మహాభాగవతంలో నీకు ఏది ఇష్టం అని అడిగితే తడుముకోకుండా చెప్పగలిగేది వామనావతారం. ‘దానం ఇస్తే పుణ్యం వస్తుంది’ అనే తామసిక ఆలోచనతో దానం ఇవ్వడం మొదలుపెట్టి, ఒక్కో మెట్టు ఎక్కుతూ ‘దానం ఇవ్వకుండా ఉండలేను’ అనే సాత్విక ఆలోచన వచ్చే మెట్టు ఎక్కి శిబి, బలి చక్రవర్తి స్థాయి రావడానికి అనేకానేక జన్మలు పట్టవచ్చు. అయితే దానం ఇవ్వకుండా ఉండలేను అనే స్థాయి వచ్చాక మాత్రమే విష్ణువు తాను నిజంగా ధర్మపరుడైన బలి చేతిలో విజయం సాధించలేడని తెలిసి భిక్షాటనకి రావడం ఈ వామనావతారానికి మలుపు. అలా భిక్ష అడిగిన వామనుడికి మొదట్లో “వరచేలంబులో, మాడలో, మణులో... “ అంటూ తానివ్వగలిగే సంపదలన్నీ ఏకరువు పెట్టినప్పుడు వామనుడు అడిగినదేమిటి? మూడడుగుల భూమి మాత్రమే. ఈ మూడు అడుగులనేది తర్వాత చూద్దాం. ముందు దానం ఇచ్చేటపుడు చేయాల్సింది ఏమిటి?
వచ్చినవాడు మహావిష్ణువు, మామూలు వేదవిదుడు కాదు. వేదాలకి మూలమైనవాడు. అటువంటివాడు వచ్చి భిక్షాందేహీ అంటే ఇవ్వనూ అనగలమా? తనచేత యజ్ఞం చేయించే కులగురువు శుక్రాచార్యుడు చెప్పాడు ‘వచ్చినవాడు మహా విష్ణువు, దానం ఇవ్వకు; నీకేం మిగలదు. ఇస్తే నీ కులంతో సహా అందరం సర్వనాశనం అయిపోతాం’ అని. బలి ఎవరు? నూరు అశ్వమేధాలు చేసి ఇంద్రపదవికి అర్హత సంపాదించినవాడు. అటువంటివాడికి దానం ఇవ్వకు అని చెప్పడం ఎంత హాస్యాస్పదం? పోనీ చెప్పినా దానం తీసుకునేవాడు ఎవరు? అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన భగవంతుడు. అటువంటి అవకాశం అసలు ఎవరికైనా వస్తుందా? రావడానికి ఎన్నివేల కోట్ల జన్మలు ఎత్తాలి? నిజంగా అలా అవకాశం వస్తే కులగురువు చెప్తే మాత్రం వదులుకుంటామా? అవన్నీ ఆలోచించుకుని బలి శాంతంగా చెప్తాడు, ‘మీరు చెప్పినది నిజమే కానీ నేను దానం ఇవ్వనూ అనే స్థాయి దాటి ఇవ్వకుండా ఉండలేనూ అనే స్థాయికి వచ్చాను. నిజంగా మీరు చెప్పినట్టు ఈ వామనుడు మహావిష్ణువే అయితే దానం ఇచ్చినందుకు నన్ను ఆదుకుంటాడు తర్వాత అన్నీ పోయినా సరే. అందువల్ల ‘మేరువు తలకిందైనను .. తప్పక ఇత్తున్’ అని చెప్పి చేతిలోకి నీళ్ళు తీసుకుని వామనుడికాళ్ళు కడిగి ఆ నీళ్ళు తల మీద జల్లుకున్నాక ఇప్పుడు అసలైన దానం ఇస్తున్నాడు. ఎలా? తన చేతిలో నీటి ధార వామనుడి చేతిలో పడేలాగా పోస్తూ. ఆ ధార ఎటువంటిదో చెప్పేదే ఈ నెల పోతన పద్యం. ‘ధార’ అనే పదాన్ని పోతన ఎలా వాడాడో గమనించండి జాగ్రత్తగా.
క.
జనితాసుర యువతి నేత్రజలకణ ధారన్
దనుజేంద్ర నిరాధారను
వనజాక్షుఁడు గొనియె బలివివర్జితధారన్ [పోతన భాగవతం 8.612]
బలిచక్రవర్తి తనచేతిలోంచి వదిలిన దానధారను (బలివివర్జితధారన్) పద్మాలవంటి కన్నులు గల స్వామి వామనుడు (వనజాక్షుఁడు) స్వీకరించాడు (గొనియెన్). ఆ జలధార మునుల నియమాలకు ఆధారమైనది (మునిజన నియమాధార); రాక్షస స్త్రీలను కన్నీటి పాలుచేసేది (జనితాసుర యువతి నేత్రజలకణ ధారన్); రాక్షసరాజైన బలిని నిరాధారుడిగా (దనుజేంద్ర నిరాధార) మార్చేది.
దీనికి కొంత వివరణ చూద్దాం. బలి ముల్లోకాలన్నీ ఆక్రమించుకుని తన ఇష్టం వచ్చినట్టూ ఉండమంటున్నాడు జనాలని, మునులని. ఎంతైనా రాక్షస రాజు కదా? అది వేద ధర్మం పాటించే మునులకీ ఋషులకి ఎలా కుదురుతుంది? ఒకసారి ఈ నీటి ధార వామనుడి చేతిలో పడగానే ఈ బలి రాజ్యం అంతం అవుతుంది కనక మునులు మామూలుగా తపస్సూ అదీ చేసుకోవడం కుదురుతుంది. అందుకే ఇప్పుడు దానం ఇచ్చే ధార ‘మునిజన నియమాధార.’ తర్వాత పాదంలో రాజ్యం పోతే రాక్షసుల సుఖం అంతం అవుతుంది. అప్పుడు ఇంట్లో ఆడవారు – రాక్షస యువతులు, లేదా జనితాసుర యువతులు ఏడుస్తారు. వాళ్ల కన్నీరు ఇక్కడ చెప్పే జలకణధార. అన్నీ దానం ఇచ్చేసాక బలికి మిగిలింది ఏమిటి? ఏమీ లేదు. తనకున్న రాజ్యం, కులం, డబ్బూ అన్నీ పోతే ఆయన ఆధారం లేని వాడు లేదా నిరాధారుడు. అదే మూడో పాదంలో ‘దనుజేంద్ర నిరాధార.’ ఇటువంటి ధారని విష్ణువు (వనజాక్షుడు, పద్మాలవంటి కన్నులు ఉన్నవాడు) తీసుకున్నాడు. ఓ సారి ఇలా దానం ఇవ్వగానే బలి తలమీద పాదం పెట్టి రోగాలు, శ్రమలూ, ఆపదలూ దుఃఖాలూ లేని సుతలం లోకి పంపాడు శ్రీహరి. ఇంతటి దానం ఇచ్చినవాణ్ణి ఊరికే వదుల్తాడా భగవంతుడు? నీ గుమ్మం దగ్గిరే కాపలా ఉంటాను, నీకేమీ భయంలేదు అన్ని అభయం ఇచ్చి మరీ పంపుతాడు.
ఇప్పుడీ మూడు అడుగుల దానం అంటే ఏమిటో చూద్దాం. ఒకపాదంతో పైలోకాలన్నీ తీసుకున్నాడు. ఊర్ధ్వ లోకాలకి వెళ్ళడానికి సాధనం మనం చేసుకున్న పుణ్యం. అంటే మన పుణ్యం అంతా భగవంతుడికి ఇచ్చాం. కింది లోకాలకి వెళ్ళడానికి సహకరించేది మనం చేసుకున్న పాపం. అది కూడా భగవంతుడికి ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే సంపూర్ణ శరణాగతి వచ్చేది. మరోవిధంగా చెప్పాలంటే, చేసిన పాపం కూడా భగవంతుడికి ఇస్తే మరోసారి ఏదైనా పని చేసేటపుడు ఇలా పాపం కూడా భగవంతుడికి ఇచ్చాం కనక ముందు ముందు పాపం చేయడానికి ఆస్కారం తక్కువ. భగవంతుడు రెండో పాదంతో ఆ పాపం కూడా తీసుకున్నాడు. మిగిలినది మూడోపాదం. అది ఎక్కడ పెట్టాలి అని అడిగినప్పుడు బలి చెప్పాడు ‘నా శిరస్సు మీద పెట్టు’ అని. అలా మూడో పాదం బలి తలమీద పెట్టి అహంకారం అణిచాడు. ఎప్పుడైతే మనం పాప పుణ్యాలనే రెండూ భగవంతుడికి రెండు పాదాలుగా ఇస్తామో అప్పుడు మూడోపాదం మన అహంకారం మీద పెట్టి సరైన దారిలోకి తీసుకొస్తాడు మనని. అయితే దానం ఇచ్చేటప్పుడు ఏ మనఃస్థితితో ఇస్తున్నాం అనేది ముఖ్యం కానీ ఏది ఇస్తున్నాం అనేది కాడు అంటారు. బలి చక్రవర్తి ఎంత గొప్పగా ఆలోచించాడో అనేది భాగవతంలోని వామనావతారంలో విశదంగా చూడవచ్చు. ఇక్కడ నుంచి వామనావతారం ఉచిత పుస్తకం దింపుకోవచ్చు.