Menu Close
Uma-Bharathi-HG-02
హృదయగానం (ధారావాహిక)
నేడే విడుదల
కోసూరి ఉమాభారతి

8

hrudayagaanam-08

పెద్దమ్మకి పొద్దుటే కొబ్బరి నీళ్లందిస్తూ ... మాలిని తమ ముందుంచిన ప్రతిపాదనని వివరించింది శాంత. "నీవే అలోచించి చెప్పమ్మా. ఆ తరువాతే నిర్ణయం తీసుకుందాము." అంది.

"ఆలోచిద్దాము. అన్నింటినీ బేరీజు వెసుకున్నాకే నిర్ణయం తీసుకోవచ్చు. కచేరీ కార్యక్రమాల విషయంగా ఆలయ కార్యవర్గం నుండి జవాబు కోసం చూస్తున్నాను. దాన్ని బట్టి ఆలోచిద్దాం." అన్నారు సీతమ్మ.

**

తోటవైపునున్న జాలీ గదిలో అప్పుడే రెండు రోజులుగా సీతమ్మగారు... పొద్దుటే నాలుగున్నర గంటల సమయంలో మనమరాలికి సంగీత శిక్షణ మొదలు పెట్టారు.

పంచరత్నాలలో మొదటిది - నాట రాగకృతి ఐన - 'జగదానంద కారకా' తో మొదలయ్యే అభ్యాసన… శ్రావ్యంగా సాగుతుంది. కృతిలోని ప్రతి ఆవృతం ఎలా పలకాలో, పదంలోని ప్రతి భావం ఎలా ఆలపించాలో...  పదేపదే సూచిస్తూ, పాడి వినిపిస్తూ సీతమ్మ గారు పారూకి శిక్షణనిస్తుంటే... తోటలోని పున్నాగలు, సంపెంగలు పులకరించి పోతున్నాయి. పూవుపూవుకు తచ్చాడే తుమ్మెదల నాదంతో పూదోట అల్లలాడుతుంది.

తెలతెలవారుతుండగా పూదోట నడుమనున్న ఆ విశాలమైన గది నుండి వినవస్తున్న గాన మాధుర్యాన్ని ఆస్వాదించేందుకేనేమో ... వెలుగుల్ని చిమ్ముకుంటూ ఉదయభానుడు వేంచేసాడా అన్నట్టుగా ఉంటుంది ఆ దివ్య దృశ్యం.

తొలి సూర్యకిరణాలు ఆ గాయనీమణుల ముఖాలని సున్నితంగా తాకిన క్షణాన, వారి సంగీత శ్రవంతి ముగింపుకొస్తుంది.

**

ఆలయం వారిని కలిసిన వారానికి, పొద్దుటే సీతమ్మగారు పూజ ముగించుకుని బయటకి రావడం, ఆలయ గుమాస్తా వేదమూర్తి వాకిట్లోకి రావడం ఒకే మారు జరిగాయి. సీతమ్మకి నమస్కరించిన వేదమూర్తి ఆమెకి ఓ కవర్ అందించి, సంతకం తీసుకుని నిష్క్రమించాడు.

అప్పుడే ముందు గదిలోకి వచ్చిన శాంతకి కవర్ అందించి, విషయం చదవమంది సోఫాలో కూర్చుంటూ సీతమ్మ గారు. ఆమె పక్కనే ఆశీనురాలై శాంత కవరు లోని ఉత్తరం తీసి చదవసాగింది.

గౌరవనీయులు 'కళాప్రపూర్ణ' సంగీత విద్వాన్ సీతామహాలక్ష్మీ గారికి,

నమస్సులు..

"గత వారం మార్చి 10న మాతో జరిగిన సమేవేశంలో, మీరు ప్రతిపాదించిన కుమారి పరమేశ్వరి గాన కచేరి కార్యక్రమాన్ని ఆలయ వృద్ధికి ఉపయోగపడేలా నిర్వహించడానికి కార్యవర్గం ఆమోదించిందని తెలియజేస్తున్నాము. గాన కచేరీ కార్యక్రమాలని మూడు నెలల వ్యవధిలో జరిపించాలని భావిస్తున్నాము. ఈ కార్యంలో, మాతో పాటుగా రాష్ట్రంలోని మరో ఐదు ప్రముఖ ఆలయ నిర్వాహకులని త్వరలో గుర్తిస్తాము.  ఏర్పాట్లకు సమయం తీసుకుని, కాకినాడ లోని 'మోటూరి భాను శంకర్ ప్రసాద్ ఆడిటోరియం' లో సంక్రాంతి వేడుక సందర్బంగా మొదటి కార్యక్రమం జరిపించేందుకు నిర్ణయించాము. వాద్య బృంద నిర్వహణ వగైరాలకు నిధిని సమకూరుస్తాము.

మీరు ప్రదర్శనలకు సిద్దపడగలరు. సాంప్రదాయ కర్ణాటక సంగీతంలో నిష్ణాతులైన మీకు, మరియు ఇక్కడ ఆలయంలో బాలలకి శ్లోక పఠనంలో శిక్షణిస్తున్న మీ కుమార్తె శ్రీమతి శాంత గారికి కార్యక్రమ రూపకల్పన, సంబంధిత బాధ్యతలని అప్పగిస్తాము.

ఈ మేరకు ఒప్పందానికి, మరిన్ని సంప్రదింపులకు ఎల్లుండి అనగా శనివారం పొద్దుట పదకొండు గంటలకి ఆలయ మీటింగ్ హాల్లో సమావేశమవ్వగలరు.

ఇట్లు,

గౌతమ్ చినరాజప్ప
ఉప కార్యదర్శి , శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయ వ్యవస్థ, కడప

చదవడం ముగించి పెద్దమ్మని సంతోషంతో కౌగలించుకుంది శాంత. “ఊహించని విజయమే అమ్మా. కళామతల్లి దయ, నీ దీవెన పారూ చేసుకున్న పూర్వజన్మ సుకృతం." అంది ఉప్పొంగిపోతూ శాంత.

"చాలా సంతోషం శాంత. మన ప్రయత్నాలకు కళామతల్లి ఆమోదం తెలిపినట్టే. ఇక మాలిని ప్రతిపాదన గురించి కూడా మాట్లాడేద్దాము. సాయంత్రం భోజనానికి రమ్మను." అని పురమాయించారు సీతమ్మ.

**

ఆహ్వానం అందుకుని శనివారం సాయంత్రం భోజనానికి వచ్చారు మాలిని, జోసెఫ్ లు.

వారికిష్టమైన వంటకాలు వండి, వడ్డించింది శాంత. పెరుగువడ, బందరు లడ్డు మాలినికి ప్రత్యేకం అంటూ బల్లపై ఉంచారు సీతమ్మ. పిల్లలతో సరదాగా గడిచిపోయింది రెండు గంటల సమయం.

భోజనానంతరం పెద్దవాళ్ళందరూ మధ్య హాల్లో ఆశీనులయ్యారు. మాలినిని ఉద్దేశించి, "హైదరాబాదులో పారూకి సమ్మర్-ఇంటర్న్షిప్ గురించి చెప్పావట. శాంత చెప్పిందమ్మా. ఆలోచించి ఓ నిర్ణయానికైతే వచ్చాము.  పారూకి ఉత్సాహంగానే ఉంది. సంగీత సాధనకి నీ ఈ ప్రతిపాదన అడ్డేమీ కాదు. ఆలయ కచేరీలకి దాదాపు తొమ్మిది నెలల సమయం ఉంటే.. చర్చ్ మ్యూజికల్ కి ఎనిమిది నెలలనుకోండి.

ఏమైనా నీకు పారూ పట్ల, ఈ కుటుంబం పట్ల ఉన్న శ్రద్ధ నన్ను ఆశ్చర్య పరుస్తుంది తెలుసా? నీవు వందేళ్ళు సంతోషంగా ఉండు తల్లీ." ఆశీస్సులు అందించారు సీతమ్మ.

శాంత కల్పించుకుని "కాకపోతే మాలిని, మా బాబాయ్ రామనాధం గారు, ఆయన కొడుకు శ్రీనాధం కుటుంబం హైదరాబాదులోనే ఉన్నారు. నా చిన్నప్పుడు రాకపోకలు ఉండేవి. నేను మ్యూజిక్ కాలేజీలో ఉండగా ఆయన తెచ్చిన పెళ్ళి సంబంధం నిరాకరించానని నాతో మాటలు మానేసారు. కానీ... పెద్దమ్మతో నిత్యం మాట్లాడుతూనే ఉంటారుట. బాబాయ్ నా గురించి అడిగి తెలుసుకుంటారు కూడానట. పారూకి వేసవి ఇంటర్న్షిప్ విషయం అనుకూలిస్తే, వారిని కలవాలని, వారితో సంబంధ బాంధవ్యాలని నిలుపుకోవాలని పెద్దమ్మ అనుకుంటుంది. అదీ విషయం." అని వివరించింది శాంత.

"అదేలేమ్మా, నిన్ననే వాళ్ళతో మాట్లాడాను. కొద్దిరోజులైనా తమతో ఉండమని అడుగుతున్నారు. వాళ్ళుండేది బంజారా హిల్స్ అట. అయినా అప్పటి వీలుని బట్టి చూద్దాములే." అన్నది కొనసాగింపుగా సీతమ్మ గారు.

"దానికింత  సంశయం ఎందుకు? సామర్ధ్యత ఉన్న పారూకి కొలువు రావడం తధ్యం. వారానికి నాలుగు రోజులు నాలుగేసి గంటల పని ఉంటుంది. మిగతా సమయం మన ఇష్టం. ఆడిషన్స్ మాత్రం చేయాలి. మొదటి రెండువారాలు పారూకి తోడుగా నేనే ఉంటాను. తరువాత మీ ఇష్టానుసారం నిర్ణయించుకోండి. గెస్ట్-హౌస్ మాత్రం మనకి అందుబాటులో ఉంటుంది. పునీత్, జననీ కూడా నాలుగు రోజుల పాటు హైదరాబాదు వెళ్ళడానికి ఉత్సాహంగా ఉన్నారు కదూ!" అంది మాలిని సంతోషంగా.

"నేను రేపు బాసర వెళ్లి వస్తాను. ఆ తరువాత హైదరాబాదు వెళ్లేందుకు నేను సిద్ధం." అంది సీతమ్మ.

**

హైదరాబాదులో... ఎనిమిది వారాలకి గాను పదహారు వేల రూపాయల జీతంతో సమ్మర్-ఇంటర్న్షిప్ పరమేశ్వరికి ఖరారయింది. మాలిని పారూతో హైదరాబాదుకి పయనమైంది. మొట్టమొదటి సారిగా పారూని విమానయానం చేయించింది మాలిని పిన్ని.

సీతమ్మ గారు కోరగా… పని మొదలు పెట్టిన నాలుగు రోజులకి …పారూని వెంటబెట్టుకుని రామనాధం గారింటికి వెళ్ళింది మాలిని. పరమేశ్వరిని… రామనాధం గారితో పాటు ఆయన కొడుకు, కోడలు శ్రీనాధం, వకుళ ఆత్మీయంగా ఆహ్వానించారు.

పారూ గురించి, పారూ సంగీత సాధన గురించి ఎప్పటికప్పుడు సీతమ్మ వారికి చెబుతుంటారని మాలినికి అర్ధమయింది. పారూ కార్యక్రమాల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు రామనాధం గారు.

తొమ్మిది గంటల ప్రాంతంలో భోంచేస్తుండగా… శ్రీనాధం, వకుళ గారి కొడుకు ‘కిరణ్’ హడావిడిగా బయట నుండి వచ్చాడు.

భుజాన ఉన్న గిటార్ తీసి పక్కన పెట్టి  డైనింగ్ వద్దకి వచ్చాడు. "డాడ్, మామ్, మా మ్యూజిక్ కాన్సర్ట్ బ్రహ్మాండంగా జరిగింది. మొన్న మీకు వినిపించానే... ఆ లిరిక్ సూపర్బ్ అన్నారందరూ. మై గాడ్! ఐ యామ్ వెరీ హ్యాపీ. కాస్మోపాలిటన్ టీవీకి క్లబ్ తరఫున ఇంటర్వ్యూ చేసి వస్తున్నా. అందుకే కొద్దిగా ఆలస్యమయింది." అంటూ మాలిని, పారూల వైపు చూసాడు.

"హలో, సారీ, ఏదో మాట్లేడేస్తున్నా. గ్లాడ్ టు మీట్ యు. నేను కిరణ్ నాధ్. మీరు డాక్టర్ మాలిని." అని మాలిని తోనూ, "నీవు నా కజిన్ పరమేశ్వరి రామ్‌కుమార్‌" అని పారూతోనూ అంటూ ... "మీరు వస్తున్నారని తాతగారు చెప్పారు." అని పలకిరించాడు కిరణ్.

తనకెంతో ఇష్టమైన ‘డిన్నర్ తరువాతి డెజర్ట్’ అంటూ... ఫ్రీజర్ నుండి బట్టర్-స్కాచ్ ఐస్-క్రీం తీసి స్వయంగా సర్వ్ చేసి, పారూకి ఎదురుగా కూర్చున్నాడు నేథన్.

"అయితే పరమేశ్వరీ… నీ గురించి, మీ పేరెంట్స్, గ్రాండ్-పేరెంట్స్ గురించి కూడా తాతగారు చెబుతుంటారు. నాకు ముగ్గురు కజిన్స్ ఉన్నారని తెలిసినా వాళ్ళని ఇప్పటివరకు కలవనందుకు కాస్త బాధే. కనీసం ఇప్పుడు నిన్ను కలిసినందుకు చాలా చాలా సంతోషం. ట్విన్స్ కూడా త్వరలో వస్తారటగా. వెరీ నైస్." అన్నాడు కిరణ్.

స్టూడియోలో పారూ వర్క్ షెడ్యూల్ గురించి అడిగి తెలుసుకున్నాడు. వారిని సిటీ లోని కొత్త ప్రదేశాలికి, తమ మ్యూజిక్ క్లబ్ కి తీసుకు వెళతానన్నాడు. తనకి ముందుగానే చెపితే, వచ్చి పికప్ చేస్తాన్నాడు. పారూకి పర్సనల్ ఫోన్ లేదని గ్రహించి, మాలినితో కాంటాక్ట్ షేర్ చేసుకున్నాడు కిరణ్.

రామనాధం గారిని, కిరణ్ని, అతని తల్లితండ్రుల్ని కలవడం... పారూని ఉక్కిరిబిక్కిరి చేసిందని భావించింది మాలిని. పారూని, మాలినిని కూడా కిరణ్ తన మాటలతో, చేష్టలతో ఆకట్టుకున్నాడు.

రెండు రోజులకోమారు పారూ, మాలినీలని స్టూడియో నుండి నాలుగింటికల్లా పికప్ చేసి, సిటీ అంతా తిప్పి, మంచి రెస్టారెంట్లో డిన్నర్ చేసాక మళ్ళీ గెస్ట్-హౌజ్ వద్ద డ్రాప్ చేసాడు కిరణ్. అతనితో ఉన్నంతసేపూ పారు స్వేచ్ఛగా నవ్వుతూ మాట్లాడ్డం గమనించింది మాలిని. కారు నడుపుతూ, హిందీ పాటలు పాడుతున్న కిరణ్ తో పారూ కూడా గొంతు కలిపి పాడుతుంటే ముచ్చటేసింది ఆమెకి.

మాలిని తిరిగి కాకినాడ వెళ్లే రెండు రోజుల ముందు … సీతమ్మగారు ఊళ్లోకి వచ్చారు. వారి ముగ్గురినీ తమ ఇంటికి ఆహ్వానించారు శ్రీనాధం దంపతులు. గెస్ట్-హౌజ్ నుండి వారిని తీసుకెళ్ళడానికి వచ్చిన కిరణ్ ముందుగా 'నానమ్మగారు' అని సంభోదిస్తూ సీతమ్మ గారికి పాద నమస్కారం చేసాడు.

దారిలో తనకి పెద్ద కుటుంబమంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఇన్నాళ్లకు కలుసుకున్నందుకు సంతోషంగా ఉందన్నాడు.

**

సీతమ్మ గారికి ఆత్మీయ స్వాగతం పలికారు రామనాథం గారు, శ్రీనాధం, ఆయన సతీమణి వకుళ. పసందైన విందు, ఆత్మీయ సంభాషణలతో సరదాగా గడిచింది ఆ సాయంత్రం.

డిన్నర్ అయ్యాక పారూని, హాల్ పక్కనే ఉన్న ఓపెన్ మ్యూజిక్ రూములోకి ఆహ్వానించాడు కిరణ్. 1940ల నుండి తన వద్దనున్న హిందీ, తెలుగు, పాశ్చాత్త సంగీతం ఆల్బములు చూపించి, రూనా లైలా, ఉషా ఊతాప్ పాటలు వినిపించాడు.

సంగీత ప్రపంచంలో మునిగి తేలుతున్న వారివురినీ గమనిస్తూ పెద్దల సంభాషణ పిల్లల దిశగా సాగింది. "కిరణ్ బాబు మాకు ఒక్కడే సంతానం. బాగా పాడతాడు, మంచి గేయ రచయిత కూడా. సంగీతంలో మా పెదనాన్న... విశ్వనాధం గారికి ఉన్నంత నైపుణ్యం ఉంది. యేడాది పాటు ఢిల్లీ వెళ్లి అక్కడ పాశ్చాత్య సంగీత రీతులు స్టడీ చేసాడు. ముందు నుండీ పాప్, జాజ్ పాశ్చాత్య సంగీతం వైపే మొగ్గు చూపాడు. అందులోనే కొనసాగుతున్నాడు." అంటూ కొడుకు గురించి చెప్పుకొచ్చారు శ్రీనాధం.

"తన సొంత బ్యాండ్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు నా మనవడు. హైదరాబాద్ సిటీ మ్యూజిక్ క్లబ్ కి తానే ఆర్గనైజర్. వాడు ఆంగ్లంలో రాసిన పాటలకి రెండు మార్లు అవార్డులు అందుకున్నాడు. కిరణ్ బాగా చదువుతాడు కూడా. హాలిడేస్ కనుక ఇక్కడ ఉన్నాడు. తిరుపతి ఐ.ఐ.టి లో బి.టెక్ చేస్తున్నాడు." అంటూ గర్వంగా చాటుకున్నారు తాతగారు రామనాధం.

“బాగుంది రామనాధం... మన కుటుంబాల్లో ఈ సంగీత కళ ఇంతలా మనగలగడం గర్వకారణమే. ఇక శాంతా, రామ్ లకి పారూ తరువాత కవలలు - పునీత్, జనని. సంగీతమే ఊపిరిగా కృషి చేస్తున్నది మాత్రం  ప్రస్తుతం ‘పారూ ఒక్కతే.” అన్నారు సీతమ్మ.

మరికాసేపు ఉండి సెలవు తీసుకున్నారు సీతమ్మా వాళ్ళు.

****సశేషం****

రచయిత్రి పరిచయం ....

‘నాట్యభారతి’ ఉమాభారతి - నర్తకి, నృత్య గురువు, నటి, రచయిత్రి, టీ.వి చిత్ర దర్శక-నిర్మాత

కూచిపూడి, భరతనాట్యం నృత్యాలలో నిష్ణాతురాలు ఉమాభారతి. నాలుగు దశాబ్దాలుగా దేశవిదేశాల్లో కూచిపూడి నృత్య విస్తరణకు కృషి చేసి ఆ కళకు వన్నె తెచ్చిన మేటి నర్తకిగా, గురువుగా ఖ్యాతి గడించారు ఆమె. పద్నాలగవ యేట అఖిలభారత కూచిపూడి నృత్య పోటీలో గెలుపొంది, 1977 లో ప్రపంచ సాంస్కృతిక సభలచే ఆహ్వానింపబడి, ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక విభాగం వారిచే సాంస్కృతిక రాయబారిగా పరిగణింపబడిన అప్పటి యువ నర్తకి, ఉమాభారతి.

1970 లో ‘కూచిపూడి రంగప్రవేశం’ గావించి, 20 సంవత్సరాల వయసుకే విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు, సినీ రంగ ప్రవేశం, చిత్ర నిర్మాణం కూడా చేపట్టి కళారంగంలో ఎనలేని కీర్తినార్జించింది ఉమాభారతి.

బాలనటిగా ‘సుడిగుండాలు’ చిత్రంలో, కథానాయకిగా ‘చిల్లరదేవుళ్లు’ చిత్రంలో, ఊర్వశి గా NTR సరసన ‘యమగోల’ చిత్రంలో నర్తించిన ఉమాభారతి 1976 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం విద్యార్ధి దశలోనే ‘భారతీయ నృత్య రీతులు’ అనే 30 నిముషాల డాక్యుమెంట్రీ నిర్మించారు.

సేవే ధ్యేయం, నృత్యం మార్గంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా… విద్యానిలయాల నిర్మాణాలకి, వరద బాధితుల నిధికి, నేత్రదాన శిబిరాలకి, 2 వ తెలుగు ప్రపంచ సభలకు, ‘రామసుబ్బయ్య పేద విద్యార్ధుల స్కాలర్షిప్ ఫండ్’ కు స్వచ్చందంగా నృత్య కార్యక్రమాలను చేసారు.

సౌతాఫ్రికా, మారిషస్, సెషిల్స్ ఆంధ్ర మహాసభల నిర్వహణలో నృత్య ప్రదర్శనల ద్వారా ఆలయ నిర్మాణ నిధులకి, తెలుగు భాషా-సంస్కృతి ప్రాచుర్యం పెంపొందించే కార్యక్రమాలకి నిధులు సేకరణకి నృత్య ప్రదర్శనలు చేశారు.

అమెరికా లోని వివిధ (25)  దేవాలయ నిర్మాణ సంస్థల నిధుల సేకరణార్ధం సాంస్కృతిక పర్యటనలు నిర్వహించారు. 1982 లో హూస్టన్ లో అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ స్థాపించి ప్రవాసాంధ్రుల యువతకి నృత్యశిక్షణ కొనసాగిస్తూ జెమిని టి.వి కి ‘అలయనాదాలు’ టెలీ సీరియల్ నిర్మించి దర్శకత్వం వహించారు.

ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న కృషికి గుర్తింపు:
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి చేతుల మీదగా స్వర్ణకంకణం, ‘నాట్యభారతి’ అనే బిరుదు, పాండుచేరి గవర్నర్ నుండి L.V.R ఫౌండేషన్ వారి ‘రాజ్యలక్ష్మి అవార్డ్’. ‘వంశీ’ వారి ‘ఉత్తమ ప్రవాసాంధ్ర కళాకారిణి’ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ వారి ‘జవహర్లాల్ నెహ్రూ సెంటినియల్ అవార్డ్, U.S.A హూస్టన్ ‘ఏషియన్ విమెన్స్ వారి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్ ’ అవార్డ్, ‘TANA’ వారి సాంస్కృతిక పురస్కారం... ఆమె అందుకున్న కొన్ని పురస్కారాలు.

రచయిత ఉమాభారతి:
తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువతో 2012 నుండీ నృత్యేతర రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టి ఉమా రాసిన కథానికలు, కవితలు, నృత్యనాటికలు తెలుగునాట  ప్రముఖ పత్రికల్లోను, పలు అంతర్జాల పత్రికల్లోను ప్రచురించబడ్డాయి. విదేశీ కోడలు – కధా సంపుటి (2013), ఎగిరే పావురమా – నవల (2015), సరికొత్త వేకువ – కధా సంపుటి (201 7), వేదిక – నవల (2016), నాట్యభారతీయం – వ్యాసా సంపుటి (2018) ..ఇప్పటివరకు పుస్తక రూపంగా వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణాలగా వెలువడిన గ్రంధాలు. నాట్యభారతి ఉమాభారతి కధలు – కధా సంపుటి (2023) లో వెలువడింది.

ఆమె తాజా నవల ‘హృదయగానం – నేడే విడుదల’ – నవల (2024) లో సిరికోన సాహిత్య అకాడెమీ వారి ఉత్తమ నవలగా గెలుపొంది, ‘జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక పురస్కారం’ అందుకుంది.

నృత్య నాటికలకు గుర్తింపు:
ఆమె రచించి, నిర్వహించిన  ‘భరతముని భూలోక పర్యటన’ ‘పెళ్లి ముచ్చట’, ‘మానసపుత్రి’, ‘లయగతులు’, ‘తెలుగింటి వెలుగు’ నృత్యనాటికలకి అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డు, సృజనాత్మకతకి గుర్తింపు పొందారు.

విద్యాభ్యాసం: M.A (Pol. Science) – Osmania Universisity
కుటుంబ నేపధ్యం: తల్లితండ్రులు: కీ. శే. మేజర్  సత్యనారాయణ, కీ. శే. శ్రీమతి శారద.
భర్త: డా. మురళి మోహన్ కోసూరి, సంతానం: డా. సత్యజిత్, డా. శిల్ప-సంతానం.
కూచిపూడి గురువులు – పద్మశ్రీ వెంపటి చిన్నసత్యం, ‘కళాప్రపూర్ణ’ శ్రీ వేదాంతం జగన్నాధ శర్మ
భరతనాట్యం గురువులు – పద్మశ్రీ ఫకీరుస్వామి పిళ్ళై, కళైమామని శ్రీ. టి.ఆర్. రాధాకృష్ణన్

Posted in May 2025, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *