Menu Close
Shyama-Sundara-Rao
తెలుగు తేజాలు
అంబడిపూడి శ్యామసుందర రావు

జనం కోసమే జర్నలిస్ట్ అన్నట్టు బ్రతికిన జర్నలిస్ట్ "గండూరి కృష్ణ గారు"

Ganduri Krishna

గండూరి కృష్ణ గారు అంటే పత్రికా ప్రపంచంలో భయమెరుగని, జగమెరిగిన జర్నలిస్ట్ ప్రస్తుత తరానికి ముఖ్యంగా జర్నలిస్టులు అని చెప్పుకొనే చాలా మందికి ఆ పేరు తెలియదు. ఎందుకంటే ప్రస్తుత జర్నలిస్ట్ లు చాలా మంది ఏదో ఒక పార్టీకో, ఏదో ఒక రాజకీయ నాయకుడికో అమ్ముడు పోయిన వాళ్ళే.  జర్నలిస్ట్ గా మాత్రమే కాకుండా పండితునిగా, చరిత్రకారుడిగా అనేక విషయాలపై అవగాహన కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణ గారు. నిన్న మొన్నటి దాకా తెలుగు జర్నలిజం ఆరోగ్యంగా ఉన్నది అనడానికి నిదర్శనం కృష్ణ గారి జీవితమే. మహా మహా నాయకులు, రాజకీయ వేత్తలు కవులు పండితులు మొదలైన వారు ఆయనను పలకరించటానికి స్వయంగా అయన ఇంటికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఐదు దశాబ్దాలకు పైబడి పత్రికా రంగంలో పనిచేసి పత్రిక  రచనలో ఒక తనకంటూ ప్రత్యేక మైన ఒరవడిని ఏర్పాటు చేసిన వ్యక్తి కృష్ణ గారు.

ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు, రాష్ట్రపతి  లాంటి ప్రముఖులతో పరిచయాలు ఉన్న గొప్ప జర్నలిస్ట్ అయినప్పటికీ హైదరాబాద్ రామ్ నగర్ వీధుల్లో సాదా సీదా గా ఠీవిగా నడుచుకుంటూ వెళ్తూ పత్రికారంగం తలెత్తుకు తిరిగేటట్లు చేశాడు. అంత పేరు ప్రఖ్యాతుల ఉన్నప్పటికీ సొంత ఇల్లు అంటూ లేకుండా జీవితం గడిపారు. ఢిల్లీ లో తెలుగు పత్రికలకు తొలి తెలుగు రిపోర్టర్ గా పనిచేసిన ఖ్యాతి ఆయనదే. 1946 లో జర్నలిజం వృత్తిలో ప్రవేశించి మొదట "మీజాన్", ఆ తర్వాత ఫ్రీ ప్రెస్ జర్నల్, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ లలో ఎడిటర్ గా పని చేశారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ బ్యూరో చీఫ్ గా పనిచేసారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ చైర్మన్ రామ్ నాద్ గోయెంకా, కృష్ణ గారి మీద ఉన్న అభిమానంతో పెద్ద పదవి ఇస్తానన్నా వద్దని విజయవాడ వచ్చి కొన్నాళ్ళు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గాఉన్నారు. వార్తలు, వ్యాసాలు, సమీక్షలు, సంకలనాలు, కధలు, కబుర్లు , జీవితచరిత్రలు ఇలా ఎన్నో చివరి దాకా రాస్తూనే ఉన్నారు. ఎవరికి ఏ రంగంలో ఆసక్తి ఉందో, ఎవరికి ఏది అవసరమో అదే మాట్లాడటం ఆయన ప్రత్యేకత మనిషి రివటలా ఉన్నా నాదం ప్రస్ఫుటంగా ఉండేది. ఆలోచనలో స్పష్టత, విషయ వివరణ ప్రావీణ్యంలో ఆయనకు ఆయనే సాటి.

వ్యక్తిగత వివరాల కొస్తే ఈయన 1924 లో కృష్ణా జిల్లా మధురాపురం అగ్రహారంలో జన్మించి 1932 లో పై చదువుల కోసం హైదరాబాద్ లోని  మేనమామ ఇంటికి చేరారు. ఆయన మూడో ఫామ్ లో ఉండగానే కవి, చిత్రకారుడు అయినా అడవి బాపిరాజు గారితో పరిచయం ఏర్పడి క్రమంగా పత్రికల పట్ల మక్కువ పెరిగింది. 1945 నాటికే నిజాం కళాశాలలో బిఏ చేసే నాటికి వివిధ సమస్యల మీద ఇంగ్లిష్, తెలుగులలో వ్యాసాలు రాసేవారు. అవి ‘మీజాన్’ పత్రిక లో ప్రచురితమయ్యాయి. కొన్నాళ్ళకు ఆ పత్రిక అధిపతి దగ్గరకు వెళ్లి నాకు జర్నలిస్ట్ ఉద్యోగం కావాలి అని అడిగితె ఇదేమన్నా అంగట్లో సరుకా ఇవ్వడానికి అన్న వాడు తన పత్రికలో వ్యాసాలు రాసిన వ్యక్తి ఇతనే అని గుర్తించి ఉద్యోగం ఇచ్చారు. ఘర్షణ జరుగుతూ ఉంటే పోలీసులు ఒక వర్గం వారికి మద్దతుగా మరో వర్గం పై రాళ్లు రువ్వుతూ ఉంటే కృష్ణ గారు ఆ ఫోటోలను మర్నాడు పేపర్ లో ప్రచురించారు అది పెద్ద అలజడికి కారణమయింది. ఆ ఫోటోలు ఎవరు తీశారు అన్న విషయం ఆరా తీయడానికి పోలీస్ కమిషనర్ స్వయంగా పత్రిక ఆఫీస్ కు వస్తే ఆ పత్రిక యజమాని కృష్ణ గారి మీద ఉన్న అభిమానంతో తానే ఆ ఫోటోలు తీశానని చెప్పి కృష్ణ గారిని ప్రమాదం నుండి బయట పడేశారు. ఆ తర్వాత ఆ పత్రికాధిపతి కృష్ణ గారి సాహసాన్ని ప్రశంసించి కృష్ణ గారి సతీమణి గారిని ఆఫీస్ కు పిలిపించి వంద రూపాయలు కానుక గా ఇచ్చారు. ఇంక అప్పటినుండి జర్నలిస్ట్ గా కృష్ణ గారు వెనక్కు తిరిగి చూసుకోలేదు.

ఈ విధమైన సంచలన వార్తలు ఫొటోలతో సహా ప్రచురించినందున పోలీసులు ఈయన కోసం గాలించడంతో కొన్నాళ్ళు అజ్ఞాతం లోకి వెళ్ళవలసి వచ్చింది. మద్రాస్ వెళ్లి ఫ్రీ ప్రెస్ లో అప్రెంటిస్ గా చేరి రాజాజీ ప్రసంగాన్ని రిపోర్ట్ చేసి న్యూస్ ఎడిటర్ దృష్టిలో పడి అప్రెంటీస్ గా చేరిన గంటలోనే ప్రొబేషన్ కు ప్రమోట్ కావడం అయన ప్రతిభకు నిదర్శనం. ఆంధ్ర పత్రికలో విలేకరిగా చేరి అక్కడే న్యూస్ ఎడిటర్, అసిస్టెంట్ ఎడిటర్ గా పదోన్నతులు పొందారు. పత్రిక తరుఫున న్యూ ఢిల్లీ లో రెండున్నర ఏళ్ళు పనిచేశారు. కృష్ణ గారు ఎన్ని పత్రికలలో ఎన్ని కాలాలు ఎంత కాలం రాశారో, అవి ఎన్ని పుస్తకాలుగా వచ్చాయి అన్నది ఇక్కడ అనవసరం. కానీ ఆయన ఓపిక ఉన్నంతకాలం రాస్తూనే ఉన్నారు. విలేఖరి ఉద్యోగమే ఆయనకు ఇష్టం. ఎడిటర్ కావాలని కానీ డెస్క్ లో కూర్చొని పని చేయాలని ఆయన కోరుకోలేదు. స్వేచ్ఛగా తిరగడం, కొత్త వారిని కలుసుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, రాయడం ఆయనకు ఇష్టం. రాజీ పడని నైజం వలన ఎన్నో ఉద్యోగాలు మారవలసి వచ్చింది. తనపై ఎవరి అజమాయిషీని ఒప్పుకునే వారు కాదు. ప్రభ లో ఉద్యోగం మానేసినప్పుడు స్వయంగా ప్రభ యజమాని గోయెంకా మళ్లి  ఉద్యోగములో చేరమని బ్రతిమాలి మరీ పట్టుబడితే ప్రత్యేక ప్రతినిధిగా పనిచేస్తానని ఇతరులు అజమాయిషీ చేస్తే సహించనని మరీ చెప్పి చేరారు. విజయవాడలో పనిచేస్తున్నప్పుడు రాజగోపాలాచారి మరణ వార్త  న్యూస్ ఎడిటర్ రంగస్వామి గారి ద్వారా తెలుసుకుని అక్కడే ఉన్న టైప్  మెషిన్  ముందు కూర్చుని కేవలం 40 నిమిషాల్లో రాజగోపాలాచారి వ్యక్తిత్వాన్ని, చరిత్రలో ఆయన స్థానాన్ని అంచనా వేస్తూ వ్యాసం రాసి రంగస్వామి గారికి ఇచ్చేసి వెళ్ళిపోయారు. మర్నాడు అది ఇండియన్ ఎక్స్ ప్రెస్ అన్ని ఎడిషన్లలోనూ బ్యానర్ గా వచ్చింది. ఆది ఆయన ప్రతిభ. స్వాతంత్ర సమరయోధులకు వచ్చే పెన్షన్ ను జర్నలిస్టులకు వచ్చే అన్ని సదుపాయాలను వీటిని తీసుకోలేదు. పెన్షన్ కోసం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు అని నిజాయితీగా చెప్పిన వ్యక్తి కృష్ణ గారు.

ఖాసా సుబ్బారావు, ప్రకాశం పంతులు తో కలిసి పని చేసిన కృష్ణ పాత తరానికి కొత్త తరాలకు మధ్య వారధిగా ఉండేవారు. ఏ జర్నలిస్ట్ అయినా సొంతంగా పత్రిక పెడుతున్నామంటూ ముందుకు వస్తే 'అనవసరంగా చేతులు కాల్చుకోకు' అంటూ హెచ్చరించి ఇంతకు పూర్వం చేతులు కాల్చుకున్న వారి పేర్లు చెప్పి హడలగొట్టేవారు కారు. ఆరంభ సంచిక కోసం వ్యాసం విధిగా రాసి పెట్టేవారు. ఏ అంశంపై రిపోర్టు రాసినా ఆ అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మరీ రాసేవారు. ఇంగ్లీషు, తెలుగు భాషలతో పాటు ఉర్దూ లో కూడా అద్భుతంగా రాసేవారు.  ఉర్దూ మాటలు ఎన్ని తెలుగులోకి ఎలా వచ్చాయో ఆయన సందర్భాన్ని బట్టి వివరించేవారు. ఏంతో మంది రాజకీయవేత్తలతో నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నా ఎవ్వరిని ఏ నాడు ఏ విషయం గురించి ఆశ్రయించలేదు. కనుకనే ఆయనంటే అన్ని తరాల జర్నలిస్టులకు ఎనలేని గౌరవం. పి. వి. నరసింహారావు ముఖ్యమంత్రిగా, అక్కిరాజు వాసుదేవరావు సమాచార శాఖ మంత్రిగా వున్న రోజుల్లో, కృష్ణ గారు నిరుద్యోగిగా విజయవాడలో వుంటూ, సంగీతం-సాహిత్యం, నాట్యం పైన, పుస్తకాలపై, సమీక్షలు రాసుకుంటూ పదో-పరకా సంపాదించుకుంటుండేవారు. పి. వి గారు సమాచార శాఖ మంత్రిని విజయవాడ పంపి, కృష్ణగారిని ఆ శాఖ డైరెక్టర్‌గా చేసేందుకు ఆయన అంగీకారం అడగమన్నారు. ఆ ఉద్యోగంలో తానేం చేయాలని ఎదురు ప్రశ్న వేసి, కాలి దగ్గర కొచ్చిన ఉద్యోగాన్ని తన్నేశాడు. వేరే వాళ్ళు అయితే ఎగిరి గంతేసి ఆ పదవిలో చేరేవారు. ఆయన ఆరోగ్యం బాగా లేదని తెలిసి చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయన ఇంటికి వచ్చి ఆయనకు వారి శ్రీమతికి వైద్యానికి కొంత అమౌంట్ శాంక్షన్ చేసి వెళ్లారు. అప్పుడు ఆయనకు నా అనారోగ్యం గురించి ఎవరు ఆయనకు చెప్పారు అని తన కొడుకులను కోప్పడ్డారు.

కృష్ణ గారి సంతానం కొడుకులు కూతుళ్లు అల్లుళ్లు అందరు జర్నలిస్టులే. ఈ రంగంలో దిగుతుంటే వారిని ఆయన వారించలేదు. ఫలానా పని చేయమని కానీ ఫలానా విధంగా ఉండమని కానీ ఆయన పిల్లలకు ఎప్పుడూ చెప్పలేదు. అందరితో ఉన్నట్లు కొడుకులు, కూతుళ్ళతో కూడా స్నేహంగా ఉండేవారు. ఆయన స్నేహశీలి. ప్రేమాస్పదుడు, అమృతుడు. ఆ విధంగా జనం కోసమే జర్నలిస్ట్ అన్నట్టు బ్రతికిన వ్యక్తి కృష్ణ గారు. ఆయనకు రుచించని ఏదైనా అంశంపైన కాని, ఎవరైనా వ్యక్తి గురించి కానీ, ఏదైనా ఒక వార్త కాని కృష్ణగారితో రాయించడం ఎవరి తరం కాదు. రచయితగా ఇంగ్లీషులో "నాయన", "హిస్టరీ ఆఫ్ తెలుగు అండ్ దెయిర్ కల్చర్", "కొమర్రాజు జీవిత చరిత్ర": తెలుగులో "మెడోస్ టైలర్ ఆత్మ కథ", "టపా కథలు", "ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ జీవిత చరిత్ర...తోడేళ్ల పాలు చేశారు", "గాంధి", "మాదన్న మహామంత్రి" అనే పుస్తకాలను రాశారు కృష్ణ గారు.

కృష్ణ గారి గురించి ఇంతా చెప్పి వారి శ్రీమతి లక్షమ్మ గారి గురించి చెప్పక పోతే అయన వ్యక్తిత్వానికి పరిపూర్ణత రాదు. ఎందుకంటే ఏ మగవాడి సక్సెస్ కు అయినా ఒక స్త్రీ  వెనుక ఉంటుంది అన్న మాట కృష్ణ గారి విషయములో పూర్తిగా నూటికి నూరు పాళ్ళు నిజం. కృష్ణ గారు జీవితాన్ని తేలిగ్గా తీసుకున్నారు ఏది పట్టించుకునే వారు కాదు. అలా అని బాధ్యతల నుండి ఎప్పుడు తప్పించుకోలేదు. సామాన్య గృహస్తు చేయవలసిన భాద్యతలను తన పరిధిలో నిర్వర్తించే వారు. వారి శ్రీమతి ఏ నాడు ఆయనను మనకు ఇల్లు కావాలి లేదా తనకు నగలు కావాలి అని గాని, మీరు అది చేయండి ఇది చేయండి అని గాని ఏనాడు అడగలేదు. ఆవిడ ఏ రకమైన ఒత్తిడి చేయకుండా జీవితాన్ని ఆయనకు ఇష్టమైన రీతిలో గడపటానికి సహకరించడం వల్ల అయన ఏ బాదరబందీ లేకుండా రాస్తూ కాలం గడిపారు. అందువల్ల ఆవిడను స్మరించడం అసందర్భం కాదు మరియు అనౌచిత్యం కాదు.

********

Posted in May 2025, వ్యాసాలు

1 Comment

  1. యామిజాల జగదీశ్

    నైస్ ప్రెజెంటేషన్ అండి.‌రచయితకు ధన్యవాదాలు. – జగదీశ్ యామిజాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *