Menu Close
sravanthi_plain
Ayyagari-Suryanarayana-Moorthy
హనుమజ్జయంతి సందర్భముగా-
అయ్యగారి సూర్యనారాయణమూర్తి
హనుమత్స్తుతి

ఉ. కార్యధురీణుఁడౌ హనుమ కాంచిన నుగ్గగు నంతరాయముల్
     సూర్యుని శిష్యుఁడౌ హనుమ చూచినఁ బర్విడు రోగపీడలే
     యర్యమతేజుఁడౌ హనుమ యాన(1) నశించును బాపవృత్రమే
     యీర్య(2)యు ధైర్య మా హనుమ యించుక కన్గొన నబ్బు నిత్యమున్
          (1) గోచరము కాగా (2) శాస్త్రసమ్మతమైన నడవడి

లయగ్రాహి
      పంచముఖదీప్తిసముదంచితహరీశ! కరుణించి ననుఁ గాంచఁ జనుదెంచితె దినాదిన్(1)?
      కుంచితసుకేశ! యుదయించు రవిఁ గాంచి ఫలమంచుఁ గబళించఁ బయనించితె నభంబం?
      దెంచి మది రాము భజియించిన సుకర్మఫల మించుక లభించుటఁ దరించెను భవంబే
      పంచ(2) క్షణమున్నను గతించు భయజాడ్యములు మించుఁ గద వాక్పటిమ కాంచనసువర్ణా!
          (1) ప్రాతఃకాలములో (2) దగ్గఱ

శ్రీరామప్రార్థన

కవికులతిలకము (స్వీయవృత్తము) న-న-స-స-స-స-స-స గణములు 9, 15, 21వ యక్షరములు యతి

       రవికులతిలకుఁడు రాఘవరాముని రాజలలాముని రాజధర
       స్తవసముచితగుణశాలిని దానవసంహృతిశీలిని సత్యవచో
       ధ్రువనియమితు ద్విజతోషణుఁ(1) గిల్బిషదుఃఖవిదూరుని దోర్బలునిన్
       పవనతనుజవిభు వాసురజాప్రియుఁ(2) బ్రార్థన సేసెద భక్తిమెయిన్
               (1) బ్రాహ్మణులను / పక్షియైన జటాయువును సంతోషపఱచినవాని
               (2) భూమిజయైన సీతకు ప్రియుడైనవాని
Posted in May 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *