మానసికారోగ్యం
మే నెల మానసికారోగ్యానికి అంకితం చేయబడిన నెల.
ఎవరైనా ఆరోగ్యంగా కనిపిస్తే, అంటే ఎవరికైనా తరచుగా ఏ అనారోగ్యాలు లేకుండా వుంటే మనం వాళ్ళని ఆరోగ్యవంతులని అంటాము. అంటే అది వారి శరీర ఆరోగ్యం అన్నమాట. అది అందరికి బాహ్యంగా కనిపించేది. అందుకే వారిని ఆరోగ్యవంతులని అందరూ ముద్ర వేసేస్తారు.
కానీ ఒక్క విషయం మనం ఎప్పుడూ మర్చిపోతాము. బాహ్యంగా కనిపించే ఆరోగ్యంతో పాటు దాని వెనక ఇంకో అతి ముఖ్యమైన ఆరోగ్యం దాగి వుంటుంది. అది మన మనసుకి, మస్తిష్కానికి సంబంధించినది. అదే మానసిక ఆరోగ్యం. మరి మన మనసు, మస్తిష్కం ఎవరికీ బయటకు కనిపించదు కదా! అందుకే మానసికారోగ్యం ఎవరికీ కనిపించదు. ఎదుటివారి మనసుని చూడాలంటే మన శరీరానికి కాదు, మనసుకి కళ్ళు కావాలి. వాటితోనే చూడగలం. అనుభవించగలం. అలాగే ఇతరుల మానసికారోగ్యాన్ని కూడా మనం మన మనసుతోనే పసిగట్టగలం, పూర్తిగా చూడగలం. అంటే అది మనసుతో అనుభవించాలే తప్ప, భౌతికంగా మన కళ్ళెదురుగా చూడలేము.
ఏడాదికోసారి మనం చేయించుకునే శారీరక/భౌతిక పరీక్షలలో (అంటే, physical checkup అన్నమాట), వైద్యులు మన భౌతిక కాయానికి, దాని అన్ని అవయవాలకు, అంటే కళ్ళు, కాళ్ళు, చెవులు, ఇలాంటి మన కళ్ళకి కనిపించే అవయవాలతో పాటుగా, గుండె, కాలేయము, మూత్రకోశాలు లాంటి మన కళ్ళకి బాహాటంగా కనిపించని అవయవాలకి కూడా రకరకాల పరీక్షలు చేస్తారు. అవి సరిగ్గా పని చేస్తున్నాయో లేదో ఆ పరీక్షల ద్వారా, అంటే రక్త పరీక్ష, మూత్ర పరీక్షలలాంటివన్నమాట, వాటి ద్వారా మన శారీరక ఆరోగ్యాన్ని పరీక్షిస్తారు, కానీ మనసుకి సంబంధించిన పరీక్షలేమీ మాత్రం చెయ్యరు. ఏవన్నా సమస్యలు వుంటే మాత్రం అప్పుడు చేస్తారు, అంతేకానీ ఏ బాధలు, చింతలు లేనప్పుడు మాత్రం ఎటువంటి పరీక్షలు చెయ్యరు. శారీరక ఆరోగ్యం విషయంలో మాత్రం అలా కాదు. ఒక రొటీన్ లాగా అన్నీ చేసేస్తారు. ఇలా ఎందుకు జరుగుతోంది, ఇలా జరుగకూడదు లాంటి మాటలేవీ ఇప్పుడు నేను అనబోవటంలేదు. కానీ ఒక్క విషయం మాత్రం తప్పకుండా చెప్తాను. మానసికారోగ్యం శారీరక ఆరోగ్యం కంటే ఏమాత్రం తక్కువ ప్రాధాన్యత వున్నది మాత్రం కాదు. ఈ రెండూ సమానమైనవి. ఒకటి బయటకి కనిపిస్తుంది, ఇంకొకటి కాదు, అంతే తేడా! ఆమాటకొస్తే మానసికారోగ్యం పైనే శరీరాకారోగ్యం ఆధారపడి వుంటుంది కూడాను. ఇంకో విషయం కూడా. మానసికారోగ్యం లేకపోతే శారీరకారోగ్యం ఎంత వున్నా కొంచెం కూడా లాభం లేదు. ఎందుకంటే ఈ శరీరం, ఎవరిదైనా సరే, అనుక్షణం ఈ మనసు లేదా మెదడు ఇచ్చే ఆదేశాల మీదే ఆధారపడి నడుస్తుంది. Mind rules the body అంటారు కదూ! మరి ఆ mind సరిగ్గా లేకపోతే ఇంక శరీరం మూల పడినట్లే కదా!
