Menu Close
సాహితీ ప్రక్రియ - గజల్...
- దినవహి సత్యవతి -

గజల్ : చతురస్ర గతి( 44 – 44- 44- 44)
*****
లోకములేలెడు స్వామివి నీవని
హృదయమునందున నమ్మితి శంకర!
నిత్యము కొలిచితి, పూజలు చేసితి,
కరుణను చూపగ కోరితి శంకర!

కంఠమునందున గరళము నిలిపీ
అమృతము సురలకు కానుకనిస్తివి,
వరముల నొసగే కైలాసవాసా,
నా మొర వినుమని పిలిచితి శంకర!

దక్షుని యజ్ఞము ధ్వంసము చేసియు,
సతిపై ప్రేమను చాటితివీవే!
నీదయనుండగ బాధలె రావులె,
బ్రోచెదవీవని తలచితి శంకర!

లయకారుడీవు గౌరీనాథుడ,
దయగల దైవము నీవే ఈశుడ!
శరణము కోరియు, మించిన భక్తితొ,
నీచరణ సన్నిధి చేరితి శంకర!

సత్యము, నీదయయున్నను చాలును,
వెరుపేయుండదు జీవితమందిక,
బ్రతుకున కలతలు తీర్చుమ దేవా,
ముక్తిని యొసగగ వేడితి శంకర!

గజల్ : ఖండగతి (5-5-5-5)
*****
మిథిలకే పుత్రికై పెరిగింది మైథిలియె,
కోదండరాముడిని వలచింది మైథిలియె!

పెనిమిటిని వెన్నంటి నడిచేను కానలకు,
లంకేశు చెరలోన వగచింది మైథిలియె!

అగ్నిపునీతయై ధన్యతగనె పుణ్యవతి,
కౌసలేయుని కీర్తి పెంచింది మైథిలియె!

జనకసుత భూజాత అయోధ్యకె మహరాణి,
నిందతో వనాలకు తరలింది మైథిలియె!

వాల్మీకి ఆశ్రమాన అడుగిడె వైదేహి,
ముద్దుబిడ్డలగని మురిసింది మైథిలియె!

ముద్దులొలుకు పుత్రుల చేష్టలకు మురిసేను,
లవకుశులను వీరులుగ మలిచింది మైథిలియె!

సత్యమగునిష్ఠతో శ్రీరాముడిని కొలిచె,
అతివలకు ఆదర్శమై నిలిచింది మైథిలియె!

--- సశేషం ---

Posted in May 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *