మనం చదివిన కొన్ని కథలు, వ్యాసాలు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. మన జీవన విలువలను నిర్ధారించడమే కాక, అలా జీవించడానికి ప్రోత్సహిస్తాయి. అలాంటి ఒక వ్యాసం 18వ శతాబ్ది ఐర్ లాండ్ రచయిత ఆలివర్ గోల్డ్ స్మిత్ వ్రాసిన ‘ఆన్ నేషనల్ ప్రిజుడిసెస్’. సగటు మనుష్యులకు దేశభక్తితో బాటు ఇతర దేశీయుల మీదున్న పక్షపాత, నిమ్నతా భావాలను ఖండిస్తూ వ్రాసిన వ్యాసం. ఆ వ్యాసం తొమ్మిదవ తరగతి ఇంగ్లీష్ పాఠ్య పుస్తకంలో పెట్టడం తో క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడప్పుడే అభిప్రాయాల పునాది గట్టిపడుతున్న సమయంలో ఈ వ్యాసం చదవడం నా అదృష్టం. అలా నన్ను నేను ఒక దేశ పౌరుడుగా మాత్రమే కాకుండా ఈ వసుధైక కుటుంబంలో ఒక జీవిగా నా గుర్తింపు మార్చుకోవడానికి ఆ హై స్కూల్ పాఠం తోడ్పడింది.
అదే, అటుతరువాత జాన్ లెనన్ వ్రాసి పాడిన ‘ఇమాజిన్’ పాట తెగ నచ్చడానికి కారణం.. రిజర్వ్ బ్యాంక్ లో పని వల్ల విదేశాలు కూడా తిరగడంతో నా అభిప్రాయాలు మరింత గట్టి పడ్డాయి. ఈ ప్రభావాల పరిణామమే ‘నేను నా వారు’. ఇది నేను వ్రాసిన మొదటి కథలలోది.
ఈ కథ కూడా మధురాంతకం రాజారాం గారికి నచ్చిన కథ. ఆయన వ్రాసిన స్పందన కథ చివర జత పరిచాను. అలానే ఆయన 1990 దశాబ్దంలో వస్తున్న వర్ధమాన రచనల గురించి వివరిస్తూ వ్రాసిన వ్యాసంలో ఈ కథ గురించి ప్రస్తావిస్తూ, తెలుగు కథ భవిష్యత్తు ఆశాజనకంగా ఉంది అనడానికి తార్కాణమని పేర్కొన్నారు.
రచయితలు కథా వస్తువును జీవితంలో నుంచి తీసుకుంటే, కథలలోని కొన్ని ఊహా చిత్రాలు జీవితంలో తరువాత ప్రత్యక్షమై నిజాలుగా నిలుస్తాయి. ఈ కథ వ్రాసినప్పుడు, విదేశాలలో తిరిగినా, అమెరికా సందర్శించలేదు. అలాంటిది ఇప్పుడు ఫ్లోరిడాలో మా ఇంటి పెరట్లో నుంచే కేప్ కనెవరల్ నుంచి రోదసీ లోకి పరుగెడుతున్న స్పేస్ షిప్ లను చూడగలగడం ఊహ, నిజాల మధ్య అంతరాలను ప్రశ్నింప చేస్తాయి.
ఈ కథలో ఒక సంఘటనలో మెరిసే, మాతృ భాష మీది అభిమానం పై కూడా కథ వ్రాయమని నాకు రాజారాం గారు చెప్పారు. రాజారాం గారు వ్రాసి చివరగా ప్రచురింపబడిన ‘కర్ణామృతం’ కథా వస్తువు తెలుగు పలుకు పై ఉన్న ప్రేమ మీదనే. జీవితంలో కొన్ని పనులు వెంటనే చేయాలని, ఏదీ సశేషం గా వదిలి పెట్టగూడదన్న విషయం నాకు ఎప్పటికీ గుర్తుండేలా చెప్పే పాఠం, ఆయన నాకు చివరగా మిగిల్చి వెళ్ళిపోయారు.
కథలకు మాత్రమే పరిమితమైన ఈ ఆలోచనలు, మా మనవరాలు లక్ష్మి పుట్టడంతో సార్థకమయ్యాయి. భారత, అమెరికాలకు ప్రతీకలయిన ఈ చిన్నారులు నిజంగానే వసుధైక కుటుంబ పౌరులు.
నేను నావారు
‘‘రమణయ్యగారి పల్లె గురించి మీరు వినలేదని ఆశ్చర్యపడనవసరంలేదు. అసలు విన్నారంటేనే ఆశ్చర్యపడవలసిన విషయం. చిత్తూరు జిల్లాలోని అనేక గ్రామాల్లో అదొకటి. ఆ ఊరు చేరాలంటే చిత్తూరు, లేక పాకాల స్టేషన్ నుంచి బండి కట్టవలసిందే. మరో మార్గం ఓ ఇరవై మైళ్ళ కాలినడకే.
ఆ గ్రామంలో మొత్తం ఇరవై ఇళ్ళకంటే ఎక్కువ ఉండవేమో, స్వతంత్ర భారత ఛాయలు ఇంకా పడలేదు. అనాదిగా వస్తున్న గ్రామ వ్యవస్థ ఇంకా నిలిచే ఉంది. ఊరుకు దక్షిణంగా పారుతున్న పిల్లకాలువ పక్కనే ఉంది మడివేలు గుడిసె. ఉత్తరంగా మిద్దింట్లో ఉండేది రైతులు. పశ్చిమంగా నూనెగానుగ కానుకుని గానుగ ఆడించే వారి ఇళ్ళు ఉంటే, తూర్పు చివర అయ్యవారిల్లుంది. గ్రామంలో ఉన్న వారందరూ ఒకరిమీదొకరు ఆధారపడి జీవిస్తున్నవారే. మడివేలు పొద్దున్నే లేచి అందరిళ్ళ కెళ్ళి మాసిన బట్టలు తీసుకెళ్ళి ఉతికి, ఆరేసి సాయంత్రం తిరిగిస్తే, రాత్రి మడివేలు భార్య అందరిళ్ళకూ వెళ్ళి సంగటి, కూర తీసుకొని వస్తే తిని, ఆ రోజు లాగించే వాళ్ళు, ఐవోరు తిథి నక్షత్రాలు చూసి మంచి రోజు చెప్పిందానికీ, పిల్లలకు ఓనామాలు నేర్పించడానికి పంటలో తృణమో పణమో ఆ గ్రామస్థులే ఆయన కిచ్చేవారు.
అప్పిచ్చు వాడి అవసరం ఆ గ్రామానికి లేకపోయినా, వైద్యుని కొరత ఆ ఊరికి, మిగతా అన్ని పల్లెటూళ్ళ లాగానే ఉంది. దగ్గర్లో డాక్టరుకు చూపెట్టాలంటే చిత్తూరికి బండి కట్టవలసిందే. అలా బండి కట్టాలా, వద్దా అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నాడు, అయ్యవారు ఆ క్షణం. దానికి కారణం అయ్యవారి పెద్ద కూతురు తొలి కాన్పుకు పుట్టింటికి వచ్చింది. ఆ చుట్టుపక్కల ఉన్న అయిదు ఊళ్ళకున్న ఒకే ఒక మంత్రసాని హస్తవాసిని నమ్ముకొని తను వేరే వైద్య ప్రయత్న మేమీ చేయలేదు. రాత్రి పది గంటలకు నొప్పులంటూనే మంత్రసానిని పక్కూరునుంచి పిలిపించారు. తెల్లవారి దాదాపు నాలుగ్గంటలు కావొస్తున్నది. ఇంతవరకూ కూతురి అరుపులే కాని కాన్పు అయ్యే సూచన లేవీ కనపడటం లేదు.
ఇల్లంటే పెద్ద తాటాకుల గుడిసే. లోపల కూతురు, మంత్రసాని, భార్య అవస్థపడుతూ ఉంటే, తను చిరుచలికి శాలువా కప్పుకుని శుభవార్త కోసం గుమ్మానికి ఆనుకొని ఉన్న దిన్నెలపైన కూర్చుని అవస్థ పడుతున్నారు.
ఇక లాభంలేదు. కూతురు ప్రాణంమీద కొచ్చేలాగుంది అని తలుపు కొట్టబోయేసరికి ‘కేర్’ అన్న శ్రవణానందకరమైన శబ్దం వినిపించింది. మనస్సులో, అయ్యవారు దేవునికి కృతజ్ఞతలు అర్పించుకున్నారు. పదిహేను నిమిషాల తరువాత మంత్రసాని తలుపు తీసి ‘‘మగబిడ్డ, మనవడు పుట్టా’’డంది.
లోపలికి ఆత్రుతగా వెళ్ళారు. గుడిసెలో ఒక మూల వరుసగా అమర్చిన కుండల దొంతర. దాని పక్కనే ఒక చాప, చాపపైన బొంత. బొంతమీద కూతురు పడుకోనుంటే, తన భార్య పక్కన కూర్చుని కూతురి ముఖానికి పట్టిన చెమటను తుడుస్తున్నది.
దగ్గరికి వెళ్ళి మనవడి కోసం చూశాడు. కూతురు అలసిపోయి మగతగా కళ్ళు మూసుకొని ఉంది. కూతురు పక్కన చామనచాయ, ఎరుపుతో కూడిన పసికూన, తన మొదటి మనవడు. మనస్సులోనే లెక్కలు వేసుకుని ‘అదృష్టజాతకుడు’ అనుకున్నాడు. సూర్యోదయంతో పుట్టిన వీడి పేరు ‘రవి’ అనుకున్నాడు.
ఈ కొత్త ప్రపంచం అలజడి పసివాడికి కష్టంగా ఉందేమో! వాడు వాళ్ళమ్మ స్పర్శకోసం కెవ్వుమంటూ అరవసాగాడు. వాడికి, తన కూతురుకు కొన్ని అంగుళాలు కంటే ఎక్కువ ఎడంలేదు. వాడి కేక విన్న కూతురు ఉలిక్కిపడి వాడిని దగ్గరకు తీసుకుంది. వెంటనే ఆ చిన్నవాడు వాళ్ళమ్మ పొత్తిళ్ళలో ఒదిగిపోయి, తృప్తిగా కళ్ళు మూసుకుని నిద్రలోకి జారాడు.
l l l
హైదరాబాదులో విజయనగర్ కాలనీ పేరు అప్పుడప్పుడే పరిచితమవుతున్న రోజులు. విజయనగర్ కాలనీ అంటే వయా మల్లేపల్లి అని రాస్తే కాని ఉత్తరాలు చేరని రోజులు. విశాలమైన మైదానంలో అక్కడక్కడ పెద్ద గోతులతో, కొన్ని ఆస్బెస్టాసు రేకుల ఇండ్లతో, పాత కాలంలో ఊరి బయట ఇళ్ళలా ఉన్న గవర్నమెంటు క్వార్టర్సు, విజయనగర్ కాలనీ. శాంతి నగర్ ఇంకా పుట్టలేదు. బంజారా హిల్స్ మీదున్నది రాళ్ళు రప్పలు, ముళ్ళకంపలే. విజయనగర్ కాలనీ నుంచి ఆ రాళ్ళు కంపలు కనిపించేవి.
రవి వాళ్ళ నాన్న ఆంధ్ర ప్రభుత్వావతరణతో మద్రాసు నుంచి కర్నూలు, అక్కడి నుంచి హైదరాబాదు ప్రభుత్వంతో పాటు మకాం మార్చి, విజయనగర్ కాలనీలో ప్రభుత్వం ఇచ్చిన ఓ చిన్న ఇంట్లో స్థిరపడి రెండేళ్ళయింది. పిల్లవాడిని మంచి ఇంగ్లీషు మీడియం స్కూల్లో చేర్చించాలని తాపత్రయం. దగ్గర్లో ఉన్న ఇంగ్లీషు మీడియం స్కూల్సన్నీ ఆబిడ్స్ దగ్గరనే ఉన్నాయి. ఆ స్కూలు, ఈ స్కూలు ప్రయత్నించి చివరకు ఆల్సెయింట్సులో చేర్పించాడు.
స్కూల్లో చేర్పించిన మొదటి రెండు రోజులు తన సైకిలుపైనే స్కూల్లో దించి, తిరిగి ఇంటి కొచ్చేటప్పుడు తెచ్చినా, మూడో రోజు స్కూలుకి కాలనీలో తెలిసిన పిల్లలతో కలిసి బస్సులో పొమ్మని రెండణాల రెండు పైసలు చేతి కిచ్చేశాడు, రవి వాళ్ల నాన్న. పోవడానికి ఒకణా, రావడానికి ఒకణా టికెట్టు. రెండు పైసలు ఏమైనా కొని తినడానికి. ఆబిడ్సుకు పోవాలంటే ఫతేమైదాన్ బస్సు ఎక్కాల్సిందే. పొద్దున మూడు బస్సులు, సాయంత్రం తిరిగి రావడానికి మూడు బస్సులు మాత్రం ఫతేమైదానుకు నడిచేవి. ఆ బస్సులు తప్పితే ఆబిడ్స్‌కు పోవడానికి నాంపల్లి బస్సెక్కి, తిరిగి బస్సు మారాల్సిందే.
మొదటిరోజు తండ్రి లేకుండా బస్సులో పోవడం భయంగానే ఉంది రవికి. దానికి తోడు భుజం మీద పుస్తకాల మోత. ఒకటికి రెండుసార్లు నాన్న ఇచ్చిన డబ్బులు జేబులో ఉన్నాయో, లేవో అని చూసుకుంటూ స్నేహితులతోపాటు బస్ స్టాప్ వైపు వెళ్ళాడు.
బస్సు ఆగే ఉంది. వెంటనే స్నేహితులతో పాటు పరుగెత్తి వెళ్ళి ఎక్కాడు. నిలబడ్డానికి మాత్రం చోటుంది. కండక్టర్ దగ్గరికి వచ్చి ‘టికెట్’ అనగానే జేబులో నుంచి అణా తీసిఇచ్చాడు. కండక్టర్ ఆ డబ్బులు సంచిలో వేసుకుని, భుజానికి తగిలించుకున్న టికెట్ మిషన్‌ను అర టిక్కెట్టుకు సరి చేసి. కిర్ మంటూ హాండిల్ తిప్పాడు. మిషన్‌లో నుంచి ఓ రిబ్బన్ ముక్కలాంటి పేపర్ ఎర్రటి ముద్రతో అప్పుడే ప్రింటై వస్తే దాన్ని చించి రవి కిచ్చాడు. రవి స్నేహితులతోబాటు బస్సు ఆబిడ్స్‌లోని గ్రామర్ స్కూల్ ఎదురుగా ఉన్న అశోక్ బుక్ డిపో దగ్గర దిగాడు. ఒకటో రెండో కార్లు తప్పితే ట్రాఫిక్ ఏమీ లేదు. పిల్లలతోపాటు రోడ్డు దాటి స్కూలు వైపు నడిచాడు.
స్కూలు బయట చాలా చిల్లర బొమ్మలు, చిరుతిళ్ళు అమ్ముతున్నారు. రవి ఉప్పు చల్లి అమ్ముతున్న నేరేడు పళ్ళు తినాలా? లేక, మసాలా పూసి అమ్ముతున్న జాంపళ్ళు తినాలా? అన్న సందేహంలో పడి, చివరకు నేరేడుపళ్ళు రెండు పైసలకి కొనుక్కుని స్కూల్లోకి నడిచాడు.
కాని కాస్లులో చేరినప్పటి నుంచి, తన కాలనీ వాళ్ళను సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు పట్టుకోగలనో, లేనో అన్ని దిగులు పెట్టుకుంది రవికి. అప్పుడప్పుడు ఇంటికి తిరిగి పోవడానికి అణా జేబులో ఉందో, లేదో అని తడిమి చూసుకుంటూనే ఉన్నాడు. సాయంత్రం స్కూలు వదలగానే తన కాలనీ వాళ్ళను వెతుక్కుంటూ బయటికి పరుగుతీశాడు. కాలనీ వాళ్ళు కూడా పరిగెడుతూ కనిపించారు. ‘‘పరిగెత్తు రవీ, లేకపోతే బస్సు దొరకదు’’ అని రవిని హెచ్చరించారు. గ్రామర్ స్కూల్ దగ్గర స్టాప్‌లో రెండు విజయనగర్ కాలనీ బస్సులు ఫతేమైదాన్ దగ్గర బయలుదేరిన చోటే నిండిపోవడంతో ఆగకుండా వెళ్ళిపోయాయి. స్నేహితులు ‘‘ఫతే మైదాన్‌కు పోతే బస్సు దొరకచ్చు’’ అనడంతో వారితోపాటు ఫతే మైదాన్ వైపు పరుగుతీశాడు.
అక్కడ చేరిన కొంతసేపటికి కాలనీ బస్సు ఒకటి వచ్చింది. అంతా పెద్ద పిల్లలే సందు పట్టకుండా ఎక్కడంతో తనకు ఎక్కడానికి సందు దొరకలేదు. బస్సు వెళ్ళిపోయిన తరువాత తనతోపాటు మరో ఇద్దరు కాలనీ పిల్లలు ఎక్కలేకుండా మిగిలిపోయినట్లు గమనించాడు.
‘‘ఇక కాలనీ చేరడానికి ఇక్కడ నుంచి బస్సు ల్లేవు. నాంపల్లి పోవలసిందే’’ అని నాంపల్లి వైపు నడవసాగారు. నాంపల్లి చేరి అక్కడ నుంచి బస్సు ఎక్కి ఇల్లు చేరేసరికి సాయంత్రం ఆరున్నర అయింది.
ఇంటి దగ్గరే గేటు వెలుపల నిలబడి ఆదుర్దాగా, తన రాక కోసం ఎదురు చూస్తున్న అమ్మా నాన్ననూ చూసేసరికి రవికి ఎక్కడ లేని దుఃఖం పొంగు కొచ్చేసింది. ‘‘అమ్మా! నాన్నా!’’ అంటూ, ముందుగా చేతులు చాచి నిల్చున్న నాన్న భుజం మీదకి ఎక్కేశాడు. అంతవరకూ భయంతో నిండి ఉన్న రవి శరీరం భయం పోయి సంతోషంతో గగుర్పాటు చెందింది. తృప్తిగా నాన్న భుజం మీద నుంచి ఎక్కిళ్ళ మధ్య తన ఆలస్యానికి కారణం చెప్పసాగాడు. మధ్య మధ్యలో ‘‘అమ్మా, నాన్నా’’ అంటూ తల్లి తండ్రులను పట్టుకుంటూ సంతోషపడసాగాడు రవి.
l l l
విజయవాడ లయోలా కాలేజీలో రవి చేరి ఆరునెలలు అయింది. ఈ ఆర్నెల్లూ ఎలాగో హాస్టల్లో గడిపేశాడు. అమ్మా, నాన్నా గుర్తొచ్చిన మొదటి రెండు రోజులు తప్పితే, మరీ అంతగా బాధపడలేదు. కాని ఇప్పుడు క్రిస్మస్ సెలవులని ఇంటికి బయలుదేరుతుంటే చాలా సంతోషంగా ఉంది రవికి.
తన తండ్రి ఉద్యోగ రీత్యా కర్నూలుకు మారడంతో ఇప్పుడు విజయవాడ నుంచి కర్నూలుకు పోవలసిందే. విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్ళి, అక్కడ పాసింజర్ రైలు ముందు రాత్రి పట్టుకుంటే అది మరుసటి రోజు పొద్దున ఏడు గంటలకు నంద్యాల చేరుకుంది. నంద్యాల నుంచి కర్నూలుకు బస్సు ప్రయాణమే. బస్సు కర్నూలు చివర ఉన్న బి. క్యాంపు గవర్నమెంటు క్వార్టర్స్‌కు రావడంతోనే చిరపరిచితమైన స్థలం చూస్తే కలిగే సంతోషం కలిగింది రవికి.
రవి బస్సు దిగగానే, రవి స్నేహితులు ఎదురు చూస్తూ కనపడ్డారు ‘‘హలో!’’ అంటూ పేరు పేరున వారిని పలకరించాడు రవి.
‘‘పట్టు రవి, బుడ్డలు. నీ కోసం చేన్లోంచి పెరుక్కొచ్చినాం’’ అని ప్రేమతో స్నేహితులిచ్చిన వేరుశనక్కాయలు తింటూ రవి సూట్ కేసు తీసుకుని ఇంటివైపు నడవసాగాడు. ఎందుకు తన మనస్సు ఈ స్నేహితులు, తల్లి దండ్రులు ఉన్న వాతావరణం అంటే ఇష్టపడుతున్నది అనుకున్నాడు రవి. ఈ సెక్యూర్టి ఫీలింగ్ తృప్తిగా, బాగా ఉంది రవికి. ‘నా వాళ్ళ దగ్గరికి వచ్చేశాను. అందుకే ఈ సంతోషం’’ అనుకున్నాడు రవి.
l l l
ఐ.ఐ.టి. ఢిల్లీలో అడ్మిషన్ దొరకడంతో రవి ఢిల్లీకి మకాం మార్చవలసి వచ్చింది ఆంధ్రా వాళ్ళని ఇంకా మదరాసీలుగానే ఢిల్లీ వాళ్ళు పరిగణిస్తున్నారు. కాంపస్‌లో అంతా ఇంగ్లీషులోనే మాట్లాడటం వల్ల, తెలుగు మాట్లాడటం బాగా తగ్గిపోయింది. మొదటి సంవత్సరం కాగానే దక్షిణ ఎక్స్‌ప్రెస్‌లో ఇంటికి బయలుదేరాడు. ఒకరాత్రి ఒక పగలు, రకరకాల ప్రజలు, వారి భాషల మధ్య ప్రయాణం చేసి బేజారైపోయింది రవికి. రెండో రాత్రి బెర్త్‌పైన పడుకుంటూ రేప్పొద్దిటికంతా ఇల్లు చేరిపోయుంటాననుకున్నాడు రవి.
పొద్దున సడన్‌గా మెలుకువ వచ్చింది రవికి. టైం చూస్తే నాలుగు గంటలైంది. ట్రెయిన్ ఏదో స్టేషన్లో ఆగినట్లుంది. ట్రెయిన్ దిగి ప్లాట్‌ఫారంపైకి నడిచాడు రవి. ‘కాజీపేట్’ అన్న తెలుగు అక్షరాలు చూసేసరికి ఎంతో సంతోషం వేసింది రవికి.
‘‘కాఫీ తీసుకోండి బాబూ’’ అని ఫ్లాట్‌ఫారం మీద టీ కాఫీ అమ్ముతున్నవాడు అనడంతోనే తీసేసుకున్నాడు రవి. చుట్టూ చూశాడు. అక్కడ అటువైపు పట్టాల దగ్గరున్న మురికి ఊడుస్తున్నవాడు తెలుగులోనే మాట్లాడుతున్నాడు. ఏదో ట్రెయిన్ కోసం వెయిట్ చేస్తున్న పల్లెటూరి గుంపునుంచి కూడా మంచి తెలంగాణా యాసలో, తెలుగులో మాటలు తియ్యగా, వీనుల విందుగా అనిపించాయి.
‘వీరంతా మనవాళ్ళు వీరిలో భాగాన్ని నేను’ అనుకున్నాడు. అతనికి అప్పుడే తన వారిని చేరినంత సంతోషంగా అనిపించింది.
l l l
గత పది సంవత్సరాలుగా తనో ప్రవాస భారతీయుడైపోయాడు. ఇంజనీరింగ్ అయిన వెంటనే పై చదువు లంటూ అమెరికాచేరి, అటు తరువాత మంచి ఉద్యోగం దొరకడంతో, అక్కడే స్థిరపడిపోయాడు. తల్లి తండ్రులను కూడా తనతోబాటు అమెరికా తెచ్చేసుకుని, ఒక తెలుగు అమ్మాయినే పెళ్ళి చేసుకుని అమెరికాలో ఉండిపోవటంతో, భారతదేశం పోయే అవసరం లేకపోయింది. పిల్లలు కూడా అమెరికా జీవనానికే అలవాటు పడిపోయారు.
అలాంటిది ఇన్ని రోజుల తరువాత ‘ఇంజనీరింగ్ కాన్పరెన్స్’ అని భారత ప్రభుత్వం నుంచి ఆహ్వానం వస్తే రవి తిరిగి భారతదేశానికి బయలుదేరవలసి వచ్చింది. ఆహ్వానంతోపాటు ‘ఎయిర్ - ఇండియా’ రిటర్న్ టికెట్టూ పంపించారు.
భార్య కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు దగ్గర కారులో దించేస్తే తను సూట్‌కేసులు రెండూ తీసుకుని చెక్-ఇన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. ఫస్ట్‌క్లాస్ టిక్కెట్ కాబట్టి తొందరగానే బాగేజి, సెక్యూరిటీ ఫార్మాలిటీలను ముగించుకుని బోర్డింగు కార్డు చూపించి ఫైటు ఎక్కగలిగాడు.
ప్లేన్లోపల భారత దేశాన్ని వెంటనే గుర్తు తెస్తూ ముగ్గుల వంటి డిజైన్లు ఉన్న చీరలు కట్టుకుని, నమస్కరించి, నవ్వుతూ కూర్చోవలసిన సీటుకు దారి చూపుతున్న ఎయిర్ హోస్టెస్‌లు. అప్పుడే భారతదేశంలో అడుగిడినట్లనిపించింది రవికి. విమానంలో అనౌన్స్మెంట్లు ఇంగ్లీషులోనే కాక హిందీలోనూ చేయడం సంతోష మనిపించింది. సీటు కెదురుగా ఉన్న అరలో పెట్టిన హెడ్ ఫోన్లను తీసి పెట్టుకుని ఛానెల్ మ్యూజిక్‌లో ఏం సంగీతం వస్తున్నదో విందామని ఛానెల్‌ను ఒకదాని తరువాత ఒకటి మార్చసాగాడు. హిందీ పాటలు కూడా ఒక దాంట్లో వస్తున్నాయి. మంచి సెలెక్షనే - ‘చౌదవీ కా చాంద్ హో’ ‘జోవాదాకియా’’ వంటి పాటలు ఒకదాని వెంట ఒకటి వచ్చి తను హైదరాబాద్‌లో గడిపిన బాల్యాన్ని గుర్తుకు తెస్తున్నాయి. ‘‘మేరే సప్నోంకీ రాణి...’’ అనే పాట వచ్చేసరికి దృశ్యాలు విజయవాడకి మారిపోయాయి. ‘మై షాయిర్ తో నహీ...’ అన్న పాట ఢిల్లీలోని ఇంజనీరింగ్ కాలేజీ రోజులని గుర్తు తెప్పించింది.
రవికి హృదయం తీపి జ్ఞాపకాలతో బరువైనట్లనిపించింది. భారత దేశంలో తను చూసిన గొప్ప గొప్ప ప్రదేశాలు, అమెరికాలో దొరకని ఆప్యాయతలను తలచుకొని ‘నా దేశం గొప్పది. ఇన్ని రోజులకు నేను నా వాళ్ళ మధ్యకి వెళ్ళగలుగుతున్నాను’ అని తృప్తిగా కళ్ళుమూసుకుని హిందీ పాటలు వినసాగాడు.
l l l
భూమిని వదిలి దాదాపు రెండేళ్ళయింది అనుకున్నాడు రవి. రెండేళ్ళ క్రితం అంగారక గ్రహం మీది లేబొరేటరీలో రీసెర్చికి వచ్చాడు. భూమికి తిరిగి వెళ్ళడానికి ఇప్పుడు వీలైంది. అసలు ఈ రెండేళ్ళలో మొదటి ఆర్నెల్లూ భూమి నుంచి అంగారక గ్రహానికీ, తరువాతి ఆర్నెల్లూ తిరిగి భూమికి ప్రయాణం చేయడానికే సరిపోయింది. అసలీ ప్రయాణం మొదట్లో రెండేళ్ళు పట్టేది. రాకెట్ల ప్రగతితోబాటు ఈ సమయాన్ని ఆరునెలలకు తగ్గించగిలిగారు. అయినా గత ఆర్నెల్లూ 20 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తు ఉన్న రాకెట్ షటిల్లో గడపడం, అదీ ఒంటరిగా, మాటలు కాదు. ఇంతకు ముందు ఇలాంటి శిక్ష ఉరి తీసే ముందు ఖైదీలకి మాత్రం వేసేవారట. ఇప్పుడు అంతర్గ్రహ ప్రయాణాలకి ఇలాంటిది మామూలైపోయింది. ఆ కాలంలో 6 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 2 అడుగుల ఎత్తు ఉన్న బెర్త్ పైన పడుకుని రైళ్ళలో ప్రయాణాలు చేయలేదూ. దాంతో పోలిస్తే ఇది నయమే. తోడు లేదనే కాని, ప్రతి నిముషం ఎదురుగా ఉన్న త్రీడీ తెరపైన జరుగుతున్న విషయాలు, వార్తలు చూడొచ్చు, కావాలంటే సంగీతం వినవచ్చు, సినిమాలు చూడొచ్చు. కంప్యూటర్లతో ఆడుకోవచ్చు. అసలు రాకెట్టును నడపడమంతా కంప్యూటర్లే కావడం వల్ల కావలసినంత తీరుబడి.
పక్కన కిటికీలో నుంచి చూస్తే భూగోళం పెద్దదిగా కనిపిస్తున్నది. భూమికి దగ్గరగా వస్తున్నందుకు అది గుర్తు. బయలుదేరినప్పుడు ఓ నీలి నక్షత్రంలాగా ఉన్న భూమి క్రమంగా పెద్దదవుతూ, చంద్రునిలా అయి, ఇప్పుడు మెల్లగా కిటికీనంతా ఆక్రమించేస్తున్నది. అమెరికా ఖండాలు అక్కడక్కడా మేఘావృతమై మట్టి రంగు, తెలుపు రంగుల మిశ్రమంగా సముద్రాలు నీలవర్ణంలో కొట్టొచ్చినట్లుగా భూమి అందంగా కనబడుతున్నది. అంటే అమెరికాలో ఇప్పుడు పగలన్నమాట!
భూమిని చూసినప్పుడల్లా రవికి సంతోషం కలిగేది. హృదయం గొంతులో పైకొచ్చి అడ్డంపడి కొట్టుకుంటునట్లనిపించేది.
ఆరోజు సాయంత్రం, రవి ప్రయాణిస్తున్న రాకెట్టు భూమి వాతావరణంలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి మరి కొన్ని నిమిషాలు, చాలా ప్రమాదకరమైన సమయం. రాకెట్టు ఓ అగ్నిగోళంలా అయిపోయింది. రాకెట్టు చుట్టూ ఈ వేడిని లోపలికి రానివ్వకుండా ఓ తెర ఆటోమెటిక్‌గా పడటం వల్ల రాకెట్టు లోపల ఉన్న రవికి ఆ వేడి కాని, ఒత్తిడి కాని తెలియలేదు. చివరగా, భూమి కొన్ని వేల అడుగులు పైన ఉండగానే రాకెట్టు వేగం తగ్గించుకుని రాకెట్టు నుంచి విమానంలా పరివర్తనం కావడం ఆరంభించింది.
మరి కొన్ని క్షణాల్లో కాలిఫోర్నియా దగ్గరున్న రాకెట్టు షటిల్ పోర్టులో మెల్లగా హంసలా దిగింది, రవి ప్రయాణం చేస్తున్న వాహనం. వాహనం తలుపు తీస్తూనే ఎదురుగా డేవ్ గామయ్యల్. తనతోపాటు గత ఇరవై సంవత్సరాలుగా అమెరికాలోనే లాబ్‌లో పనిచేస్తున్న సహచరుడు. వెంటనే లేచి ‘‘హయ్ డేవ్!’’ అంటూ కౌగిలించుకున్నాడు. డేవ్ ముఖంలో కూడా ఆనందం. బయటకు వచ్చి రవి ఊపిరితిత్తులనిండా గాలి పీల్చుకున్నాడు. భూమి మీది ఈ గాలి పీల్చి ఎన్ని రోజులైందో అనుకున్నాడు. ఎదురుగా షటిల్ పోర్టు ఇరువైపులా పచ్చగా చెట్లు కనిపిస్తున్నాయి. మనుషులు అటు ఇటూ తిరుగుతూ కనిపిస్తున్నారు.
‘వీరంతా నా వంటి మనుషులు. నేను కూడా వీరిలో ఒకరిని. ఈ భూమికి మేమంతా వారసులం. వీరితో కలిసి భూమిలో జీవించడం ఎంత ఆనందం? ఎంత అదృష్టం!’ అనుకున్నాడు రవి సంతోషంతో.
- ఆంధ్రప్రభ, 1990
ఆంధ్రప్రభ వీక్లీలో ఇటీవల వెలువడిన నీ రెండు కథలు చదివాను. 'పంచింగ్ బ్యాగ్' అనే కథలోని వస్తువు నాకు కాస్త కొత్తదనే చెప్పాలి. కార్యాలయ వ్యవహారాలు ఎలా ఉంటాయో అందు మూలంగా తెలిసొస్తుంది. ఈ వారం వెలువడిన 'నేను, నా వారు' అన్నది మాత్రం చాలా మంచి కథ. ఈ కథలోని ఇతివృత్తం, సర్వదేశాలకు, సర్వ కాలాలకు సమానంగా చెందినది. దీన్ని యధాతథంగా ప్రపంచ భాషాలన్నింటిలోకి అనువదించ వచ్చు. మా ఇంట్లో ముగ్గురు, నలుగురు కథకులున్నప్పటికీ మా ఊరి పేరు(ప్రసక్తి కాదు, ప్రసక్తి చాలా చోట్ల వచ్చింది) ఏ కథలోను వచ్చినట్లు లేదు. ఆ పని నీ కథలో జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. కథల్లో వైవిధ్యం కనిపించాలంటే వివిధ రంగాల్లో, వివిధ ప్రదేశాల్లో, వివిధ ప్రజల మధ్య ఉన్న వాళ్ళు రాయాలి. ఈ కారణాల వల్ల నువ్వు ఏ కథ రాసిన అది విలక్షణంగా ఉంటుంది. ఎటొచ్చి కొంత తీరిక, ఓపిక చేసుకోవాలి. ఈ వ్యాసంగం ఆత్మ సంతృప్తి కైనా అవశ్యంగా కొనసాగింప దగినది.
... శ్రీ మధురాంతకం రాజారాం
14-2-1990