శరీరానికి సంబంధించినంత వరకు ఆరోగ్యానికి కొలమానాలు వున్నాయి. Blood pressure ఇంత వుండాలి, A1C అంత వుండాలి, అది అంత వుండాలి, ఇది ఇంత వుండాలి, ఇలా అన్నిటికీ లెక్కలు వున్నాయి. మరి, మానసికారోగ్యానికి? దానికేం కొలమానాలు వున్నాయి? అసలు వున్నాయా? ఉంటే అవి ఏమిటి?
ఇవన్నీ చెప్పుకునే ముందు అసలు మానసికారోగ్యం అంటే ఏమిటో తెలుసుకోవటం చాలా ముఖ్యం.
మన ఆలోచనలని, మన ప్రవర్తనని, మన మాటలని, చేతలని, అన్ని సమయాలలోను, వ్యతిరేకమైన పరిస్థితులలో కూడా, అనుక్షణం మన నియంత్రణలో పెట్టుకుని, వాటిని ఎల్లప్పుడూ సరైన పద్ధతిలో పయనించేలాగా చేసుకోగలగడమే మానసికారోగ్యం. అలా అంతర్గతంగా మన భావోద్వేగాన్ని అదుపులో పెట్టుకుంటే బహిరంగంగా మనం సరిగ్గా ప్రవర్తించగలం, చక్కగా పని చేయగలం. అదే మానసికారోగ్యం. అంతేకాదు, మనసు ఆరోగ్యంగా వుంటే ఆలోచనలు ఆరోగ్యంగా వుంటాయి. ఆలోచనలు ఆరోగ్యంగా వుంటే ఆచరణ ఆరోగ్యంగా వుంటుంది. ఆచరణ ఆరోగ్యంగా వుంటే అభ్యుదయం లభిస్తుంది. సమాజం ముందుకు నడుస్తుంది. దేశానికి ప్రగతి లభిస్తుంది. ఎవరికైనా అంతకంటే ఏం కావాలి?
అయితే నేను ముందే చెప్పినట్లు శారీరక ఆరోగ్యానికి రకరకాల కొలమానాలు వున్నట్లు, ఈ మానసిక ఆరోగ్యానికి బాహాటంగా కనిపించే అంకెలు ఏమీ లేవు. మానసికారోగ్యాన్ని ఎవరైనా సరే, మనసుతో అనుభవించాలి. మానసికంగా ఆరోగ్యంగా వున్నవారు అందరికి ఆనందం పంచుతారు, అంటే, మన మానసికారోగ్యమే ఎదుటివారి మానసికానందానికి ఒక మంచి చిహ్నం అన్నమాట.
జీవితంలో అంతా సవ్యంగా సాగుతున్నంత వరకు అందరూ బాగానేవుంటారు. ఏదన్నా అస్తవ్యస్తంగా వున్నప్పుడే మనిషి అసలు వ్యక్తిత్వం తెలుస్తుంది. వారిలో దాగివున్న సంయమనం, దాని స్థాయి బయటకు వ్యక్తమవుతాయి. అందుకే మానసికంగా స్థిరంగా వున్నవాళ్ళు వ్యతిరేక పరిస్థితుల్లో వాటిని బాగుపరచుకునే అవకాశాలని వెతుకుతారు, అంతేకాని వాటి బెదిరింపులకు జడవరు, లొంగరు. అలాగే వారు ఎటువంటి ఒత్తిడులకు కూడా వంగరు. సవాళ్ళకి సవాలుగా నిలుస్తారు కానీ భయపడి వెన్ను చూపించరు. దాన్ని బట్టే వారి మానసికారోగ్యం తెలిసిపోతోంది కదా!
చిన్నప్పుడు నేను ఏదన్నా సభలోనైనా, ఎవరిదగ్గరైనా, ఎక్కడైనా సరే, ఏదన్నా ఒక పాట పాడగానే వెంటనే పక్కనే వున్న మా నాన్నగారిని ఎలా వుంది, బాగా పాడానా? అని అడుగుతూ ఒకటే ప్రాణాలు తోడేసేదాన్ని. ఒకరోజు ఆయన ఓపికగా నాకు విడమర్చి చెప్పారు, మనమీద మనకి నమ్మకం వుండాలి. మనం చేసే పనిలో ప్రామాణికత, అంటే authenticity వుండాలి, అంతేకానీ ఇతరుల ఆమోదంతో మనకి పని లేదు. మితిమీరిన ఆ తాపత్రయం, అభద్రత, అంటే, insecurity ని సూచిస్తుంది. ఇంక దాంట్లో పడ్డామంటే మనకున్న ఆత్మవిశ్వాసం పడిపోయే ప్రమాదం వుంది. మనం చేసే పని మాత్రం బాగా చెయ్యాలి. మనం చేసిన పని అందరికి నచ్చిందా లేదా అనే కుతూహలం వుండటం సహజమే కానీ అది కేవలం మానవ సహజమైన కుతూహలం స్థాయిలోనే వుండాలి కానీ ఒక అభద్రతను సూచించే స్థాయికి వెళ్ళకూడదు. మన పని బాగుంటే అది అందరికి తప్పకుండా నచ్చే అవకాశం ఎక్కువగా వుంటుంది. ఈ మాటలు ఆ వయసులో నాకు ఏదో కొంచెం కొంచెమే కానీ అంత బాగా అర్థం కాలేదు, కానీ తర్వాత తెలిసింది ఆ మాటల్లో అర్ధం. బాగా అభ్యాసం చేస్తే పరిపూర్ణత, అంటే, perfection వస్తుంది. Perfection తో ఆత్మవిశ్వాసం వస్తుంది. అప్పుడు ఎదుటివారి స్పందన వెంట మనం పడక్కరలేదు. దానికి అవసరాన్ని మించిన ప్రాముఖ్యతని అసలే ఇవ్వక్కరలేదు. అదే మానసికారోగ్యం అంటే.
మానసికంగా బలహీనంగా వున్నవాళ్ళు చేసే ఇంకో పని తమని అస్తమాను ఇతరులతో పోల్చుకోవటం. సాధారణంగా మానవ స్వభావం ఎలా వుంటుందంటే మనుషులు ఎప్పుడూ వారికి తెలీకుండానే తమ బలహీనతలను, అంటే weaknesses ను ఎదుటివారి పటుత్వాలతో, అంటే strengths తో పోల్చుకుంటారు. దాంతో తమని ఎప్పుడూ ఎదుటివారి కంటే తక్కువగా, లోకువగా పరిగణిస్తారు. తాము ఎందుకు పనికి రానివారు అని అనుకుని ఆ ఆత్మన్యూనతతో బాధపడతారు. ఎదుటివారి విజయాలకు వారు తగరని, కేవలం అదృష్టం వల్లనే వారికా గెలుపులు లభిస్తున్నాయని, ఆ అదృష్టం తమకి లేకపోవటం వల్లనే ఆ విజయాలన్ని అర్హత వున్నా కూడా తమకి రావటంలేదని, ఇలా రకరకాలుగా వాపోతారే తప్ప అవతలివారి పరిశ్రమ, పట్టుదల, అనుశాసనం, కార్యదీక్ష వారి కళ్ళకి కనిపించదు. మానసికారోగ్యం వున్నవాళ్ళు అలా ఆలోచించరు. వాళ్ళు ఎదుటివారి విజయాలలోంచి స్ఫూర్తిని పొందుతారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తారు. వారిని చూసి వారిలాంటి విజయాలను పొందటానికి తమ తప్పులను దిద్దుకుంటారు.
మితిమీరిన సంకోచం, తటపటాయింపు, ఏం అంటే ఏం తప్పో అన్న అర్ధం లేని భయం, ఇవన్నీ కూడా మానసిక అనారోగ్యానికి చిహ్నాలు. ధైర్యంగా మనసులో మాట చెప్పటం, మనం నమ్మినదాన్ని నిస్సంకోచంగా ఆచరణలో పెట్టడం, ఎవరైనా మనల్ని విమర్శిస్తే వారిని ద్వేషించకుండా ఆ విమర్శలని మంచి దృష్టికోణంతో తీసుకోవటం, ఇవన్నీ మానసికారోగ్యం సూచనలు. ఇంకో విషయం ఏమిటంటే మనందరం మామూలు మనుషులమే! అందుకే ప్రతివాళ్ళలోనూ చెడు ఆలోచనలు ఎప్పుడైనా వచ్చే అవకాశం చాలా వుంది. కానీ మానసిక ఆరోగ్యం ఆ ఆలోచనలను పసికట్టేస్తుంది. పడగొట్టేస్తుంది. చెడుని పారద్రోలి, మనల్ని మంచి వైపు తోస్తుంది. మానసిక ఆరోగ్యం బాగా లాభం చేకూర్చే విషయం ఇంకోటి కూడా వుంది. ఏ విషయం లోనైనా సరే, మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అనే సందర్భం వచ్చినపుడు ఈ మానసిక ఆరోగ్యం తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకునేలాగా చేస్తుంది. అసందిగ్ధంలో ఎక్కువసేపు వుంటే చాలా నష్టాలు కలిగే అవకాశాలు వున్నాయి. అధికంగా తాత్సారం చేస్తే చేతికి చిక్కబోయిన సువర్ణావకాశాలన్నీ కోల్పోయే ప్రమాదం వుంది. మానసికారోగ్యం ఇలాంటి ప్రమాదాల నుండి తప్పిస్తుంది. అటో ఇటో తేల్చుకోలేని ఆ అసందిగ్ధం లోంచి మనల్ని బయటకు లాగి మనల్ని మన కర్తవ్యం వైపు వెళ్ళటానికి ప్రోద్బలాన్నిస్తుంది.
Abnormal psychology చదువుతుంటే చాలా ఆసక్తికరమైన విషయాలు మన కళ్ళబడతాయి. చిత్రం ఏమిటంటే, వాటిల్లో చాలా లక్షణాలు మనలో చాలామందికి వుంటాయి. కానీ వాటిని మనం అంత సీరియస్ గా ఎప్పుడూ తీసుకోము. అసలు వాటిని జబ్బులనాలో, లేక కేవలం మానసిక వికారాలు మాత్రమే అని అనాలో తెలియటం లేదు. బహుశా వికారాలు ముదిరితే జబ్బులవుతాయి కాబోలు. మేము ఎక్కడికన్నా వెళ్ళటానికి బయలుదేరుతున్నప్పుడు ఇంట్లోంచి బయలుదేరి పక్క వీధి దాకా వెళతాం. అప్పుడు హఠాత్తుగా మావారికి అనుమానం వస్తుంది, గరాజు సరిగ్గా వేసావా, చెక్ చేసావా అని ఆందోళనగా అడుగుతారు. చేశాను, వేసాను అని ఎంత చెప్తున్నా ఆయనకు తృప్తి కలగదు. కారు మళ్ళీ వెనక్కి తిప్పేదాకా ఆయనకు మనఃశాంతి వుండదు. ఇలా కొన్ని వందల సార్లు జరిగింది. ఇలాగే ఇంట్లో స్టవు కట్టేసానా లేదా అన్న అనుమానం కొంతమందికి. తలుపు సరిగ్గా వేసానా, తాళం సరిగ్గా పడిందా లేదా అన్న అనుమానం ఇంకొంతమందిని బాధిస్తూ వుంటుంది. ఇలాగే అనుమానం అనండి, చాదస్తం అనండి, మానసిక వికారం అనండి, లేక పోనీ మానసిక జబ్బు అనే అనండి, చాలామంది కడిగినదాన్నే మళ్ళీ మళ్ళీ కడుగుతూ, తుడిచినదాన్నే మళ్ళీ మళ్ళీ తుడుస్తూ, అలా చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తూ అసలు ఇంక ఆ పనిలోంచి బయటపడరు. ఇవన్నీ మానసిక అనారోగ్యానికి సంబంధించినవే!
ఇప్పుడు నాకు అమెరికాలో ఆమధ్య జరిగిన సంఘటన ఒకటి గుర్తొస్తోంది. ఆమధ్య అమెరికాలో ఒక ఘోరమైన విమాన ప్రమాదం జరిగింది. ప్రయాణికులందరూ మరణించారు. ఆ విమాన సంస్థకి ఎంత తల బద్దలు కొట్టుకున్నా దానికి కారణం ఏమిటో తెలియలేదు. చివరికి తీవ్రమైన పరిశోధన తర్వాత వారికి తెలిసినదేమిటంటే ఆ విమానం నడిపే పైలట్ మానసికస్థితి అస్సలు బాగాలేదుట. విపరీతమైన depression తో బాధపడుతున్నాడట. అలాంటి అపాయకరమైన పరిష్టితిలో విమానాన్ని నడుపుతూ, తనేం చేస్తున్నాడో తనకే తెలీని పరిష్టితిలో దాన్ని చేజేతులా కొండల్లోకి దించేసాడు అతను. తన ప్రాణాలను కోల్పోవడటమే కాకుండా ఏ అపరాధము చేయని అంతమంది అమాయక ప్రయాణికుల అకాలమృత్యువుకి కారణమయ్యాడు. ఇలా ఎందుకు జరిగింది? అతని మెదడు అడుగుల్లో ఏ అలజడులు రేగుతున్నాయి? అతని మానససాగరపు లోతుల్లో ఏ బడబాగ్నులు రగులుతున్నాయి? అసలు అతని మానసిక జబ్బు గురించి ఎవరికీ తెలీదా? బహుశా తెలీకపోవచ్చు. ఎందుకంటే శారీరకారోగ్యం బయటకు కనిపిస్తుంది. కానీ మానసికారోగ్యం చూసేవారికి మరీ అంత స్పష్టంగా తెలియదు అని ముందే చెప్పుకున్నాం కదా! కానీ సునిశితంగా పరిశీలిస్తే దాన్ని కూడా మనం కనీసం కొంచెంగానన్నా పసికట్టేయగలమేమో! అందుకే మన చుట్టూ వున్నవారిని, మనకు కావలిసినవారిని, మన కుటుంబసభ్యులు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు, సహోద్యోగులు, అందరినీ వేయి కళ్ళతో కనిపెట్టుకుని వుండండి. అవసరమైనవారికి తగిన వైద్య సహాయం సమయానికి అందేలా చేయండి. వారి మానసికారోగ్యానికి సముద్రంలో నీటిబొట్టయినా సరే, నిస్సంకోచంగా మీకు తోచినంత చేయూతనివ్వండి.
ప్రతికూలంగా వున్న సందర్భాలలో కూడా బెంబేలెత్తకుండా ఓటమిని ఒప్పుకోకపోవటం మానసికారోగ్యం. సరిగ్గా అలాగే ఓటమి ఇష్టం లేకపోయినా కూడా ఇంక నట్టింట్లోకి అడుగు పెట్టేసిన తర్వాత అప్పటికి దాన్ని స్వీకరించి ముందు భవిష్యత్తులో దాన్ని ఓడించటానికి కంకణం కట్టుకోవడం కూడా మానసికారోగ్యమే! విమర్శలలోంచి మంచిని గ్రహించి ఏ ఒత్తిడులకి లొంగకుండా రెట్టించిన వుత్తేజంతో ముందుకు సాగిపోవటమే మానసికారోగ్యం. జీవితంలోని మార్పులను ప్రతిఘటించకుండా వాటిని జీవితంలో ఒక భాగంగా స్వీకరించి తదనుగుణంగా తమను తాము మలచుకొనటం మానసికారోగ్యం. దీనిలోని భాగమే మనలోని పరిమితులను మనం గుర్తుపెట్టుకోవడం. లోతు తెలీకమునుపే గభాలున దూకకుండా మన జాగ్రత్తలో మనం వుండటం కూడా మానసికారోగ్యమే! అలాగే ఏ అర్ధం పర్ధం లేని బంధంలోనుండైనా సరే, మరీ ఆలస్యం కాకమునుపే తెగించి బయటకు దూకడం కూడా మానసికారోగ్యమే! అంటే అలాంటి సమస్యా పరిష్కారాలను సమయం మించిపోకుండా మన బుర్ర ఆలోచించగలుగుతోందన్నమాట. మరి అది మంచి ఆరోగ్య సూచనయే కదా!
ఇప్పుడు నాకు అంతగా తెలీదు కానీ ఒకప్పుడు ఇండియాలో మానసిక రుగ్మతలని ఏవో కళంకాలుగా, అంటే ఒక stigma లాగా చూసేవారు. అసలు శరీరానికి లాగానే మనసుకు కూడా జబ్బులు వచ్చే అవకాశం వుంది అన్న అవగాహన ప్రజలలో అంతగా వుండేది కాదు. వారిని చూసి చెవులు కొరుక్కునేవారు. ఇంక వారు బాగుపడరని, వారి జీవితం పూర్తిగా వ్యర్థమని ముద్ర వేసేసేవారు. అంతేకాకుండా వారిని ఏదో వెలి వేసినట్లుగా కూడా చూసేవారు. అందుకే ఆ సాంఘిక బహిష్కరణకు భయపడి మానసిక జబ్బులను నయం చేసుకోటానికి బదులు గూఢంగా దాచాలని అందరూ ప్రయత్నించేవారు. కానీ క్రమంగా వారి ఆలోచనలలో, దృష్టికోణంలో మార్పు వచ్చింది. మానసికారోగ్యం, దాని ప్రాముఖ్యత గురించి కొంచెం కొంచెంగా అయినా సరే, మెల్లిగా అందరికి అర్ధం అవటం మొదలయింది. మానసిక రోగులని సానుభూతితో చూడటం మొదలైంది. Psychologists, Psychiatrists లాంటి వృత్తులను అందరూ గౌరవించటం మొదలుపెట్టారు.
మనిషి అన్న తర్వాత భావోద్వేగాలు తప్పవు. అందుకే వాటిని అదుపులో వుంచుకుంటే అసలు మానసిక అనారోగ్యమన్నదే రాదు. అయినా అసలు కొన్ని మానసిక జబ్బులు వారసత్వంలాగా వస్తాయేమో కానీ చాలా మటుకు మాత్రం మన స్వకర్మల వలనే వస్తాయి అనటంలో ఏమీ తప్పు లేదేమో! ఆందోళన, అంటే anxiety, నిరాశ, నిస్పృహలు, అంటే depression, నాకేమి చేత కాదు, నేనెందుకు పనికిరాను అనే ఆత్మన్యూనతా భావం, ఇవి ప్రపంచం మొత్తం మీద ఎక్కువ మంది ప్రజలను ఎక్కువగా బాధపెట్టే మానసిక జబ్బులు. సరే, ఇంక రకరకాల eating disorders సంగతి చెప్పనే అక్కరలేదు. సన్నగా వుండాలి అన్న తాపత్రయంలో మితి మీరుతూ, చాలా వింతైన తిండి అలవాట్లని మొదలుపెడితే అవి చివరికి చాలా ప్రమాదకరంగా తయారయే అవకాశం కూడా వుంది. ఇంకో విషయం. మన నియంత్రణలో లేనివాటిని మనం ఏమి చేయలేము. మరి అలాంటప్పుడు అలాంటివాటి గురించి తల బద్దలు కొట్టుకోవడమెందుకు? ఆ శక్తిని వేరే మంచి విషయాల కోసం వెచ్చించవచ్చును కదా! అంతేకాదు, మరీ అంతగా ముందు భవిష్యత్తును గురించి ఆలోచించి ఏవేవో ప్రణాళికలు వేసుకోవటం వ్యర్థం. ఎందుకంటే అంత ముందుగా వచ్చే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? అసలు రానున్న అయిదు ఏళ్ళలో ఏమాత్రం ప్రాముఖ్యం వహించని విషయాలకు అయిదు నిముషాలకు మించి ప్రాముఖ్యత ఇవ్వరాదని మానసిక నిపుణులు చెప్తున్నారు. అలాగే ఎప్పుడైనా మనకి మనస్తిమితంగా లేకపోతే 5 -5 -5 పద్ధతిని పాటించాలని కూడా వారు చెప్పారు. అంటే, అయిదు సెకన్లు వూపిరి తీసుకుని, అయిదు సెకన్ల పాటు ఆ వూపిరిని బిగపట్టి, ఇంకో అయిదు సెకన్లలో మెల్లిగా ఆ వూపిరిని వదలటం చేస్తే ఆ సమయం అంతటిలోను మన మనసులోని ఆందోళన కాస్తైనా తగ్గి కాస్త మనఃశాంతి చిక్కుతుందని వారి వుద్దేశం. అలాగే ఎప్పుడూ సకారాత్మకంగా ఆలోచించటం, సంతోషంగా వుండటం, సోమరితనాన్ని వదిలేసి ఎప్పుడూ తీరిక లేకుండా పనులలో నిమగ్నులై వుండటం, ఇవన్నీ కూడా మానసికారోగ్యాన్ని ఇస్తాయి. మనకున్న అభిరుచులు, అంటే passions అన్నమాట, అవి కూడా మనకి ఎంతో మానసికానందాన్ని, తద్వారా మానసికారోగ్యాన్ని ఇస్తాయి. బాధల్లో ఉపశమనాన్ని, ఒంటరితనంలో తోడుని, నిరాశలో సాంత్వనని, నిస్పృహలో సంయమనాన్ని, ఓటమిలో ఆత్మవిశ్వాసాన్ని అభిరుచులు మనకి ఇస్తాయి. అందుకే ప్రతివారికి ఏదో ఒక అభిరుచి వుండటం వారి మానసికారోగ్యం కొరకు చాలా ముఖ్యం.
మానసికారోగ్యానికి నాకు తెలిసిన ఇంకో చిట్కా చెప్తాను. అది ఎప్పుడూ కుటుంబం, బంధువులు, స్నేహితుల సాంగత్యంలో సమయం గడపటం. ఒంటరిగా కంటే ఆప్తులతో కలిసి జీవించేవారి ఆయువు పెరుగుతుందని, వారి జీవిత నాణ్యత, అంటే quality కూడా పెరుగుతుందని మానసిక నిపుణులు అన్నారు. అందుకే ఆరోగ్య త్రికోణం, ఆంటే health triangle లో శారీరక, మానసిక ఆరోగ్యాలతో పాటుగా సామాజిక ఆరోగ్యాన్ని కూడా చేర్చారు. అంటే శారీరకంగా ఆరోగ్యంగా వుండటం తో పాటు ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ, బయట సంఘంలో తోటి సభ్యులతో కానీ మంచి సంబంధ బాంధవ్యాలను కొనసాగిస్తే అది కూడా మన మానసికారోగ్యాన్ని బాగా బలపరుస్తుంది. మీరు చిన్నపిల్లలను చూడండి, పదిమంది మధ్య పెరిగిన పిల్లలు, ఒంటరిగా ఒక్కరూ పెరిగే పిల్లలకి మానసిక పెరుగుదలలో చాలా వ్యత్యాసం వుంటుంది. పదిమంది ముద్దుమురిపాల మధ్య పెరిగిన పిల్లలు చాలా emotional security తో వుంటారు. వారి మానసిక పెరుగుదల చాలా smooth గా, తొందరగా వస్తుంది. ప్రపంచజ్ఞానం, అంటే మనం street smartness అంటాం చూసారా, దానిలో వారు ఆరితేరినవారయే అవకాశం చాలా వుంది. ఒంటరిగా పెరిగిన పిల్లలకి మానసిక పెరుగుదల కొంచెం నిదానంగా వస్తుంది. ఈ తేడా మనం వుమ్మడి కుటుంబాలలోని పిల్లలను, ఒక్క తల్లితండ్రుల మధ్య మాత్రమే పెరిగిన పిల్లలను గమనిస్తే చాలా తేలికగా పసికట్టగలం. దీన్నిబట్టి సామాజికారోగ్యం కూడా మానసికారోగ్యానికి దోహదం చేస్తుందని మనకు తెలిసిపోతోంది.
ఇవన్నీ ఒకదానితో ఇంకొకటి ముడి పడి వున్నాయి. అందుకే మనం అన్నిటికీ సమాన ప్రాధాన్యతనివ్వాలి. అన్నీ వుంటేనే మన మనుగడ సవ్యంగా, సాఫీగా సాగుతుంది.
చివరగా ఒక్క విషయం చెప్తాను. చాలామటుకు శారీరక అనారోగ్యాలు అందరి కళ్ళకు కనిపిస్తాయి. కానీ మానసిక రుగ్మతలు అందుకు పూర్తిగా విరుద్ధం. చాలామటుకు అవి మనిషి మనసులలో దాగివుండి వారిని నిశ్శబ్దంగా బాధిస్తాయి తప్ప చూసేవారికి కొంచెం కూడా ఎలాంటి సూచనల్ని తేలికగా ఇవ్వవు. అందుకే వాటిని చాలా సునిశితంగా పట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎవరన్నా అటువంటివారు మనకు తటస్థపడితే వారికి ఇచ్చే గౌరవాన్ని ఏమీ తగ్గించకండి. వారి మీద అవసరానికి మించి జాలి కూడా వద్దు. వారికి అమితమైన ప్రేమను, మీ సహాయాన్ని, మద్దతును మాత్రం పుష్కలంగా ఇవ్వండి. అప్పుడే వారు కూడా తొందరగా మామూలు మనుషులవుతారు. పోగొట్టుకున్నఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ తిరిగి పొందుతారు. ప్రయోజకరమైన నాగరికులుగా మారి తేలికగా సమాజం లో కలిసిపోతారు.
అనవసరమైన పోల్చడాలు నాకిష్టం వుండదు కానీ ఒక్క విషయం మాత్రం అనకుండా వుండలేకపోతున్నాను. ఎంత శారీరక ఆరోగ్యం వున్నా, మానసిక ఆరోగ్యం లేకపోతే మాత్రం ఏమీ లాభం వుండదు, ఏమీ చేయలేము. ఏదీ అనుభవించలేము. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. అందుకే మనందరం మన మానసికారోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి మనం అందరం ఆ గమ్యం వైపు నడుద్దామా?
మనందరి ఈ ప్రయాణం సఫలీకృతమవ్వాలని, మనందరి మానసికారోగ్యం మన శరీరారోగ్యంతో సమానంగా చక్కగా వుండాలని కోరుకుంటూ ఈ విషయాలని ఇంక ఇంతటితో ముగిస్తూ ఈ నెలకి మీ అందరి దగ్గర నుండి సెలవు తీసుకుంటాను.
అమ్మా ..
మానసిక,శారీరక అరోగ్యాలగురించి, వాటి ప్రాముఖ్యత గురించి చాలా సమగ్రమైన విశ్లేషణ చేసారమ్మా..
ధన్యవాదాలు .. అభినందనలు.