Menu Close
Rayavarapu-Saraswathi
నేను అమ్మను కావాలి (కథ)
-- రాయవరపు సరస్వతి --

రామయ్యా, సూరమ్మలకు ఒక్కగానొక్క సంతానం సత్యం. తాము కూలీ చేసుకు బ్రతుకుతున్నా తమ కొడుకు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగస్తుడైతే చూడాలన్న ఆశ ఎంత గానో ఉంది. కానీ, సత్యానికి చదువు అబ్బలేదు. ప్రభుత్వ పాఠశాలలో వేసారు. కానీ అతని దృష్టoతా స్నేహితులతో కలిసి గోళీకాయల ఆటల మీదే ఉండేది. గురువుల కళ్ళు గప్పి చీకటి పడేవరకూ ఆటలాడుకొని ఆనక ఇంటిదారి పట్టేవాడు. ఎట్టాగోలా ఐదో తరగతి వరకూ ఎలగ బెట్టి చతికిలబడి పోయాడు.

ఇక లాభం లేదని రామయ్య తమ కొడుకుని కిరాణా కొట్లో పనిలోకి పెట్టాడు. అక్కడా రెండేళ్లు చేసి చుక్కల్ని చూపించాడు. ఏదైతే అదవుతుందని రామయ్య తనతో పాటూ కొడుకును పొలంలో కూలి పనికి అలవాటు చేసాడు. క్రమేణా ఆ పని అలవాటు చేసుకున్నాడు సత్యం. తండ్రీ కొడుకులు కూలి చేసుకువచ్చేసరికి సూరమ్మ వంట చేసి వాళ్ళ కోసం ఎదురుచూసేది.

పదేళ్ల కాలం గిర్రున తిరిగి కాలగర్భంలో కలిసిపోయింది. సత్యానికి యుక్త వయసు వచ్చింది. పెళ్లి చేయాలనుకున్నారు తల్లిదండ్రులు. తమ బంధువుల్లో గల ఒక మంచి అమ్మాయిని చూసి వివాహం జరిపించారు.

కొత్త కోడలు స్వప్న ఎనిమిదో తరగతి వరకూ చదువుకుంది, తెలివైనదని బంధుమిత్రులు చెప్పగా తెలుసుకున్నారు. స్వప్న గురించి అందరూ చెప్పడమే కాదు, ఆమె తెలివితేటలు, ఇంట్లో ఆమె నడవడికలోను, పని పాట్లలోను తెలుస్తోంది.

ఇంట్లోవాళ్లకు, అత్త సూరమ్మ చెప్పకుండానే ఇంటి పని నంతా నీట్ గా ఒంటి చేతి మీద చేసుకుపోతోంది. కోడలు ఇంటి పనిని సమర్ధవంతంగా చేసుకు పోవటంతో సూరమ్మకు ఇక ఇంటి పని, వంటపనిలో తన అవసరం లేదని అర్ధమైంది, టైం ప్రకారంగా జరగవలసిన కాఫీ, టిఫిన్లు పెడుతూ భోజనాలు తయారు చేసి కూలి పనికి వెళ్తున్న భర్త, మామలకు క్యారియర్లు రెడీచేసి అందించడం లాంటివి చక చకా చేసుకు పోవటంతో ఇక సూరమ్మకు తానూ భర్తా కొడుకులతో కూలి పనికి వెళ్ల సాగింది.

సత్యం, స్వప్నల వివాహం జరిగి ఏడాది కావచ్చింది. కానీ తనకేంటి ఇంకా నెల తప్పలేదు? తనతో పెళ్లయిన తన ఫ్రెండ్ పూర్ణకు అప్పుడే ఆరో నెల నడుస్తోంది. మరి నాకు ఇంతవరకూ అలాంటిదేమీ లేదేంటని స్వప్న ప్రతి రోజూ మదన పడుతూనే ఉంది. ఎందుకో తనకు పిల్లలంటే మహాఇష్టం. బంధువుల్లో ఎవరి పిల్లల్నిచూసినా వాళ్ళ పర్మిషన్ లేకుండానే తల్లి చంకలో పిల్లను లాక్కొని మరీ ఎత్తుకుండేది. మరి? తనకేంటి పెళ్లయి రెండేళ్లవుతున్నా ఇంకా సంతానం కలుగలేదు? 'ఒక వేళ తనకు సంతానయోగం లేదా?' ఆమె మనసు నిండా అనుమానపు ఆలోచనలు పురుడు పోసుకున్నాయి.

'ఇద్దరం వెళ్లి డాక్టర్ చెకప్ చేయించుకుందామా?' అని భర్తతో ఎన్నో సార్లు అంది స్వప్న కానీ భర్త వింటేగా.

ఒక్క పూట పనిలోకి వెళ్లకపోతే కూలీ పోతుందంటాడు. ఇదీ అతని వాలకం. మరి తనకు పిల్లలు కలిగేదెట్లా? మనసులోనే దిగులు పడింది స్వప్న.

ఆరు మాసాల కాలం గిర్రున తిరిగి కాల గర్భంలో కలిసి పోయింది. సత్యంకు ఈ మధ్య రౌడీ మూకతో ఫ్రెండ్ షిప్ లు ఎక్కువయ్యాయి. ఒద్దని ఎంత చెప్పినా వినని భర్తను ఇక లాభం లేదని అనుభవం మీద తనే తెలుసుకుంటాడని మిన్నకుంది.

ఓ రెండు నెలల అనంతరం ఒక ఖూనీ కేసులో ఆ రౌడీ మూకతో పాటూ సత్యం కూడా అరెస్టయ్యాడు. అత్త మామలతో పాటూ పోలీసుస్టేషన్ కు పరిగెత్తింది స్వప్న.

ఎవరూ వాళ్ళని కలవడానికి వీల్లేదని వాకిట్లో నుండే పంపించేసారు పోలీసులు. స్వప్న భర్తను తలచుకొని బావురుమని ఏడుస్తూనే ఉంది, ఒక రెండు వారాలు తరువాత కోర్టులో ఖూనీ కేసులో అరెస్టయిన వాళ్లందరికీ జడ్జీగారు యావజ్జీవకారాగార శిక్షను విధించారు.

దానితో స్వప్న ఆశలన్నీఆవిరైపోయినట్లు కుంగిపోయింది.

రెండు నెలలు గడిచాయి. ఆమె బాగా ఆలోచించిన పిదప లాయర్ సహాయంతో హై కోర్టులో 'నా భర్త మా పెళ్లిలో చేసిన ప్రమాణకాలలో నన్ను తన పిల్లలకు తల్లిని చేస్తానని ఆ నాడు అగ్ని సాక్షిగా ప్రమాణo చేసారు. మరి? ఇప్పుడు కోర్టు వారు నా భర్తకు యావజ్జీవ కారాగార శిక్షను విధించారు, మరి నాకు నా భర్త పెళ్లిలో చేసిన ప్రమాణకం తప్పినట్లేనా? అయ్యా జడ్జి గారూ నాకు నా భర్తతో పిల్లల్ని కనే అదృష్టాన్ని కలిగించండి. నేనొక సగటు ఆడపిల్లను, మాతృత్వం అంటే నాకు చాలా ఇష్టం, అందులోనే ఉంది కదా ఆడజన్మకు సార్ధకం, తమరు నా భర్తకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను మీరు నాకు విధించినట్లుగానే భావిస్తున్నాను, నేను మీ కూతురు లాంటి దాన్ని సార్, నా భర్తను విడుదల చేయండి సార్, నేను నా భర్తతో అమ్మను కావాలి, తమరు తల్చుకుంటే నా కోరికను తీర్చగలరు, నా భర్త ను విడుదల చేయండి ప్లీజ్ నా భర్తకు ఆ ఖూనీకి ఎలాంటి సంబంధంలేదు, కేవలం వాళ్ళతో ఫ్రెండ్ షిప్ మాత్రమే, అర్ధం చేసుకోండి సార్, దయచేసి నా మనసును అర్ధం చేసుకొని నా కోరికను మన్నించండి' అంటూ హైకోర్టులో అప్పీలు చేసుకుంది స్వప్న.

పదిహేను రోజుల్లో స్వప్నకు కోర్టుకు రమ్మని కోర్టు నుండి సమన్లు వచ్చాయి.

ఆ రోజు కోర్టు తీర్పు. స్వప్న, ఆమె భర్త ఎదురెదురు బోన్లు లో నిలబడ్డారు.

"చూడమ్మా మీరు కోర్టువారికి అప్పీలు చేసుకున్న వాటిలో మీకు మీ భర్త ద్వారా పిల్లలు కావాలనీ అందుకు భర్తను విడుదల చేయమని కోర్టుకు అప్పీలు చేసుకున్నారు. కానీ మీ వారు ఖూనీ కేసులో ఒక భాగం. అటువంటి వారిని మేము విడుదల చేయలేము. మీ కోరికను మన్నించి కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నా పూచీ గత్తులు మీద ఎవరూ చేయని సాహసం చేసి పదిహేను రోజులు అతను మీ ఇంట్లోను, మరో పదిహేను రోజులు కారాగారంలోను ఉన్నట్లుగా నేను తీర్పునివ్వాలని నిశ్చయించుకున్నాను. ముఖ్యoగా ఒక ఆడపిల్ల 'నేను నా భర్తతో అమ్మను కావాలి' అంటూ కోర్టుకు రావడం ఇదే మొదటిసారి. ఒక విధంగా ఇలా ఇంత వరకూ ఎవరూ ఈ సాహసం చేయలేదు, నా ముప్పై ఏళ్ల సర్వీసులో ఇదే ఫస్ట్  టైం నేను వినడం, కనడం కూడా. కనుక మిమ్మల్ని నమ్మి అతన్ని పదిహేను రోజులు విడుదల చేస్తున్నాను, అతన్ని మీరే పదిహేను రోజుల తరువాత మళ్ళీ స్టేషన్ కు అప్పగించాలి. అంతే కాకుండా అతను ప్రతి రోజూ స్టేషన్ కు వచ్చి రిజిస్టర్ లో సంతకం చేసి వెళ్ళాలి. దానికి మీరే బాధ్యత తీసుకోవాలి. ఇది అరుదైన తీర్పు. స్త్రీ పొందవలసిన మాతృత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మీకీ అవకాశం కల్పించాను" అన్నారు జడ్జి కృష్ణమోహన్ గారు.

"అలాగే సార్! నాదే పూచీ. మళ్ళీ పదిహేను రోజులు తరువాత నేనే స్వయంగా తీసుకెళ్లి స్టేషన్లో అప్పగిస్తాను. అంతేకాదు రోజూ స్టేషన్ కొచ్చి సంతకం చేసి వెళ్తారు" అని స్వప్న మాట ఇవ్వగానే ఆమెతో అదే విషయం రాత పూర్వకంగా తీసుకొని సత్యoను ఆమెతో పంపించారు.

స్వప్న కోర్టువారికి అనేక ధన్యవాదములు సమర్పించుకొని భర్తతో ఇంటిదారి పట్టింది.

మూడు నెలలు కాలం గిర్రున తిరిగి కాలగర్భంలో కలిసి పోయింది. నాలుగో నెలలో నెలతప్పింది స్వప్న. ఆమె ఆనందానికి అవధులు లేకపోయింది. వీధిలో అందరికీ స్వీట్లు పంచిపెట్టింది.

నెలలు నిండేవరకూ భర్తను ఉంచమని కోరడంతో ఆమె మాటను కోర్టువారు గౌరవించి ఆమె డెలివరీ అయ్యేవరకూ ఉండమని సెలవివ్వడంతో సత్యం ఇంటివద్దనే ఉండి భార్యను కంటికి రెప్పలా చూసుకోసాగాడు. స్వప్నకు తొమ్మిది నెలలు నిండాయి. పది రోజుల తరువాత స్వప్న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దానితో ఇంటివారి ఆనందానికి అంతులేకుండా పోయింది. హాస్పిటల్ నుండి స్వప్న బిడ్డతో సహా ఇంటికి రావడంతో సత్యం తిరిగి జైలుకి వెళ్ళిపోయాడు.

స్వప్న తన బిడ్డతో లోకాన్ని మరిచిపోయి ఆనందంగా మనగలుగుతోంది. నెలలో ఒకసారి బిడ్డతో సహా జైలుకు వెళ్లి భర్తను చూసి రావటం అలవాటు చేసుకుంది. అత్తమామలు కోడల్ని, మనవడ్ని కంటికి రెప్పలా చూసుకోసాగారు.

****సమాప్తం****

Posted in May 2025, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *