Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
-- మధు బుడమగుంట --
కాలమహిమ

మ.కో. కాలగర్భమునందు మాయము గారె యెంతటివారలున్
         జాలఁ బ్రీతిగ మమ్ముఁ జూచిన శాస్త్రకోవిదు లెంద ఱీ
         నేల వీడి గతించిరో కద; నీవ నిత్యుఁడ వంచు నీ
         కేలుఁ బట్టితి వీడ కెప్పుడు(1) కీర్తితాసమసద్గుణా!
               (1) వీడక+ఎప్పుడు/వీడకు+ఎప్పుడు 187

శా. ఇంతింతై పసిబాలలే యెదిగి తా మెంతో సుధీమంతులే
     భ్రాంతిన్ జెంద నితాంత(1)భూమిని, నభఃప్రాంతంబు రక్షింప ది
     గ్దంతుల్ మ్రొక్కు; నిశాంతవాసినులు క్షాంతస్వాంతలే నేఁటి వి
     క్రాంతల్(2) కాంతుల రోదసీగమనలై రాణింతు రా యింతులే
          (1) గొప్ప (2) వ్యాపించినవారు 188

హస్తవాసి

ఉ. గుండ్రని యట్లు వేయఁగను గోరిన యట్లుగ(1) నొక్కలిప్తలో
     తీండ్రలు గల్గునట్టి సుదతీమణులే తగువారు, నేర్పులో
     నాండ్రకు సాటిలేరు; హరుఁడైనను వేఁడడె యన్నపూర్ణనే
     యుండ్రము లా గణేశునకు నోపిక నీయఁగ తల్లి మక్కువన్?
         (1) విధముగా / అట్లు అయ్యేలా 189

కం. కాలును బంగరు రంగున
     క్రాలుఁగదా యట్టు లింటి కాంతామణి చే
     వ్రాలు పడి, రసన మీఁదను
     వాలఁగ మది సంతసించి పడుఁ గడుతృప్తిన్ 190

కం. మహిళలు మహి లలనలు(1) కా
     రిహపరముల యందు శక్తికే రూపంబుల్
     బహుకష్టగగనరక్షణ
     వహియించు సమర్థురాండ్రప్రతిభకు జేజే! 
        (1) ఆడుకొనువారు
భావము- 
ఆడువారు భూమిమీద ఆడుకొనువారు కాదు. ఇక్కడ, పైన కూడ
శక్తికి ఆకారాలు. ఆకాశము నుండి మాతృభూమికి వచ్చే ముప్పును
తప్పించే అతికష్టమైన రక్షణ(వాయుసేనా) బాధ్యతను వహించే వారి
ప్రతిభకు జేజేలు అర్పిస్తున్నాను. అందుకే ఆడువారు ఆడుకొనువారు
కాక ఆదుకొను వారు, సమర్థశక్తిస్వరూపిణులు అయ్యారు. 191

చం. పరమపవిత్రకార్యముగ వంటలు వార్పులు చేసి దేవునిన్
     స్మరణము సేయుచున్ జనుల స్వస్థతయే కడు శ్రద్ధ నెంచుచున్
     నిరతము వండి వడ్డన లనిర్వచనీయముగా నొనర్చు స్త్రీ
     కరములు శ్రీకరంబు లగుఁగా కని చేర్చెద నా కరంబులన్ 192
Posted in February 2025, సాహిత్యం

1 Comment

  1. ASNMurthy

    మొట్టమొదటి మ.కో . పద్యం మూడవ పాదంలో గచిరో బదులు గతించిరో అని ఉండాలి.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!