‘ఆంధ్ర సాహిత్యంలో పరమ ప్రామాణిక గ్రంథం అప్పకవీయం’ అంటూ ఆరుద్ర అప్పకవి రాసిన గ్రంథాన్ని పరిచయం చేశారు.
అప్పకవి తన కాలాన్ని, వంశాన్ని గూర్చి స్పష్టంగా చెప్పాడని, తనుగన్న కలను గూర్చి పూర్తి వివరాలు ఇచ్చాడని చెప్పి ఆరుద్ర ఆ వివరాలను తెల్పారు. అది-
శాలివాహన శకం 1578 మన్మథ నామ సంవత్సరం శ్రావణ బహుళ అష్టమి నాడు అంటే క్రీ.శ.1656 ఆగష్టు 3వ తేదీ తనకు కల వచ్చిందన్నాడు అప్పకవి. ఆ కలలో దేవుడు కనపడి నన్నయ గారి వ్యాకరణ గ్రంథాన్ని తెనిగించమని ఆదేశించాడని చెప్పాడు.
అప్పకవి తన వంశంలోని ఆరుతరాల వారి వివరాలు ఇచ్చాడని దానిని ఆధారం చేసుకొని ఆరుద్ర అప్పకవి యొక్క వంశ వృక్షాన్ని తయారుచేశాడు.
తల్లితరపు వారిని కవులని చెప్పిన అప్పకవి తన తాత ముత్తాతలు కావ్యాలు వ్రాసినట్లు వివరించలేదు. కాని ఒకచోట రాసిన దానిని బట్టి కాలామృతం అనే గ్రంథానికి ఆంధ్రీకరణ గ్రంధమేమోనని చెప్తూ “అయితే ఇది తెలుగు భాషలో వెలసిన తొలి జ్యోతిష్యాస్త్ర గ్రంథం అవుతుంది. అందువల్ల ఈ కవిని గూర్చి చెప్పుకోవడం సముచితమే” అని ఆన్నారు ఆరుద్ర. ఈ కవి పేరు తిరుమల భట్టు. వంశ వృక్షంలో 4వ నంబరు వ్యక్తి ఇతను. ఇతనిని ఆ కాలామృతం గ్రంథ కర్తగా భావించారని చెప్పిన ఆరుద్ర ఇలా అన్నారు.
“పట్టికలో 1 వ నెంబర్ వ్యక్తిగా కాకునూరి తిమ్మకవి క్రీ.శ.1500) సూచించిన మూలపురుషుడు ఆ గ్రంథాన్ని (కాలామృతం) వ్రాసి ఉంటాడని నేను భావిస్తున్నాను.” అని చెప్పి అందుకు తగిన కొన్ని విషయాలను ప్రస్తావించారు ఆరుద్ర. (స.ఆం.సా. పేజీ 941).
ఈ తిమ్మన అతని కుమారుడు సోమన చాలా ప్రసిద్ధులు. సోమన కాశీలో బ్రహ్మేంద్రుల వారి వద్ద విద్య నేర్చుకొన్నాడు. ఇతను కాశీలో, మధురలో పండితులను ఓడించాడు.
అప్పకవి పూర్వీకులను గూర్చి చెబుతూ, ఆ కాకునూరి పండితులు నేటి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ తాలూకా లేమావిళ్ళ అనే గ్రామంలో ఉండేవారని, దీనినే అప్పకవి అభినవ చూత (లేత మామిడి) సద్గ్రామమని చెప్పాడని ఆరుద్ర తెల్పారు. (పీఠిక 73, స.ఆం.సా. పేజీ 942).
ఆరుద్ర అప్పకవి వంశాన్ని గూర్చిన విషయాలు సోమన తపస్సంపన్నత మొదలైనవి సమగ్రంగా చర్చించారు. ఆరుద్ర గారి పరిశోధనా శక్తి అపారం.
ఆరుద్ర ఈ వ్యాసంలో కాకునూరి అప్పకవి యొక్క వంశం వారి పెద్దల వివరాలు మాత్రమె వివరించారు. అందుకే ‘కాకునూరి పండితులు’ అని పేరు పెట్టారు. అప్పకవి ని గూర్చి, అతని రచనల గూర్చి తెలపలేదు.
నూతన కవి సూరన
సూరన కవి వ్రాసింది ‘ధనాభిరామం’. ఇతడు కొన్ని సాక్ష్యాల వల్ల పోతనకు సమీపకాలంలోని చిన్నవాడని చెప్పవచ్చు. “పుట్టం బుట్ట శరంబునన్ మొలవ....అన్న పోతన గారి పద్యం తర్వాత తెలుగులో వాల్మీకిని స్మరించే కవులు ఈ “పుట్టం బుట్ట” అన్నది వాడారని ఆరుద్ర తెల్పారు.
సూరన కూడా ‘కావ్యం’ గొప్పదని చెప్తూ,
పుట్టం బుట్టి మహానది – బుట్టియు సైకత స్థలమును బుట్టి జగంబుల్
నెట్టన బొగడగ వెలసిన – యట్టి మహాత్ముల దలంతు నాదిమకవులన్ (ధనాభిరామం. 1-10)
అని సూరన పోతనను అనుకరించాడని, ఇదీకాక అంత్యానుప్రాసలో కూడా సూరన పోతనను అనుకరించినది చూపారు. ఇలాంటి ఆధారాల వల్ల సూరన కాలం పోతన తర్వాత అంటే క్రీ.శ.1470 -1500 గా నిర్ణయింపవచ్చని ఆరుద్ర తెల్పారు.
ధనాభిరామం కథ
సూరన తన ధనాభిరామం కావ్యాన్ని దాక్షారామ భీమేశ్వరునికి అంకితం ఇచ్చాడు. ధనాభిరామంలో కథాస్థలం కూడా ద్రాక్షారామమే. ధనం గొప్పదా? రూపం గొప్పదా? అన్న విషయం తేల్చుకోవడానికి మన్మధుడు కుబేరుడు వచ్చి ద్రాక్షారామం చేరారు. దీనికి ముందు కథ ఇంద్ర సభలో మన్మధుడు కుబేరుడు వాదనలో, కుబేరుడు స్త్రీలకూ డబ్బే ముఖ్యం, ఈ అందం కన్నా నా డబ్బునే వారు కోరుతారు అనడం, ఇలా వారి వాదనతో ప్రధమాశ్వాసం ముగిసింది. వారిరువురూ ఎవరు గెలిస్తే వారే ఇంద్ర లోకం పోవడానికి అర్హులు. ఓడినవారికి అర్హత లేదని పందెం పెట్టుకొంటారు.
ద్వితీయాశ్వాసము లో మన్మధుడు వసంతకాల సమయంలో ద్రాక్షారామం వస్తాడు. అక్కడ ఒక స్త్రీ కన్ను మన్మధునిపై పడిందని చెప్పే పద్యంలో సూరన అలంకార శాస్త్రంలో చెప్పిన 10 అవస్థలను ఆమె ద్వారా ఒక్క పద్యంలో తెల్పాడు. అవి దర్శనం, మనస్సంగం, సంకల్పం, జాగారం మొదలైనవి. వీటిని గూర్చి చెబుతూ ఆరుద్ర ‘ఈ పది విషయాలను ఏమాత్రం భావుకత లేకుండా ఒకే ఒక పద్యంలో చెప్పాడు సూరన’ అని అన్నారు.
సూరన కావ్యాన్ని గూర్చి ఆరుద్ర చాలా పద్యాలనే వివరించి చర్చించారు. నూతన కవి సూరన సొగసైన వర్ణనలు చెయ్యలేదని అని అన్నారు.
ఇక కథలోకి వస్తే, కుబేరుడు వచ్చినా నిన్ను వదలను అని ఆ కాంత చెలికత్తె చేత చెప్పి పంపడంలో మన్మధుడు ఆమె ఇంటికి వెళతాడు. ఇక్కడ గల చిత్రాలను గూర్చి చెబుతూ ఆరుద్ర శ్రీనాథుని చిత్ర వర్ణనలను, అటుపై వచ్చిన మార్పులను గూర్చి వివరంగా చర్చించారు.
ఇక కుబేరుడు కూడా ద్రాక్షారామం వస్తాడు. లెక్కలేనన్ని మణిమాణిక్యాదులను, ఆభరణాలను తెచ్చి నాట్యం చేసే వారికి (ఆలయంలో) పంచుతాడు. ఈ సందర్భంగా సూరన ఆనాటి ఆభరణాలను ఒక పద్యంలో వల్లించాడు.
“కమ్మలు, పచ్చల కడియాలు, జోళ్ళును ...అన్న ఈ పద్యంలో 26 ఆభరణాల పట్టిక వుందని అన్నారు ఆరుద్ర.
ఈ పర్వం వల్ల క్రీ.శ.1475 ప్రాంతపు ఆడవారి, చీరలు, నగలు తెలుస్తాయి. కుబేరుడు ఇచ్చిన వాటిని ముందు సుగుణావతి (మన్మధుని ప్రియురాలు) తీసుకోలేదు. చివర తల్లి బోధనచే నగలను తీసుకొంది. కానీ మన్మధునికి అబద్ధం చెప్పింది. కానీ మన్మధుడు తెలుసుకొన్నాడు. అప్పుడు సుగుణవతి తల్లి మన్మధుని బయటకు గెంటివేసింది. మన్మధుడు భీమేశ్వరుని వద్దకు వెళ్లి ప్రార్థింప అతడు తీర్పు చెప్పాడు.
రూపులేకున్న జగములో రూఢి లేదు
ధనము లేకున్న మరియు నంతకును కొరత
వలయు రూపంబు ధనము నవశ్య మఖిల
మానవులకును సురలకు మాన కిపుడు (ధనాభిరామం 3-106)
---అంటూ రెండూ కావాలని భీమనాథుడు చేసిన ఈ రాజీతో 111 పద్యాలున్న తృతీయశ్వాసం దానితో పాటు ధనాభిరామం కావ్యం కూడా సమాప్తమౌతుందని ఆరుద్ర తెల్పారు.
ఈ సందర్భంగా ఆరుద్ర వివరిస్తూ శతకకర్త ల దృక్పథం కన్నా కావ్యకర్తల దృక్పథం భిన్నమని అన్నారు. నూతనకవి సూరన కావ్యం దనానికి అందానికి మధ్యగల భేదాన్నీ, విలువలను తెల్పిన రచన.
మన శతకకర్తల దృక్పథం విలక్షణమైనదని, కావ్యకవుల సంప్రదాయం విభిన్నమైనదని చెప్పి ఆరుద్ర “ఇంటిపేరులో మాత్రమే సూరన కొంతవరకు నూతనకవి” అని సెలవిచ్చారు.
చంద్రమౌళి దేవరాజు భట్టు
ఆంధ్రదేశంలో బహుళ ప్రచారంలో ఉన్న కథ హరిశ్చంద్రుని కథ. దీనిని గౌరన ద్విపద కావ్యంగా రచించాడు. ఇది చాలా ప్రచారం పొందింది.
గౌరన శ్రీనాథునికి సమకాలికుడు. క్రీ.శ 1385-1445 మధ్య కాలం వాడు. గౌరన ద్విపద కావ్యాన్ని పద్యకావ్యంగా తిరగ రాసినవాడు చంద్రమౌళి అని ఆరుద్ర తెల్పారు.
ఈ కావ్యం నేడు దొరకడం లేదు. కానీ ఒకనాడు బహుళ ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తున్నదని చెప్పిన ఆరుద్ర చంద్రమౌళి రచనను అతని అనంతర కవులు స్తుతించారన్నారు. క్రీ.శ.1720 ప్రాంతపు జంటకవులు తురగా రాజకవి, అయ్యంకి బాలసరస్వతులు సుప్రసిద్ధులైన పూర్వకవులతో కలిపి స్తుతించిన పద్యం తెల్పారు.
నన్నపను దిక్కమఖి బ్రబంధపరమేశు
సాధు నాధర్వణాచార్య చంద్రమౌళి
భాస్కరు ననంతు శ్రీనాథభట్టు బీము
సోము నమరేంద్రు దలతు నుత్సుకత నాత్మ.
ఈ జంటకవుల కన్నా పెద్దవాడు పెదపాటి జగ్గన్న కూడా చంద్రమౌళి కావ్యం చదివి ఆనందించిన వాడేనని నిజానికి జగ్గన్న తన గ్రంథంలో చంద్రమౌళి వ్రాసిన ఒక పద్యాన్ని ఉదహరించడం వల్లనే చంద్రమౌళి క్రీ.శ.1550 కి పూర్వమే హరిచంద్రోపాఖ్యానాన్ని పద్యకావ్యంగా వ్రాశాడని అనుకోవడానికి వీలు కల్గింది.