Menu Close
VSRao
అశోక మౌర్య
డా. వల్లూరుపల్లి శివాజీరావు

అశోకుడి వారసులు

క్రీ.పూ. 232 లో అశోకుడు పరలోక ప్రయాణం చేసిన తరువాత ఆయన రాజ వంశీయులు కొన్ని దశాబ్దాల పాటు మౌర్య రాజ్యాన్ని పరిపాలించారు. వీరిలో ఏ ఒక్కరూ ప్రజలకు శిలాశాసనాలు ఏర్పాటుచేయలేదు. ఇతర దేశాలనుంచి రాయబారులు, చరిత్రకారులు భారతావనిని, ముఖ్యంగా మౌర్య రాజుని దర్శించ లేదు. ఆయన తరువాత మౌర్యసామ్రాజ్యాన్ని పాలించిన వారి గురించి చరిత్రకారులలో ఏకాభిప్రాయం లేదు.

మొదటి ముగ్గురు మౌర్య రాజులు (చంద్రగుప్త, బిందుసార, అశోక) 85 ఏళ్ళు పరిపాలించగా, అశోకుడి తరువాత వచ్చిన ఆరుగురు రాజులు కేవలం 52 ఏళ్ళు (క్రీ.పూ. 232-180) మాత్రమే పరిపాలించ గలిగారు. వీరిలో అధికులు కేవలం పేరుకు మాత్రమే రాజులుగా చెలామణి అయ్యారు. వీరిని గురించి ఇప్పుడు తెలుసుకుందాము.

దశరథ మౌర్య (పాలన: క్రీ.పూ. 232-224)

అశోకుడి మరణం తరువాత మౌర్య సింహాసనంకోసం చాలా ఘర్షణలు జరిగాయి. యదార్ధానికి అశోకుడి ప్రియ పుత్రుడు ‘కునాల’ (Kunala; తల్లి పద్మావతి; అశోకుడి మూడవ రాణి)కు మౌర్య సింహాసనం దక్క వలసి ఉన్నది. కాని క్రీ.పూ. 263 లో జన్మించిన 31ఏళ్ల కునాల మారుటి తల్లి ‘తిష్యరక్షిత'’ (అశోకుడి చివరి భార్య) కుటిలాలోచనవల్ల చూపును కోల్పోవటం జరిగింది. {వివరాలకు ‘సిరిమల్లె’ మే 2024 లో ప్రచురితమైన వ్యాసం చదవండి}. దైవ కృపవల్ల కొంత చూపు తిరిగివచ్చినా పూర్తి చూపులేనందువల్ల రాజ్యాధికారం కోల్పోవలసి వచ్చింది. ఈ కారణంగానూ, మరో ఇతర కారణాలవల్లనూ అశోకుడి మనుమడు ‘దశరధ’ మౌర్య సింహాసనం క్రీ.పూ. 232 లో అధిష్టించటం జరిగింది.

ఈయన సింహాసనం ఎక్కిన వెంటనే బలమైన సామంత రాజులు, సైనికాధికారులు బలహీనుడైన దశరధను లెక్కచేయక స్వతంత్రత ప్రకటించి అశోకుడి అధీనంలో ఉన్న అనేక ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి గల రాజులయ్యారు.

దశరథ మేనమామలలో ఒకరైన ‘జలుక’ (Jaluka) కాశ్మీర ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని దానికి స్వతంత్ర రాజు అయ్యాడు. ఒక మౌర్య రాజకుమారుడు ‘వీరసేన’ గాంధార ప్రాంతానికి స్వతంత్ర రాజుగా పరిపాలన సాగించాడు. వీరసేన తరువాత అయన బంధువు ‘సుభగసేన’ (Subhagasena) వాయువ్య (North-Western) దిశలో ఉన్న ప్రాంతం అంతటిని స్వాధీనం చేసుకుని స్వతంత్ర రాజుగా పేరొందాడు. మరొక దశరధ బంధువు ‘విదర్భ’ ను విడగొట్టి పరిపాలించాడు.

అశోకుడికి సామంత రాజు ‘శ్రీముఖ’ స్వాతంత్రం ప్రకటించి తూర్పు-పడమర ప్రాంతంలో కొంత భాగాన్ని విడగొట్టి పడమర వైపు ప్రాంతాన్ని పరిపాలించాడు. ఆంధ్రుడైన ఈ శ్రీముఖ క్రీ.పూ. 235 లో శాతవాహన సామ్రాజ్యం స్థాపించి అశోకుడికి సామంత రాజుగా పశ్చిమ-దక్షిణ భారతావనిని పరిపాలించాడు. అశోకుడి మరణం తరువాత ఈయన క్రీ.పూ. 230 లో స్వతంత్రం ప్రకటించి దశరధను ఎదిరించి ఈ ప్రాంతానికి స్వతంత్ర రాజు అవటం జరిగింది. ఈ ఆంధ్ర-శాతవాహన సామ్రాజ్యంలో మొదట 30 పట్టణాలు, అనేక గ్రామాలు ఉన్నాయి. సైన్యంలో ఒక లక్ష కాల్బలం, 2,000 అశ్వ దళం, 1,000 గజ దళం ఉన్నాయి. ప్రారంభంలో అశోకుడు ఉన్నప్పుడే శ్రీముఖ కృష్ణానదీ తీరాన ఉన్న ‘శ్రీ కాకుళం’ (విజయవాడ కు 45 కి.మీ. దూరం) శాతవాహన రాజ్యానికి రాజధానిగా చేసుకోవటం జరిగింది.

దశరధను ఎదిరించి స్వతంత్ర రాజు అయిన తరువాత శ్రీముఖ గుంటూరు జిల్లాలో ఉన్న ‘ధాన్యకటక’ (Dhanyakataka; అదే ఇప్పటి అమరావతి ప్రక్కన ఉన్న ‘ధరణికోట’) ను రాజధానికి చేసుకోవటం జరిగింది. ఆంధ్ర ప్రాంతమేగాక సౌరాష్ట్ర, మహారాష్ట్ర కూడా శాతవాహన రాజ్యంలో కలిసిపోయింది. ఈ క్రమంలో, శ్రీముఖి తరువాత వచ్చిన శాతవాహన రాజులు మహారాష్ట్రలో ఉన్న ‘ప్రతిష్టాన పుర’ (ఇప్పటి ‘పైథాన్’) ను రాజధానిగా చేసుకోవటం జరిగింది.

అలాగే దశరధ పాలనలోనే దక్షిణాన మైసూరు ప్రాంతమంతా కూడా విడిపోయి స్వతంత్ర రాజ్యంగా మారింది.

దశరధుడి 8 ఏళ్ల పాలనలో మౌర్య సామ్రాజ్య ప్రతిభ, విస్తీర్ణం క్షిణించటం ప్రారంభం అయినా పితామహుడి ఒరవడిలోనే కొన్ని శిలాశాసనాలు జారీచేయటం జరిగింది. అశోకుడి వలె బౌద్ధ ధర్మం అనుసరించే దశరధ కూడా తన పేరుకు ముందు ‘దేవనామప్రియ’ (దేవనామప్రియ దశరధ) అనే బిరుదును జతపరచటం జరిగింది.

దశరధడు ‘నాగార్జుని గుహలలో’ ఉన్న మూడు గుహలను వర్షాకాలంలో ‘అజీవిక’ల ఆశ్రయం నిమిత్తం క్రీ.పూ. 230 లో అంకితం చేశాడు. ప్రాచీన ‘నాగార్జుని కొండ’ దగ్గర అశోకుడు నిర్మించిన ‘బారా బర్’ (Barabar Caves) గుహల సముదాయంలో ఉన్న ‘గోపిక’ (Gopika), ‘వడతిక’ (Vadathika), ‘వహి యక’ (Vahiyaka) గుహలను ‘నాగార్జుని గుహలు’ అని అంటారు. ఈ బారాబర్ గుహలు బీహార్ లోని ‘గయ’ కు 24 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఈ ‘నాగార్జుని గుహల’ విషయం గురించి అయన సింహాసనం అధిష్టించిన తరువాత కొద్ది కాలానికే తన బిరుదు ‘దేవనామప్రియ’ పేరున ఒక శాసనం చేయటం జరిగింది. ఈ మూడు నాగార్జుని గుహల లోపలి గోడలు ‘గ్రనైట్’ (granite) శిలాసముదాయం తో అశోకుడి కాలంలో చూపిన ‘మౌర్య నగిషీ’ పనితనంతో నిర్మించబడ్డాయి.

“సూర్య చంద్రులు భాసిల్లినంత కాలం చెడిపోకుండా నిలిచియుండే ఈ ‘గోపిక’ గుహను ‘దేవ నామప్రియ దశరధ’ నిర్మించి దానిని అజీవికలకు పర్ణశాలగా ఉపయోగపడటానికి నేను సింహాసనం అధిష్ఠించినందుకు బహుకరించాను” అని ఈ గుహ గోడమీద చెక్కబడింది. ఇటువంటి శాసనాలు ‘వడతిక’, ‘వహియక’ గుహల గోడల మీద కూడా చేయటం జరిగింది.

దశరధుడు తరువాత ‘అజీవిక’ అనే పదం మౌర్య శిలాశాసనాలనుంచి తీసివేయటం గాని, చెరపటం గాని, రూపు చెడగొట్టటం గాని జరిగింది. దీనికి ముఖ్య కారణం అజీవికలకు బదులు ఇతర మతాల వారు ఈ గుహలను స్వాధీనం చేసుకోవటమే. మౌర్య రాజుల తరువాత ఉత్తర భారతావనిలో వచ్చిన ‘శుంగ’ (Shunga), ‘కుషాణ’ (Kushana), ‘గుప్త’ (Gupta) రాజుల వద్ద అజీవికలకు ప్రాపకం, పోష కత్వం లభించలేదు.

అశోకుడి సామ్రాజ్య విస్తీర్ణంలో కేవలం నాలుగోవంతు మాత్రమే పరిపాలించిన ఈ నాలుగవ మౌర్య రాజు క్రీ.పూ. 224 లో, సింహాసనం ఎక్కిన తరువాత 8 ఏళ్లకు మరణించటం జరిగింది.

సంప్రతి (Samprati: పాలన: క్రీ.పూ. 224-215)

‘సంప్రతి’ అశోకుడి అత్యంత ఇష్టమైన కుమారుడైన ‘కునాల’ పుత్రుడు. ఈ 5 వ మౌర్య రాజు జన్మతః జైన మతస్థుడు. ఈతని నాయనమ్మ ‘పద్మావతి’ (కునాల తల్లి; అశోకుడి భార్య) పిన్న వయస్సులోనే మరణించినందువల్ల ఉజ్జయినిలో జన్మించిన కునాల అచ్చటే పెరిగాడు. సంప్రత తల్లి ‘కాంచనమాల’ (కునాల భార్య) కూడా పిన్నవయస్సులోనే మరణించినందువల్ల ఈ బాలుడు సంప్రతి ఒక దాసి సంరక్ష ణలో ఉజ్జయిని లోనే పెరిగి పెద్దవాడయ్యాడు. అశోకుడి మరణం ముందు మౌర్య సింహాసనం కొరకు కునాల, సంప్రతి ఆయనతో చర్చలు జరిపారు. “కునాల దృష్టి లోపం వల్ల అనర్హుడు; సంప్రతి కంటే వయస్సులో పెద్దవాడైన మరో మనుమడు దశరధ రాజు అవటానికి అర్హుడు; ఇతని తరువాత సింహాసనం సంప్రతి అధిష్టించగలడు” అని అశోకుడు నిర్ణయించాడు. యదార్ధానికి సంప్రతి అశోకుడు జీవించి ఉన్నప్పుడే ఉజ్జయినిలో పరిపాలన బాధ్యతలు సమర్ధవంతంగా చాకచక్యంతో నిర్వహించి అచ్చటి ప్రజల మన్ననలతో పాటు, పితామహుడి మన్ననలు కూడా పొందాడు. ఈ ఒప్పందం ప్రకారం దశరధకు ఉత్తరాధికారి సంప్రతి అవటం జరిగింది.

అశోకుడు తరువాత మౌర్య సింహాసనం అధిష్టించిన వారిలో సంప్రతి అతి ముఖ్యుడు. ఒక జైనమత మూలగ్రంధం ప్రకారం సంప్రతి తన సామ్రాజ్యాన్ని పాటలీపుత్ర, ఉజ్జయిని నుంచి పరిపాలించాడు. దశరధ కాలంలో పోగొట్టుకున్న సౌరాష్ట్ర, మహారాష్ట్ర, ఆంధ్ర, మైసూరు ప్రాంతాలలోని కొంత భాగాన్ని రెండవ శాతవాహన రాజు ‘కన్హ/కృష్ణ’ (Kanha/Krishna) ను ఓడించి సంప్రతి స్వాధీనం చేసుకోవటం జరిగింది. వీటికోసం జరిగిన యుద్ధాలలో ఈయన సైనికులను జైన సన్యాసులుగా వేషాలు మార్చి శత్రు సైనికులను అంతమొందించాడు.

బాలుడుగా ఉన్నప్పుడే సంప్రతికి జైన ఆచార్య ‘సుహస్తిసురి’ (Suhastisuri) జైన సూత్రాలు, వాటి వివరములు బోధించి తద్వారా ఈ మౌర్య మహారాజుని బౌద్ధధర్మం వదిలి జైన ధర్మాన్ని స్వీకరించేటట్లు చేశాడు. ఈ మార్పిడి తరువాత సంప్రతి జైన పండితులను పంపి జైన ధర్మాన్ని భారత దేశంలో పాటు ఇతర దేశాలలో కూడా వ్యాప్తి చేశాడు. ఈయన కృషి వల్ల జైన సన్యాసులు అనాగరికులు, కిరాతకుల నివాసప్రాంతాలకు కూడా వెళ్లి అనేక జైన దేవాలయాలను పునఃనిర్మించి వాటిల్లో లక్షలాది విగ్రహాలను స్థాపించటం జరిగింది.

ఆయన నిర్మించిన జైన దేవాలయాలు ఈ రోజుకూ గుజరాత్ లోని ‘వీరంగాం’ (Viramgam; విరా గ్రామం), ‘పలితాన’ (Palitana), మరియు మధ్య ప్రదేశ్ లోని ‘అగర్’ (Agar-Malwa జిల్లా) లోను ఉన్నాయి. అశోకుడు బౌద్ధ ధర్మ ప్యాప్తికి, విస్తరణకు ఎనలేని కృషి చేస్తే, ఆయన మనుమడు సంప్రతి జైన ధర్మానికి చేసిన కృషికి ఆయన ‘జైన అశోక’ (Jain Ashoka) గా పేరు గాంచాడు. సంప్రతి జీవిత చరిత్ర జైన గ్రంధాలలో (సంప్రతి కథ, పరిశిష్టపర్వ, ప్రభావకచరిత్ర) నిక్షిప్తమైనాయి. శాంతి ప్రియుడైన సంప్రతి మహారాజు 9 ఏళ్ళు పరిపాలించి క్రీ.పూ. 215 లో పరలోకగతుడవటం జరిగింది. ఆయన సంతాన రహితుడు.

శాలిశుక మౌర్య (పాలన: క్రీ.పూ. 215 -202)

క్రీ.పూ. 215 లో గద్దెనెక్కిన ఈ ఆరవ మౌర్య రాజు పూర్వోత్తరాలు తెలియవు. సంప్రతితో ఇతనికి ఎటువంటి బంధం ఉన్నదో తెలియదు. కాని అతను తప్పనిసరిగా మౌర్య వంశానికి చెందిన వ్యక్తి అయి ఉంటాడు. ఈ శాలిశుక మౌర్య అధర్మవర్తనుడు, జగడగొండి, కలహభోజనుడు. ఈయన పాలనలో ప్రజలను అకారణంగా హింసించటం జరిగింది. కౄరుడుగా పేరుగాంచిన శాలిశుక 13 ఏళ్ళు పరిపా లించి క్రీ.పూ. 202 లో మరణించాడు.

దేవవర్మ (పాలన: క్రీ.పూ. 202–195)

ఏడవ మౌర్య రాజుగా క్రీ.పూ. 202 లో మౌర్య సింహాసనం అధిష్ఠించిన దేవవర్మ శాలిశుక మౌర్య వలె కౄరుడుకాదు, అధర్మవర్తనుడు కాదు. కాని ఈ అతి బలహీన అసమర్ధ, అనాసక్తుడైన రాజు. తన పాలనలో రాజ్యంలో చాలా భాగం పోగొట్టుకున్నందువల్ల పరిపాలన కేవలం పాటలీపుత్ర (పుష్ప పుర) కే పరిమితమైంది. కేవలం 7 ఏళ్ళు రాజుగా ఉన్న ఈ దేవవర్మ క్రీ.పూ. 195 లో పరలోకగతుడయ్యాడు.

శతధనుస్ (శతధనవన్; పాలన: క్రీ.పూ. 195-187)

శతధనుస్ మౌర్య గురించిన వివరాలు తెలియవు అయన కూడా ఒక బలహీనమయిన రాజుగా పేరొందాడు. ఎనిమిది ఏళ్ళు పాలించిన తరువాత క్రీ.పూ. 187లో మరణించిన తరువాత మౌర్య సింహాసనం ఆయన పుత్రుడు బృహద్రధ పరమయింది.

బృహద్రధ (పాలన: క్రీ.పూ. 187-180)

బృహద్రథ కూడా అతి బలహీనమైన రాజు. అయన Greco-Bactrian (మధ్య ఆసియాలో ఆఫ్ఘనిస్తాన్ పైన ఉన్న ప్రదేశం) రాజు Demetrius I కుమార్తె Berenisa (పాలీ: సువర్ణాక్షి) ని వివాహం చేసుకోవటం జరిగింది. ఈ వైవాహికబంధం వల్ల ఈ మౌర్య రాజు ఏ మాత్రం బలపడలేదు. ఈ బలహీనతను అవకాశంగా తీసుకుని ఆయన సైన్యాధ్యక్షుడు ‘పుష్యమిత్ర శృంగ’ ఈ మౌర్య రాజును హతమార్చాడు.

మౌర్య రాజ్యంలో భాగమైన ‘విదిష’ (Vidisha: ఇప్పటి మధ్య ప్రదేశ్ లో ఉన్న విదిష నగరం) కు పుష్యమిత్ర శృంగ సామంతరాజు. బృహద్రథ మౌర్య సింహాసనం అధిష్టించిన తరువాత పుష్యమిత్రను పాటలీపుత్రకు బదిలీ చేసి అతనిని సేనాపతిని చేయటం జరిగింది. ఈ మార్పే బృహద్రథకు ప్రాణాంతకమైంది, మౌర్య సామ్రాజ్యం అంతానికి కారణమైంది.

క్రీ.పూ. 180 లో ఒక రోజు బృహద్రథ సమక్షంలో సైన్యాధక్షుడి ఆధ్వర్యంలో సైన్యం కవాతు కవాతు నిర్వహిస్తున్నప్పుడు పుష్యమిత్ర శృంగ తిన్నగా బృహద్రథ మీదకు వెళ్లి ఆయనను సంహరించి మౌర్య రాజుల పరంపరను అంతం జేయటం జరిగింది. వెంటనే పుష్యమిత్ర పాటలీపుత్ర సింహాసనం అధి ష్టించి ‘శృంగ’' సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు.

ముగింపు

వృత్తిరీత్యా ఆచార్యుడు, మహామంత్రి అయిన ‘చాణక్యుడి’ ప్రోద్బలంతో, సహకారంతో క్రీ.పూ. 321 లో చంద్రగుప్త స్థాపించిన మౌర్య సామ్రాజ్యం 141 ఏళ్ళు వర్ధిల్లి (137 ఏళ్ళు పాలన, మధ్యలో 4 ఏళ్ల పాటు బిందుసార మరణం తరువాత సింహాసనం కొరకు జరిగిన అంత:కలహాలు) చివరకు బృహద్రథ మరణంతో అంతమయింది.

ఈ 9 మంది మౌర్య రాజులలో ఈ రోజుకూ ఘన కీర్తి పొందిన వారు చంద్రగుప్త, అశోకుడు మాత్రమే. నిజానికి చాణక్య సహకారం లేనిదే మౌర్య రాజ్య స్థాపన చంద్రగుప్తకు సాధ్యమయేదికాదు. ఈమహాశయుడి అర్ధ శాస్త్రం, నీతి శాస్త్రం ఈ రోజుకూ వీటిని అనుసరించే పాలకులకు, ప్రజలకు మార్గదర్శకాలే.

అలాగే 36 ఏళ్ళ సుదీర్ఘపాలన చేసిన అశోకుడు క్రీ.పూ. 232 లో పరలోక గతుడయినప్పటి నుంచి ఈ రోజుకూ, 2,200 ఏళ్ల తరువాత కూడా, ఆయన ఘన చరిత్ర భారత ప్రజలలో సజీవంగా మెదులుతూనే ఉంది. అనేక తరాల ప్రజలను ఇంతగా ఆకట్టుకున్న భారతావని మహారాజు ఎవరు లేరంటే అతి శయోక్తి కాదు. ఆయన నిర్మించిన స్థూపాలు, విగ్రహాలు, శాసనాలు చాలా వరకు ఈనాటికీ సజీవంగానే ఉన్నాయి. ప్రాధమిక, ఉన్నత పాఠశాలలో “అశోకుడు రహదారులకు రెండువైపులా చెట్లు నాటించెను” అనే విషయం ప్రతి విద్యార్థి తెలుసుకోవటం జరిగింది. ఈ చెట్లు శబ్ధ కాలుష్యం తగ్గిస్తుందని ఆనాడే అశోకుడు గ్రహించినట్లు తెలుస్తుంది. తరువాత వచ్చిన ఏ రాజు నుంచి ఇటువంటి విషయాలు విద్యార్థులు తెలుసుకోలేదంటే అతిశయోక్తి కాదు.

బౌద్ధ ధర్మ నిర్మాత ‘గౌతమ బుద్ధ’ తరువాత అత్యంత ప్రసిద్ధి పొందిన మహామనీషి అశోకుడే! ఈయన కృషి వలనే బౌద్ధ ధర్మం సనాతన ధర్మంలో ఒక ప్రముఖ భాగమైంది. తరువాతి కాలంలో అనేక బౌద్ధ ధర్మాచార్యుల ప్రభావంతో బౌద్ధ ధర్మం సనాతన ధర్మం నుంచి వేరువడి ప్రపంచంలో ఒక ప్రముఖ మతంగా ప్రసిద్ధి పొందింది. ఈ పరిణామానికి విత్తనం నాటింది అశోకుడే!

అయన సత్కృత్యాలు అనేకమంది భారతీయులకు జీవన ప్రమాణాలుగా, దేశ చిహ్నాలుగా (ఉదాహరణకు: అశోక చక్రం) ప్రసిద్ధికెక్కాయి. ఆయనలాంటి మహామనీషి ఈ 2,200 ఏళ్లలో మరల జన్మించలేదంటే అది నిస్సందేహంగా అతిశయోక్తి కాదు. అవునా?

****సమాప్తం****

గత రెండు సంవత్సరాలనుంచి ‘అశోక మౌర్య’ శీర్షిక తో 24 వ్యాసాలు వ్రాయటం జరిగింది. వీటికి ముగింపు పలుకుతూ జనవరి 2025 నుంచి మరొక ముఖ్యమయిన విషయం మీద నా వ్యాసాలు ‘సిరిమల్లె’ పత్రికలో ప్రచురితమవుతాయి.

Posted in December 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!