Menu Close
Bulusu-Sarojini-Devi
గాలి (ధారావాహిక)
-- బులుసు సరోజినిదేవి --

ఆ ఆదివారం అపార్ట్మెంట్ మీటింగ్ లో ఇంకో పదిరోజుల్లో జరగబోయే విరించి తల్లి తండ్రుల షష్టి పూర్తి మహోత్సవం ఘనంగా జరగబోతోందని అందర్నీ మనస్పూర్తి గా ఆహ్వానించారు విరించి లావణ్య లు. అందరికీ శుభలేఖ లిచ్చి తమ ‘బంగారు పల్లె’ ప్రాశస్త్యం అక్కడి గుడిలోని దేవతల ఆశీర్వాద బలమేనని. అక్కడ అన్యాయానికి. అక్రమానికి చోటే ఉండదని, అందరూ ఒక్క తాటిపై నీతిగా, న్యాయబద్దంగా జీవిస్తారని చెప్పాడు. హర్ష స్వాతిలు పిల్లలందరికి తమ పల్లె ఎంత అందమైనదో చెప్పి ఊరిస్తున్నారు. అందరికీ ఉత్సాహం వచ్చి సరదా ట్రిప్ కోసం బయలుదేరారు. కవిత మాత్రం ఒక మార్పు కోసం, కొన్నాళ్ళు పట్నవాసపు బిజీ లైఫ్ నుంచి ఉపశమనం అనుకుంది.

విరించి ఏర్పాటు చేసిన బస్సు లో పెళ్లి సందడి చేస్తూ బయలుదేరింది.

ఒక కొత్తదనం. అందరూ ఒక్కటిగా ఒక కోలాహలం. అల్లర్లు, ఆటపాటల మధ్య ఊరు మొదలులో ఉన్న గ్రామ దేవత గుడి దగ్గర ఆగింది. అక్కడ జరిగే జాతర శక్తివంతమైనదని చెప్పాడు విరించి. అక్కడ బస్ ఆగగానే, టపాకాయల మోతలతో విజయోత్సాహపు ఢంకా లు మొగిస్తూ విరించి స్నేహితులంతా స్వాగతం పలికారు. పరిచయాలు, ఫలహారాలు పూర్తికాగానే జాతర మొదలయ్యే వేళకి అంతా గుమిగూడారు. వాళ్ళ నాయకుడెప్పుడూ చంద్రమే!

అక్కడి నృత్యాలు, పాటలు, పల్లె ఊసుల గీతాలు హాయిగా ఉన్నాయి. అంతా ఒక పద్దతిలో జరుగుతోంది. అందరి మొహాల్లో ఒక చెప్పలేని ఉత్సాహం. ఉల్లాసం.

కొంత సేపు జాతరలో గడిపాక ‘మహాలక్ష్మి దేవాలయం‘ ముందు ఆగింది బస్సు. అక్కడేమి కోరుకున్న జరిగి తీరుతుందన్నారు కొందరు. అందరూ హుషారుగా కదులుతూ ఉంటే నిశ్శబ్దంగా, మౌనంగా వారిని అనుసరిస్తున్న కవితని చూసాడు చంద్రం. గుళ్ళో పూజలు జరిగే ముందు బయటకు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి రమ్మని పూజారి చెప్పాడు. అక్కడంతా చేరి కొబ్బరికాయ కొట్టబోవడం అది పగలగొట్టడం చేతగాక పోతే నవ్వడం ప్రారంభించారు.

చంద్రం తర్వాత క్యూలో నిలబడి ఉంది కవిత. ఒక్క దెబ్బతో కాయ రెండు చెక్కలు కావాలని గట్టిగా ఒడుపుగా కొట్టాడు చంద్రం. ఆ విసురుకి కొబ్బరిచెక్క ఒకటి ఎగిరి సూటిగా కవిత నుదురుని బలంగా తాకింది. సరదాగా ప్రారంభమయిన ఆ సందడిలో విషాదం కవిత నుదురు నుంచి బొటబొటా కారే రక్తం. అందరూ కవిత చుట్టూ చేరారు.

“అరె! మీరు నావెనుకే ఉన్నారు కదా? ఇంతలోనే ధజస్తంభం వైపు ఎలా వెళ్ళారు?” అంటూ ఆమె నుదుటి మీద తన రుమాలు తీసి ఒత్తి పట్టాడు. ఆమె కళ్ళు మూసుకుని బాధని పంటి బిగువున భరిస్తోంది. ఎప్పుడూ కాంతివంతం గా ఉండే ఆమె మొహం ఆ ఘటన తో వాడిపోయింది.

“ఏమిటీ ఉపద్రవం? ఎప్పుడూ లక్ష్మమ్మ గుడిలో ఇలా జరగలేదే! మనూరు లో ఎప్పటి కాన్నుంచో ఒక్క రగతపు బొట్టు చిందలే! ఏటవబోతోందో?” అంది ఒక పండు ముసిలి.

“ఎహే నువ్వూరుకో! అన్నాడు దాని పెనిమిటి. కవిత భయభ్రాంతురాలై చంద్రం వంక చూసింది.

విరించి వాళ్ళని బయిటికి తీసుకుపోయాడు. అందరూ గుమికూడవద్దని...

‘గాలి’ ఆడాలని చంద్రం రిక్వెస్ట్ చేశాడు. పదే పదే కవితకి సారి చెప్పాడు.

ఆలా జరుగుతుందని అస్సలు అనుకోలేదన్నాడు. నొచ్చుకుంటూనే ఉన్నాడు.

‘మీరు నా పక్కనే ఉన్నారు కదా? అటెందుకు వెళ్ళారంటూ బాధగా మాట్లాడుతూ ఉంటే కవిత ఆ ఆప్యాయతకి తడిసి ముద్దవుతోంది. మానసికంగా కృంగిపోయి ఉన్న కవితకి చంద్రం అంతలా బాధపడుతూ సపర్యలు చేస్తూ ఉంటే తలకి తగిలిన గాయానికి కాక, మనసులో మరుగుతున్న గాయానికి స్వాంతన కలిగినట్లయి ఆశ్చర్యంతో కూడిన హాయిగా ఉందామెకి.

రక్తం స్రవించడం ఆగాక అక్కడికి దగ్గర్లో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వైద్యం చేయిస్తే గానీ కుదుటపడలేదు చంద్రం.

రెండుగంటల తర్వాత బస్ వేగాన్ని పుంజుకుంది. తారు రోడ్డుమీద సర్రున సాగిపోతుంది. పైరగాలి హాయిగా తగుల్తోంది. ఎత్తు పల్లాల మీద పచ్చగా పరుచుకున్న చేలు, వరుసగా బారులు తీరి ఉన్న కొబ్బరిచెట్లు, గుబురుగుబురుగా పెరిగిన అగ్నిపూల చెట్లు, వాటికి సమీపంలోనే పెద్దనూతులు, పంపుసెట్లు అమర్చిన షెడ్లు చూడముచ్చటగా ఉన్నాయి. “నేనిలాంటి ప్రయాణాలు చాలానే చేశాను!” అన్నాడు బడ్డీ ఎన్ క్లేవ్ ప్రెసిడెంటు.

“ఇతగాడిప్పుడు స్వంత డబ్బా వాయిస్తాడనుకుంటాను!” అన్నాడు తనకి బాగా అనుభవం ఉండడం వల్ల రాకీ. స్తుతి కిసుక్కున నవ్వింది.

“రెండుగంటలు మధ్యలో ఆగిపోయామా? ఆ ఎండకి గొప్ప చీదర గా ఉంది. గాభరా పెట్టడం లేదూ?” తన ఉనికిని చాటుకుంది ప్రెసిడెంటు భార్య.

“ఇంతకీ మనం పెళ్ళికొడుకు తరుపా?” పెళ్లి కూతురు తరుపా? అని అడిగాడు ప్రెసిడెంటు. అతడికి తొంబై ఏళ్ళు ఉంటాయి. అన్నింటికీ తయారయిపోతాడు. చూస్తే ఎవ్వరేనా పట్టుకుని నడిపించాలి. దిగేటప్పుడు ఇద్దరు దించాలి. పోనీ పిట్ట మనిషా అంటే భారీ విగ్రహం!

అతణ్ణి దింపేలోపల ‘జాగ్రత్త!  జాగ్రత్త! అని కంగారు పెట్టేసి దిగాక “అమ్మయ్య! చచ్చాను!” అంటాడు.

“వీడా చచ్చింది? మనం కాదూ? అని గొణుక్కున్నాడు లక్ష్మణ్.

‘బంగారు పల్లె’ కి అందరూ బయల్దేరుతుంటే లక్ష్మణ్ ఎదురు అపార్ట్మెంట్ ‘సాంబ’ కి తన డ్యూటీ అప్పజెప్పేసి బండెక్కేసాడు. అదిగో... అప్పట్నుంచి పెసిడెంటు తినేస్తున్నాడు. ఎదవసచ్చినోడు... ఈడికెందుకు ఈ సరదా?” అని గొణుగుతూ ఉంటే రాకీ, స్తుతి ఒకటే నవ్వు.

‘ఒక అర మైలు’ మట్టిరోడ్డు ఉంటుందని ఆ రోడ్డు మన పల్లెకు దగ్గర దారి! అని అనౌన్స్ చేశాడు విరించి.

బస్సు ఎత్తుపల్లాల్లో, కుదుపుల్తో ఎగిరెగిరి పడుతోంది.

కవితని గట్టిగా పట్టుకుని ఉన్నాడు చంద్రం.

ఆమెకి మళ్ళీ దెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకున్నాడు.

బస్సు ఉయ్యాల ఊగినట్టు ఊగుతోంది. హఠాత్తుగా బస్ గాల్లోకి ఎగిరినట్టయి కవిత అతని ఒడిలో పడి... లేచిసద్దుకుని కూర్చుంది. పిల్లలు కిలకిలా నవ్వారు. భయం వేసిన వాళ్ళు హాహాకారాలు చేసారు. ఇంతలో తార్రోడ్డు వచ్చింది. బస్ సాఫీ గా సాగుతోంది. ఇంకా కవితని పట్టుకునే ఉన్న చంద్రాన్ని రాకీ చూసి కొంటెగా నవ్వి స్తుతికి చూపించాడు. అతని స్పర్శ హాయిగా తోచి నిశ్చింతగా ఉన్న కవిత అతను వదిలిపెట్టగానే కళ్ళు విప్పి చుట్టూ చూసింది.

‘బంగారు పల్లె ‘చేరుకున్నారు. బస్సు ఆగీ ఆగగానే మంగళ వాయిద్యాలు మోగాయి.

ఒక పెద్ద కోట దగ్గర ఆగింది బస్.

ఎప్పటిదో వందల ఏళ్ళనాటి కోట అది!

ఒకాయన మహారాజులు విశ్రాంతి కోసం కట్టుకున్న మహల్ అని చెప్పాడు ఆ కోటలోకి తీసుకువెళ్తూ.

ఆ కోట బురుజు త్రికోణాకారంలో ఉంది. ఆయన పోతూనే ఉన్నాడు. అలా వెళ్ళి వెళ్ళి పెద్ద పెద్ద  చావడీలు ఉన్న ఒక హాలులాంటి దానిలోకి తీసుకుపోయి ఆగాడు అక్కడ.

కోట చరిత్ర చెప్పడం మొదలుపెట్టాడు.

‘ఓరి పిచ్చిసచ్చినోడా! ఇప్పుడు సెరిత్ర ఏట్రా? లోపలికి తోలుకుపోక!” అన్నాడు సూట్కేస్లు మోస్తున్న వాడు. ”బతికించేవ్ “అన్నట్టు చూసారందరూ! కోటలోపల అందమైన రూములు ఉన్నాయి. ఎవరికి కావలిసినవి వాళ్ళు ఎన్నుకున్నాక చంద్రం వచ్చి –

“కవితా! మీరిలా రండి!” అన్నాడు.

“వెళ్ళండి. వెళ్ళండి!” అన్నాడు తమాషాగా రాకీ! నవ్వుతూ వెళ్ళింది ఆ మాటలకి. చంద్రం ముసి నవ్వు నవ్వాడు.

కవితకి ఒక గది చూపించి బాల్కనీ లోకి తీసుకెళ్ళాడు.

“ఆహా! ఏమి సౌకర్యవంతమైన విడిది!’ అంది ప్రెసిడెంట్ గారి భార్య.

మహేంద్ర తన రూమ్ లోకి వెళ్తూ ఎదురుగా ఉండే రూంలోనే వాసంతి వాళ్ళు ఉన్నందుకు గొప్ప హాయిగా ఫీల్ అయ్యాడు. అతని కోసమే ఎదురుచూస్తున్నట్లు కళ్ళు కలవగానే నవ్విందామే! ఇదంతా చూస్తున్న రాకీ హుషారుగా ఈల వేస్తే లక్ష్మణ్ గొప్ప అల్లరిగా నవ్వేశాడు.

******

కాస్సేపటిలోనే కోట హాల్లో సందడి మొదలయింది. లక్ష్మణ్ రాకీ కి రహస్యం గా చెప్పాడు.

“షష్టి పూర్తి ఈడే జరుగుతుందట. ఆరి పెళ్లి కూడా ఇక్కడే జరిగిందట ఇక నాకు కూర్చోడానికి కూడ ఉండదు!” అన్నాడు పెసిడెంట్ గది వేపు చూస్తూ. రాకీ ఒకటే నవ్వాడు.

“ఈ కాలం పిల్లలకి ఊరకూరికినే నవ్వొస్తుంది.” అన్నాడు. అతడికి చాలా మంటగా ఉంది పొద్దుటినుంచి. పొలాల గట్లంట, వాగులంటా, వంకలంటా, తోట్లమ్మటా తెగ తిరిగెద్దామని అనుకున్నాడు. పెసిడెంటు పడనివ్వకపోగా ఏదో ఒక పని అప్పగిస్తూనే ఉన్నాడు. రాకీ లక్ష్మణ్ ని దగ్గరికి పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. హుషారుగా తలూపాడు. ఆ తర్వాత మరి కనపడలేదు పెసిడెంటుకి లక్ష్మణ్! ఎవరిని అడిగినా అదిగో... ఇదిగో అని దాటవేస్తున్నారు. చేసేది లేక తన పిల్లల్ని పిలవడం మొదలెట్టాడు.

****

షష్టి పూర్తి సంబరాలు మొదలయ్యాయి. పొడవాటి పందిరి. దాదాపు నలభై మంది మామిడి తోరణాలు కట్టేస్తుంటే కొంతమంది పరాచికాలు ఆడుతున్నారు. బుట్టల్తో గుట్టలు గుట్టలుగ పొసేస్తున్నబంతి పూలని చెయ్యితిరిగిన చేతులు చకచకా దండలు గుచ్చి పడేస్తున్నాయి. కుట్టిన వాటిని పందిళ్ళకి కట్టి, కొన్ని వేలాడదీసి, కొన్నింటిని అలంకరించి కదుల్తున్నారందరూ. ఇదంతా కవితకి భలే నచ్చింది. పెసిడెంటు అందర్నీ పలకరిస్తూ కబుర్లు చెప్తున్నాడు. తెల్లవారుఝాము ముహూర్తం లో షష్టి పూర్తి  ఘనంగా జరిగింది. విరించి తండ్రి పరంధామం భార్యని పేరు పెట్టి పిలిస్తే ఆవిడ సిగ్గు పడింది. సౌమ్య, శ్రీధర్లు రాలేకపోయారు. మిగతా అందరూ హడావిడిగా తిరుగుతూనే ఉన్నారు.

చంద్రం కవితని ఇష్టపడుతున్నట్టు కనిపించిన చంద్రం తండ్రి ఆ అమ్మాయిని పెళ్ళాడాలనుకుంటే తనకి అంగీకారమే! అన్నాడు. చంద్రం కవిత వైపు చూస్తూ-

“ఈ రాత్రి మిమ్మల్ని మా ఊరి సెలయేటి దగ్గరికి తీసుకుపోతాను!” అన్నాడు.

******

పాలవెన్నెల!!

కవితా చంద్రం వెనుక నడుస్తోంది. ఎండిన ఆకులు కాలికింద నలిగి గలగలమంటున్నాయి. వంతెన దిగాక మరికాస్త ముందుకి నడుస్తుంటే కీచురాయి శబ్దం విని ఝడుసుకుని చంద్రాన్ని గట్టిగా పట్టుకుంది. ఆ చేతిని తన చేతిలో బిగించాడు చంద్రం. అలాగే పట్టుకుని కొండ ఎక్కించి సెలయేటిని, వాటి గలగలల్ని వినిపించాడు.

సన్నగా చలి వణికిస్తోంది. ఆమె సన్నగా వణుకుతుంటే చంద్రం ఆమె పొదవి పట్టుకుని నెమ్మదిగా కొండ దిగాడు.

“షాల్ తేవాల్సింది!” అన్నాడు ఆమె వణుకు చూసి.

ఏదో కొత్తదనం లోకి అడుగు పెడుతున్నట్లుగా ఉందామెకి. ఒక బండరాతి మీద కూర్చున్నాడు చంద్రం. ఎదురుగా కవిత! వారి మధ్య వెన్నెల!

“నేను సిగరెట్ కాలుస్తాను. మందు కొడతాను!” అంది కవిత కొంత మౌనం తర్వాత.

”తెలుసు. విన్నాను. బహుశా వాటి అవసరం ఇంక రాకపోవొచ్చు!” ఆ మాట అంటున్నప్పుడు ఆ గొంతులో ఒక చేరిక ధ్వనించింది.

“అందరితో కలిసి ఉండడం కంటే ఏకాంతం గా ఉండడం నా అలవాటు!” అంది.

“కానీ ఒక ఉత్సవం లోనూ ఏకాంతంగా ఉండొచ్చు. ఇంకా ఆనందంగా!” అన్నాడు చంద్రం.

“అవును. ఇక్కడి వాతావరణం, మనుషులు, నేచర్... అందరితో నేనూ అనిపిస్తోంది!” అంది.

చాలా సేపు మాటలేవీ లేవు.

సెలయేటి గలగల. చెట్ల మధ్య ఈలపాట. అప్పుడప్పుడు సన్నని చలి.

“చేతనయినంతలో అందరికీ సహాయ పడాలన్నది నా తత్వం!” అన్నాడు చంద్రం.

ఆమె మౌనంగా, ధీర్ఘంగా ఆలోచనలో పడి చంద్రం మాటలకి తల ఊపింది.

“ఇక్కడ ఉండగలరా?”

“ఇక్కడే ఉండగలననిపిస్తోంది!” అంది.

“మీకు బోర్ గా అనిపించినప్పుడు ఏదైనా టూర్ కి వెళ్ళొచ్చు!” అన్నాడు.

“ఆలోచిస్తున్నాను!”

“ఏమని?” అడిగాడు చంద్రం.

“నా గురించి ఎలా చెప్పాలా?” అని. ‘నా గతమంత అందమైనది కాదు!” అంది కవిత.

“కాలం ఒక లెక్కలోనిది కాదు. అన్నీ మారిపోతాయి. నువ్వు... అదే మీరు నాకు ఒక్క అవకాశమిస్తే అవేవీ గుర్తుకు రావు!” అన్నాడు ఆమె బాధని గుర్తిస్తున్నట్టు.

ఆమె మౌనం అతడిని బాధిస్తోంది. ‘ఈ దూరం ఎంత భారం!’ అనుకున్నాడు.

పల్లెవాసులు నిరాడంబరులు. పూలన్నీ చిరునవ్వుల్తో చూస్తున్నట్టు, కొమ్మల మీద పిట్టలు తీయని పాటలు పాడుతున్నట్లు వీరు సహజంగా ఉంటారు!” అన్నాడు.

ఒక తీరైన భావన కలుగుతోందామెకి. ఓ కొత్తలోకం,కొత్తభావాలు... చిగురులు వేస్తున్నాయి.

ఊరి వైపు బయలుదేరారిద్దరూ!

నడవాల్సిన దారి చాలా ఉంది. ఏటి దగ్గర కొచ్చారు.

ఏటి ఒడ్డున నిలబడి నీళ్ళల్లో వెన్నెల చూస్తుంటే లోకంలో బాధలు గుర్తుకే రావు. మేఘాల దారుల్లో చందమామ పరుగు వింతగా తోస్తోంది. కొబ్బరిచెట్ల నీడలు నీటిలో కదులుతున్న చల్లని నీడల్లా ఉన్నాయి. నడుస్తున్నారు. చల్లని గాలి ఉండుండి వీస్తోంది.

అక్కడికి దగ్గర్లో ఉన్న పొదల్లో ఏదో బలంగా కదిలినట్టయి భయంతో చంద్రాన్ని అల్లుకుంది కవిత! చంద్రం ఈ సారి సాహసించి ఆమె పొదవి పట్టుకుని నడిపించాడు.

ఊరికి దగ్గరగా వచ్చినట్టు ఊరిమధ్య చెరువు చెప్పింది. చెరువు కట్ట దగ్గర మట్టిరోడ్డు దాటి సన్నని తారు రోడ్డు మీద కొచ్చాక ఓ గట్టు మీద కూర్చుని కవితని లాగి ఒళ్ళో కూర్చొబెట్టుకున్నాడు. చెరువులో ఎర్ర కలువలు, తెల్ల కలువలూ సరాగాలాడుతున్నట్టు నెమ్మదిగా ఊగుతున్నాయి.

చందమామ నీటిలో అవి ఊగినప్పుడల్లా కదిలి పారిపోతూ సయ్యాటలాడుతున్నట్టు మనోహరంగా ఉంది.

చంద్రం ఆమెని ఒక్క ప్రశ్న కూడా వెయ్యకుండా తన బాహువుల్లో ఇముడ్చుకున్నాడు.

ఆమె గువ్వపిట్టలా ఒదిగింది.

హఠాత్తుగా చెరువులో “దబ్’ మని చప్పుడు. ఏటి లో ఎవరో దూకేశారు. ఒక తెల్లని ఓణీ ఆ శరీరం నుంచి విడివడి దూరంగా కొట్టుకుపోతోంది. చంద్రం కవితని వదిలి చటుక్కున దూకేసాడు.

చాలా వేగంగా ఈత కొడుతూ ఆ ఆకారం వైపు వెళ్ళి జుత్తుని అందిపుచ్చుకుని బయిటికి లాగుతూ కాస్త శరీరం దొరకాగానే గట్టిగా అందిపుచ్చుకుని ఒడ్డుకి లాక్కొచ్చాడు. ఆమె పెద్దగా నీరు తాగలేదు. పొట్టని ఒత్తబోతూ ఆగాడు. కడుపుతో ఉన్నట్లుగా తోచింది. నెమ్మదిగా తేరుకుంది.

“తులసీ! అంటూ ఆశ్చర్యపోయాడు చంద్రం.

“చంద్రన్నా!” వెక్కి వెక్కి ఏడుస్తోందాపిల్ల. పదహారు సంవత్సరాల కంటే వయసుండదా పిల్లకి.

జరిగింది తెలుసుకుంటూ కళ్ళనీళ్ళపర్యంతరం అయ్యాడు చంద్రం.

‘బంగారు పల్లె” లోనా ఇదంతా జరుగుతోంది? రెండు నిముషాలు గడిచాయో, లేదో ఒక ఆకారం వడివడి గా అడవి మార్గం వైపు నడుస్తూ వెళ్తోంది. ఆమె ‘కాదంబరి’ గా గుర్తించి తులసిని కవితకి అప్పజెప్పి ఆ దిశగా వెళ్ళాడు. కొద్దిసేపటిలో-

ఆమెను లాగి గట్టిగా లెంపకాయ కొట్టిన శబ్దం కొండల్లో ప్రతిధ్వనించింది.

పది నిముషాల అయ్యాక చంద్రం ఇంటివైపు వచ్చారందరూ. ఎవరికో ఫోన్ చేశాడు చంద్రం. ఇరవై నిముషాలు నిశ్శబ్దంగా భారంగా గడిచాయి.

****సశేషం****

రచయిత్రి పరిచయం ..

Bulusu-Sarojini-Devi పేరు: బులుసు సరోజినిదేవి

ప్రకాశం జిల్లా, దరిశిలో...జూన్ 29, 1956 లో జన్మించిన పట్టిసపు సరోజినీ దేవి, వివాహానంతరం బులుసు సరోజినీ దేవి అనే పేరుతో రచనలు మొదలుపెట్టారు. వీరి తల్లిదండ్రులు పట్టిసపు ఉమామహేశ్వరరావు గారు జోగులాంబ గారు . ఈమె 2010లో తన మొదటి కవితతోనే జాతీయస్థాయి రంజని కుందుర్తి అవార్డు సొంతం చేసుకొని రచనలను మొదలుపెట్టారు. 2011లో మరో జాతీయస్థాయి ఎక్స్ రే అవార్డును పొందారు. వీరి మొదటి కథ రంజని వారు సాధారణ ప్రచురణకి తీసుకున్నారు. తర్వాత నాలుగు కథలకు ప్రైజులని రంజని వారిచే పొందారు.  వీరు రాసిన "శ్రీముఖి" అనే నాటిక జాతీయస్థాయి రెండవ బహుమతి పొందింది. సంగీత స్రష్ఠ శ్రీశ్రీ శ్రీ  మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసి ఎంతో అదృష్టాన్ని కూడగట్టుకున్నారు. నాలుగు గురజాడ పురస్కారాలను అందుకున్నారు. వీరు 'కళామిత్ర' అనే బిరుదును పొందారు. ఉన్నత ప్రమాణాలు విలువలు కలిగిన రచనలు చేయడం వీరికి ఇష్టం. నాలుగు నవలలు, నాలుగు నాటికలు, దాదాపు 500 కథలు, 300 కవితలు, కొన్ని వ్యాసాలు రాశారు. వీరికి రచనలు చేయడం అంటే ఎంతో ఇష్టం.

ప్రముఖుల ప్రశంసలు: తెలుగు సాహిత్య ప్రపంచంలో బులుసు సరోజినీ దేవి గారి పేరు వినని వారు ఉండరు. ఆమె రాసిన ఈ మూడు కథలు వైవిధ్యవంతమైన జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. 'రెండో పెళ్లి', 'బొంకుల దిబ్బ' అనే కథలు స్త్రీల వైపు నుంచి జీవితాన్ని చూడడానికి... పారాహుషార్ అనే కథ నన్ను నివ్వెరపరిచింది. ఒకప్పుడు టిప్పు సుల్తాన్ దాడికి గురైన ఆ కథ ఇప్పుడు చెప్పటంలో మరొక కొత్త సత్యం ఆవిష్కరణ ఆవిష్కారమవుతోంది. చరిత్రల్ని సాధారణంగా మనం స్థూలంగా దేశానికో,  ప్రాంతానికో, రాష్ట్రానికో సంబంధించినవిగా చెప్పుకుంటాము.విభేదనలకు గురికాబడ్డ కారణంగా మనం ఒక జాతిగా, రాష్ట్రంగా, ప్రాంతంగా రూపొందే క్రమంలో చరిత్రను స్థూలంగా చెప్పుకునే క్రమంలో, చాలాసార్లు సూక్ష్మ చరిత్రల్ని మనకు తెలియకుండానే తుడిచేస్తుంటాము. అలా తుడిచి పెట్టబడటానికి ఇష్టపడని ఒక సూక్ష్మ చరిత్ర స్థూల చరిత్రకు ఎదురు తిరిగిన ఈ కథ  చదివితే పాఠకుడికి ఆ వివేకం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. -వాడ్రేవు చినవీరభద్రుడు

Posted in May 2025, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *