Menu Close
VSRao
మహాత్మా గాంధి
డా. వల్లూరుపల్లి శివాజీరావు
Mahatma-Gandhi
Image by WikiImages from Pixabay

మోహన్ దాస్ ఇంగ్లండ్ ప్రయాణం

మోహన్ దాస్ తన 18 వ ఏట (1887లో), మెట్రిక్యూలేషన్ ఉత్తిర్ణుడయ్యారు. ఈ పరీక్ష వ్రాయటానికి కథియవార్ విద్యార్థులు అహ్మదాబాద్ గాని, బొంబాయి గాని వెళ్ళాలి. తండ్రి మరణంతో ఆర్ధిక స్థోమత అంతగా లేని కారణంగా మోహన్ దాస్ దగ్గరలో ఉన్న అహ్మదాబాద్ వెళ్లి వ్రాయవలసి వచ్చింది. తోడు లేకుండా రాజ్ కోట నుంచి అహ్మదాబాద్ వెళ్లటం ఈతనికి ఇదే మొదటిసారి. పరీక్షలో ఉత్తీర్ణుడయిన తరువాత కుటుంబ పెద్దలు అతనిని భావనగర్ లో గాని, బొంబాయిలో గాని పై చదువులు చదువుకోమని సలహా ఇచ్చారు. చివరకు దగ్గరలో ఉన్న భావనగర్ లో 1885లో స్థాపించబడిన ‘సమల్ దాస్’ కళాశాల లో ‘ఇంటర్మీడియెట్’ చదవటం ప్రారంభించారు.

కాని అక్కడ బోధించే పాఠాలు అర్ధమవటానికి చాలా కష్టంగా ఉండేది. ఉపాధ్యాయుల బోధనలు అర్ధమయ్యేవి కావు. నిజానికి వారు ఉత్తమ శ్రేణి ఉపాధ్యాయులు. అతి కష్టం మీద మొదటి అర్ధ సంవత్సరం పూర్తిచేశాడు మోహన్ దాస్. తరువాత కొద్ది రోజులకు మోహన్ దాస్ కుటుంబ స్నేహితుడు, సలహాదారు ‘మావ్జి దవే జోషి’ (Mavji Dave Joshi) ఒక రోజు వీరింటికి వచ్చారు. మోహన్ దాస్ తండ్రి మరణం తరువాత కూడా ఈయన ఈ కుటుంబంతో సాన్నిహిత్యం కొనసాగిస్తూనే ఉన్నారు. అప్పుడు మోహన్ దాస్ తల్లి పుత్లీబాయి, పెద్దన్న ‘లక్ష్మీదాస్’ తో జరిగిన సంభాషణలో మోహన్ దాస్ ప్రస్తావన వచ్చింది. ఇతను ‘సమల్ దాస్’ కళాశాలలో చదువుచున్నాడని తెలుసుకుని ఆయన (Joshi) ఇలా అన్నాడు.

“కాలం మారిపోయింది. తగిన విద్య లేకపోతే మీకుటుంబంలో ఎవరూ మీ తండ్రి స్థానం పొంద లేరు. ఇప్పుడు ఈ కుర్రవాడు ఇంకా కళాశాల విద్య కొనసాగిస్తున్నాడు. ఇతనిని తండ్రి స్థానంలో నిలబెట్టటానికి కృషి చేయాలి. B.A. పట్టా పొందాలంటే 4,5 ఏళ్ళు పడుతుంది. అది సాధించినా కేవలం 600 రూపాయల ఉద్యోగం వస్తుంది గాని దివాన్ పదవి కాదు. న్యాయశాస్త్ర విద్య చదవటానికి ఇంకా ఎక్కువ కాలం పడుతుంది. ఆ సమయానికి అనేకమంది న్యాయశాస్త్ర పట్టాదారులు ఒక దివాన్ పదవి కొరకు పోటీపడతారు. అందువల్ల మీరు ఇతనిని ఇంగ్లండ్ పంపించండి. అక్కడ బారిస్టర్ అవటం చాలా తేలి క అని మా అబ్బాయి ‘కేవల్ రామ్’ చెప్పాడు. మూడు ఏళ్లల్లో బారిష్టర్ పట్టాతో తిరిగివస్తాడు. ఖర్చులు కేవలం 4, 5 వేల రూపాయలు అవుతాయి. బారిష్టర్ గా తిరిగివచ్చాడంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. అడిగిన తడవుగా దివాన్ పదవి వస్తుంది. ఎంతో విలాసవంతగా, దర్పంతో కూడిన జీవితం అనుభవిస్తాడు.

కాబట్టి మీరు ఈ సంవత్సరమే మోహన్ దాస్ ను ఇంగ్లండ్ పంపించమని గట్టిగా చెపుతున్నాను. మా అబ్బాయి కేవల్ రామ్ కు ఇంగ్లండ్ లో స్నేహితులున్నారు. వారికి మోహన్ దాస్ ను పరిచయం చేస్తూ ఈతనికి ఉత్తరాలు ఇస్తాడు. అందువల్ల మీ అబ్బాయికి ఇంగ్లండ్ లో చాలా తేలిక అవుతుంది.”

జోషి జీ (మావ్జి దవే జోషి) మోహన్ దాస్ వైపుకు తిరిగి ఎంతో నమ్మకంతో ఇలా అన్నాడు: “నీకు ఇక్కడకంటే ఇంగ్లండ్ వెళ్లి చదువుకోవటం ఇష్టం ఉండదా? నాకు ఇంతకంటే ఏదీ మంచి విషయం అనిపించలేదు.”

ఆ సమయంలో మోహన్ దాస్ కు ఇంతకంటే ఏదీ మంచి విషయం అనిపించలేదు. అప్పుడే అతనికి చదువు అంటే ఉన్న బిడియం, భయాన్ని అధిగమించటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన సలహా ఎంతో నచ్చి, తాను ఇంగ్లండ్ త్వరగా వెళ్తేనే మంచిదనిపించింది. కాని పరీక్షలు ఉత్తీర్ణుడవటం చాలా కష్టతరమనిపించింది. దీనికంటే వైద్య విద్య చదువు మంచిది కదా అనిపించి ఇది ఆయనకు చెప్పాడు.

అప్పుడు పెద్దన్న లక్ష్మీదాస్ కలగజేసుకుని “నాన్న ఇది ఎప్పుడు ఇష్టపడలేదు. వైష్ణవులయిన మనం మానవ శరీరాలను కోయరాదని నిర్ధేశించారు” అని చెప్పాడు.

దీనిని జోషిజీ ఇలా సమర్ధించారు. “నేను మీ తండ్రి లాగా వైద్యవృత్తిని వ్యతిరేకించను. మన శాస్త్ర గ్రంధాలు దీనికి వ్యతిరేకం కావు. కాని వైద్యశాస్త్రం పట్టాతో దివాన్ పదవి వరించదు. నీవు దివాన్ కాని, దాని కంటే పైపదవిలో గాని ఉండాలని నా సలహా. ఈ విధంగా మీ పెద్ద కుటుంబానికి అవసర మైన భద్రతను పెంపొందించుకోవచ్చు. కాలం త్వరితగతిని మారుతోంది. రోజురోజుకూ జీవనం కష్టతరమ వుతోంది. కాబట్టి అత్యంత తెలివైన పని మోహన్ దాస్ బారిస్టర్ అవటం.”

అప్పుడు ఆయన పుత్లీబాయి వైపుకు తిరిగి “ఇక నేను వెళ్ళాలి. నేను చెప్పిన వాటిని గురించి ఆలోచించండి. నేను మరల వచ్చినప్పుడు మోహన్ దాస్ ను ఇంగ్లండ్ పంపించటానికి చేసిన ప్రయత్నాలను వినాలనుకుంటున్నాను. నా సహాయం అవసరమయితే నాకు తెలియజేయండి” అని ఆయన సెలవు తీసుకున్నారు.

గాంధీజీ ఆలోచనలు

తరువాత జరిగిన పరిణామాలను గాంధీజీ మాటల్లో తెలుసుకుందాం. “నేను వెంటనే గాలిలో హర్మ్యాలను నిర్మించటం మొదలెట్టాను. పెద్దన్న దీనిని గురించి తీవ్రంగా ఆలోచించటం ప్రారంభించాడు. దీనికి కావలిసిన పైకం ఎలా సమకూర్చాలి, ఇంత చిన్నవాడినయిన నన్ను ఒంటరిగా ఇంగ్లండ్ పంపించటం తగునా అని ఆయన ఆలోచనలు. మా అమ్మకు కలవరం మొదలైంది. నన్ను విడిచి ఉండటం ఆమెకు నచ్చలేదు. చివరకు ఆమె తన మరిది, ఇంటి పెద్దదిక్కు ‘తులసీదాస్ గాంధి’ (మా తండ్రి తమ్ము డు) కు చెప్పి ఆయన ఒప్పుకుంటే అప్పుడు నిర్ణయించుదామని చెప్పింది.

కానీ, మా అన్నయ్యకు వేరే ఆలోచన వచ్చింది. ఆయన నాతో ఇలా అన్నారు. ‘మనకు పోర్ బందర్ రాష్ట్రంలో కొంత పట్టు ఉంది. దీని పరిపాలనాధికారి Mr. Lely కు మన కుటుంబం అంటే చాలా గౌరవం ఉంది. ఈయనకు బాబాయి చాలా ఇష్టమైన వ్యక్తి. అందువల్ల ఆయన సిఫారస్ తో రాష్ట్రం నుంచి నీవు వెళ్ళటానికి కావలసిన ఆర్ధిక సహాయం పొందవచ్చు.’

ఈ పధకం నాకు చాలా నచ్చి వెంటనే పోర్ బందర్ (180 కి.మీ. దూరం) వెళ్ళటానికి ఉద్యుక్తుడనయ్యాను. ఆ రోజులలో రైళ్లు లేవు. ఎద్దుల బండిమీద అయితే 5 రోజుల ప్రయాణం. నేను స్వతహాగా భయస్తుడిని, పిరికివాడిని. అయినా ఇంగ్లండ్ వెళ్లాలనే ఉత్సాహంలో ధైర్యం చోటుచేసుకుంది. వెంటనే ఎద్దుల బండిని అద్దెకు తీసుకుని దాని మీద దొరజి (Doraji) గ్రామం వెళ్లి, అక్కడనుంచి (96 కి.మీ. దూరం) ఒంటె మీద ప్రయాణించి, మొత్తం 4 రోజులలో చేరాను పోర్ బందర్. ఇదే ఒంటె మీద నా మొదటి ప్రయాణం.

“పోర్ బందర్ చేరి బాబాయికి సమస్కరించి అన్ని సంగతులు విపులంగా చెప్పాను. అయన చాలాసేపు ఆలోచించి ఇలా సమాధానం ఇచ్చాడు. "తన మతానికి అవమానం, భంగం, దురభిమానం కలుగనీయకుండా ఎవరు ఇంగ్లండ్ లో ఉండలేరు. నేను విన్నదానిని బట్టి నాకు చాలా అనుమానాలున్నాయి. మనదేశం తిరిగివచ్చిన బారిష్టర్ లను చూస్తే వారి జీవనశైలి ఆంగ్లేయుల జీవన శైలిని పోలి యుంటుంది. వారికి ఆహార విషయంలో నియమాలుండవు. వారి ఆహార్యం (dress) కూడా ఆంగ్లేయులను పోలి ఉంటుంది. వారి నోళ్ళల్లో ఎప్పుడు సిగార్ (Cigar: పొడవాటి పొగాకు చుట్ట) ఉంటుంది. మన కుటుంబ సాంప్రదాయంకు భిన్నంగా, వ్యతిరేకంగా ఉంటుంది. నేను ఇప్పుడు పుణ్యస్థలాలకు వెళ్లాలనుకుంటున్నాను. నాకు ఇంకా ఎంతో ఆయుష్షు లేదు. మరణం దారిలో ఉన్న నేను నిన్ను సముద్రాలను ధాటి ఇంగ్లండ్ వెళ్ళటానికి అనుమతి ఎలా ఇవ్వగలను? కాని నీదారికి అడ్డం రాను. అంతా నీ తల్లి అనుమతిమీద ఆధారపడి ఉంటుంది. నేను అడ్డుపడనని ఆమెకు చెప్పు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ తప్పక ఉంటాయి.

బాబాయి నన్ను సిఫార్స్ చేస్తూ ‘Mr. Lely’ కి ఉత్తరం ఎందుకు ఇవ్వలేదో నాకు తెలియదు. అయన దృష్టిలో నేను ఇంగ్లండ్ వెళ్ళటం అనైతిక చర్యగా భావించియుండవచ్చు.

మరుసటి రోజు నేను Mr. Lely ఇంటికి వెళ్లగా ఆయన ‘నీవు B.A. ఉత్తీర్ణుడవయ్యి నా దగ్గరకు రా. నేను నీకు ఇప్పుడు సహాయం చేయలేను’ అని వెళ్ళిపోయాడు. నిరుత్సాహంతో రాజ్ కోట తిరిగి వెళ్తున్న నా మనస్సులో నా భార్య నగలు, నన్ను ఎంతో ప్రేమతో చూసుకునే అన్న మదిలో మెదిలారు. ఇంటికి వెళ్లి అన్ని విపులంగా అమ్మకు, అన్నకు చెప్పాను. తరువాత అందరూ జోషిజీ (మావే దవే) తో సంప్రదించారు. నా భార్య నగలు అమ్మితే 3, 4 వేల రూపాయలు వస్తాయని చెప్పాడు. మిగతా పైకం అన్నయ్య సమకూర్చుతానని మాట ఇచ్చాడు.”

పుత్లీబాయి సమ్మతి; వీడ్కోలు

పుత్లీబాయికి తన పుత్రుడు ఇంగ్లండ్ వెళ్ళటం ఇష్టం లేదు. కాని ఆమె ఇంగ్లండ్ లో జీవితం గురించి తెలిసిన వారిని సంప్రదించింది. వారు అక్కడకు వెళ్లిన వారు మాసం తినటం, మద్యం త్రాగటం అలవాటు చేసుకుని చెడిపోతారని చెప్పారు. ఆమె పుతృడిని అడగగా మోహన్ దాస్ “నీవు నన్ను నమ్మలేవా? నేను నీకు అబద్ధాలు చెప్పను. వీటిని ముట్టను అని శపధం చేస్తున్నాను. ఇవన్నీ ఆలోచించకుండా ‘మావ్జీ దవే’ గారు నన్ను ఇంగ్లండ్ ఎందుకు వెళ్ళమంటారు?” అని తల్లికి నచ్చజెప్ప ప్రయత్నించాడు. దీనికి పుత్లీబాయి “నిన్ను నేను నమ్ముతాను. కాని దూరదేశంలో ఉన్నప్పుడు నిన్ను నేను ఎలా నమ్మగలను? నేను మన బేచార్జీ స్వామి (Becharji Swamy) ని అడుగుతాను” అని బదులిచ్చింది.

ఈ స్వామి ఒక జైన సన్యాసి. ఈయన జైనమతావలంబి అయిన పుత్లీబాయికి ఆధ్యాత్మిక గురువు. మోహన్ దాస్ కుటుంబానికి సలహాదారు. ఆయనను సంప్రదించగా “ఈ కుర్రవాడు మూడు విష యాలలో పవిత్ర ప్రతిజ్ఞలు చేయాలి. అప్పుడు ఇంగ్లండ్ వెళ్ళటానికి సమ్మతించవచ్చు” అని సలహా ఇ చ్చాడు. వెంటనే తల్లి ఎదుట ఈ సన్యాసి మోహన్ దాస్ తో ‘మద్యం, మాంసం, స్త్రీ’ ని ముట్టనని ప్రతిజ్ఞ చేయించాడు. అప్పుడు పుత్లీబాయి కుమారుడు ఇంగ్లండ్ వెళ్ళటానికి సమ్మతించింది.

మోహన్ దాస్ ఇంగ్లండ్ వెళ్తున్నాడని తెలుసుకున్న కాలేజీ విద్యార్థులు అతనికి ఘనమైన వీడ్కోలు ఇచ్చి సత్కరించారు. ఆ రోజులలో ఒక యువకుడు ఇంగ్లండ్ వెళ్ళటం ఒక అపూర్వమైన సంఘటన. ఈ సభలో మాట్లాడటానికి చిన్న ఉపన్యాసం వ్రాసుకున్నా, మోహన్ దాస్ దానిని చదవటానికి నట్లు కొడుతూ ఎలాగో పూర్తి అయిందనిపించాడు.

తల్లి, పెద్దల ఆశీర్వాదంతో మోహన్ దాస్ 1888 జూన్ లో నెలల వయస్సు ఉన్న జ్యేష్ఠ కుమారుడు ‘హరిలాల్ గాంధి’ ను వదలి ఎంతో సంతోషంతో పెద్దన్నతో కలిసి బొంబాయి పయనమయ్యాడు. అచ్చటికి చేరిన తరువాత స్నేహితులు, తెలిసిన పెద్దలు జూన్ నెలలో అలలతో కూడిన తుఫానులు వస్తాయి కాబట్టి నవంబర్ వరకు వెళ్లవద్దని తమ్ముడిని బొంబాయిలోనే ఒక స్నేహితుడి వద్ద ఉంచి రాజ్ కోట వెళ్ళి పోయాడు.

గాంధీజీ కుల-సంఘ బహిష్కరణ

ఈ విషయం గురించి గాంధీజీ ఇలా వివరించారు. “నేను బొంబాయి వెళ్లేముందు ఇంగ్లండ్ వెళ్లే విషయం గురించి మా ‘మోధ్ బనియా’ (వైశ్యులలో ఒక తెగవారు; వీరు మోధేశ్వరీ మాత ఆరాధకులు; ఈమె 18 చేతులు ఉన్న పార్వతీ మాత ఒక స్వరూపం) కుల పెద్దలు ఆందోళన మొదలుపెట్టారు. మా వైశ్య వర్గంలో ఎవరూ ఇంతవరకు విదేశాలు వెళ్ళలేదు కాబట్టి, వెళ్లదలచిన నన్ను కట్టడిచేయాలని వారు నిర్ణయించారు. దీనికి ప్రజలను సమీకరించి ఒక రోజు సభను ఏర్పాటుచేసి నన్ను పిలిచి ‘పెద్దల పంచాయితీ’ నిర్వహించారు. నేను అకస్మాతుగా ఎంతో ధైర్యం చేసి నిర్భయంగా వారి ముందు నిలబడ్డాను. అందరి కంటే పెద్ద, మా తండ్రితో సత్సంబంధాలున్న ఒకాయన నన్ను ఇలా ప్రశ్నించాడు.

‘మన వర్గం వారి అభిప్రాయం ప్రకారం నీవు ఇంగ్లండ్ వెళ్ళటం సముచితం కాదు. మన మతాచారం ప్రకారం సముద్రాలు దాటి విదేశాలు వెళ్ళటం నిషిధ్ధం. రాజీపడకుండా మన మతాచారాల ప్రకారం పరాయిదేశంలో జీవించటం అసంభవం. అక్కడ యూరోపియన్ల వలె నీవు మాంసం తినాలి, మద్యం సేవించాలి. కాబట్టి నీవు ఇంగ్లండ్ వెళ్ళటం విరమించుకో.’

దానికి నా సమాధానం: ‘మాకుటుంబంలో మీకున్న అనుబంధం గురించి తెలుసు. మీరు పెద్ద వారు. నేను ఇంగ్లండ్ వెళ్లాలనే నిర్ణయం మార్చుకోలేను. నా తండ్రి స్నేహితుడు, సలహాదారు, బ్రాహ్మణ పండితుడు నేను ఇంగ్లండ్ వెళ్లటంలో అభ్యంతరం పెట్టలేదు. ఆయనతోపాటు, నా తల్లి, అన్న నేను వెళ్ళటానికి అనుమతి ఇచ్చారు.

వెంటనే పంచాయితీ పెద్ద ‘దీనిని బట్టి నీవు మన కుల పెద్దల నిర్ణయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు’ అని హెచ్చరించాడు. దీనికి నేను ‘ఇందులో నేను నిరాశక్తుడిని. నా దృష్టిలో ఈ విషయంలో కులం అడ్డు పడకూడదు’ అని సమాధానమిచ్చాను.

దీనికి కోపగించుకున్న కులపెద్ద దూషించాడు. అయినా నేను కదలలేదు. అప్పుడు ఆయన ఇతర పెద్దలతో చర్చించి ఈ విధంగా తీర్మానం చేశాడు: ‘ఈ రోజు మొదలు ఈ కుర్రవాడిని మన కులం నుంచి వెలివేయబడిన వాడిగా పరిగణించాలి. ఈతనికి ఎవరైనా సహాయపడినా, వీడ్కోలు పలకటానికి ఓడ రేవుకు వెళ్ళినా వారు ఒక రూపాయి 4 అణాలు జరిమానాకు శిక్షార్హులు.’

ఈ తీర్మానం నా మీద ఎటువంటి ప్రభావం చూపలేదు. మా అన్నయ్య నాకు వీడ్కోలు పలకటానికి రాడేమోనాని భయపడినా, ఆయన తొణకకుండా నాతో బొంబాయి పయనమవ్వటానికి ఉద్యుక్తుడయ్యాడు.

నేను బొంబాయిలో ఉన్న సమయంలో జునాఘడ్ నుంచి ‘త్రయంబకరాయ్ మజుందార్’ అనే వ్యక్తి న్యాయ శాస్త్ర విద్య చదవటానికి సెప్టెంబర్ 4 వ తేదీన (1888) లండన్ వెళ్తున్నారని వార్త విన్న అన్నయ్య, అతనితో పాటు నేను వెళ్తే మంచిదని అమ్మను ఒప్పించి బొంబాయి వచ్చి నన్ను పంపించటానికి సన్నాహాలు చేశాడు. కావలసిన పైకం అప్పుగా ఇవ్వమని మా బావ గారిని అడుగగా ఆయన నా సంఘ బహిష్కరణ విని, పెద్దల తీర్మానాన్ని దాటటానికి సాహసించలేదు. కాని నా స్నేహితుడి కుటుంబం నిర్భయంగా ముందుకు వచ్చి, అవసరమైన పైకం అప్పుగా ఇచ్చారు. ఈ డబ్బును అన్నయ్య బొంబాయి తీసుకురాగా దానితో ప్రయాణపు టిక్కట్టు కొని, మిగిలిన డబ్బుతో కావలసిన బట్టలు కొన్నాను. వీటిల్లో ఒక టై (tie), ఒక జాకెట్ (jacket) కూడా ఉన్నాయి. జాకెట్ కొంచెం చిన్నది అయినా సర్దుకున్నాను ఇంగ్లండ్ వెళ్లాలనే ఉత్సాహంతో. ఇంకా మిగిలిన డబ్బును నా ప్రయాణ ఖర్చులకు, ఇంగ్లండ్ లో మొదట ఖర్చులకు ఉంచుకున్నాను.

బొంబాయిలో నా స్నేహితులు త్రయంబకరాయ్ మజుందార్ ప్రయాణించే గది (cabin) లోనే ఉండేటట్లుగా తీసుకున్నారు. అతను వయస్సులో నాకంటే పెద్దవాడు, అనుభవశాలి. నేను ఎటువంటి అనుభవంలేని 18 ఏళ్ల కుర్రవాడిని. ఆయన నన్ను సాదరంగా తన దగ్గరకు తీసుకుని సలహా ఇచ్చి ధైర్యం చెప్పారు...... చివరకు ఎంతో ప్రయాసతో నా ఓడ ప్రయాణం S.S. Clyde లో బొంబాయి నుంచి 1888 వ సంవత్సరంలో సెప్టెంబర్ 4 వ తేదీన మొదలయింది.”

Mahatma-Gandhi-18Years
ఇంగ్లండ్ వెళ్లే ముందు 18 ఏళ్ళ, 11 నెలల మోహన్ దాస్ కరంచంద్ గాంధి

****సశేషం****

Posted in June 2025, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *