Menu Close
GVRao
భావ లహరి
గుమ్మడిదల వేణుగోపాలరావు

రేపటి పౌరులకు నేడు మనం చేయగల మార్గనిర్దేశము

Baalotsavam

అది ఏదన్న ప్రశ్నని ఎదుర్కొంటున్నది దేశాన్ని పాలించే పాలకులు, రాజకీయనాయకులు, సంఘసంస్కర్తలు, ఉపాధ్యాయులేకాదు, బాధ్యతాయుతులైన తలిదండ్రులు కూడా. దేశం ముందుకు నడవకపోతే దేశవనరులు పెరగవు. వ్యవసాయరంగం వృద్ధి చెందకపొతే పెరుగుతున్న జనాభా కడుపులు నింపడానికి తిండిగింజలు కరువై ప్రజల ఆకలికేకలతో దేశమంతా గగ్గోలవుతుంది. పారిశ్రామికాభివృద్ధి లేకపోతే ప్రజల తక్కిన అవసరాలు తీరక ఇతర దేశాల పురోగతితో పోటీ పడలేక దేశప్రజలలో అసంతృప్తి పెరుగుతుంది. ప్రజలలో ఉత్సాహం కుంటుబడితే నైపుణ్యత పెరగదు, క్రొత్తదనం రాదు, ఆర్థికాభివృద్ధి ఉండదు, దారిద్య రేఖని దాటి పైకి ఎదగలేము.

Baalotsavam

దాని కొరకు "నేటి బాలలే రేపటి పౌరులౌతారన్న" - ‘పెద్దలమాట చద్దిమూట’ గానే తలంచి కృషి చేయాలిసిందే. దానికై, పిల్లలని ప్రోత్సహించి నడిపించే వారి తలిదండ్రులు, విద్యాబుద్ధులు చెప్పించే అధ్యాపకులు, ఎవరినైతే ఆదర్శంగా భావించి పిల్లలు అనుకరిస్తుంటారో అటువంటి తరచూ కనబడే స్థానిక నాయకులు, ఉన్నతప్రమాణాలతో జీవిస్తూ సమయం దొరికినప్పుడల్లా ఆదర్శ జీవనావసరాన్ని బోధిస్తూ వారందరికీ ఆదర్శంగా నిలవాలి. నిజానికి చాలామందిలో ఈ ఉద్దేశ్యము బలీయమైనా, సరైన అవకాశం లభించకనో, తమ దైనందిన కార్యక్రమాలలో సమయం లభించకనో, తగిన ప్రాముఖ్యాన్ని ఇవ్వలేకపోవడం వల్లనో అవి ఆచరణరూపం దాల్చకుండానే మాటలలోనే మిగిలిపోతున్నాయి.

Baalotsavam

దానిని చేతలలో రూపకల్పన  చేయడానికి ధృఢ సంకల్పం చాలా అవసరం. ఈ అవసరాన్ని గుర్తించి "బాలోత్సవం" అన్నపేరుతో 1991 లో తెలుగు బాలల కోసం 'కొత్తగూడెం క్లబ్' వారిచే ఆ ఊరి బాలల కోసమే ప్రారంభించబడింది. అప్పుడు మొదలుపెట్టిన నాలుగు విభాగాలు- వ్యాసరచన, బాషా పరిజ్ఞానం (Elocution), సాధారణ జ్ఞానం (General Knowledge) మరియు చిత్ర లేఖనం(painting). ఆ ప్రయత్నం సఫలీకృతమవడంతో ఆ ఆలోచనా శ్రేణిని దొరకబుచ్చుకుని దానినే అనేక దిక్కులలో విస్తృతంచెయ్యడమే కాకుండా ఇతర ప్రాంతాలవారు కూడా దానిని అనుకరించడానికి పిల్లల్లోని ప్రతిభని వెలికితీయడానికి తోడ్పడింది. ఆవిధంగా ఆ సుసంపన్న భావాల తీగ క్రమక్రమంగా విశాఖపట్నం, అమరావతి -(నంబూరు, గుంటూరు జిల్లా), ఏలూరు, తిరుపతి, హైద్రాబాదు (తెలంగాణ) కి ప్రాకి ఇంకా పైకి ఎదుగుతుండడం ఎంతో ముదావహం.

Baalotsavam
తిరుపతి బాలోత్సవ వేడుకలు

ఈ కార్యక్రమం చాలా ప్రసిద్ధి చెంది ఒక్కొక్క కేంద్రంలో వందల కొద్దీ పాఠశాలలు ఉత్సుకతతో పాల్గొంటూ వాటి విద్యార్థులు విద్యలోనే కాకుండా భావి పౌరులుగా మలుస్తూ వారిలోని కళాభివృధికి, సాంస్కృతిక అవగాహనకి, నైపుణ్య పెంపుకి తోడ్పడుతున్నాయనడంలో సందేహం లేదు.

Baalotsavam

కానీ ఇటువంటి కార్యక్రమాలు సంతృప్తిగా జరిపించడానికి ఉదారంగా శ్రమ దానం చేసే విద్యాసంస్థలు, ద్రవ్య సహాయం చేసే స్థానిక ప్రముఖ వ్యాపార సంఘాలు ఆయా ఊళ్ళల్లో ముందుకురావడం ఎంతో ఆనందదాయకం.

Baalotsavam

-o0o-

Posted in May 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *