గాంధీజీ తండ్రి కరం చంద్ గాంధి మరణం, ఆయన ధార్మిక దైవావలోకనం
తండ్రి మరణం
1885 లో, గాంధీజీకి 16 ఏళ్ళు వయస్సు ఉన్నప్పుడు తండ్రి గుదనాళ వ్రణం (Fistula)తో మంచం పట్టినప్పుడు తనతో పాటు తల్లి పుత్లీ బాయి, ఒక సేవకుడు ఆయనకు సపర్యలు చేసేవారు. మోహన్ దాస్ నిత్యం తండ్రి వ్రణం కడిగి, శుభ్రం చేసి, మందు ఇచ్చేవాడు. ఇంట్లోనే వివిధ ఆయుర్వేద చూర్ణాలను కలిపి, మందును వ్రణానికి రాయటంతో పాటు ఆయన నిద్రపోయేవరకు కాళ్లకు మర్దన చేసేవాడు. ఈ దైనందిన చర్య మోహన్ దాస్ కు ఇష్టమైన పని. ఏనాడూ పనిలో అలసత్వం ప్రదర్శించలేదు. ఆ రోజులలో మోహన్ దాస్ కు నిత్యం పాఠశాలలకు వెళ్ళటం తిరిగి ఇంటికి వచ్చి తండ్రికి సపరిచర్యలు చేయటంలో నిమగ్నమయ్యేవాడు. తండ్రి అనుమతి ఇస్తేనే సాయంత్రం వేళల్లో నడకకు వెళ్ళేవాడు.
ఈ సమయంలో మోహన్ దాస్ భార్య కస్తూరిబాయి గర్భిణితో ప్రసవానికి దగ్గరలో ఉంది. దీనిని గురించి గాంధీజీ మాటల్లోనే తెలుసుకుందాం.
ఈ విషయం గురించి నేను రెండు కారణాల వాళ్ళ చాలా సిగ్గుపడేవాడిని. ఒకటి: ఇంకా విద్యా ర్థిగా నన్ను నేను నిగ్రహించులేకపోవటం. రెండవది: చదుకోవలసిన సమయంలో ఇంద్రియ నిగ్రహం కోల్పోయి కామానికి వశపడిపోవటం. బాల్యం నుంచీ వృద్ధులు, అంధులు అయినా తల్లిదండ్రులను భక్తి తో అమితంగా ప్రేమిస్తూ వారిని కావడిలో మోసుకెళ్లిన శ్రవణుడిని ఆదర్శంగా తీసుకున్న నేను నా తల్లిదండ్రులకు సహాయపడక పోవటం చాలా సిగ్గుగా ఉండేది. ప్రతిరోజూ నా తండ్రి కాళ్లకు మర్దన చేసేటప్పుడు నా మనస్సు పడకగది చుట్టూ తిరుగుతూ ఉండేది. ఈ అపరిపక్వ వయసులో కామకేళి నిషిద్ధమని నా మతం, వైద్య శాస్త్రం నిర్దేశించినా నేను జ్ఞానం కోల్పోయాను. ఫలితం: నా తండ్రికి శుశ్రూష ముగించిన మరుక్షణం మా పడకగదికి వెళ్ళిపోవటం.”
కరంచంద్ వ్రణవం తగ్గక పోగా పెద్దదవుతున్న తరుణంలో ఆయుర్వేద వైద్యులు అనేక లేపనాలు (ointments) ప్రయత్నించారు; యునాని వైద్యులు పట్టీలు వేశారు; నకిలీ వైద్యులు ఔషధాలు ఇచ్చారు కాని ఏవీ పనిచేయలేదు. ఒక ఆంగ్ల వైద్యుడు శస్త్ర చికిత్స చేయాలని సూచించగా దేశీయ వైద్యులు వృద్ధాప్యంలో చేయకూడదని తిర్కరించారు. కాని కొన్నాళ్ల తరువాత ఆయనకు బొంబాయిలో ఒక వైద్యుడు శస్త్ర చికిత్స చేశారు. అయితే బొంబాయినుంచి తిరిగిచ్చిన తరువాత కరంచంద్ ఆరోగ్యం మరింత క్షీణించ సాగింది. చివరకు ఆయనకు అన్ని పనులూ మంచం మీదే జరిపే దశలో కూడా కరంచంద్ వాటిని తిరస్కరించి, అతికష్టం మీద లేచి కాలకృత్యాలు తీర్చుకునేవారు. అసలు సిసలైన ఈ వైష్ణవుడు బాహ్య పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు.
పరిశుభ్రత విషయంలో తన తండ్రి అంత నిఖచ్చితంగా ఉండటం మోహన్ దాస్ కు చాలా ఆశ్చర్యం కలిగి ఆయన అంటే ఆరాధనా భావం మరింత పెరిగింది. తన తండ్రి అలవాట్లే గాంధీజీకి జీవితాంతం తోడయ్యాయి.
చివరికి భయానక రోజు రానే వచ్చింది. రాజ్ కోటలో ఉన్న కరంచంద్ తమ్ముడు ‘తులసీదాస్’ తన అన్న పరిస్థితి క్షీణిస్తోందని తెలిసి వెంటనే పోర్ బందర్ కు తిరిగివచ్చారు. ఆరోజు రాత్రి తన అన్న కరంచంద్ గదిలోనే నిద్రిస్తానని అని చెప్పి మోహన్ దాస్, అతని అన్నలను బయటికి పంపించాడు. కాని అదే కరంచంద్ గాంధికి ఆఖరి రాత్రి అవుతుందని అనుకోలేదు.
తరువాత జరిగిన పరిణామం గురించి గాంధీజీ ఇలా వివరించారు. “రాత్రి 10.30-11.00 మధ్య తులసీదాస్ బాబాయి చెప్పగా నా పడక గదికి వెళ్లాను. నా భార్య దీర్ఘనిద్రలో ఉంది. ఆమె ప్రక్కన పడుకుని ఆమెను లేపాను. 5 ,6 నిముషాలు గడిచాయి...... అకస్మాత్తుగా పనివాడు తలుపు తట్టాడు. నేను వెంటనే ఏమిటి సంగతి అని అడిగాను. 'ఇక మీ తండ్రి లేరు' అని అన్నాడు. ఇక అంతా అయిపోయింది. ఎంతో సిగ్గుపడుతూ దుఃఖంతో నా తండ్రి గదికి పరుగెత్తుకుని వెళ్లాను. ఆ పశు కామవాంఛ నన్ను అంధుడిని చేయకపోతే మా నాన్న ఆఖరిక్షణంలో ఆయన వద్దనే ఉండేవాడినికదా అనే బాధ నాలో చాలా పెరిగింది. ఆ బాధ ఈరోజుకూ నాలో ఉంది. నేను ఆయనకు మర్దన చేస్తూ ఉండియుంటే ఆయన నా చేతుల్లోనే మరణించేవారు కదా!”
"మా బాబాయికి తన అన్న అంటే అమితమైన ఆరాధనా భావం ఉంది. మా నాన్న చివరి క్షణాలు బాబాయి చేతుల్లో పోవటం ఆయన అదృష్టం. ఆయనకే మా నాన్న అంత్యక్రియలను నిర్వర్తించే భాగ్యం కలిగింది. మా నాన్నకు తన మరణం ముందే తెలిసియున్నట్లు ఒక కాగితం మీద ‘నా అంతిమక్రియలకు సిద్ధం కండి’ అని వ్రాసి ప్రక్కన పెట్టారు. తరువాత చేతికి ఉన్న రక్షరేఖ, మెడకు ఉన్న తులసి పూసలున్న బంగారపు గొలుసు తీసి ప్రక్కన పెట్టారు. మరుక్షణం ఆయన పైలోకానికి వెళ్లిపోయారు.”
