Menu Close
Uma-Bharathi-Kosuri
హృదయగానం (ధారావాహిక)
నేడే విడుదల
కోసూరి ఉమాభారతి

3

hrudayagaanam-03

ఎటువంటి వివరాలు చెప్పకుండా, అర్జంటుగా వచ్చేయండన్న శాంత పిలుపందుకుని, అటునుండి రామ్, ఇటునుండి మాలిని ఉరకలు పరుగుల మీద ఒకేసారి ... శాంత వాకిట్లోకి వచ్చారు. పిల్లలకి ఏమై ఉంటుందో అని ఒకింత ఆదుర్దాగా హల్లోకి వచ్చారిద్దరూ. అక్కడేమీ కనపడలేదు. అంతా నిశ్శబ్దంగానే ఉంది.

"పారూ, శాంతా... ఎక్కడున్నారు?" అని పిలుస్తూ బెడ్-రూమ్‌లోకి వెళ్ళాడు రామ్. అక్కడ చంటి పిల్లలిద్దరూ హాయిగా నిద్రపోతున్నారు.

అక్కడినుండి, వారివురు వంటగది దాటి తోటవైపు నడిచారు. అక్కడ పూలమొక్కల మధ్య దృశ్యం వారిని నివ్వెరపరిచింది. మల్లెమొగ్గలు, మందారాలు కోసి శాంత చేతిలో ఉన్న పూల సజ్జలో వేస్తూ, తల్లితో సావకాశంగా కబుర్లు చెబుతున్న పారూని చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాదు, తనకిష్టమైన రంగులు, పూల సువాసనల గురించి చిలుక పలుకులు పలుకుతున్న పారూని చూసి మురిసిపోయారు.

మాలిని, రామ్ ఆనందబాష్పాలతో శిలల్లా నిలుచుండిపోయారు.

“ఇటువంటి అద్భుతాలు జరుగుతాయన్నమాట”, “ఈ క్షణంలో నా బిడ్డ గొంతు వింటుంటే మునుపు ఎన్నడూ వినని కమ్మని రాగాలు ఆలకిస్తున్నట్టుంది. దూరాన ఉన్న ఆ హరివిల్లు కూడా ముందెన్నడూ లేనంత అందంగా కనబడుతుంది.” అన్నాడు చమర్చిన కళ్ళతో, పారవశ్యంలో రామ్.

“అంతేకాదు. పారూ మాట్లాడ గలగడం ఒకెత్తైతే ... ఆ మాటలోని మాధుర్యం, స్పష్టత మరో ఎత్తు.” అంది సంభ్రమాశ్చర్యాలతో మాలిని...

***

పారూకి మాట వచ్చిందన్న సంతోషం, సంబరం బాసర వరకు పాకింది. అమ్మమ్మ సీతమ్మ గారు తరచుగా ఫోన్ చేసి … మనమరాలితో కబుర్లలో మునిగి తేలుతున్నారు.

"అమ్మకి... కవలలతో పని ఎక్కువయింది కనుక చేతనయిన సాయం చేయాలి నువ్వు. మంచి పనిమంతురాలు అనిపించుకోవాలి." అని కూడా మనమరాలికి చెప్పనారంభించారు ఆమె.

చంటిపిల్లలతోనే కాక, ఇంటి పని, వంటపనులతో తీరికలేకున్నా… ఎలాగోలా సమయం కేటాయించి, రోజులో కాసేపైనా పారూతో మాట్లాడుతూ, శ్లోకాలు వల్లె వేయిస్తుంది శాంత. ఆ చిన్నారి స్వరమాధుర్యాన్ని ఆస్వాదించడం ఆమెకెంతో ఇష్టం.

ఎంతటి క్లిష్టమైన పదాలనైనా … పారూ సులువుగా ఉచ్ఛరించగలగడం, శ్రావ్యంగా పాడగలగడంతో ...పెద్దమ్మ చెప్పినట్లు తమ చిన్నారికి చక్కని స్వరంతో పాటు, ప్రత్యేకమైన నైపుణ్యం ఉందని గ్రహించింది శాంత.

"రామ్ మీకు గుర్తుంది కదూ...ఐదేళ్ళ వయసు వరకు మాట్లాడలేక పోయిన 'క్లారా షూమన్’ రోజుకి మూడు గంటల పాటు పియానో ప్రాక్టీస్ చేస్తూ... పదేళ్లకు సంగీత రంగప్రవేశం చేసి… విశ్వ విఖ్యాత స్వరకర్తగా వెలుగొందిందని ... మన పారూ విషయంలోనూ అలాగే జరిగే అవకాశం ఉందని పెద్దమ్మ చెబుతుంది కదూ!” అని గుర్తు చేసే భార్యతో...

"అవును, అత్తమ్మగారి ఆశ, ఆశయం మహా గొప్పది. పారూ పలుకులు, శ్లోకాలు వింటుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఏమైనా ఇదంతా మీ వైపు నుంచి వచ్చినదే సుమా! ఇంత చిన్న వయసులో కష్టమైన పదాలని స్పష్టంగా పలకగలగడం దేవుడిచ్చిన వరం." అంటాడు రామ్.

***

ఓ శనివారం… తెల్లారక ముందే వంటింట్లో ఉన్న తల్లి వద్దకి వచ్చిన పారూ “కాస్త పొంగలి చేయమ్మా. గుడి మెట్ల మీద కూర్చునే వాళ్ళు మన కోసం చూస్తుంటారు. వెళ్లి వాళ్లకి పెట్టేసి వద్దాము. నీవు దగ్గరుంటే నేను వండగలనేమో చూడు. అమ్మమ్మ పొంగలి చేయడం చూసాను. నాకన్నీ తెలుసు. ప్లీజ్” అంటూ బతిమిలాడింది.

కాఫీ తాగుతూ .. అది విన్న రామ్, "శాంతా, ఆ కాస్తకి దాన్ని నొప్పించకు. దానిది జాలి గుండె. పైగా మంచి పనేగా. నీవు పొంగలి చేయి. దాన్ని నేను తీసుకువెళతానులే." అంటూ భరోసా ఇచ్చాడు.

రామ్, శాంతల ఇంట కవలలు అడుగులు వేయడాలు... పరుగులు తీయడాలు ఓ వైపు. గానమే గమ్యంగా నిత్యసాధన చేస్తూన్న పారూ మధురగానం మరోవైపు అన్నట్టుగా మరో ఏడాది గడిచింది.

***

కవలల ప్రాపకంతో తీరికలేక చర్చికి, గుడికి ఇదివరలోలా వెళ్లలేకపోతుంది శాంత. సంగీత పాఠాలు చెప్పాలన్న ఆలోచన కూడా మరుగున పడింది.

అయితే, చర్చిలోని బృందగానంలో పాల్గొనేందుకు ఇష్టపడే ఆరేళ్ళ పారూని .. తరచుగా రామ్, రామ్ కి వీలుకానప్పుడు మాలిని... చర్చికి తీసుకు వెడుతున్నారు.

మరో పక్క, తల్లి నుండి శ్లోకాలని శ్రద్దగా నేర్చుకుని... ఇంటి వెనుక తోటలోని జాలీ గదిలో ప్రశాంతంగా సరిగమల సాధన చేయడం కూడా పారూకి అలవాటుగా మారింది. తరచుగా అమ్మమ్మకి ఫోన్ చేసి, తన గానాన్ని వినిపించి...ఆమె మెప్పు పొందడం ఆ మనమరాలికి ఎంతో ఇష్టం. కూతురి ఆసక్తి, పట్టుదల శాంతని ఆశ్చర్య పరుస్తాయి.

'పారూ' అన్న పేరుతోనే అందరూ పిలిచినా ... గానం, సంగీతం విషయంగా మాత్రం 'పరమేశ్వరి' అన్న మనమరాలి పూర్తి పేరునే వాడాలన్న సీతమ్మ గారి నిర్ణయంతో ఏకీభవించారు శాంతా, రామ్ లు.

ఇకపోతే, పారూని తన సొంత బిడ్డలా భావించే డాక్టరమ్మ మాలిని, కవలలతోనూ ఆప్యాయంగా ఉంటుంది. దగ్గరికి తీసుకుని 'పిన్నీ' అని పిలిపించుకుంటుంది. మంచిమాటలు చెబుతుంది. చర్చి స్టోర్ నుండి పిల్లలకి అవసరమైన స్కూల్ సామాను తెచ్చి పెడుతుంది.

ఇల్లు, పిల్లల బాధ్యతలతో శాంతకి మరో నాలుగేళ్లు గడవడంలో స్నేహితురాలు మాలిని సహకారం మెండుగా ఉంది. పునీత్, జనని ఐదేళ్ళ వారయితే పారూకి పదేళ్ళు నిండాయి.

***

తమ నిర్వహణ లోని కమ్యూనిటీ చర్చి వార్షికోత్సవ సందర్బంగా… తన నేతృత్వంలో యువత కొరకు సాంస్కృతిక కార్యక్రమాలని ప్రకటించింది మాలిని. అందుగ్గాను బృందగానం సభ్యులతో పాటు పారూకి కూడా .. చర్చి మ్యూజిక్ టీచర్స్ వద్ద రెండు నెలల పాటు శిక్షణ ఏర్పాటు చేసింది.

ఆ అమ్మాయి స్వరంలో ఉన్న ప్రత్యేకతని గుర్తించిన టీచర్లు... కొన్ని శ్రావ్యమైన గీతాలు నేర్పి, ప్రోగ్రాములో పరమేశ్వరికి విడిగా గానం చేసే అవకాశాన్ని కల్పించారు.

***

ఈస్టర్ వేడుకలో భాగంగా జరిగిన లలిత సంగీత కార్యక్రమంలో… పరమేశ్వరి గానం ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. అందరి అభిమానాన్ని పొందిన పదేళ్ళ పరమేశ్వరికి తమ తరఫున ప్రత్యేక నగదు బహుమతిని అందజేశారు చర్చి నిర్వాహకులు మాలిని, జోసెఫ్ లు.

చర్చి సంస్థాఫుకులైన తన మామగారి గౌరవార్ధం.. యువత కోసం త్వరలో సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు, సాంకేతిక శిక్షణ తరగతులు మొదలుపెడతామని ప్రకటించింది మాలిని.

***

ఈస్టర్ కార్యక్రమంలో పారూ పాడిన పాటల రికార్డింగ్ విన్న వెంటనే సీతమ్మ, బాసర నుండి శాంతకి ఫోన్ చేశారు. "శాంతా, మన పారూ ... మీ అమ్మ మాణిక్యాంబలోని అద్భుతమైన నైపుణ్యాన్ని, స్వరమాధుర్యాన్ని పుణికి పుచ్చుకుంది. పాటలోని భావంతో లీనమైపోగల గుణం తన గానంలో ఉంది. అయితే... ఇప్పటినుండి శిక్షణ, క్రమశిక్షణలతో పారూ లోని నైపుణ్యాన్ని మనం పెంపొందించాలి. తానొక గొప్ప గాయనిగా .. అంతర్జాతీయంగా కూడా ఎదగాలి.

హఠాత్మరణం వల్ల సంగీత రంగంలో మీ అమ్మ అధిరోహించలేకపోయిన ఆ శిఖరాలను మన పరమేశ్వరి అందుకునేలా మనం శ్రమించాలి. నామటుకు నేను అందుకోసమే కట్టుబడతాను. నీ వంతు సహకారాన్ని నీవు అందించాలి. వంశపారంపర్యంగా వస్తున్న మన ఈ కళని ప్రపంచం గుర్తించేలా చేయాలని ఉందమ్మా." అంటూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు సీతమ్మ.

అప్పటికే, పారూ గురించి పెద్దమ్మ చెబుతున్న మాటలకి ఆనందభాష్పాలతో తడిసి ముద్దైన చెక్కిళ్లని తుడుచుకుంది శాంత. "పెద్దమ్మా ... వద్దు అలా బాధపడకు. తల్లి లేని లోటు తీర్చి నన్ను తల్లికన్నా మిన్నగా పెంచావు. ఇప్పుడు పారూ పట్ల నీ నిస్స్వార్ధ  ప్రేమ, దాని వృద్ధి పట్ల నీ ఆలోచన ... అది చేసుకున్న పుణ్యం. నీకు పూర్తి సహకారాన్ని అందించే ధర్మం నాది. ఇక మాట పెంచను. నా గుండె నిండిపోయింది. మళ్ళీ మాట్లాడుతానమ్మా." అంటూ ఫోన్ పెట్టేసి పవిటతో కళ్ళు తుడుచుకుంటున్న తల్లి వద్దకు వచ్చింది పారూ.

తల్లి చేయందుకుని, "అమ్మా, నీతో అమ్మమ్మ ఏమందో తెలీదు కానీ... నీ మాటలు విన్నాను. కొంత తెలిసింది. ఎందుకు నీవిలా ధుఃఖిస్తున్నావు? పూర్తిగా చెప్పమ్మా." అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

మనసు విప్పి, తాను చెప్పగలిగినంత చెప్పింది శాంత కూతురికి.

అంతా విని... "నీవు చెప్పిన దాని కన్నా ఎక్కువే అర్ధమయిందమ్మా. నాకు పాటన్నా, సంగీతమన్నా ప్రాణం. పాడకుండా నేనుండలేను. నీవన్నా, అమ్మమ్మన్నా కూడా అంతే ప్రాణం. నిజానికి మీరు గనక నన్ను పాడవద్దు అంటే మాత్రం నేను పారిపోతాను తెలుసా? కాబట్టి.. మనం ముగ్గురం ఒక జట్టు. మీరెలా చెపితే అలా." అని కళ్ళు తుడుచుకుని, తల్లి వడిలో తల వాల్చింది పారూ.

“అయితే... ఈ జట్టులోని అమ్మమ్మా-అమ్మా-అమ్మాయిల నడుమ సరిగమల సంధి కుదిరిందన్న మాటే కదా!” నవ్వుతూ కూతురి నుదుట ముద్దు పెట్టింది శాంత.

ఓ వైపు పెద్దమ్మ పంచుతున్న నిస్స్వార్ధ  ప్రేమ, వాత్సల్యాలని, మరో వైపు మాలిని బేషరతుగా అందిస్తున్న సలహా సహకారాలని... శాంత తమ అదృష్టంగా భావిస్తుంది.

***

ఆదివారం నాడు... పారూని చర్చికి తీసుకువెళ్ళడానికి వచ్చిన మాలినికి ‘ఛాయ్’ అందించి పక్కనే కూర్చుంది శాంత. “ఆదివారాలు ఈ వాగుడుకాయ ఇంట్లో లేనప్పుడు... ఆ నిశ్శబ్దాన్ని అస్సలు భరించలేకపోతున్నాం...మాలిని. ఇప్పుడు నీతో వెళ్ళిపోతుంది కదా. మా వసపిట్ట మళ్ళీ ఇల్లు చేరేంతమటుకు ఇల్లు గొయ్యరంలా నిశబ్దంగా ఉంటుంది." అంది నవ్వుతూ.

"అవును నిజమే, దారి పొడుగునా నాకు ఎన్ని కబుర్లు చెబుతుందో నీకు తెలియదు. ఓహ్!… నీకు చెప్పడం మరిచాను. చర్చి సభ్యులు, ప్రేక్షకులు కూడా.. ఈస్టర్ కార్యక్రమంలో పారూ గానాన్ని ఇప్పటికీ మరువలేకుండా ఉన్నారనుకో. మొత్తానికి ఆ కార్యక్రమం ద్వారా పారూ గానంలోని మాధుర్యాన్ని అందరికీ చవి చూపించగలిగాము." అంటున్న మాలిని అభిమానానికి అచ్చరువొందింది శాంత.

ఇంతలో, తయారయి వచ్చి ... మాలిని చేయి పుచ్చుకుని గేటు దాటుతున్న పారూని చూసి … వారివురి నడుమనున్నది ఓ అవినాభావ సంబంధమే అనిపించింది ఆ తల్లికి.

మాలిని కారు కనుమరుగయినా, ఆమె గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది శాంత. జన్యుపరమైన రుగ్మతతో పురిట్లోనే బిడ్డని కోల్పయిన విషాదాన్ని దిగమింగుకుని, పిల్లల వైద్యురాలిగా ఎందరో అనాధులని ఆదుకునే మాలినిలోని మాతృమూర్తికి శాంత మనసు నీరాజనాలు పడుతుంది.

అందుకోసం కూడా... అభిమానంతో మాలిని, జోసెఫ్‌ లకి తరచుగా ఇష్టమైన వంటకాలు, స్వీట్లు చేసి పెడుతుంది. తోటలోని మల్లెలు, జాజులని మాలకట్టి .. "మా తోటలో పూలు ఉంటే దేవుడి మెడలో ఉండాలి, లేదంటే నా స్నేహితురాలి సిగలో ఉండాలి..." అంటూ మాలిని జడలో తురమడం శాంతకి ఇష్టం.

గోడ గడియారం పన్నెండు గంటలయిందని సూచించడంతో... మాలిని గురించిన ఆలోచనల నుండి బయటపడి, లేచి వంటింట్లోకి నడిచింది శాంత.

****సశేషం****

రచయిత్రి పరిచయం ..

Uma-Bharathi-Kosuri‘నాట్యభారతి’ ఉమాభారతి - నర్తకి, నాట్య గురువు, నటి, రచయిత్రి, దర్శక - నిర్మాత

కూచిపూడి, భరతనాట్యం నృత్యరీతుల్లో నిష్ణాతురాలు ఉమాభారతి. మేటి నర్తకిగా, గురువుగా అంతర్జాతీయ ఖ్యాతి గడించారు ఆమె. పద్నాలగవ యేట అఖిలభారత కూచిపూడి నృత్య పోటీలో మొదటి స్థానం గెలుపుతో మొదలయిన ఆమె కళాజీవన ప్రస్థానం విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ అవార్డులు, సినీరంగ ప్రవేశంతో... బహుముఖ ప్రజ్ఞాశాలిగా కొనసాగింది.

'సుడిగుండాలు' చిత్రంలో బాలనటిగా పరిచయమయి, సాహిత్య అకాడమీ అవార్డు పొందిన 'చిల్లరదేవుళ్ళు' చిత్రంలో కథానాయకిగా, 'యమగోల' చిత్రంలో ఊర్వశిగా నర్తించిన ఉమాభారతి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యార్ధి దశలోనే ‘భారతీయ నృత్య రీతులు’ అనే డాక్యుమెంట్రీ, సింగపూర్, జోహన్నస్బర్గ్ టి.వి లకి ‘నర్తకి’ టెలి-ఫిలిం, ‘క్లాసికల్ డాన్సస్ ఆఫ్ ఇండియా’ అనే ఎడ్యుకేషనల్ వీడియో నిర్మించి నటించారు.

ఆమె స్థాపించిన 'అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడమీ' ద్వారా నిర్మించి, దర్శకత్వం వహించిన 'ఆలయనాదాలు' టెలి-ఫిలిం జెమినీ టీవీలో సీరియల్ గాను, అంజలి వీడియోస్ ద్వారా విదేశాల్లో నేరుగాను పంపిణీ చేయబడింది.

సౌతాఫ్రికా, మారిషస్, సింగపూర్, మలేషియా, అమెరికాలో నృత్య ప్రదర్శనల ద్వారా పెక్కు ఆలయ నిర్మాణ నిధులకు, తెలుగు భాషా-సంస్కృతి అభివృద్ధి కార్యక్రమాలకు, వరద బాధితుల నిధులకు, నేత్రదాన శిబిరాల నిర్వహణకు, పేద విద్యార్ధుల స్కాలర్షిపాపులకు, లైబ్రరీలకు  పలుమార్లు నిధులను అందించారామె.

గుర్తింపు: 1975 లో శ్రీ మంగళంపల్లి బాలమురళికృష్ణ గారి చేతుల మీదగా స్వరణకంకణంతో పాటు ‘నాట్యభారతి’ బిరుదును, '89 లో పాండుచేరి గవర్నర్ నుండి ‘రాజ్యలక్ష్మి అవార్డ్’, 1981 లో ‘వంశీ’ వారి ‘ఉత్తమ ప్రవాసాంధ్ర  కళాకారిణి’ పురస్కారం, 1991 లో ఆంధ్ర ప్రదేశ్ సినీ గోయర్స్ వారి నెహ్రు సెంటీనియల్, హౌస్టన్ లో 'ఏషియన్ విమెన్స్ వారి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులు, 2016 లో ఢిల్లీ తెలుగు సంఘం వారి ప్రవాసాంధ్ర కళాకారిణి గుర్తింపుని అందుకున్నారు ఉమాభారతి.

రచయిత్రిగా: ‘తానా’, ‘ఆటా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డులు, సృజనాత్మకతకి గుర్తింపు పొందిన నృత్య నాటికలు - భరతముని భూలోక పర్యటన, దేవి స్తోత్ర మాలిక, కన్య, టెంపుల్ బెల్స్, గురువే నమః, పెళ్లి ముచ్చట, మానసపుత్రి, తెలుగు వెలుగు 2013 నుండి నృత్యేతర రచనల్లో వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా వారి 'ఉత్తమ రచన పురస్కారం' పొందినవి -  ముళ్ళ గులాబీ, తులసి, ఏమాయ చేసావో?, విదేశీ కోడలు, సరికొత్త వేకువ, 'ఉమాభారతి కథలు' - (కథలు*డయాస్పోరా కథానికలు* లేఖా సాహిత్యం) - కథా సంపుటిలు.

వేదిక, ఎగిరే పావురమా, నాట్యభారతీయం (నవలలు) ఇప్పటివరకు పుస్తక రూపంగా 'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' ప్రచురణలుగా వెలువడ్డాయి. ఉమ రాసిన ధారావాహికలు, కథానికలు, కవితలు, నృత్యనాటికలు ప్రముఖ పత్రికల్లోను, పలు అంతర్జాల  పత్రికల్లోను ప్రచురించబడ్డాయి.

తాజాగా..డా. అక్కినేని నాగేశ్వరావు శతజయంతి సందర్భంగా.. సిరికోన - జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక నవలా రచన పోటీలో .. ఉమాభారతి రచన ‘హృదయగానం – నేడే విడుదల’ ఉత్తమ రచన అవార్డుని అందుకుంది.

ఇతర వ్యాపకాలు, కార్యక్రమాలు:

శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ ఛారిటీ సంస్థ స్థాపించి యేటా కధా - పద్య - కార్టూన్ ల పోటీలు నిర్వహిస్తూ, సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఉమాభారతి.

1982 లో అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ స్థాపించి ప్రవాసాంధ్రుల భావితరాలకి నృత్య శిక్షణనిస్తున్నారు.

ఉమాభారతి కుటుంబం:

మేజర్ సత్యనారాయణ, శ్రీమతి శారద: తల్లితండ్రులు, కోసూరి మురళి మోహన్ – భర్త, సత్యజిత్, శిల్ప- సంతానం.
కీ. శే. పద్మశ్రీ వెంపటి చిన్నసత్యం, కీ. శే. కళాప్రపూర్ణ వేదాంతం జగన్నాధ శర్మ –కూచిపూడి గురువులు.
కీ. శే. పద్మశ్రీ  ఫకీరుస్వామి పిళ్ళై,  కళైమామణి శ్రీ. టి.ఆర్. రాధాకృష్ణన్ – భరతనాట్యం గురువులు.

హృదయగానం నవల రచన వెనుక ప్రేరణలు..

ఓ జీవికి సహజంగా సంక్రమించే గుణగణాలు, సామర్ధ్యత, నేర్పు వంటివి ఆ జీవికే సొంతం. పువ్వు వికసించి పరిమళించాలన్నా, మనిషి ఎదిగి సమర్ధవంతంగా జీవించాలన్నా.. సానుకూలత ఎంతైనా అవసరం. సహకారం అందించి, సానుకూలత కల్పిస్తే.. పారలేని యేరు సెలయేరు కాగలదు. కదలిక ఎరుగని కొత్త లేడి పిల్ల లేచి పరుగులు తీయనూ కలదు.

ఒక్కోమారు రాళ్ళని చీల్చుకుని కూడా వికశించగల అపురూపమైన పుష్పం లాగా.. ప్రతికూల పరిస్థితులని సైతం అధిగమించి ఎందరో తామెంచుకున్న మార్గాల్లో రాణించి స్పూర్తిదాయకులు అవ్వగలరు.

ఆ వాస్తవాన్ని ఆధారంగా తీసుకుని రాసిన కథనమే ‘హృదయగానం’. సంగీత విధ్వాంసుల కుటుంబంలో జన్మించిన అమ్మాయి .. ఐదేళ్ల వరకు అమ్మ, అత్త అని కూడా పలుకలేని పరిస్థితి నుండి.. కృషితో, పట్టుదలతో, పెద్దవాళ్ళ సహకారాలతో ప్రఖ్యాత సంగీతకారిణిగా ఎదిగిన వైనమే ఇందులోని ఇతివృత్తం.

అలాగే తల్లితండ్రుల ఆశయాలని, ఆశలను తనవిగా సొంతం చేసుకుని జీవితంలో ముందుకు సాగడంలో తృప్తి, ఆనందం ఉంటాయని కూడా నాయకి తత్వంగా రాసినదే ఈ నవల.

నా మాట:

క్రమబద్దమైన జీవితాన్ని జీవించిన ఓ సామాన్య ఆడపిల్ల పరమేశ్వరి కధనం
ఆమె పథం “జన్మ సార్ధకత - జన్మ సాధికారికత”
శాస్త్రీయ సంగీత గాత్ర విద్వాంసుల కుటుంబంలో జన్మించిన పరమేశ్వరి...
ఐదేళ్ళు నిండినా గళం విప్పి పలుకలేని పసిది
ప్రతికూల వాతావరణంలోనూ వికసించే అరుదైన పుష్పం లాంటిదే ఆ చిన్నారి..
**
అయితే, ఆమె హృదయం చేసే గానం శ్రీరాగం లా గంభీరమైనది...
హృదయగానం ప్రేమ మధురిమలని కురిపిస్తుంది. మార్ధవంగా కారుణ్య రసం చిలికిస్తుంది.
సహన రాగం ఆలపిస్తుంది, విలపిస్తుంది, పరితపిస్తుంది కూడా.
అన్ని భావాలని సమపాళ్ళలో ఆస్వాదిస్తూ రాగాలాపన చేస్తుంది.
ఆమె సంగీత జీవన ప్రస్థానంలోనూ ఎన్నెన్నో మలుపులు... వింతలు, విశేషాలు, అద్భుతాలు.

ఇక నవలను మొదలు పెడతాను. చదివి మీ అభిప్రాయాలతో ఆశీర్వదించ మనవి – మీ ఉమా భారతి

Posted in December 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!