దుర్గ పన్నెండోసారి వీధి గుమ్మం దగ్గరకు వెళ్లి, గేటు బయటకు తొంగిచూసింది.
అడపాదడపా కార్లు, మోటార్ సైకిళ్ళు బయటకి, లోపలకి తిరుగుతున్నాయి.
దుర్గ నిట్టూర్చి లోపలకు వచ్చింది. మంచం మీద కావేరి సన్నగా మూలుగుతోంది. దుర్గ ఆమె దగ్గరగా నడిచి, “అమ్మా! ఏమన్నా కావాలా!” అడిగింది.
“మంచినీళ్ళు” నూతిలోనుంచి వచ్చినట్టు వినిపించింది ఆవిడ స్వరం.
దుర్గ మంచం పక్కన ఉన్న స్టూల్ మీద జగ్‌లో ఉన్న నీళ్ళు గ్లాసులో సగం వరకు పోసి ఆమెని తలగడ మీదకి కొద్దిగా ఎత్తి నీళ్ళు తాగించింది.
ఆవిడ నీళ్ళు తాగి, ఓసారి గాజుకళ్ళు ఎత్తి గది మొత్తం పరిశీలించింది. ఆమె కనురెప్పలు నిరాశతో వాలిపోడం దుర్గ గమనించింది.
పదిమంది పిల్లలున్న తల్లిని మించిన సంపన్నురాలు ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరేమో! ఒకళ్ళు కాకున్నా, ఇంకొకళ్ళు తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కనిపెట్టుకుని ఉంటారు. ఒక్కడే కొడుకు. బాగా చదివించి తండ్రి పోతే, మంచి ఉద్యోగంలో ఉన్న కొడుక్కి చక్కటి పిల్లను చూసి ఆడంబరంగా పెళ్లి చేసి, కోడలిని చూసి మురిసిపోయింది ఈ తల్లి. ఆ కోడలే కొరివి అయి, ఆవిడ ఆశలన్నీ తగలేసింది.
“ఏముందిలేమ్మా! ఇదే ఊళ్ళో ఉంటాగా... వారానికి రెండుసార్లు వస్తుంటాలే దిగులుపడకు.” అంటూ వాగ్దానం చేసి వెళ్ళిన కొడుకు నెలకి, రెండు నెలలకీ వస్తూ, ఓ గంట కూర్చుని వెళ్ళేవాడు. నెమ్మదిగా అది కూడా మానేసాడు.
“అదేంటిరా అంటే టైమ్ లేదమ్మా. ఈ ట్రాఫిక్‌లో పడి రావడం, పోవడం కష్టం” అన్నాడు.
మనసులో దిగులున్నా, పైకి మాత్రం “పోనీలేవే ఎవరి ఇబ్బందులు వాళ్ళవి. వాడికి కుదరడం లేదేమో” అంటూ దాటేసేది దుర్గ ఏమన్నా అంటే ఆవిడ.
పదిరోజుల క్రితం ఆవిడ బాత్రూమ్లో పడింది. దుర్గ దగ్గరే ఉంది కాబట్టి వెంటనే పక్కింట్లోనే ఉన్న డాక్టర్ని పిలుచుకుని వచ్చింది. ఆయన పనిచేసే హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లి, రెండు రోజులక్కడే ఉంచి,
“రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలమ్మా” అని డిశ్చార్జ్ చేసాడు. కానీ ఆవిడ కోలుకోలేదు... మానసిక ఆందోళనకి మందేదీ మరి!
ఆరోజు నుంచీ ఆవిడని కంటికి రెప్పలా కనిపెట్టుకుంటూ, ప్రతి రోజూ ఆనంద్కి ఫోన్ చేస్తూనే ఉంది దుర్గ. ఆరోజు నుంచి ప్రతిరోజు ఎదురుచూస్తూనే ఉంది ఆవిడ. కొడుకు కాదు కర్కోటకుడు అనుకుంది దుర్గ వందోసారి.
బయట కారు శబ్దం. దుర్గ పరుగున వీధి గుమ్మం దగ్గరకు వెళ్ళింది.
హడావుడిగా లోపలికి వస్తూ, “ఎలా ఉంది అమ్మ?" అంటూ మంచం దగ్గరకు వెళ్లి “అమ్మా!” అని పిలిచాడు.
ఆవిడ కళ్ళు తెరిచింది. ఆ కళ్ళల్లో మెరుపులు మెరిసాయి. ఆప్యాయంగా కొడుకు చేయి పట్టుకుని “ఎలా ఉన్నావురా? కోడలు బాగుందా?” అంది.
“వదిలేశానమ్మా! పోరాడి, పోరాడి అలసిపోయి తనని వదిలేసాను. నాకు భార్య మళ్ళీ వస్తుందమ్మా. కానీ నీకు ఏమన్నా అయితే అమ్మ రాదు కదమ్మా!”
“అదేంటిరా! నేనెక్కడికి పోతాను? నీ భార్య కడుపున నీ కూతురుగా మళ్ళీ నీ ఇంటికి రానూ! అందుకోసం భార్యని వదిలేసావా! తప్పు నాన్నా!”
వింటున్న దుర్గ, ఆమె చేతి స్పర్శలో అమృతధారలా ప్రవహిస్తున్న వాత్సల్యపూరితమైన స్పర్శని తాదాత్మ్యంగా అనుభూతిస్తున్న ఆనంద్ ఒకేసారి విస్తుబోతూ ఆవిడ వైపు చూసారు. ఇద్దరి నోటినుంచీ ఒకేసారి “అమ్మా!” అనే పిలుపు వచ్చింది. అవును ఆమె అమ్మ.