు పల్లె లో ఇటువంటివి విన్నామా రా? ‘తులసి ఎంత చక్కని పిల్ల. ప్రేమంటే సినిమాలు, సీరియెల్స్ చూసి నేర్చుకోవడం అనుకుంటోంది. బతుకునే పణంగా పెట్టేసింది. కాదంబరి? ‘ప్రేమ అంటే సరదా’ అనుకుంటోంది. వరలక్ష్మి పక్క ఊరు పిల్లే కదా? మన ఊరిలోనే...’డబ్బు కోసం’ ‘వల’ వేయడం నేర్చుకుంది. లోకం ఇలా మారిపోతుంటే దిగులుగా ఉందిరా! అన్నాడు బాధగా.
ఒక్కసారి గాలి బలంగా వీచి కొడితే తలుపులు దడ దడ లాడాయి.
“ప్రేమ కోపంగా వీచిందిరా!” అన్నాడు విరించి నవ్వుతూ.
నవ్వాడు చంద్రం.
కొద్దిసేపటిలో అందరూ వెళ్ళిపోతున్నారు. వారందరికి వీడ్కోలు పలికేందుకు విరించితో కలిపి కోట గుమ్మం దగ్గరికి వచ్చాడు చంద్రం.
దారంతా ఈడ్చిఈడ్చి కొడుతోంది. తుఫాను మొదలయ్యే సూచనలా ఉంది. చంద్రం వచ్చిన ఐదు నిముషాల్లో ఒక దారుణమైన వార్త దావానలంలా వచ్చేసింది.
“తులసి చెరువులో శవమై తెలుతోందని!”
అందరూ చెరువుకట్ట దగ్గరికి పరుగుపరుగున చేరారు.
రేపో, ఎల్లుండో ‘రచ్చబండ ‘మీదకు చర్చకు రాబోయే ఆ ఘటన పరిసమాప్తి అయింది.
కోటి, కోటి తండ్రి, అతడి అనుచరులు అక్కడ విచార వదనాలతో నిలబడి ఉన్నారు.
“తెలిసీ తెలియని వయసులో తొందరపడ్డారని, అందుకే తులసి ని కోడలిగా తీసుకుపోదామని నిర్ణయించుకుని ‘రచ్చబండ’ లో చెబ్దామనుకుంటే పిల్ల ఇటువంటి పని చేస్తుదనుకోలేదు!” అంటూ పై పంచ తో ఒకటే కళ్ళు ఒత్తుకుంటున్నాడు కోటి తండ్రి. మాటి మాటికి కొడుకుని దగ్గరకు తీసుకుని ఓదారుస్తున్నాడు. కోటి విచారమైన మొహాన్ని పెడుతూ తులసి వంకే చూస్తున్నాడు.
అక్కడ ఒక ‘హత్య’చాలా ‘కూల్’ గా చేయబడింది. దానికి ప్రశ్నలు, జవాబులు ఉండవు. ప్రేమలో విఫలమైన ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుందనో, ఇంకేదో కధ అల్లబడుతుంది.
జనం కొన్నాళ్లు చర్చించుకుని కొత్త వార్త రాగానే పక్కన పడేస్తారు.
ఒక పక్కగా కంటికీ, మంటికీ ఏకధారగా ఏడుస్తూ ఉంది తులసి చెల్లెలు ‘నీలి’. ఆమెని పరీక్షగా చూసిన చంద్రం ఉలిక్కిపడ్డాడు. బుగ్గలమీద పంటి గాట్లు. దానికి అడ్డంగా పెట్టుకున్న చేత్తో ఒకసారి కళ్ళు తుడుచుకుని మళ్ళీ బుగ్గని దాచింది.
ఆ పిల్లకి పన్నెండేళ్ళు. పేదరికంతో ఒక ఇంట్లో పనికి కుదిరింది. ఎంత చైల్డ్ సర్వెంట్స్ ఉండకూడదని రూల్ పెట్టినా ‘చాపకింద నీరులా’ జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. ఆ పిల్ల వెక్కుతూ ఉంటే తల్లి ఆమెని కొంగులో దాచేస్తోంది. చంద్రం ఒక్క నిముషం లో కనిపెట్టాడు ఏదో జరుగుతోందని. ఆ పిల్లని పైకి లాగి తీసుకెళ్తుంటే విరించి గమనించి అందర్నీ తమతో వచ్చెయ్యమని సైగ చేశాడు!
గాలి దబాయించి కొడుతోంది. చెట్లు ఒకటే ఊగిపోతున్నాయి. కోటగుమ్మం దగ్గర గట్టు మీద కూర్చుని నీలి చేత వేడివేడి టీ తాగించాడు చంద్రం. నాలుగు ఇడ్లీలు తినిపించాడు. ఆవురావురుమంటూ వెక్కిపడుతూ తింటోంది. తిని, తేరుకున్నకొద్దిసేపయ్యాక ఏం జరిగిందని అడిగాడు. నీలి తల్లి ఏమీ లేదని దబాయించబోయింది. చంద్రం ఆమెని చూపుడు వేలితో ఆపాడు.
ఊరి పెద్దలుగా చలామణి చేసుకుంటున్న జనార్ధన్ అనే ఆసామి ఇంట్లో పనికి కుదిరింది ‘నీలి’! కొన్నాళ్ళు బాగానే గడిచింది. జనార్ధన్ భార్య ఊరెళ్ళినప్పుడు కోరిక ఆపుకోలేక ఆ పిల్ల మీద పడ్డాడు. తల్లికి చెప్పి చెప్పి విసిగిపోయిందాపిల్ల. తల్లిని డబ్బులిచ్చి నోరుమూయింఛాడు.
చెప్తూ చెప్తూ చెప్పడం రాక మాటలు లేక చెప్తుంటే అందరి హృదయాలు ద్రవించిపోయాయి.
కోట తలుపులు గాలికి బరువుగా పెద్ద శబ్దం చేస్తూ కొట్టుకుంటున్నాయి. చంద్రం రుమాలు అడ్డుపెట్టుకుని వెక్కివెక్కి ఏడ్చాడు. కవిత ఆ పిల్లని దగ్గరకు తీసుకుని వెన్ను నిమురుతూ ఉండిపోయింది.
“నిజానికి ఇదొక మూల సమస్య. కామపిశాచి. రాక్షసి. అదుపులేని సుడిగాలి. దీన్నెందుకు మట్టుపెట్టే ప్రయత్నం జరగదు?” గట్టిగా అంది సంజన. సంజన చాలా నెమ్మదస్తురాలు.
ఎంతటి బాధనైనా పంటిబిగువున నొక్కి పట్టి సహనం గా రాబోయే మంచిరోజుల కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. ఆమే అలా అందంటే ఈ పసివాడని మొగ్గ ‘నీలి’ ని చూస్తే ఎవరి హృదయం ద్రవించదు?
“మనిషి లోని ఆవేదన కంటే, బాధ కంటే గొప్పదీ,ఆపుకోలేనిది అయిన ఈ ‘కామం’ చూస్తే ఒళ్ళు జలదరిస్తోంది. అస్సలు ఆపలేమా?” ఆవేదనగా అందామె మళ్ళీ! సీరీన్ సంజనని పక్కకు తీసుకుపోయాడు.
“కాలుతున్న కొలిమి అది...నూనె బావి పేలుతున్నట్టు. దాన్ని ఆపేకొద్దీ ప్రజ్వరిల్లుతున్నట్టు ఉంది. ఇదొక్కటి ఆపితే చాలు. శాంతి వస్తుంది!” అన్నాడు మహేంద్ర.
ఒక్కసారిగా గాలి సుడులు సుడులు తిరిగి ఈడ్చి కొట్టింది. అందరూ నేలమీద కాలు ఆనక గిలగిల లాడుతున్నారు. కాస్త ఉధృతి కనపడనప్పుడు కోటలోకి వెళ్ళి హాలు తలుపుల్ని మూసేసారు.
“సముద్రం లో వాయుగుండం!” అన్నాడు లక్ష్మణ్.
“మీరందరూ వెళ్ళడం కష్టం. ఆగిపోండి!” అన్నాడు చంద్రం. చేసేదేమీ లేక అందరూ తల లూపారు.
ఒక్క రేడియో మాత్రమే తుఫాను హెచ్చెరిక ని వివరించగలుగుతోంది.
వాతావరణం అతి చల్లగా ఉంది కరంట్ పోయి వస్తోంది. ఆకాశంలో చిక్కని నల్లని మబ్బులు అలముకుంటున్నాయి. రేడియో లో వాతావరణ హెచ్చెరికలు ముమ్మరం చేశారు. చిన్న చిన్న చినుకులు. అంతలోనే దబదబా వర్షం. ఆగి ఆగి, కురుస్తూ ఉరుములు ఉరుముతూ ఉన్నాయి...
****సశేషం****
రచయిత్రి పరిచయం ..
|