కాకమ్మ కథలు చెప్పొద్దు
అన్విత మూడోతరగతి చదువుతోంది. అన్నం కూరలు తినడానికి ఇష్టపడేది కాదు. ఎవరూ చూడకుండా మట్టి, సుద్ద, బలపాలు తినేది. ఒకసారి బలపం తింటూఉండగా నానమ్మ కంటపడింది. తినకూడదని నానమ్మ దెబ్బలాడింది. అయినా ఆ అలవాటును మానలేకపోయింది అన్విత.
కొన్నాళ్ళకు అన్విత ఆరోగ్యం పాడయింది. తల్లి దండ్రులు అన్వితని చిన్నపిల్లల వైద్యులు శ్రీకాంత్ డాక్టరు గారికి చూపించారు. డాక్టర్ గారు అన్వితని పరీక్షించి
“మీ అమ్మగారు వండిన కూరలు, అన్నం నువ్వు తినడం లేదు కదూ?” అని అడిగారు డాక్టర్ గారు.
“నేను తినలేదని మీకెలా తెలుసు” అని అడిగింది అన్విత గడుసుగా.
“అన్నం కూరలు తినలేదు కాబట్టే నువ్వు బలహీనంగా ఉన్నావు” అన్నారు డాక్టర్ గారు.
“నాకు అన్నం తినాలనిపించడం లేదు” అని నసుగుతూ చెప్పింది అన్విత.
“నువ్వు సుద్దముక్క, పలకపుల్లలు, మట్టి తింటున్నావు కాబట్టే అన్నం తినాలనిపించడం లేదు!” అని చెప్పారు డాక్టర్ గారు.
“ఛీ అవి నాకు ఇష్టం ఉండదు. నేను తినను” అంది అన్విత.
“కాకమ్మ కథలు చెప్పకు” కాల్షియం, జింక్ లోపం వల్ల నువ్వు వాటిని తింటున్నావు. నేను రాసి ఇచ్చిన మందులు వాడి నెల తర్వాత మళ్ళీ రండి” అని చెప్పారు డాక్టరు గారు.
ఆకలి వెయ్యకపోవడానికి కాకమ్మ కథకి సంబంధం ఏమిటో అర్ధం కాక ఇంటికి వెళ్లగానే నానమ్మ వల్లి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పి “కాకమ్మ కథలు అంటే ఏమిటని” అని అడిగింది అన్విత.
అన్వితని పెరట్లోకి తీసుకువెళ్ళింది నానమ్మ వల్లి.
అక్కడ పెరట్లో అరుగు మీద సంజనను కూర్చోబెట్టి అన్నం తినిపిస్తోంది అన్విత పిన్ని మధురిమ. చెట్టు మీద కాకికి గోరుముద్ద చూపిస్తూ “కాకమ్మా రా! ఈ గోరుముద్ద తిను” అని కాకిని పిలిచింది మధురిమ.
సంజూ "నువ్వు తినకపోతే కాకి తినేస్తుంది" అనగానే సంజన నోరు తెరచింది. నోట్లోకి గోరుముద్దని పెట్టింది. అలా కాకమ్మ కథలు, కబుర్లు చెప్తూ అన్నం తినిపించింది. సంజన కాకి వైపు చూస్తూ అమ్మ చెప్పిన కథలు వింటూ బొజ్జనిండా అన్నం తిన్నది.
“చూశావా అన్వి, పిన్ని కాకితో చెప్పినవన్నీ, నిజాలు కావు. చెల్లికి అన్నం తినిపించడం కోసం చెప్పిన కల్పిత కథలు, కబుర్లు. అందుకే కాకమ్మ కథలు అనే మాట వాడుకలోకి వచ్చింది.
లేని పోని విషయాలు, కల్పితాలు చెప్పినపుడు, అబద్దాలు చెప్పినపుడు కాకమ్మ కథలు చెప్పకు అనడం అలవాటుగా మారింది. ఇది ఒక జాతీయం. నువ్వు మట్టి తినలేదని డాక్టర్ గారికి అబద్ధం చెప్పావు కదా! అందుకే ఆయన అలా అన్నారు” అని చెప్పింది నానమ్మ.
“సరే ఇక అబద్ధం ఆడను, బుద్ధిగా అన్నం, కూరలు తింటాను” అంది అన్విత.
రచయిత పరిచయం
నా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 250 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి. – కాశీ విశ్వనాథం.
ఏ భాషలోనైనా జాతీయాలు, సామెతలు పిల్లలకి అర్థమవాలంటే వాటి అర్థం చెప్పేస్తే సరిపోదు. అవి పూర్తిగా అర్థమయ్యేలా ఒక సంఘటన గానో, ఒక కథగానో చెప్తే పూర్తిగా అర్థమవుతుంది. ఆ కథలు, సంఘటనలు కూడా పిల్లల ఊహల కనుగుణంగా ఉన్నవైతే ఇంకా బాగా బోధపడతాయి. కాశీ విశ్వనాథం గారు ఈ విధంగా చెప్పడంలో నిష్ణాతులు. బాలసాహిత్యానికి వారి రచనలు కలికి తురాయి వంటివి.