గెలుపుకి గుర్తులు
జీవితంలో అందరికి గెలవాలనే వుంటుంది. ఓటమి తర్వాత మాత్రమే గెలుపు లభిస్తుందని తెలిసినా కూడా ఎవ్వరికీ ఓడిపోవాలని వుండదు. అయితే ఈ గెలుపుకి రకరకాల నిర్వచనాలు వున్నాయి. పెద్ద పెద్ద ఇళ్ళలో నివసిస్తూ, పెద్ద కార్లలో తిరుగుతూ, అంతకంటే పెద్ద బేంకు బేలెన్సులతో వుంటే అది గెలుపుకి నిర్వచనమా? మనిషికి ఇవన్నీ ముఖ్యమా లేక ఇవన్నీ లేకపోయినా కూడా మంచి మనసుతో, సమాజంలో పేరు ప్రతిష్ఠలతో, మనఃశాంతితో జీవితం సాగించటం గెలుపుకి సంకేతమా?
గెలుపుకి ఓటమికి మధ్య వున్న దూరం గురించి ఆలోచిస్తే అప్పుడప్పుడు మనకి ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే కొన్ని కొన్ని గెలుపులు బయటకు గెలుపులాగా కనిపించినా వాస్తవానికి అవి ఓటమిలు. అలాగే ఓటమిలు కూడా. కొంతమందిని ఓడిపోయి కూడా గెలిచారు అని మనం అందుకే అంటూ వుంటాము.
అయితే కొన్నిసార్లు మాత్రం ఈ రెండూ మనకి స్పష్టంగా కనిపిస్తూవుంటాయి. ఉదాహరణకి, అన్నిటికంటే ముందు అసలు మన దగ్గర వున్నవాటిని మనం గుర్తిస్తే అదే అసలైన గెలుపు. అలా దగ్గరున్నవాటి విలువ గ్రహించలేకపోతే అవి వున్నా లేనట్లే కదా! అంటే గెలిచినా కూడా మనం ఓడిపోయామన్నమాట. అలాగే మనకి అందనివాటిని గురించి వగచక, నిరాశలో కృంగిపోకుండావుంటే అది ఓడినట్లు కనిపించినా కూడా గెలిచామన్నమాట! అవునా? అయితే మన దగ్గర లేనివాటి కోసం ప్రయత్నం చెయ్యకూడదని నా ఉద్దేశం కాదు. ప్రయత్నం చెయ్యాలి, వాటిని పొందాలి కూడా. మన దగ్గర లేనివాటిని పొందటానికి మన కృషి, పరిశ్రమలని తప్పకుండా కొనసాగించాలి. అభివృద్ధిని, దాన్ని పొందటానికి చేసే కృషిని ఎప్పుడూ ఆపకూడదు. అయితే ఇక్కడ చాలామంది విస్మరించే విషయమొకటి వుంది. చాలామంది అవి, ఇవి కావాలని కోరుకుంటారు. కానీ తీరా అవి పొందటానికి అవకాశం వస్తే వాటిని వుపయోగించుకోవటానికి తయారుగా వుండరు. ఇంకేముంది? గడప దగ్గరికొచ్చిన అవకాశం చేజారిపోతుంది. ఎవరైనా తలుపు తట్టినపుడు మనం తలుపు వెంటనే తెరవకపోతే మరి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటం సహజమే కదా! అందుకే అవకాశాలను జారిపోనివ్వకుండా స్వాధీనపరచుకోవటానికి అనుక్షణం సిద్ధంగా వుండటం కూడా గెలుపుకి ఒక సంకేతమే అంటాను నేను.
అసలు గెలుపు నిర్వచనం అందరికీ ఒకేలాగా వుండదు. అలాంటప్పుడు ఎదుటివారి నిర్వచనం ప్రకారం మన జీవితాన్ని తులతూచుకుంటే మనకి నిరాశ తప్పదు. అసలు అది సరైన పద్ధతి కాదు కూడా. అందుకే ఇతరుల జీవితం మీద వ్యామోహపడకుండా మన జీవితాన్ని మనం జీవించటం, మన అవసరాలను మనం గుర్తించటం చేస్తే సగం విజయాన్ని పొందినట్లే అని నా నమ్మకం. ఎందుకంటే అసలు మన అవసరాలు ఏమిటో మనకు తెలీకపోతే ఇంక వాటిని పొందటమన్నది ఎలా సంభవం?
కొన్ని విషయాలు మనకి చాలా సాధారణంగా అనిపిస్తాయి. కానీ వాటిని మనం పొందటం సాధారణమైన విషయమేమీ కాదు. ఉదాహరణకి, నిజమైన స్నేహితులు, హితోభిలాషులు దొరకటం ఒక వరం లాంటిది. కానీ ఈ విషయాన్ని మనం granted లాగా తీసుకుంటాము. కానీ వారి అవసరం వచ్చినపుడు వారు మన పక్కన లేకపోతే అప్పుడు మనకి తెలుస్తుంది, మనం జీవితంలో ఎంత కోల్పోయామో. అందుకే మన ఆనందంలో పాలు పంచుకునేవారు, మన విజయాలకు మనస్ఫూర్తిగా గర్వపడేవారు, మన కష్టాలకి అయ్యో పాపం అనేవారు, మన అవసరాలకు ఆదుకునేవారు, మన కోసం నిజమైన కన్నీరు కార్చేవారిని మనం సంపాదించుకోగలిగితే మనం జీవితంలో చాలా పెద్ద విజయాన్ని సాధించినట్లే! అదేవిధంగా మనల్ని గురించి కూడా ఎవరైనా అలాగే అనుకున్నప్పుడు, అంటే మనల్ని ఎవరైనా వారి నిజమైన స్నేహితులుగా భావించి, వారి కష్టసుఖాల్లో మనల్ని వారి భాగస్వాములను చేసినపుడు, మన మీద నమ్మకంతో వారి వ్యక్తిగత రహస్యాలను మనకి చెప్పుకున్నప్పుడు కూడా మనం పెద్ద విజయం పొందినట్లు ఆనందించవచ్చు. ఎందుకంటే ఎదుటివారి ప్రేమను, గౌరవాన్ని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని పొందటం పెద్ద విజయాన్ని సాధించటంకంటే ఎంతమాత్రమూ తక్కువేమి కాదు. ఎటొచ్చి ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రేమని మనం నిలబెట్టుకోవాలి. వారిని ఆదుకుని, వారికి సాంత్వనని ఇవ్వగలగాలి. అప్పుడే అది సంపూర్ణమైన గెలుపు అనిపించుకుంటుంది.
అలాగే ఆర్ధికమైన లాభాపేక్షలేమీ ఆశించకుండా మన అభిరుచులను, అంటే passions ను, కొనసాగించటం కూడా నా దృష్టిలో ఒక గొప్ప విజయం. యాంత్రికమైన జీవితంలో ఒక ఆహ్లాదకరమైన విరామాన్ని, తద్వారా అనంతమైన శక్తిసామర్థ్యాలను ఇచ్చేవి ఈ అభిరుచులు. జీవితంలో అప్పుడప్పుడు మనకి ఎదురయ్యే అపజయాల అలలలోనుండి మనల్ని బయటకు లాగి మనలో కొత్త వూపిరిని ఊదే ఈ అభిరుచులను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అంతేకాకుండా ఎప్పుడైనా మనం జీవితంలో ఆశాభంగాలను పొంది ఏవో అగాధాలలో వున్నట్లుగా అనుభూతి పొందుతున్నప్పుడు ఈ అభిరుచులే మనల్ని అందలాలలో వున్నట్లుగా అనిపించేలా చేస్తాయి. పోతున్న ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ మనకి తిరిగి వచ్చేలా చేస్తాయి. అందుకే ఎన్నో వ్యయప్రయాసలకోర్చి చేసిన నా music albums ని వింటున్నపుడల్లా నాకు చాలా సంతోషంగా, గర్వంగా అనిపిస్తూ వుంటుంది. అవి చెయ్యడంలో నేను పడ్డ కష్టాలు, అవరోధాలు, ఖర్చు, సముద్రాల ఎల్లలు దాటి చేసిన ప్రయాణాలు, సమయాభావం వలన తొందరగా రికార్డింగ్ పూర్తి చేసెయ్యాలన్న తొందరలో తిండీతిప్పలు కూడా మర్చిపోయి ఆ రికార్డింగ్ స్టూడియోల్లో నేను పడ్డ తాపత్రయాలు, ఇవన్నీ నేను మర్చిపోతాను. వింటున్నప్పుడల్లా ఆ పాటలు నాకిచ్చే ఆనందం మాత్రమే నాకు గుర్తుంటుంది. ఎందుకంటే ఎటువంటి అవరోధాలకు జంకకుండా, లొంగకుండా అభిరుచులను కొనసాగించటం, వాటి కోసం చిత్తశుద్ధితో ప్రయాస పడటం, సమయాన్ని, సంపదని ఖర్చుపెట్టడం కూడా నా దృష్టిలో ఖచ్చితంగా ఒక విజయమే!
ఎవరితోనైనా సరే, అంతరాత్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదు. అలాంటి అంతరాత్మ చేత చివాట్లు తినకుండా నిజాయితీగా, బాధ్యతాయుతంగా ప్రవర్తించినపుడు మనం విజయాన్ని సాధించినట్లే! అలాగే అద్దంలో చూసుకున్నప్పుడు మిమ్మల్ని చూసి మీరు సిగ్గుపడకూడదు. గర్వపడాలి, ఆనందించాలి. అలా మీ వ్యక్తిత్వం వుంటే అది కూడా మీ విజయానికి ఒక చిహ్నమే! ఇంకో విషయం చెప్తాను. మీ చిన్నప్పటి రూపం మీ ఇప్పటి వ్యక్తిత్వాన్ని చూసి ప్రేరణ పొందిందనుకోండి. అది నిజంగా పెద్ద విజయమే! ఎందుకంటే మనల్ని చూసి ఎవరైనా ప్రేరణ పొందారు అని అంటే అది నిజంగా మనకి చాలా గర్వాన్ని కలిగిస్తుంది. ఫరవాలేదు, నేను కూడా ఏదో సాధించాను అన్న తృప్తిని కలిగిస్తుంది. మాకు మిసిసిపి లో స్నేహితులొకరు వుండేవారు. వాళ్ళు ఇండియాకి వెళ్ళిపోతున్నపుడు వీడ్కోలు చెప్పడానికి మేము కలిసినపుడు ఆవిడ నా దగ్గరకు వచ్చి, 'మీ పాట నాకు చాలా నచ్చింది, నేను కూడా సంగీతం నేర్చుకుందామనుకుని ఒక సంగీతం టీచరుని కూడా ఏర్పాటు చేసుకున్నాను' అని నాతో అన్నారు. అప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది, ఏదో, నేను కూడా నాకు తెలీకుండానే ఒక మనిషిలో ఒక మంచి ప్రేరణ కలిగించగలిగానని చాలా ఆనందపడ్డాను. మరి ఇది గెలుపు కాక ఇంకేమిటి?
మనకి నచ్చని విషయాలను, మనుషులను మన మనసులలోంచి పక్కకి నెట్టేసి, నిస్సంకోచంగా ముందుకు సాగిపోవటం ఒక గొప్ప విజయం. మనకి ఎవరైనా కష్టం, నష్టం కలిగిస్తే వారి మీద పగ, ద్వేషం లాంటి నకారాత్మక భావాలు పెంచుకునే బదులు వారిని క్షమించేసి, ఆ చేదునంతా తొలగించేసుకుంటే ఇంక జీవితమంతా తీపితోనే నిండిపోతుంది. అలాగే ఏ కారణం చేతనైనా మనకి తెలీకుండా మనమీద మనమే కోపాన్ని పెంచుకున్నప్పుడు కూడా ఆ నకారాత్మక భావాన్ని వూరికే పొడిగించకుండా మనల్ని మనమే క్షమించేసుకోవటం కూడా మనమీద మనం విజయం సాధించటంతో సమానమే! కోతిలాంటి ఈ మనసుని గట్టి నియంత్రణలో పెట్టుకోవటం కూడా అసలైన గెలుపే కదా!
ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నింటికీ వ్యతిరేకంగా వుండటం నిజమైన ఓటమి అని చెప్పచ్చు. ఏ పరిస్థితినైనా తమ దృష్టికోణంలోంచి మాత్రమే చూడటం, ఎదుటివారి వాదనను అర్ధం చేసుకోవటానికి ఏమాత్రము ప్రయత్నం కూడా చేయకపోవటం, ఇవన్నీ ఓటమి చిహ్నాలు. అలాగే సోమరిగా వుంటూ ఏ పని చెయ్యటానికి ఇష్టపడకుండా వుండటం ఓటమి చిహ్నం. అందుకు వ్యతిరేకంగా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ, కొత్త కొత్త విషయాలను నేర్చుకోవటానికి కుతూహలపడటం గెలుపుకి చిహ్నం. మనలో వున్న ప్రత్యేకతలను గుర్తించటం, వాటిని ప్రేమించటం, వాటిని వృద్ధి చేసుకోవటానికి కృషి చేయటం, వాటి వలననే తమకు అందరిలోనూ ప్రత్యేకత వచ్చిందని గుర్తించటం, ఇవన్నీ గెలుపుకి చిహ్నాలు. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. ఎంత గొప్ప ప్రత్యేకతలు వున్నా, ఎంతటి పేరుప్రతిష్టలు సంపాదించినా అతిశయాన్ని, గర్వాన్ని మాత్రం మనం మన దగ్గరికి కూడా రానివ్వకూడదు. ఎందుకంటే మన గెలుపుని కూడా చిటికెలో లాగా మార్చే శక్తి గర్వానికి వున్నది.
నాకు గెలుపుకి ఇంకో బలమైన సూచన ఏమనిపిస్తుందంటే గెలుపు మీద దృష్టి వున్నవాళ్లు ఎప్పుడూ వారి తప్పులకి, ఓటమిలకి ఇతరులను దోషిగా పరిగణించరు. ఆ తప్పులను నివారించుకోవడానికి, తమని తాము మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తారు. అందుకే వారు ఎప్పుడూ మంచి విమర్శలను ఆహ్వానిస్తారు, గౌరవిస్తారు, ఆమోదిస్తారు, అమలులో పెడతారు. అలాగే తమ మనసులో మాటని చెప్పటానికి, అదెంత చేదుగా వున్నా సరే, నిర్భయంగా మంచి మాటలలో వ్యక్తపరచటానికి ఎప్పుడూ జంకరు. అలాగే ఎప్పుడన్నా తమ వలన ఏదన్నా తప్పు జరిగితే వీళ్ళు క్షమాపణలు చెప్పటానికి కొంచెం కూడా జంకరు. ఎందుకంటే తప్పులను, ఓటమిని ఒప్పుకోవటం, ఆతర్వాత వాటిని సరిదిద్దుకోవటంలోనే అసలైన గెలుపు దాగివుందని వీరికి బాగా తెలుసు.
ఇంకో చిట్కా ఏమిటంటే మనం ఎప్పుడూ కూడా సామర్థ్యం వెనక పడాలి, గెలుపు వెనక కాదు, సామర్థ్యం వుంటే గెలుపు దానంతట అదే మన దగ్గరకు వచ్చేస్తుంది అసలు గెలుపంటే గమ్యాన్ని చేరుకోవటం, విజయాన్ని సాధించటం మాత్రమే కాదు. నిజమైన గెలుపు ఎల్లప్పుడూ విజయాన్ని ఆశించదు. ఎప్పుడూ గమ్యం దొరుకుతుందని అనుకోదు. ఆ గెలుపు కోసం, ఆ గమ్యాన్ని చేరుకోవటం కోసం మనసా, వాచా, కర్మణా, నిజాయితీగా పరిశ్రమ చేసేవారిని గెలుపు వరిస్తుంది. అంటే గెలుపుకి ముగింపుతో పని లేదు. దాని ఫలితం తో పని లేదు. కేవలం ఆ ప్రయాణం తో మాత్రమే పని వుంది. ఒకవేళ కింద పడి దెబ్బలు తగిలినా మళ్ళీ లేచి ప్రయాణం కొనసాగించేవారితోనే పని వుంది. వారినే గెలుపు వరిస్తుంది. అసలు ఓటమిని లెక్క చేయకుండా నిరంతర సాధన, శోధన చేసేవారికి ఓటమే వుండదు అని సాక్షాత్తు గెలుపే అంటుంది.
జీవితంలో మనకి ఎన్నో అపజయాలు ఎదురవుతూ వుంటాయి. కానీ వాటికి భయపడకుండా, ముందుకి సాగిపోవటం ఒక గొప్ప విజయ సూచన. అలాగే ఆ అపజయాలలో నుండి పాఠాలను నేర్చుకుని కొత్త విజయాలను సాధించటం కూడా ఇంకా గొప్ప విజయ సూచన.
నా దృష్టిలో ఇవన్నీ గెలుపుకి గుర్తులు. మరి మనలో వీటిల్లో ఏవేవి వున్నాయో, ఒకవేళ లేకపోతే మనం ఏం చేసి వాటిని తెచ్చుకోవాలో కొంచెం ఆకళింపు చేసుకుందాం. సరేనా?
ఈలోపల నేను మీదగ్గర నుండి కాస్త సెలవ తీసుకుని మళ్ళీ వచ్చే నెల మరిన్ని కొత్త కబుర్లతో మీ దగ్గరకు వస్తాను. అంతదాకా సెలవు.