“కాని నాకు అత్యంత సిగ్గు కలిగించిన విషయం నా తండ్రి మరణించే సమయంలో కూడా నా పశు కామవాంఛ తీర్చుకోటానికి సిద్ధమవటం. ఇది నాజీవితంలో చెరిపివేయలేని మచ్ఛ, దుర్ఘటన. నేను మోహానికి దాసుడైన ఒక విశ్వసనీయుడైన భర్తగానే నడుచుకున్నాను. కాని ఆ రాత్రి జరిగిన సంఘటన ఇంద్రియ లోలత్వ సంకెళ్లనుంచి బయటపడటానికి అనేక పరీక్షలను దాటుకోవలసి వచ్చింది. ఇది జరిగిన కొన్ని రోజులకు జన్మించిన చిన్న నలుసు (శిశువు) 3, 4 రోజులు మాత్రమే శ్వాస పీల్చింది. ఇంతకంటే ఏమి జరుగుతుంది? ఈ నా అనుభవం, ఉదాహరణ ఇతరులు హెచ్చరికగా తీసుకోవాలి”
“అప్పుడు నా వయస్సు పైన నుడివినట్లు 16 ఏళ్ళు మాత్రమే!”
గాంధీజీ ధార్మిక, దైవావలోకనం
మోహన్ దాస్ 6-16 ఏళ్ల వయసు మధ్యలో పాఠశాలలో బోధించిన విద్య ద్వారా ధార్మిక, మత సంబంధిత విషయాలు మినహా మిగతావి నేర్చుకున్నాడు. ఇతరులద్వారా నేర్చుకున్నది అంతంత మాత్రమే. అలాగే తాను వైష్ణవ కుటుంబంలో జన్మించిన కారణంగా దేవాలయానికి వెళ్లినా తెలుసుకున్నది మాత్రం చాలా తక్కువే. అక్కడ నేర్చుకోనిది తన కుటుంబంలో చాలాకాలంనుంచి పనిచేస్తున్న పనిమనిషి నుంచి నేర్చుకున్నాడు. ఆ పనిమనిషి పేరు ‘రంభ’. ఆమే మోహన్ దాస్ కు చిన్నతనంలో తరచుగా వచ్చే దెయ్యాలు, పిశాచాల కలలను నివారించటానికి ‘రామ నామం’ జపించమని సలహా ఇచ్చింది. ఇది కొన్నాళ్ళు ఆచరించి ఫలితం సాధించగలిగినా, దానికి కొన్నాళ్ల తరువాత స్వస్తి పలికాడు మోహన్ దాస్.
కాని ఆమె నాటిన విత్తనమే చాలాకాలం తరువాత గాంధీజీలో మొక్కగా పుట్టి పెరిగింది. ఆయన జీవితంలో ‘రామ నామం’ ఒక అమోఘమైన ఔషధంగా పనిచేసింది. తండ్రి అస్వస్థత సమయంలోనే రామభక్తుడైన ఒక దగ్గరి బంధువు మోహన్ దాస్ కు, చిన్న అన్న ‘కర్సన్ దాస్’ కు ‘రామరక్ష’ పద్యం బోధించాడు. వీళ్ళు దీనిని కంఠతా పట్టి ప్రతి ఉదయం, స్నానానంతరం పఠించేవారు. దీనిమీద మోహన్ దాస్ కు నమ్మకం లేకపోయినా దానిని స్వచ్ఛమైన ఉచ్చారణతో కంఠస్థం చేయగలనని నిరూపించుకోటానికి పట్టుదలతో కంఠస్థం చేశాడు.
కాని గాంధీజీ మీద చెరగని ముద్ర వేసింది తన తండ్రి అస్వస్థత సమయంలో ప్రతి సాయంత్రం, ఆయన ఎదుట కూర్చుని చేసిన ‘రామాయణ పారాయణం’. పారాయణం చేసే వ్యక్తి ‘బిలేశ్వర్' కు చెంది న ‘లాదా మహారాజ్’ కు జరిగిన అనుభవం గురించి. ఈయనకు వచ్చిన కుష్టు వ్యాధి ఏమందుకూ లొంగకపోతే, బిలేశ్వర్ లోని మహాదేవుడి గుడిలో శివుడికి అర్పించిన ‘బిల్వ’ పత్రాలను తాకించటంతో పాటు ప్రతి క్షణం ‘రామ నామం’ జపిస్తే వెంటనే తగ్గిపోయింది. ఈ ఉదంతంతో పాటు నిత్య ‘రామ నామ’ జపం, ఉచ్చారణ కూడా మోహన్ దాస్ ను పూర్తిగా మార్చివేసింది.
భక్తి సాహిత్యంలో గాంధీజీ కి అమితంగా నచ్చింది ‘తులసీ రామాయణం’. తన భక్తి మార్గం గురించి 1925 లో గాంధీజీ ఇలా వివరించారు. “నా తండ్రి మరణం తరువాత కొన్నాళ్ళకు నేను రాజ్ కోట కు వెళ్లాను. అక్కడ ఎవరూ రామాయాణం పారాయణం చేయలేదు. ఏకాదశి రోజు మాత్రం ‘భాగవతం’ పారాయణం చేసేవారు. కాని ఆ ‘భాగవతార్’ ఆసక్తికరంగా చెప్పేవాడు కాదు. చాలా ఏళ్ల తరువాత నేను 21 రోజులు (18 సెప్టెంబర్-8 అక్టోబర్ 1924) నిరాహార దీక్ష చేసినప్పుడు ‘మదన్ మోహన్ మాలవీయ’ (1861-1946) రచించిన ‘భాగవత కదా సంపుటి’ చదివినప్పుడు ఈ పుస్తకాన్ని నేను బాలుడుగా ఉన్నప్పుడే చదివివుంటే నేను దైవ భక్తుడను అయ్యేవాడిని. చిన్న వయస్సులో పడిన ముద్రలే చిరకాలం ఉంటాయి. అటువంటి మంచి పుస్తకాలు చిన్నప్పుడే చదివే అవకాశం నాకు దక్కలేదు.”
“ఆ రోజులలో హిందూమతంలోని వివిధ శాఖలు. దీనికి సంబంధించిన ఇతర మతాలను చాలా తెలుసుకున్నాను. దానివల్ల నాకు పరమత సహనం అలవడింది. మా తల్లిదండ్రులు తరచు శివ, రామాలయాలకు వెళ్లి పూజలు జరిపేవారు. చిన్న పిల్లలను కూడా అచ్చటికి పంపించేవారు. మా తండ్రి వద్దకు ‘శైవ’ సన్యాసులు వచ్చి ఆధ్యాత్మిక చర్చలు జరిపేవారు. వారు ఇచ్చిన ఆహార పదార్ధాలు స్వీకరించే వారు.”
“అనేక సార్లు మహ్మదీయ, పార్సీ స్నేహితులు వచ్చి, వారు చెప్పే మత సంబంధిత విషయాలను ఓపికగా, శ్రద్ధగా వినేవారు. నేను మా తండి వద్దే ఉంటూ శుశ్రూష చేస్తున్నందువల్ల వారి సంభాషణలు వినేవాడిని. ఇదే భవిష్యత్ కాలంలో ఇతర మతాల యెడల సహనం అలవరచుకోటానికి దోహదపడింది.”
“ఒక్క క్రైస్తవ మతం అంటేనే నాలో ఏహ్యభావం ఉండేది. ఆ కాలంలో క్రైస్తవ మిషనరీలు మాబడి మూలల్లో నిలబడి హిందువులను, హిందూదేవుళ్ళను మాకు వినిపించేటట్లు దూషించేవారు. వాళ్ళు చాలామంది హిందువులను క్రైస్తవులుగా మార్చుతున్నారని చెప్పుకోవటం వినేవాడిని. మార్చిన వెంటనే వారి చేత గొడ్డుమాంసం తినిపించి, మద్యాన్ని త్రాగించేవారు. దీనితోపాటు, సనాతన వస్త్రధారణ స్థానే యూరోపియన్ వస్త్రధారణ, తలమీద టోపిపెట్టుకోవటం బలవంతంగా నేర్పేవారు. అంతేగాక హిందూ మతస్థులైన వీరి పూర్వీకులను, ఆచార పద్ధతులను, దేశాన్ని నానా దుర్భాషలాడేవారు. ఇవన్నీ నాలో క్రెస్తవ మతం అంటే అయిష్టం కలిగింది.”
“ఆ సమయంలో మా నాన్న వద్ద ఉన్న ‘మనుస్మృతి’ గ్రంధాన్ని చదివాను. అందులో ఉన్న విషయాలను చదివిన తరువాత నేను కొంత ‘నాస్తికత్వం’ వైపుకు మొగ్గు చూపాను. నా అనుమానాలను మేధావి, నాకంటే పెద్దవాడు, వరసకు అన్న అయిన ఒక వ్యక్తి ఎదుట వ్యక్తం చేశాను. కాని ఆయన ఇచ్చిన జవాబులు సంతృప్తికరంగా లేవు. ఇది గమనించి ‘నీవు పెద్దవాడవు అయినప్పుడు నీ అనుమానాలను నీవే నివృత్తి చేసుకోగలవు. ఇటువంటివి నీలో జనించకూడదు’ అని ఆయన సలహా ఇచ్చాడు. దీనితో అప్పటికి ఊరుకున్నా, నా మనస్సులో ఇవి చాలాకాలం తొలుస్తూనే ఉన్నాయి. మనుస్మృతిలో కొన్ని అధ్యాయాలలో పేర్కొనబడిన ఆహార పద్ధతులు నేను ఆచరించే అలవాట్లకు వ్యతిరేకంగా ఉన్నాయి. ‘నా మేధస్సు పెరిగినప్పుడు, లోతుగా అధ్వయనం చేసినప్పుడే నేను అర్ధంచేసుకోగలను' అని అనుకుని సమాధాన పడినాను.”
“అహింస గురించి మనుస్మృతి నాకు ఏమీ బోధించలేదు. ఈ గ్రంధం మాంసాహారాన్ని సమర్ధించింది. పాములు, కీటకాలు, నల్లులను చంపటం నైతికమైనదని, మానవ ధర్మమని అప్పుడు నేను నమ్మాను.”
“ఒక్క విషయం నాలో వ్రేళ్లూనుకుపోయింది. అది ‘నీతి’. అన్నిటికీ ఇది పునాది అని నా గట్టి నమ్మకం. నీతికి భావార్ధం, సారం, మూలం ‘సత్యం’. అందుకే నాజీవితానికి ఏకైక గమ్యం ‘కర్మ’. ఈ భావం నాలో రోజురోజుకు పెరుగుతూ మనస్సంతా విస్తరించింది. ‘చెడును వదలి మంచి స్వీకరించు’ అనే ధర్మం, నీతి నా జీవితాన్ని నడిపించే దిక్సూచి అయింది. ఇది నన్ను ఎంతగా పెనవేసుకుందంటే దీనితో అనేక ప్రయోగాలు చేశాను.”
దీనిని గురించి నాకు నచ్చిన అద్భుత వాక్యాలు ఇవే:
‘ఒక గిన్ని నీళ్లకు బదులుగా ఒక మంచి ఆహారం ఇవ్వు’
‘వినమ్రతతో చేసిన అభివందనానికి నీ శిరస్సును ప్రేమాతిశయంతో వంచు’
‘ఒక దమ్మిడీని స్వీకరించి తిరిగి బంగారం రూపంలో ఇవ్వు’
‘నీ జీవితం రక్షించబడితే దానిని నీవు నిలవరించకు’
‘ప్రతి చిన్న సేవకు విజ్ఞుల మాటలు, చర్యలు పది రేట్లు ప్రతిఫలమిస్తాయి’
‘అందరూ ఒకటే అని భావిస్తూ అపకారానికి ప్రతిఫలంగా ఉపకారం ఇచ్చేవాడే ఉదాత్తమైన వ్యక్తి’ గాంధీజీ హృదయాంతరాళలనుంచి వచ్చిన ఈ మణిమయ ఖచిత హార ధారణ పరమపదసోపానమని అంటే ఎవరు కాదనగలరు?