1962 ఎన్నికల అనంతరం సంజీవయ్యగారితో రాజకీయ వివాదం
1962 ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఎన్నికలైన పిమ్మట అవసరమైతే తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వదులుకోవడానికి సిద్ధమని సంజీవరెడ్డి గారు ఢిల్లీలో బాహాటంగా ప్రకటించారు. ఇది ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రిత్వాన్ని చేపట్టాలనే కోరికను వెల్లడించడమే. శ్రీ సంజీవరెడ్డి రాష్ట్ర రాజకీయాల్లోకి మళ్ళీ ప్రవేశిస్తారనే వార్త రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.
అయితే శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుకు, శ్రీ దామోదరం సంజీవయ్యకు సంజీవరెడ్డి గారు మళ్ళీ రాష్ట్ర రాజకీయ రంగంలోకి రావడం ఇష్టం లేకపోవడంతో అడ్డుకోవడానికి ఇరువురూ జాయింట్ ఫ్రంట్ గా ఏర్పడి ఢిల్లీలో ప్రయత్నాలు సాగించారు. వీరికి అప్పటి రక్షణ శాఖ ఉప మంత్రి శ్రీ రఘురామయ్య తోడయ్యారు. ఈ పరిణామం బ్రహ్మానందరెడ్డి గారిని కూడా ఆందోళనపరచినప్పటికీ శ్రీ ఏ.సి.సుబ్బారెడ్డి, శ్రీ తిమ్మారెడ్డిలు వారిని సమాధానపరిచారు. అయితే శ్రీ సంజీవయ్యకు స్వతహాగా బలం లేదని, వారు పార్టీలో మరొకరి మీద ఆధారపడవలసి ఉంటుందని, పార్టీ ని ఏకతాటి మీద నడిపించే శక్తి శ్రీ సంజీవయ్యకు లేదని అగ్రనాయకులు అభిప్రాయపడ్డారు. అందువల్లే శ్రీ సంజీవరెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపడానికి నిర్ణయించుకున్నారు. కొంతమంది నాయకులు శ్రీ సంజీవయ్యకు స్వతహాగా బలం లేకపోవడం వల్ల రాష్ట్రంలో బహుళ నాయకత్వం ప్రబలిందని దీన్ని నివారించాలంటే శ్రీ సంజీవరెడ్డి నాయకత్వం అవసరమని భావించారు. శ్రీ సంజీవరెడ్డి నాయకత్వం ఒక దృష్టితో చూసినపుడు వాంఛనీయమని మరో దృష్టితో చూసినపుడు నిరుత్సాహజనకమని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పరిపాలనా పాటవం దృష్ట్యా ,పార్టీ పై అదుపుగల నాయకత్వం దృష్ట్యా శ్రీ సంజీవరెడ్డి రాష్ట్రానికి రావడం అవసరమని అభిప్రాయపడేవారు కొందరైతే, సంజీవరెడ్డిలోని వర్గతత్వం పార్టీకి నష్టం చేస్తుందని, వారి నాయకత్వమంటే సర్కారు జిల్లాల్లో వ్యతిరేకత ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు. శ్రీ సంజీవరెడ్డి 1961 డిసెంబర్ నెలలో తిరుపతి వచ్చి తన పాత అనుచరులను పిలిపించుకుని తన కోరికను తెలియజేయగా, వారు తమకు నిస్సందేహంగా మద్దతు పలుకుతామని చెప్పారు. తిరుగు ప్రయాణంలో బేగంపేట్ విమానాశ్రయంలో హరిజన విలేఖరుల సమావేశంలో సంజీవరెడ్డి కాళహస్తి నియోజకవర్గం గురించి ప్రస్తావించారు. తనకు రూ.2500 కూడా ఖర్చు కాకుండా అభిమానంతో ఎన్నుకున్నందుకు కాళహస్తి ప్రజలకు కృతజ్ఞత వెల్లడించుకోవడానికి తాను కాళహస్తి వెళ్లానని, అనేక గ్రామాల నుండి ముఖ్యులు వచ్చి తనను కలుసుకున్నారని చెప్పారు.
12 ఫిబ్రవరి 1962న నెల్లూరు పురమందిరంలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో సంజీవరెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు: -
ప్రజాస్వామ్య సోషలిజం ప్రధాన ఆశయంగా కాంగ్రెస్ దేశాభ్యుదయాన్ని సాధిస్తున్నదన్నారు. 45 ఏండ్లుగా రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ పాలిస్తున్నా, ప్రజావసరాలన్నిటినీ తీర్చడానికి ఇంకా 20 ఏండ్లు పడుతుందని కృష్చేవ్ చెబుతున్నాడని, ఎకరాకు 60 టన్నుల ధాన్యం పండినదని మన కమ్యూనిస్టులు ప్రచారము చేసిన చైనాలో ప్రజలు రేషన్ తిండి తినలేక లక్షలాది ఆకలి యాత్రలు జరుపుతున్నారని, ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారని శ్రీ సంజీవరెడ్డి అన్నారు.
కమ్యూనిస్టుల చరిత్ర పాప భూయిష్టమైనదని, గాంధీజీకి ముసలితనం వచ్చిందని, ఆయన వైదొలగాలని, పూలమాల సత్యాగ్రహం వల్ల స్వాతంత్రం రాదనీ చెప్పిన కమ్యూనిస్టులు, 1942లో "చావో బ్రతుకో" అని కాంగ్రెస్ స్వాతంత్ర శంఖారావాన్ని పూరించియుండగా, ప్రజాయుద్ధమంటూ ఆనాటి వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హోమ్ శాఖా సభ్యుడు మాక్స్వెల్ తో లాలూచీ పడి బ్రిటిష్ పాలకుల పాదాక్రాంతులై ఉన్నారని అన్నారు.
ఏ ఇతర పార్టీ అయినా అధికారంలోకి రావచ్చునేమో గానీ కమ్యూనిస్టు పార్టీ మాత్రం అధికారానికి రావడానికి వీల్లేదన్నారు.
స్వతంత్ర పార్టీని గురించి ప్రస్తావిస్తూ ఇది ఎన్నికలకు పుట్టిన ధనవంతుల పార్టీయనీ, కోటీశ్వరులు మరీ పెద్ద కోటీశ్వరులవ్వాలని, దరిద్రులు ఇంకా దరిద్రులు కావాలనే ఆశయంగల పార్టీ అన్నారు.
1962లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో నీలం సంజీవరెడ్డి గారు డోన్ నియోజకవర్గం నుండి పోటీ చేసి పోలైన ఓట్లలో 87.31% సాధించి విజయం సాధించారు. సంజీవరెడ్డి గారికి ఈ ఎన్నికల్లో ప్రత్యర్ధులు ఇండిపెండెంట్లే. కమ్యూనిస్ట్ పార్టీ నుండి కానీ, స్వతంత్ర పార్టీ నుండి కానీ అభ్యర్థులు ఎవరూ లేరు.1962 ఎన్నికల తరువాత మార్చ్ 12, 1962న శ్రీ సంజీవరెడ్డి నాయకత్వాన ఏర్పడిన ఆంధ్ర మంత్రి మండలిలోని పది మంది మంత్రులు, ఆరుగురు సహాయ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మార్చ్ 7న జరిగిన శాసన సభ్యుల, కౌన్సిల్ సభ్యుల సమావేశంలో సంజీవరెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమావేశంలో సంజీవరెడ్డి గారి పేరును అప్పటి నాయకుడు శ్రీ దామోదరం సంజీవయ్య ప్రతిపాదించగా, శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు బలపరిచారు.
అయితే మార్చ్ 13న మాజీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య, శ్రీ సంజీవరెడ్డి ప్రస్తుతం ప్రదేశ్ కాంగ్రెస్ వారిలో ఏర్పడిన ముఠాల నిర్మూలనకు అనువుగా విశాల దృష్టితో మంత్రివర్గ నిర్మాణాన్ని చేస్తానని మాట ఇచ్చి తప్పినారని ఆరోపించారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ఉండదలచినపుడు ఎవ్వారూ పోటీ ఉండరాదని శ్రీ నెహ్రూ చెప్పగా, తాను పోటీ చేయలేదని, తన సహచర మంత్రులను కూడా మంత్రివర్గంలోకి తీసుకొనగలనని శ్రీ సంజీవరెడ్డి మాట ఇచ్చి తప్పినారని శ్రీ సంజీవయ్య విమర్శించారు. సంజీవరెడ్డి గారు శ్రీ అల్లూరి సత్యనారాయణరాజును తమ మంత్రివర్గంలో చేర్చుకోకపోవడం అసమంజసమని శ్రీ సంజీవయ్య ఆరోపించారు.
సంజీవరెడ్డి గారు తానూ, రాజుగారు ఒకే చోట ఉండరాదని, అల్లూరి సత్యనారాయణరాజుగారిని రాజ్యసభకు పంపాలనుకున్నారు. కానీ అల్లూరి సత్యనారాయణరాజుగారు తాను రాజ్యసభకు వెళ్లకూడదని, రాష్ట్ర రాజకీయాలలోనే ఉండదలచుకున్నానని ప్రకటించారు.
సంజీవయ్య ఆరోపణలపై సంజీవరెడ్డి మాట్లాడుతూ తాను వాగ్వివాదాలకు దిగదలచుకోలేదని అన్నారు. మరల మార్చ్ 18న సంజీవరెడ్డి గారు కాళహస్తిలో మాట్లాడుతూ రాయలసీమలో కాంగ్రెస్ ఓటమికి కాంగ్రెస్ వారి తగాదాలే కారణమని అన్నారు. కానీ దేశాభివృద్ధి కృషిలో పార్టీ తగాదాలు అడ్డురాకుండా తోడ్పడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మార్చ్ 19న ప్రధానమంత్రి శ్రీ నెహ్రూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాలను గురించి స్వయంగా తెలుసుకోవడానికి గుంటూరులోని గాంధీ స్మారక నిధి అధ్యక్షుడు శ్రీ టి.అమృతరావును ఢిల్లీకి రమ్మని వర్తమానం పంపారు. మార్చ్ 25,1962న శ్రీ సంజీవరెడ్డి పత్రికా ప్రతినిధుల గోష్టిలో మాట్లాడుతూ శ్రీ సంజీవయ్య మంత్రి వర్గంలో చేర్చుకోవడానికి ఎప్పుడూ సుముఖులుగానే ఉంటాము, కోపతాపాలు అనవసరం, వారి ఇష్టం వచ్చినపుడు వచ్చి చేరవచ్చు, ఒక కులానికి, వర్గానికీ మంత్రి వర్గంలో స్థానాలను ప్రత్యేకించే ఆచారంలేదు అని అన్నారు.
సంజీవయ్యగారు తనతో పాటు శ్రీ అల్లూరి మంత్రివర్గంలో ఉండాలని పట్టుబట్టారు. సంజీవయ్యగారు సంజీవరెడ్డిగారితో చేతులు కలపకపోవడానికి కారణం సంజీవరెడ్డిగారిది రాజకీయ ఎత్తుగడ అనే అనుమానం.
సంజీవయ్య తన మంత్రి వర్గంలోనే ఉంటే తన చేతి క్రిందే ఉంటూ ఎదిగే అవకాశం లేదని, కేంద్రం నుంచి వచ్చే ప్రముఖ రాజకీయవేత్తలతో సంబంధ బాంధవ్యాలు పెంచుకుని కేంద్రానికి వెళ్ళే అవకాశం ఉండకూడదని, సంజీవయ్య వర్గాన్ని పూర్తిగా నాశనం చేయాలని, అల్లూరిని సంజీవయ్యను విడదీయాలని సంజీవరెడ్డిగారి నిగూఢ రాజకీయ ఎత్తుగడ అని సంజీవయ్యగారి భావం.
కొంతకాలం తరువాత సంజీవయ్యగారు నెలరోజులు ఢిల్లీలో మకాం వేసి రాష్ట్ర రాజకీయ పరిస్థితులను కేంద్ర రాజకీయ వేత్తలకు, నెహ్రూకు కూడా నివేదించారు.అప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ హరిజన నాయకుడైన సంజీవయ్యను కాంగ్రెస్ అధ్యక్షులుగా చేస్తే బాగుంటుందనే ప్రతిపాదన తెచ్చి నెహ్రూ గారికి నచ్చజెప్పారు. ఆ విధంగా నెహ్రూగారు సంజీవయ్యను కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించే ఏర్పాటు చేశారు. రాజకీయ రంగంలో ఆపద సమయంలో ఆదుకున్న శ్రీమతి ఇందిరాగాంధీని సంజీవయ్యగారు చివరివరకు బలపరుస్తూనే ఉన్నారు.
ప్రజాస్వామ్యంలో విశ్వాస విశేషం :-
1962 ఎన్నికల అనంతరం సంజీవరెడ్డిగారు ప్రతిపక్ష సభ్యులు చేసిన ఆరోపణలకు సమాధానం చెబుతూ - ఎన్నికలలో ప్రతి అభ్యర్థి హెచ్చుగా ఖర్చు చేసినాడని, నిర్ణయించిన ఖర్చును మించి తాము ఖర్చు చేయలేదని కమ్యూనిస్ట్ సభ్యులు చెప్పగలరా? అని అడిగారు.
****సశేషం****
అవతరణి – రచయిత మనో నేత్రం
నేను వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ ని. ప్రవృత్తి, అధ్యయనం మరియు రచన. మా ఊరు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణం. ఆంధ్ర రాష్ట్ర రాజధానైన అమరావతికి కుడి భుజమైన గుంటూరు నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. మాకు గురువు దైవ సమానులైన మా మాతామహులు పిచ్చుక పుల్లయ్య గారు. వీరు ఆధ్యాత్మికవేత్తగా మారిన ఒకప్పటి కమ్యూనిస్టు. మా నాయన జగదీశ్వరరావు గారు క్రియాశీల రాజకీయాలలో పాల్గొని ఉండటం వల్లనేమో నా పై రాజకీయాల ప్రభావం ఉన్నది.
నా తొలి ఇరవై తొమ్మిదేళ్ల జీవితం ఆస్తిక నాస్తికత్వాలకు నడుమ అభిప్రాయరహితంగానే సాగినది. కానీ నాలో భారతీయ భాష, సంస్కృతుల పట్ల అభిమానం సహజాతంగా ఉన్నది. నేటికీ కొనసాగుతున్నది. జీవన గమనంలో ఎదురయ్యే ఒడిదిడుకుల వల్ల మతం వైపుకి మళ్ళిన నేను, ఎనిమిదేళ్ల మేధోమథనం, సునిశిత పరిశీలన, హేతుబద్ధ ఆలోచనల ఫలితంగా వ్యక్తి తత్త్వం వద్దకు చేరాను. ఆంగ్లంలో ఈ దృక్పథాన్ని “Individualistic Philosophy” అంటాను.
నాలో రచనా ప్రవృత్తి తలెత్తింది ఆగస్టు 7, 2018 నుండి ఆగస్టు 16, 2018 మధ్య కాలంలో. పై రెండు తేదీలు కచ్చితంగా చెప్పడానికి కారణం : మొదటి తేదీన శ్రీ కరుణానిధి కాలధర్మం చెందగా, రెండవ తేదీన శ్రీ అటల్ బిహారీ వాజపేయ్ కాలధర్మం చెందారు. సాహిత్యం, రాజకీయం కలగలసిన వీరిరువురి జీవితాల గురించి తెలుసుకుంటున్నపుడు నాలో రాయాలన్న ప్రేరణ కలిగింది. నా అధ్యయనం మొదలైంది కూడా అప్పటినుండే. అప్పటి వరకు నేనొక సాదాసీదా చదువరినే.
ఐదు సంవత్సరాల పురిటి నొప్పుల తరువాత నా యొక్క రచనా దృక్పథం నిర్దిష్టంగా రూపుదిద్దుకుంది. అనుభూతులను అలంకారికంగా చెప్పడం కవిగా నా దృక్పథమైతే, మానవ జీవన కోణాలను, జీవిత పార్శ్యాలను ఆసక్తికరంగా చెప్పడం కథకుడిగా నా లక్షణం. అధ్యయన ఫలితాలను చదువరులకు అందించడం వ్యాసకర్తగా నా ఉద్దేశం. ఏలితుల ఏకరువును తెలియజెప్పడం విమర్శల వెనకున్న కారణం.
అచ్చుకు నోచుకున్న తొలి కవిత "విడివడని బాధ్యత" విశాలాక్షి మాసపత్రికలో, తొలి కథ "వై" సిరిమల్లెలో, తొలి విమర్శ "పారిశ్రామిక అభివృద్ధితోనే సీమ ప్రగతి" ఆంధ్రజ్యోతిలో, తొలి వ్యాసం "మునసబు నుండి రాష్ట్రపతి దాకా..." ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతి దినపత్రికకు, విశాలాక్షి మాస పత్రికకు, స్వీయ ముద్రణకు అవకాశం కల్పించి నేను రాసేవి చదవదగ్గవేనన్న విశ్వాసం కల్పించిన ప్రతిలిపి పోర్టల్ కు, కథలను, వ్యాసాలను అచ్చువేయడమే కాకుండా ప్రోత్సాహకరమైన వాక్కులతో శీర్షిక రాయడానికి అవకాశం కల్పించిన సిరిమల్లె సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. – కుమార్ బాబు