గతి : తిస్రగతి
రధీఫ్ : వంశీధర!
*****
హరివైనను మానవుడిగ పుడమిపైన వెలసినావు వంశీధర!
భువిజనులను కాచుటకై తలచినావు వంశీధర!
దేవకీ వసుదేవులు పొందిరి నిను పుణ్యఫలమున!
యశోద ప్రియపుత్రుడవై పెరిగినావు వంశీధర!
గోవర్థన గిరినీడను గోపాలుర కాచితీవు,
కాళీయుని గర్వమంత అణచినావు వంశీధర!
కంసాదుల బారినుండి ప్రజగాచిన యవనారివి,
జననీ జనకుల చెర విడిపించినావు వంశీధర!
సత్యముగా నినుకోరిన రుక్మిణి చేపట్టినావు,
నిను నమ్మిన వారినెపుడు బ్రోచినావు వంశీధర!
గజల్ : తిస్రగతి/ అంత్యప్రాస
*****
నిత్యము నిను భక్తితోడ పూజింతును శ్రీలక్ష్మీ,
శ్రీవైష్ణవి, పద్మాలయ కరుణించవె మహలక్ష్మీ!
నీవునిలుచు తావులోనె నిలిచియుండు సిరిసంపద,
మదిని నిన్ను నమ్మితినీ కావుమమ్మ గజలక్ష్మీ!
సంతాన భాగ్యమొసగేటి సంతానలక్ష్మివీవేలె,
విద్యనొసగి విద్యాలక్ష్మి జయమీయవె జయలక్ష్మీ!
కామితములు దీర్చేటీ శ్రీమంతురాలివీవు,
వరములిచ్చి భక్తజనుల బ్రోవుమమ్మ వరలక్ష్మీ!
సత్యమైన భక్తి మెచ్చి కనకధార కురిపిస్తివి,
జగతినంత శాసించే శక్తి నీవె ధనలక్ష్మీ!