Menu Close
Nagamanjari-Gumma
అనామిక (ధారావాహిక)
నాగమంజరి గుమ్మా

దాదాపు ఒక గంట దూరం ప్రయాణం చేశాక, అనుకోని సంఘటన జరిగిపోయింది. ముందుకు దారి చేసుకుంటూ వెళ్తున్న వాళ్ళు నరికిన పొదలో తేనెపట్టు ఒకటి ఉంది. కత్తి విసురుకు తేనేపట్టు సగానికి తెగి పడింది. అడవి తేనెటీగలు ఒక్కసారిగా జుమ్మని పైకి లేచాయి. తేనెటీగలను చూడగానే అనుచరులు అందరూ ఒక్క ఉదుటున పరుగు ప్రారంభించారు. "పరుగెత్తవద్దు, అందరూ కదలకుండా కూర్చోండి" అని నసీర్ కేక పెట్టి, ముసుగు పెట్టి, నేలపై పడుకుండిపోయాడు. కేక విన్న కొందరు తమ చొక్కాలు విప్పి తలపై కప్పుకుని కూర్చుండిపోయారు. వినిపించుకోకుండా పరుగెత్తిన వారిని వెంబడించి, వెంబడించి మరీ కుట్టాయి తేనెటీగలు. ఆ తేనెటీగల హోరు తగ్గి, అవి దూరంగా పోయేవరకు ఎవరూ లేచి నిలబడే సాహసం చేయలేకపోయారు. సహచరుల ఆర్తనాదాలు వినిపిస్తున్నా అక్కడనుంచి కదలలేదు.

తేనెటీగల హడావుడి సద్దుమణిగాక నెమ్మదిగా లేచి అందరిని వెతకడం ప్రారంభించారు. ముందు పొదలను నరుకుతూ నడచిన ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే తేనెటీగల దాడికి గురయ్యాడు. మరొకడు నసీర్ తో సహా నేలమీదకు పడి ముసుగుపెట్టాడు. నసీర్, ఆ అనుచరుడు లేచి మిగతా అనుచరులు పరుగెత్తిన దిశగా వెతుకుతూ, పిలుస్తూ వెళ్లారు. రెండు వైపుల నుండి వీరి పిలుపుకు ప్రతిస్పందన వచ్చి, ఇద్దరిద్దరుగా నలుగురు వచ్చి కలిశారు. మరో నలుగురు ఇంకా కనిపించవలసి ఉంది. తమ సామాన్ల సంచులు అన్ని ఒకేచోట పెట్టి, ఒకడిని మరణించిన వాడి దగ్గర కాపలా ఉంచారు. పేర్లు పెట్టి పిలుస్తూ మిగతావారిని వెతుకుతూ నసీర్, నలుగురు అనుచరులూ వెళ్లారు. ఒకరి తర్వాత ఒకరుగా నలుగురూ స్పృహ లేని స్థితిలో కనిపించారు. ఒక్కొక్కడూ ఒక్కొక్కరికి మోసుకుని వచ్చారు. వారిలో ఒకడిని తేనెటీగలు తీవ్రంగా కుట్టేసాయి. ముఖం, చేతులు వాచిపోయాయి. అక్కడక్కడా కుట్టిన తేనెటీగలు కూడా శరీరానికి అతుక్కుని చచ్చిపోయి ఉన్నాయి. అక్కడక్కడ దొరికే ఔషధ పత్రాలు వెతికి, తెంపి, నలిపి, ఆ పసర్లు పూసి, జాగ్రత్తగా ముళ్ళు లాగేసారు. ముఖం, మెడ, చేతులు, పాదాలు వాచిపోయాయి. తమ దగ్గర ఉన్న మందులలో నుంచి నొప్పి తగ్గించే మందులు, జ్వరం రాకుండా, ఇన్ఫెక్షన్ తగ్గించే మందులు వారితో మింగించారు. వారందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా, నసీర్ ఆధ్వర్యంలో నలుగురు కాస్త దూరం లో ఒక గొయ్యి తవ్వి మరణించిన తమ సహచరునికి అంత్యక్రియలు నిర్వహించారు.

గాయపడిన అనుచరుల దగ్గర కాపలాగా ఉన్నవాడు, తేనెపట్టు తెగి పడిన స్థలానికి వెళ్ళాడు. అక్కడ పట్టు రెండు ముక్కలుగా పడి ఉంది. ఒక ముక్క నేలపై పడిన ఆకులపై ఉండగా, ఇంకొకటి పొదను అంటి పెట్టుకుని ఉంది. తేనెటీగలన్నీ వెళ్లిపోయాయి. తేనె కారుతూ ఉంది. ఎగరలేని కొన్ని చిన్న ఈగలు మాత్రం ఇంకా పట్టుని అంటిపెట్టుకొని ఉన్నాయి. ఆ రెండు పెద్ద తేనెపట్టు ముక్కలను జాగ్రత్తగా తీసుకు వచ్చాడు. నీళ్లు పట్టడానికి తెచ్చిన ఒక కేన్వాస్ సంచిలోకి తేనెను జాగ్రత్తగా పిండాడు. ఒక ముక్క పిండేసరికే సంచి నిండిపోయి బరువుగా అయ్యింది. పిండగా ఖాళీ అయిన తిత్తిని ఇంకాస్త గట్టిగా రాతితో నొక్కి చదునుగా చేసాడు. మిగిలిన తేనె నేల లోకి ఇంకిపోయింది. ఆ తిత్తిని గట్టిగా రాతితో కొట్టి, కొట్టి, స్థూపాకారంగా దగ్గరగా నొక్కి పెట్టాడు. మధ్యలో ఒక గుడ్డ ముక్కను కూడా చేర్చాడు. ఇప్పుడు చూడటానికి ఒక దీపపు స్తంభంలా, 2 అడుగుల పెద్ద కొవ్వొత్తిలా కనబడుతోంది. రెండవ తేనెపట్టు ముక్కను జాగ్రత్తగా ఆకుల బొత్తిపై పెట్టాడు. దానిపై మరిన్ని పెద్ద ఆకులను కప్పాడు. ఒక్కొక్కరుగా గాయపడిన వారికి స్పృహ వస్తోంది. వారిని లేపి కూర్చోపెట్టి, మంచినీళ్లు తాగించాడు.

ఈలోగా అంత్యక్రియలు పూర్తి చేసుకుని, నసీర్ బృందం తిరిగి వచ్చింది. అటవీప్రాంతం కావడం వలన అప్పటికే కనుచీకటి పడుతోంది. గాయపడిన నలుగురికి స్పృహ వచ్చినా ఇంకా నడిచే పరిస్థితిలో లేరు. వారిలో ఒకరికి తీవ్రగాయాలయి, జ్వరం కూడా వచ్చింది. ఆకులు నూరిన ముద్దను మంట తగ్గడానికి పైపూతగా వేస్తూనే ఉన్నారు. ఈ రాత్రికి ప్రయాణం కొనసాగించడం అసాధ్యం అని నసీర్ నిర్ణయించాడు. మధ్యాహ్నం తినగా మిగిలిన కాల్చిన మాసం, వెంట తెచ్చుకున్న రొట్టెలు, వెదురు బియ్యం గంజి, పుచ్చుకొని, ఆ రాత్రికి భోజనాలు అయ్యేయి అనిపించారు. ఈ ప్రాంతం ఎంతవరకు సురక్షితమో తెలీదు. వంతులు వారీగా ఒక్కొక్కరు కాపలా ఉండడానికి నిర్ణయించుకున్నారు. అనుచరుడు తయారుచేసిన కొవ్వొత్తి కాసేపు కష్టపడ్డాక వెలిగింది. నెగడు వేయడానికి భయపడ్డారు. ఆ మంటకు, పొగకు చుట్టుపక్కల ఇంకేవైనా తేనెపట్లు కదిలే ప్రమాదం ఉందని తలిచారు.

తేనెపట్టు దీపం చుట్టూ జాగ్రత్తగా శుభ్రం చేసుకుని, చుట్టూ సామాన్ల సంచులు పేర్చుకుని మధ్యలో పడుకున్నారు. వారి చుట్టూ పావుగంటకు ఒకసారి తిరుగుతూ, పాములు, అడవి జంతువులు రాకుండా కాపలా కాస్తున్నాడు ఒకడు. రెండు గంటలు గడిచాక మరొకడిని నిద్రలేపి కాపలా కాస్తున్నవాడు నిద్రపోయాడు. తేనెపట్టు దీపం చక్కగా వెలుగుతోంది. నిద్ర మత్తు వదలడానికి ఒక సిగరెట్ వెలిగించాడు అనుచరుడు. పొగత్రాగుతూ, కత్తి చేతపట్టుకుని చుట్టూ ఒకసారి తిరిగివచ్చి, దగ్గరలోని బండరాతిపై కూర్చున్నాడు. దూరంగా అడవి జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. అవి బహుశా తాము విడిచి వచ్చిన మడుగు దగ్గరకు నీటి కోసం వెళ్తున్నాయి అనుకున్నాడు. ఇంతలో పక్కన ఉన్న పొదలో అలికిడి అయ్యింది. చటుక్కున కత్తి పట్టుకొని లేచి నిలబడ్డాడు. సిగరెట్ ఆఖరిగా పీల్చి, నిప్పు లేకుండా ఆర్పి, కింద పడేసాడు. శబ్దం వచ్చిన వైపు అడుగులు వేసాడు. సంచి పక్కన పెట్టిన లైటు ఉన్న హెల్మెట్ పెట్టుకుని లైట్ వేసి చుట్టూ చూసాడు. ఒక దిశలో ఉన్న పొదలు నెమ్మదిగా కదులుతున్నాయి. నెమ్మదిగా కాలికింద పడి విరిగే పుల్లల చప్పుడు కూడా కాకుండా అడుగులు వేస్తూ వెళ్ళాడు. ఒక పెద్ద అడివి పిల్లి, విశ్రాంతి తీసుకుంటున్న చెవులపిల్లి పై దాడి చేసి, చంపి, తీరిగ్గా తింటోంది. తలకి పెట్టుకున్న లైటు వెలుగు మీద పడడంతో పచ్చగా మెరుస్తున్న కళ్ళతో చూసి, మ్యావ్ మంటూ, ఒక్కసారిగా వెనక్కి దూకి పారిపోయింది.

తేలికపడ్డ మనసుతో వెనక్కి వచ్చి కూర్చున్నాడు కాపలావ్యక్తి. లైటు ఆపి, హెల్మెట్ మళ్ళీ యధాస్థానంలో పెట్టేసాడు. చీకటి మళ్ళీ ఆక్రమించుకుంది. తేనెపట్టు దీపం నిశ్చలంగా వెలుగుతోంది. గాలి లేదు, ఉక్కపోత లేదు. చల్లగా ఉంది. అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. చెట్లపై మిణుగురు పురుగులు ఎగురుతున్నాయి. నక్షత్రాలు ప్రకాశవంతంగా ఉన్నాయి. పున్నమి వెళ్లి నాలుగైదు రోజులు దాటిందేమో అర్ధచంద్రుడు పడమటి వైపు ఉదయిస్తున్నాడు. మళ్ళీ మరొకసారి చుట్టూ తిరిగి వచ్చాడు. వాచీ చూసుకున్నాడు. మరో అరగంట దాటితే మూడవ వాణ్ణి లేపాలి. జ్వరంతో బాధపడుతున్నవాడు మూలుగుతున్నాడు. వాడి నుదురు తాకి చూసాడు. వేడిగా ఉంది. ఆమాత్రం ఒత్తిడికే గాయాలు ఒత్తుకుని నొప్పి పెట్టినట్లు 'ఇస్' అన్నాడు వాడు. కనురెప్పలు కాస్త వాచి ఉన్నాయి. కళ్ళు తెరిచి చూసాడు. దాహం అన్నట్లుగా పెదవులు కదిపాడు. పెదవులు కూడా వాచిపోయి ఉన్నాయి. కొద్దిగా విడివడిన పెదవుల పైనుంచి కొంచెం కొంచెంగా నీళ్లు పోసాడు కాపలావ్యక్తి. మూడు గుటకలు వేసాక కళ్ళరెప్పలు ఆర్పాడు, ఇంక చాలు అన్నట్లు. నీళ్ల సీసా మూత పెట్టి, నిద్రపోయిన వాడికి దుప్పటి సరిగ్గా కప్పి బండరాతి దగ్గరకు వచ్చాడు.

మళ్ళీ పొదలలో అలికిడి అయ్యింది. ఇందాక వదిలేసిన చెవులపిల్లి మాంసాన్ని తినడానికి పిల్లి వచ్చి ఉంటుంది అనుకున్నాడు. అయినా మళ్ళీ హెల్మెట్ తగిలించుకుని, లైటు వేసి వెళ్లి చూసాడు. పచ్చ కళ్ళ పిల్లి గుర్రు మంటూ చూసింది. 'ప్రశాంతంగా నన్ను తిననియ్యవా?' అన్నట్లు. నవ్వుకుంటూ లైటు ఆర్పి, హెల్మెట్ తీసి సంచిలో పడేసి, మరో సిగరెట్ వెలిగించబోయాడు. పొదలో చెవులపిల్లి దేహంలో భాగాలను ఆరగిస్తున్న అడవిపిల్లి ఒక్కసారి చేస్తున్న పని ఆపేసింది. తన చెవులు నిక్కించింది. సన్నగా మ్యావ్ మంది. అంతే. ఒక్కక్షణం కీచురాళ్ల రొద ఆగి, తిరిగి మొదలైంది. కాపలావ్యక్తి అనుమానంగా చుట్టూ చూసాడు. చీకట్లో రెండు మెరుస్తున్న కళ్ళు కనిపించాయి. పిల్లే అనుకున్నాడు. దగ్గరకు వచ్చేవరకు ఎలుగుబంటి అని పోల్చుకోలేకపోయాడు. గట్టిగా కేకలు పెట్టి అందరిని లేపాడు. గబగబా హెల్మెట్ తగిలించి లైటు వేసాడు. ఆరోగ్యంగా ఉన్న ముగ్గురు, నసీర్ వెంటనే లేచారు. నలుగురూ వెంటనే హెల్మెట్ ధరించి లైటు వేశారు. అనారోగ్యంతో ఉన్నవాళ్లు కాస్త నెమ్మదిగా లేచారు. నాలుగు వైపులా నుండి లైటు పడటంతో ఎలుగుబంటి పరుగున వచ్చి, ఆకుల మధ్య భద్రపరచిన తేనెపట్టు ముక్క తీసుకొని అడవిలోకి పారిపోయింది. అందరూ 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడి సామాన్లు అక్కడ తిరిగి సరిచేసి పెడుతూ ఉండగా, జ్వరం వచ్చినవాడు లేవలేదని గుర్తించారు. దగ్గరకు వెళ్లి చూడగా, ఆ వ్యక్తి కళ్ళు తెరిచి, మరణించి ఉన్నాడు. ఎలుగుబంటిని చూసి, గాయాలు, జ్వరంతో కదలలేక పోయాడని, భయంతో గుండె ఆగిపోయి ఉంటుందని, అందువల్లనే అతడు చనిపోయాడని అర్ధమయ్యింది. అనుచరులందరూ తమ సహచరులలో మరొకడు మరణించినందుకు బాధపడ్డారు. నసీర్ మాత్రం, ఆ వ్యక్తి జ్వరం కారణంగా ప్రయాణం ఆగిపోయే సమస్య ఉందని ఆలోచిస్తున్నాడు. ఈ విధంగా తన సమస్య తీరినందుకు సంతోషించాడు.. అప్పటికప్పుడే అంత్యక్రియలు నిర్వహించమని ఆదేశించాడు నసీర్. లేదంటే  ఇంకా ఏవైనా క్రూరమృగాలు రావచ్చును అన్నాడు. దానితో బెదిరిపోయిన అనుచరులు అప్పటికప్పుడే మొదట పాతిన మృతదేహం పక్కనే ఈ వ్యక్తిని కూడా ఖననం చేశారు. వేగుచుక్క పొడిచింది. ఇంక ఆలస్యం చేయకుండా ప్రయాణం ప్రారంభించమన్నాడు నసీర్. తేనెటీగలు కుట్టిన ముగ్గురి బేగులు వేరేవారు భుజాన తగిలించుకున్నారు. మరణించిన వారి బ్యాగులను మరో ఇద్దరు పట్టుకున్నారు. తలలకు హెల్మెట్ ధరించి, ఆ లైటు వెలుగులో దారి చేసుకుంటూ ముందుకు సాగారు.

వెలుతురు వచ్చాక, నీటి వసతి కనిపించిన చోట బృందాన్ని ఆపుచేయించాడు నసీర్. చుట్టుపక్కల పరిశీలనగా చూసి, ప్రమాదకరంగా లేదని నిశ్చయించుకున్నాక, ఇద్దరిద్దరు జట్లుగా వెళ్లి స్నానాది కాలకృత్యాలు తీర్చుకు వచ్చారు. దగ్గరలో దొరికిన పళ్ళు, కాయలు తిని కాసేపు విశ్రమించి, నీళ్లు నింపుకుని మళ్ళీ బయలుదేరారు. మందులు వాడటం, ఆకు పసర్లు పనిచేయడంతో తేనెటీగలు కుట్టినవారు కూడా బాధ నుంచి తేరుకున్నారు. ఇద్దరు తమలో లేని వెలితి మాత్రం బాధిస్తోంది. ఏదో నిధి అన్వేషణకు వెళ్తున్నట్లు అనుచరులకు చెప్పాడు నసీర్. తమ వంతుగా నసీర్ మంచి లాభం ఇస్తాడని వారు ఆశిస్తున్నారు. అందుకే కష్టానికి వెరవకుండా వచ్చారు. మరణించిన వారి కుటుంబాలకు లోటు జరగకుండా చూస్తానని, వారికి కూడా మీతో పాటు తన లాభాల్లో వాటా ఇస్తానని అనుచరులకు చెప్పాడు నసీర్. ఆ మాటలతో అనుచరులలో ధైర్యం, ఉత్సాహం ఇంకాస్త పెరిగాయి. తమ జీవితాలు మలుపు తీసుకుని, బంగారుమయం అవుతాయని ఆశిస్తున్నారు వారు. ఇలాంటి అన్వేషణ జరిగినప్పుడు నరబలి కోరుతుందని, అది మొదటే తీరిపోవడంతో తనదారి సరైనదేనని, అన్వేషణ సరైన తీరులోనే జరుగుతోందని ఊహించాడు నసీర్. అసలైన మలుపు ముందుందని ఏమాత్రం ఆలోచించినా అక్కడికక్కడే వెనుదిరిగి ఉండేవాడు.

*****

తెల్లవారుజామున లేచి, తల్లిదండ్రులతో కలిసి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి దర్శనానికి బయలుదేరాడు మోహన్. సుధ నిమ్మకాయ పులిహార, పెరుగు గారెలు, ఇడ్లీ, సాంబారు, చెట్నీ, సేమ్యాపాయసం చేసింది. టాక్సీ మాట్లాడుకుని జంబుకాన, మంచినీళ్ల క్యాన్లు, ఫలహారాలు అన్ని డిక్కీలో సర్దించి, నలుగురూ బయలుదేరారు. పెద్దగా రద్దీ లేకపోవడంతో వెంటనే దర్శనం అయిపోయింది.

దర్శనం అవగానే సంపంగి చెట్ల నీడన జంబుకాన పరిచి, ఇడ్లీ, సాంబారు, చెట్నీ, మంచినీళ్లు డబ్బాలు, ప్లేట్లు, గ్లాసులు సర్దింది సుధ. మోహన్, తల్లిదండ్రులు వచ్చి కూర్చున్నారు. కమ్మని సంపంగి పరిమళాలు నాసికను చుట్టుముడుతున్నాయి.

"సంపెంగ వాసనలకు తుమ్మెదలు రావట. ఈ ప్రాంతం మామూలు సంపెంగలుతో పాటు, తెల్ల సంపెంగలు, ఆకు సంపెంగలు, ఇలా ఎన్నో సంపెంగ తోటలకు సింహాచలం ప్రసిద్ధి నాన్నా… అలాగే అనాస పండ్లకు కూడా. ఇక్కడ పైనాపిల్ కోలనీ అనే పేరుతో ఒక కోలనీ కూడా ఉందట." చెప్పాడు మోహన్.

"ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉన్న విద్యానాథుని(అగస్త్యుని) "నలకీర్తికౌముది" అనే సంస్కృతకావ్యంలో ఈ క్రింది శ్లోకం ఉంది.

భృంగానవాస్తి ప్రతిపన్నఖేదా
కృత్వాననే గంధఫలీ తప:ఫలమ్
తన్నాసికా భూ దనుభూతగంధా
స్వపార్శ్వ నేత్రీ కృత భృంగసేవ్యా

ఈ శ్లోకం భావం గ్రహించి రామరాజభూషణుడు

నానాసూన వితాన వాసనల నానందించు సారంగ మే
లా నన్నొల్ల దఁటంచు గంధఫలి బల్కాలం దపం బంది యో
షా నాసాకృతిఁ దాల్చి సర్వ సుమనస్సౌరభ్య సంవాసి యై
పూనెం బ్రేక్షణమాలికా మధుకర పుంజంబు లిర్వంకలన్

అనే పద్యం రచించినాడట.

అన్ని రకాల పూవుల వాసనను గ్రోలుచు ఆనందించే తుమ్మెద తనంటే ఎందుకిష్టపడదని సంపెంగ పూవు ఘోరమైన తపస్సు చేసి నాయిక నాసిక రూపును ధరించి ఆమె చూపులనే తుమ్మెదల బారునే పొందినదని కవి ఉత్ప్రేక్షించాడు. అంటే నాయికయైన గిరికా దేవి ముక్కు సంపెంగ పూవంత అందంగా ఉందని భావం." అని సుధ చెప్పింది.

"శభాష్ అమ్మాయి. ఈ కాలంలో తెలుగు సాహిత్యం మీద ఈమాత్రం పట్టు ఉందంటే అభినందనీయం. మా తెలుగు మాస్టారు చెప్తే విన్నాను ఈ పద్యాన్ని" అంటూ అభినందించాడు మోహన్ తండ్రి ప్రభాకరరావు. అంతటితో ఆగకుండా "వీడు ఉన్నాడు చూడు, ఎప్పుడు చూసినా ఆ చెత్త సినిమా పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఆ సినిమాల ప్రభావమే ఈ ప్రేమలు, వల్లకాడూను…" అనేసి నాలిక్కర్చుకుని "అయ్యో… ఏమనుకోకమ్మాయ్.. పొరపాటుగా వచ్చేసింది." అన్నాడు.

"సుధ ఏమనుకున్నా, ఏమనుకోకపోయినా నేను మాత్రం అనుకున్నాను నాన్నా… సినిమా పాటలు చెత్త కాదు" అన్నాడు ఉక్రోషంగా మోహన్.

"సర్లేరా… ముందు ఇడ్లిలు తిను, చల్లారిపోతున్నాయి" అంది విజయ.

****సశేషం****

రచయిత్రి పరిచయం:

Nagamanjari-Gummaనాగమంజరి గుమ్మా గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయిని. ప్రవృత్తి: సాహిత్య సేవ. భాషణం, పఠనం, లేఖనం మూడూనూ..

కవితలతో మొదలై పద్యాలు, ఖండికలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, సమీక్ష, గీతం, కథలు, నవల... ఇలా వీలైనన్ని, చేతనైనన్ని సాహితీరూపాల్లో రచనలు చేయడం వారికి నిత్యకృత్యమైనది. వారు వ్రాసిన శ్రీగణేశ చరిత్ర, విశ్వనాథ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి  పుస్తకాలుగా ముద్రితమయ్యాయి. అనేక దిన, వార, పక్ష, మాస, ద్వైమాస పత్రికలలో వారి రచనలు ప్రచురితమయ్యాయి.

అవకాశం దొరికినప్పుడల్లా పురాణ ప్రవచనాలు చెప్పడం, పిల్లలకు శ్లోకాలు పద్య పఠనంలో శిక్షణ నివ్వడం. ముగ్గుల పోటీల్లో, మాస్టర్స్ అథ్లెటిక్స్ లో రాష్ట్రస్థాయిలో బహుమతులు, పతకాలు పొందడం జరిగింది.

ముందుమాట:

"అనామిక" అనే ఈ నవల 90' లలో మొదలైన ప్రేమకథ ఏ మలుపులు తిరిగింది? అనామిక ఎవరు? ఆ ప్రేమ జంటకి అనామికకు సంబంధం ఏమిటి? అనే విషయాలతో ఆసక్తికరంగా సాగుతుంది.

దైవిక శక్తులతో ఆటలాడడం ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. అలాంటి వారిని శిక్షించే పని భగవంతుడే వివిధ రూపాలలో పూర్తి చేస్తారు. అలా జరిగిన ఒక చిన్న సంఘటన ఆధారంగా ఈ నవల రూపు దిద్దుకుంది.

ఈ నవల మిమ్మల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తూ....మీ అభిప్రాయాలను, సూచనలను మీ కామెంట్స్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ.. "అనామిక" నవలను సీరియల్ గా ప్రచురిస్తున్న సిరిమల్లె సంపాదకులు మధు మరియు ఉమప్రియ గార్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ...

- నాగమంజరి గుమ్మా, శృంగవరపుకోట

Posted in June 2025, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *