Menu Close
Paranandi-Aravindarao
మనసు విప్పిన మడతలు - 16
పారనంది అరవిందారావు

నలగని మడతలు

nalagani-madathalu

ముడతలుపడ్డ నా హృదయంలో
మడతలు నలగని మమకారాలు
ముసుగుతన్నిన మధుర సృతులు
అరుదైన అనుభవాలు అలసిపోయిన అనుభూతులు
ఆనంద భాష్పాలు ఆవిరి కాని అశ్రువులు
ఎన్ని సంక్షోభాలు ఎన్ని సంఘర్షణలు
ఓపికుడిగి శుష్కించిన హస్తాలు
విప్పలేని గత సృతుల మూటలు

మడతలు విప్పే మనసొకటి దొరికితే
మదిలో దాగిన మబ్బులన్నీ
కవితలుగా, కథలుగా,
కావ్యాల్లా కురుస్తాయి
మెరుపుల్లా మెరుస్తాయి
ఉరుముల్లా గర్జిస్తాయి
ఓ రోజుకి ఓ ఘడియకి
ప్రాణం పోసుకుని పరుగిడి
పురివిప్పి నాట్య మాడి
సంతృప్తితో సంతోషంగా
సుషుప్తిలోకి నిశ్చింతంగా
చెదిరిన మడతల్ని సరిచేసుకుని
చెదరని ముడతల్లో కాంతి పుంజుకొని
చెరగని జ్ఞాపకాలని చేరువుగా హత్తుకొని
అథో జగత్తులోకి జారుకుంటాయి.

ఓ అల విలాపం

oh-ala-vilaapam

నీటి ఒడ్డున కూర్చుని
నింగి లోకి చూస్తుంటే
కాలినెవరో తట్టినట్లై
త్రుళ్ళిపడి చూసాను .
ఓ చిన్నారి పిల్ల అల
వినయంగా నుంచుని
తెల్లటి నా పాదాలని
సున్నితంగా సృశించింది.

ఆ గులకరాళ్ళకన్న నీ పాదాలు నాకు
మెత్తగాఉండి మత్తెక్కిస్తున్నాయంది.
పందేలేసుకుని రోజూ ఒడ్డుకి
పరిగెడుతూ వస్తుంటే
ఆ గులకరాళ్ళన్నీ ఒళ్ళు
గుచ్చిపడేస్తున్నాయంది.

అయినా ప్రతిరోజు
అంగలేసుకుని వస్తాను
తూట్లుపడిన దేహంతో
అమ్మ వొడిలో వాల్తాను.
అమ్మ నన్ను ఓదార్చి నా
కంటి నీరు తుడిచి అంది
“ఇప్పుడు చిట్టి అలవేమో కాని
రేపు కెరటమై ఎగిరెగిరి
ఆ గులకరాళ్ళని అరగదీసివస్తావు
మెత్తటి ఇసుక చేసి మిత్రత్వం నెరపుతావు”

అందాక అప్పుడప్పుడు
వస్తూవుండు నేస్తం!
నీ పాదాల మెత్తదనం
అరువిస్తూవుండు నేస్తం!

*****

ముందుమాట

Paranandi-Aravindaraoనాకు చిన్నప్పటినుంచి వచనకవిత్వంలో ఓ రకమైన కుతూహలం ఉండేది. 14-15 ఏళ్ళ వయస్సులోనే కీర్తి శేషులు డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి కవితలు, వారు ఆ కవితలని పఠించే తీరు నన్ను చాలా ఆకర్షించేది. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రసాయనిక శాస్త్రం అభ్యసిస్తున్నప్పుడు వారు తెలుగు శాఖలో రీడర్ గా ఉండేవారు. వారు నన్ను చాలా ప్రోత్సహించేవారు. క్రమేపీ నాకు వచన కవిత, కథానిక ప్రక్రియల్లో అభినివేశం, అభిమానం కలగడం ప్రారంభమైంది. అలాగే ఆ రోజుల్లో All India Radio లో పనిచేస్తున్న కీ.శే. వేలూరి సహజానందం గారు నా కవితలని రేడియోలో చదవడానికి ఎన్నో అవకాశలిచ్చి ప్రోత్సహించేవారు. ఇంగ్లండు లో రసాయనిక పరిశోధన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పుడు నాకు గీతాంజలి అనే బహుభాషా కవుల సంఘంతో పరిచయమేర్పడి వారి ప్రోత్సాహంతో తెలుగు, ఆంగ్ల భాషల్లో కవితలు రాయడం మొదలుపెట్టాను. ఆ సంస్థ అధ్యక్షులు డా కృష్ణకుమార్ గారు ఉత్తరప్రదేశ్ వారైనా తెలుగు భాష మీద మిక్కిలి గౌరవం చూపించి రెండు సంకలనాలలో నా తెలుగు మరియు ఆంగ్ల కవితలు ముద్రించారు. సుమారు 4 సంవత్సరాల క్రితం ఇంకో తెలుగు సాహితీ అకాడెమీ సమూహంతో పరిచయమేర్పడి తెలుగులో మాత్రమే కవితలు రాయడం మొదలెట్టాను. ఆ సమూహ అధ్యక్షులు మాజీ ఉపకులపతులు గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు ఎంతో అభిమానంతో నాకు స్వాగతం పలికి నాకు మార్గదర్శకులుగా నిలబడి నా సాహిత్య పయనానికి దోహదమిచ్చారు.

మార్చి 2023 హైదరాబాదు సిరికోన సాహితీ అకాడమీ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉపకులపతులు ఆచార్య కిషన్ రావు గారు నా కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు ఆవిష్కరించారు. నా కవితా సంపుటిని ప్రశంసించిన పెద్దలందరికీ వినమ్ర నమస్సులు.

ఆచార్య రాణి సదాశివమూర్తి, కులపతి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, తిరుపతి
వీరి కవితలను చదువుతుంటే ఒక భాద్యత గల కవయిత్రి, కనబడని సూత్రధారిణి గోచరిస్తారు. ప్రతి శీర్షికలో ఒక కొత్తదనం, పద పదంలో మెత్తదనం, కవిత కవితలోచిత్తాన్ని కదిలిచే చిత్తరువులు, చిత్ర వైచిత్రిని నింపుకున్న భావ కల్పతరువులు దర్శనమిస్తాయి.

శ్రీ నివర్తి మోహన్ కుమార్, చార్టెడ్ ఎకౌంటెంట్
పురుషాధిక్య సమాజంలో గ్లాస్ సీలింగ్ బ్రద్దలుచేసి తమదైన ప్రత్యేకత నిలుపుకున్న భారతీయ వనితల్లో అరవిందారావుగారు కూడా ఒకరు. వీరు పరస్పర భిన్న ప్రవృత్తులను సమతుల్యము చేసుకుని జీవితాన్ని ఒక కళగా మలుచుకున్నవారు. ప్రస్తుత కవితాకదంబమే అందుకు సాక్ష్యం.

డా శారదాపూర్ణ శొంఠి షికాగో, యు.ఎస్.ఎ.
అరవింద గజల్ రచయిత్రిగా, సృజనాత్మక గేయరచయిత్రిగా, గాయనిగా పేరెన్నికగన్నారు. ఆమె వృత్తి ఉజ్వలం. ప్రవృత్తి అద్భుతం. ఆమె కవితలు భావ కవిత్వ ధోరణిలో సాగుతాయి. చదువరుల అంతరంగాన్ని సుతారంగా తాకి, ఊపి ఆమె అనుభూతిలో భాగమవుతాయి. భావకవిత్వ సమాలోచనకి ఈ కవితా సంపుటి బర్హిపింఛం.

నా ఈ కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు లోని కవితలు ఇకపై సిరిమల్లె పత్రికలో ప్రతినెలా పాటకులను అలరిస్తాయని నమ్ముతున్నాను.

నమస్కారములతో – పారనంది అరవిందారావు

Posted in May 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *