ఎన్నికలు
అమెరికాలో ఈ సంవత్సరం నవంబరు 5 న ఎన్నికలు జరిగాయి. ప్రపంచంలో అమెరికాకు వున్న స్థానాన్ని బట్టి ఆ ఎన్నికలు ఒక్క అమెరికాలో మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తంలోనే అత్యధిక ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడి పదవి ఎవరి చేజిక్కుతుంది అని అన్ని దేశాలు ఆతురతతో ఎదురు చూసాయి. ఈ ఎన్నికలు కాదు కానీ ప్రపంచం మొత్తం అంతా అమెరికా ఎన్నికలకి సంబంధించిన హడావిడిలో మునిగిపోయింది.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలన్నవి చాలా ముఖ్యమైనవి. అసలు ప్రజాస్వామ్యానికున్న ఒక ముఖ్య లక్షణమే ఈ ఎన్నికలు. దేశాన్ని ఏలే బాధ్యతని ఏ వంశపారంపర్యంగానో లేక ఏ అధికారం, బలం వల్లనో, లేక ఏ దోపిడీ, ద్రోహాల వల్లనో కాకుండా కేవలం ప్రజల ఇష్టాయిష్టాలమీద ఆధారపడి ఒక సమూహానికి అప్పచెప్తాయి. ఆ సమూహాన్ని మనం రాజకీయ భాషలో ఒక రాజకీయ పార్టీ అని అంటాము. ఆ పార్టీ నాయకుడే ఆ దేశానికి అధ్యక్షుడు. అతన్ని ఎన్నుకోవడానికి ఆప్రజలందరికి హక్కు వుంటుంది. దేశ విస్తీరణలో కాకపోయినా జనాభా లెక్కన చూస్తే ప్రపంచం మొత్తం మీద అత్యంత పెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశానిది. కానీ ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యం అమెరికాది. అయితే ఈ ప్రజాస్వామ్యంలో కూడా మళ్ళీ తేడా వుంది, భారతదేశానిది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. అంటే అక్కడ పార్లమెంటు, ప్రధానమంత్రి ప్రజాపాలనలో ముఖ్య పాత్రని వహిస్తారు. అమెరికాదేమో ప్రెసిడెన్షియల్ ప్రజాస్వామ్యం. అంటే అమెరికాలో ప్రెసిడెంటు, అంటే అధ్యక్షుడు, సెనేటు, కాంగ్రెసు ప్రజాపాలనలో ముఖ్య పాత్రని వహిస్తారు. అందుకే అమెరికాలో ఎన్నికలంటే ఎవరు ప్రెసిడెంటు అవుతారో అని మొత్తం ప్రపంచం అంతా ఎదురుచూసింది.
ప్రజాస్వామ్యం ఏ తరహాకి చెందినదైనా దాంట్లో ప్రజల బాధ్యత ఎంతైనా వుంటుంది. ఎందుకంటే ఏ పార్టీకైనా, ఏ వ్యక్తికైనా పదవిని, అధికారాన్ని ఇచ్చేది ఆ ప్రజలే కదా! అందుకు ఎన్నికలే సాధనం. అందుకే ఎన్నికలంటే ప్రజలందరికీ చాలా బాధ్యతన్నమాట. మంచి అర్హతలు, శక్తిసామర్థ్యాలు వున్నవారిని మాత్రమే ఎన్నుకుని వారికి అధికారాన్ని అప్పచెప్పే బాధ్యత. ఈ బాధ్యతని సరిగ్గా నిర్వర్తించడానికి, అంటే, సరైన నాయకులను ఎన్నుకోవడానికి సాధారణంగా అందరూ రెండు రకాలైన పద్ధతులను ఎన్నుకుంటారు. అంతర్గతం మరియు బాహ్యం. అసలు ఎన్నికల హడావిడి మొదలు కాకమునుపే చాలామంది మనసులలో ఆ అభ్యర్థుల గురించి కొన్ని అభిప్రాయాలు వుంటాయి. ఇంక ఎన్నికల హడావిడి మొదలైన కొద్దీ ఆ అభ్యర్థుల ప్రసంగాలు, వారి ప్రవర్తనలని బట్టి వారి అభిప్రాయాలు ఇంకా బలమవుతాయి లేదా మారిపోతాయి. ఇది అంతర్గతంగా ఎన్నుకునే పధ్ధతి.
ఇంక బాహ్య పద్ధతులకు వస్తే, ప్రజలు ఎన్నికల అభ్యర్థుల ప్రవర్తనని బాగా గమనిస్తూ వుంటారు. వాళ్ళు ఎలాంటి ప్రసంగాలు ఇస్తున్నారు, వారి పాలసీలు ఎలా వున్నాయి, వారు ఎలాంటి మార్పులు తీసుకొస్తామంటున్నారు, వారి చుట్టూ ఎలాంటివారు వున్నారు, వారి ప్రవర్తన ఎలాగుంది, ఇవన్నీ బాగా గమనిస్తూవుంటారు. వాటితో పాటు చుట్టుపక్క దేశాల్లో ఏమవుతోంది, వాటి ప్రభావం ఆ అభ్యర్థుల మీద ఎలా పడుతోంది, వాటన్నిటికీ వారెలా రియాక్ట్ అవుతున్నారు, ఒకవేళ ఏ దేశంలో అయినా యుద్ధాలు అవి జరుగుతోంటే వాటి పట్ల ఆ అభ్యర్థుల రియాక్షన్ ఎలా వుంది, ఇలాంటివన్నీ ప్రజలు వెయ్యి కళ్ళతో, వెయ్యి చెవులతో గమనిస్తూవుంటారు. దాన్నిబట్టి వారి ఎన్నికని వారు చేసుకుంటారు. అలాగే ఆ అభ్యర్థుల గురించి వారికి తెలిసిన వివరాలు, గుణగణాలన్నింటినీ గుర్తు చేసుకుంటారు. ఒకవేళ వారు అప్పటికే పదవిలో వుంటే అప్పటిదాకా వారు ఏమేమి సాధించారో అవన్నీ వారి అపజయాలతో పాటుగా గుర్తు చేసుకుంటారు. వారి రాజకీయానుభవాన్ని, రాజకీయ నైపుణ్యాన్ని గుర్తు చేసుకుంటారు. ఇది సాంఘిక మాధ్యమాల యుగం కాబట్టి ఆ సామాజిక మాధ్యమాలలో వారికి ఏపాటి పేరు వుందో తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా వారి ఎన్నికని ప్రభావితం చేస్తాయి. ఇంకో విషయం. పెద్దవారు, పేరున్నవారెవరైనా వారిని సమర్థిస్తే, అంటే endorse చేస్తే, దాని విలువ కూడా చాలా వుంటుంది.అంతేకాదు, అనేక రకాలైన బృందాలు, అంటే రకరకాలైన ధార్మిక, సాంఘిక, సాంస్కృతిక సముదాయాలతో వారికి ఎటువంటి సంబంధబాంధవ్యాలు వున్నాయి అని కూడా ప్రజలు చాలా ఆలోచిస్తారు. అప్పుడప్పుడు అభ్యర్థులకి సంబంధించినవారు తమవారిని సమర్థిస్తూ ప్రజల దగ్గరకి వచ్చి వారిని ఒప్పించటానికి ప్రయత్నిస్తూ వుంటారు. ఈ ప్రయత్నాలలో వారు ఎంతవరకు కృతకృత్యులయ్యారో ప్రజల రియాక్షన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే అలాంటి ప్రయత్నాలు ఎల్లప్పుడూ విజయవంతమవుతాయని గారంటీ లేదు. ఒకొక్కసారి బెడిసికొట్టచ్చు కూడా!
మీకు ఇంకో విషయం చెప్తాను, వినటానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. నా స్నేహితురాలు ఒకమ్మాయి వుంది. ఎన్నికలలో ఎవరికీ ఓటు వెయ్యాలో ఆమె నిర్ణయించుకునే పధ్ధతి విని నేను చాలా ఆశ్చర్యపోయాను. అది ఏమిటంటే, ఆమె మొట్టమొదటగా ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరి ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు లెక్క వేస్తుందిట. ఆ తర్వాత ప్రతి అభ్యర్థికి ప్లస్ లోంచి మైనస్ నంబరు తీసివేసి ఆ వచ్చిన స్కోరును అందరి విషయంలోనూ పోల్చి చూస్తుందట. చివరికి ఎవరికి ఎక్కువ స్కోరు వస్తుందో వారికి తన ఓటు వేస్తుందిట. ఈ పధ్ధతిలో తప్పేమీ లేదేమో, కానీ నాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఎందుకంటే నేనెప్పుడూ అలా చేయలేదు. ఏదో, నాకెప్పుడూ నా పాటలు, నా రాతలు తప్ప ఇలాంటి లెక్కల మీద ధ్యాస ఎప్పుడూ పోలేదు సుమా! అందుకే కొంచెం కొత్తగా, కొంత వింతగా కూడా అనిపించి మీకు చెప్తున్నాను.
నేను ఇక్కడ ఇంకోవిషయం చెప్పదలచుకున్నాను. మానవసహజంగా చాలామంది భావోద్వేగంగా వుంటారు. వారి మానసిక భావాలకి, చిన్నదైనా సరే, ఏదైనా దెబ్బ తాకితే వారు సహించలేరు. అందుకే నేతలు, నేతలవక ముందు, అయిన తర్వాత కూడా, ప్రజల మనసులతో, వారి సున్నిత మానసిక భావాలతో ఎప్పుడూ ఆటలాడకూడదు. ప్రజలకి ఎప్పుడూ కూడా వారి ఆర్ధిక పరిస్థితి, వారి కుటుంబ సౌఖ్యం చాలా ముఖ్యం. వాటికి ఏమాత్రం దెబ్బ తగిలినా వారు ఎంతమాత్రమూ సహించలేరు. దానికి కారణమైనవారిని ఏమాత్రమూ క్షమించలేరు. నేతలవ్వారనుకునేవారు, అయినవారు కూడా ఈ విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి. ప్రజల మనసులను దోచుకోవాలి, ఎన్నికలలో గెలవాలి అంటే ఈ విషయాన్ని మరువకూడదు సుమా!
సరే, నేతలను ఎన్నుకునేటప్పుడు ప్రజలు ఎలా ఆలోచిస్తారు అన్నది ఇప్పుడు కొంచెం తెలుసుకున్నాం. ఇంక ఎన్నికలప్పుడు వారి మనఃస్థితి ఎలా వుంటుందో కూడా కాస్త చెప్పుకుందాం. అయ్యో, ఏం చెప్పమంటారు? ఈ ఎన్నికలన్నవి లేకపోతె ప్రజలకిష్టమైనవారికి పదవి లభించదు, నిజమే! కానీ అసలు ఆ ఎన్నికల కాలంలో వారికి సమయం ఎలా గడుస్తుందో ఆ భగవంతుడికే తెలియాలి. ఎన్నికలల ముందు వారి సభలు, వారి ప్రసంగాలు, వారి వాగ్దానాలు, ఎదుట వున్న ప్రత్యర్దులపై వారు చేసే నిందారోపణలు, వీటన్నిటితోను అసలే అలసిపోయిన ప్రజలకి ఇంక ఎన్నికల రాత్రి ఒక శివరాత్రిలాగా గడుస్తుంది. భారతదేశంలో ఇప్పుడు ఎలా వుందో నాకు తెలీదు కానీ అమెరికాలో మాత్రం సాయంత్రం పోలింగు ముగిసినప్పటి నుండి అన్ని టీవీ ఛానెల్స్ లోను, రేడియోలో కూడా ఎన్నికల ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం చేస్తూవుంటారు. నిముష నిముషానికి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచిందో, ఎవరెవరికి ఎన్నెన్ని electoral votes వచ్చాయో చెపుతూ వుంటారు. దానితో పాటు వారి భవిష్యవాణి కూడా మనకు వినిపిస్తూ వుంటారు. దానితో వినేవారికి, చూసేవారికి కూడా రక్తపుపోటు పెరుగుతూ వుంటుంది. ఇంక వారి మానసికాందోళన సంగతి చెప్పనే అక్కరలేదు. అసలే కొన్ని నెలల నుండి ప్రజలమీద ఈ పోటీదారుల గురించిన రకరకాల వివరాలు బాంబుల వర్షం చాలా గాఢంగా కురుస్తూ వుంటాయి. రోజుకొక కొత్త వార్త, రోజుకొకటి కాదు, నిముషానికొకటి అన్నా తప్పు లేదు, అనుక్షణం అలాంటి ఏమాత్రం ఆశించని ఆటంబాంబుల వర్షంలో పూర్తిగా తడిసి ముద్ద అయినవారికి ఇప్పుడు వాటి ఫలితాలు ఎలా వుంటాయో అన్న ఆందోళన కూడాను. కొన్ని నెలలపాటుగా టీవిలలోను, రేడియోలలోను, స్నేహితుల మధ్య, ఆఖరికి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కూడా రకరకాల వాదులాటలు, అప్పుడప్పుడు దెబ్బలాటలు కూడాను. వీటన్నిటితోను అసలే అందరూ మానసికంగా పూర్తిగా అలిసిపోయి వున్నారు. పాపం, ఇప్పుడు వారి స్థితి ఇంక ఎలా వుంటుంది?
సరే, ఇంత ఆందోళన, ఒత్తిడి, అంటే stress అనుభవించిన తర్వాత ఎన్నికలలో ఇంక అనుకోని ఫలితాలు వచ్చాయంటే, బాధతో మూలిగేవాడి మీద తాటిపండు పడినట్లు అవదూ వారి పరిష్టితి? అప్పుడింక ఆశాభంగం, నిరాశ, నిస్పృహ, క్రోధం, పగ లాంటి నకారాత్మక భావాలన్నిటికీ వారిలో చోటు చేసుకునే అవకాశం కూడా వుంది. వారు కోరుకున్నవారు గెలవలేదన్న ఉక్రోషం కొద్దీ గెలిచినవారిని ద్వేషించి, వారిని సమర్ధించేవారి మీద పోట్లాడటానికి కూడా అవకాశం వుంది. అంతేకాదు, ఆశాభంగం, నిరాశ, నిస్పృహలు మనిషి చేత ఎలాంటి దారుణాన్నైనా చేయిస్తాయి. బహుశా ముట్టుకుంటే బద్దలయ్యే బాంబులాగా వుంటుందేమో వారి పరిష్టితి! అంతవరకూ ఎవరూ వెళ్ళకూడదని ఆశిద్దాం, ఆ భగవంతుడిని ప్రార్ధిద్దాం.
అయితే అలాంటి అపాయాలలోంచి తప్పించుకోవాలంటే ఆ ప్రార్థనలతో పాటు బాధ్యతతో కూడిన సామాజిక స్పృహ వున్న నాగరికులుగా మనందరం చెయ్యాల్సిన పనులు కూడా కొన్ని వున్నాయి. ముందుగా అంతర్జాలంలో వున్న రకరకాలైన మాధ్యమాలని, వార్తాపత్రికలలోను, టీవిలలోను వచ్చే వార్తలను గుడ్డిగా నమ్మటం మానాలి. ఎందుకంటే వాటిల్లో నిజాలతో పాటు అతిశయోక్తులు, అప్పుడప్పుడు అబద్ధాలు కూడా చాలా వుంటాయి. ఏదన్నా సంచలనం రేకెత్తించే వార్త దొరికిందంటే ఇంక అవి నిజమా కాదా అని ఆలోచించకుండా, వాటి పూర్వాపరాలు పూర్తిగా పరీక్ష చేయకుండా ప్రచురించేస్తారు, ప్రసారం చేసేస్తారు. కానీ అవన్నీ కళ్ళు మూసుకుని నమ్మటం మానాలి. వెనక ముందు చూడకుండా అవన్నీ జీర్ణించుకుంటే మనకే నష్టం. ఇంక మనసులోని ఆందోళనలు తొలగాలంటే ఏదో ఒక పనిలో మనసుని లగ్నం చేయాలి. కాస్సేపు బయట నడిచి రావచ్చు. ఏదన్నా సంగీతం వినచ్చు. యోగ, మెడిటేషన్ చెయ్యచ్చు. వంట చెయ్యచ్చు. కుట్లు అల్లుకోవచ్చు. లేదా ఎన్నికలకి సంబంధించని, మన మనసుకు నచ్చిన ఇంకేదన్నా చెయ్యచ్చు. కాస్సేపైన తర్వాత మనసులోని ఆ అలజడి కాస్త తగ్గుతుంది. అప్పటిదాకా మన మనసుని మనం ఇంకో వైపు మళ్ళించాలి. మనల్ని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి విరుద్ధంగా ఆలోచించేవారితో కూడి, వారితో మళ్ళీ వాదనలలోకి దిగి మనసులోని అలజడిని ఇంకొంచెం పెంచుకోవటం కంటే మన అభిప్రాయాలతో ఏకీభవించేవారితో కలిసి వుండటం, ఆశాభంగం, సానుభూతులను కలిసి పంచుకోవటం చేస్తే మండే గుండెమంటలను కాస్త చల్లార్చుకున్నట్లు అవుతుంది. ఇంకో విషయం. అసలే మనం ఆశించిన ఫలితాలు రాలేదని నిరాశలో వున్నప్పుడు, నకారాత్మకంగా ఆలోచించేవారితో, లేదా నిరాశావాదులతో సాంగత్యం, అందులో అలాంటి సమయంలో చాలా అపాయకరమైనది. దాన్ని మనం దూరం వుంచాలి. అసలు అస్తమాను ఆ టివి ముందు కూర్చోటం, వార్తాపత్రికలు కళ్ళ ముందే వుంచుకోవటం, లేకపోతె అంతర్జాలంలో పయనించడం లాంటివి మానేయాలి. ఎందుకంటే వాటి వలన ఆందోళన యింకా పెరుగుతుంది. అంటే చుట్టుపక్కల ఏమవుతుందో పట్టించుకోకుండా స్తబ్దుగా వుండమని నా వుద్దేశం కాదు. కేవలం అప్పుడప్పుడు మాత్రమే వార్తలను చదివితే, లేదా వింటే, లేదా చూస్తే కాస్త కొత్త వార్తలేమన్నా తెలుస్తాయేమో! వాటిని కూడా సరైన మాధ్యమాలలోనే వినండి, కనండి, చూడండి. అప్పుడే నిష్పక్షపాతమైన వార్తలు మీకు దొరుకుతాయి. ఏది ఏమైనా ఎన్నికల దినం లేదా రాత్రి మీద నియంత్రణ మీచేతిలో వుండాలి కానీ మీమీద నియంత్రణ వాటికి కాదు. అవునా? ఎందుకంటే అసలే రాజకీయాలు మనుషుల మీద, వారి మనసుల మీద అనేక వత్తిడులను తీసుకొస్తాయి, ఇంక వాటికి తోడుగా మనం మనమీదే నియంత్రణని కోల్పోతే ఎలాగ? మన జుట్టుని దుష్టశక్తులకి అప్పచెప్పేసి చేతులెత్తేసినట్లేగా! ప్రతి నాగరికుడు తన ఓటు వల్లనే తన పార్టీ గెలుస్తుందని ఆశిస్తాడు. అలాగే తన ఓటుతో తనకి నచ్చిన నాయకులకు పదవిని ఇప్పించానని అనుకుంటాడు. గర్వపడతాడు. అందుకు వ్యతిరేకంగా జరిగితే, ఆ ఆశాభంగాన్ని తట్టుకోవటం కంటే, తన ఓటుకి విలువ లేకుండా పోయిందన్న నిరాశ మనిషిని క్రుగదీస్తుంది.
కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఎన్నికలలో ఓడిపోయినప్పుడు ముందు ఓటమిని స్వీకరించటం చాలా ముఖ్యం. ప్రజాస్వామ్యానికి అది వెన్నెముకలాంటిది. అయినా జయాపజయాలు దైవాధీనాలు. ఒకరు గెలవాలంటే ఇంకొకరు ఓడిపోవాలి. ఈసారి ఎన్నికల్లో మనకి నచ్చినవారు గెలవకపోతే మాత్రం ఏమైంది? ఇంకోసారి అంటూ ఎప్పుడూ వుంటుంది కదా! ఒక్కసారి మనకి నచ్చనివారికి, మనం అనర్హులు అనుకుంటున్నవారికి పదవి లభించినంత మాత్రాన ఇంక ప్రజాస్వామ్యమే కూలిపోతుందా? అది అంత ఓటిదా? అది ఎన్నో ఏళ్ళ కృషి, శ్రమ, పరిశ్రమల ఫలితం కదా! అంతం అన్నది లేకుండా అనుక్షణం గలగలా ప్రవహించే జీవనది కదా అది! మన చెవుల్లో గింగిర్లు తిరిగే ప్రజల వాక్కు కదా అది! అందుకే ఈ ప్రజాస్వామ్య ప్రవాహం, వేగం ఏ ఆటంకాలకి ఆగదు, లొంగదు. ఏ దేశ ప్రగతి కూడా ఒక్క ఎన్నికల సైకిల్ వలన ఆగిపోలేదు. మీకు నచ్చిన మార్గంలో నడవకపోవచ్చు. కానీ గమ్యానికి ఒక్కటే దారి వుండదు. ఎవరికి నచ్చిన దారిని వారు ఎన్నుకుంటారు. సహనంతో మళ్ళీ ఎన్నికల సమయం వచ్చేదాకా ఎదురుచూడండి. ఈలోపల అధికారంలో వున్నవారి ఆలోచనలను అర్థం చేసుకోవటానికి, వీలైతే అవసరమైనప్పుడు మెచ్చుకోవటానికి కూడా సిద్ధంకండి. అసలైన ప్రజాస్వామ్యం అంటే అదే!
మన పురాణకాలంలో శ్రీరాముడి రాజ్యంలో ప్రజాస్వామ్యం ప్రత్యక్షంగా లేదు. కానీ పరోక్షంగా అణువణువులోను నిండివుంది. శ్రీరాముడు ఒక రాజులాగా ఎప్పుడూ లేడు. ఆయన తన అధికారాన్ని, అభిప్రాయాలని ప్రజల మీద ఎప్పుడూ రుద్దలేదు. ఎప్పుడూ ఒక ప్రజాప్రతినిధిలాగానే రాజ్యాన్నేలాడు. వాళ్ళ మనసెరిగి ప్రవర్తించాడు. వారి కోసం వ్యక్తిగత త్యాగాలు చెయ్యటానికి కూడా వెనుకాడలేదు. అందుకే యుగాలు మారినా మనం ఇంకా రామరాజ్యం అనే అంటున్నాము. దాన్నే మన ఆశయంగా పెట్టుకుని, దాన్ని సాధించటానికే కృషి చేస్తున్నాం. ఆతర్వాత చరిత్రలో అశోకుడు, అక్బరు లాంటి రాజులు కూడా మనకు తెలుసు. వాళ్ళు కూడా రాజులైనా ప్రజాస్వామ్య పద్ధతిలోనే రాజ్యాన్నేలారు. అందుకే మనకు ఆదర్శప్రాయులయ్యారు. ప్రజాస్వామ్యంలో అంత శక్తి వుంది, అంత మేలు వుంది, అందుకే మన ప్రజాస్వామ్యాన్ని మనందరం కలిసి కాపాడుకుందాం.
ప్రజాస్వామ్యానికి ఎన్నికలు వెన్నెముక. నిష్పక్షపాతంగా, మన అంతరాత్మ సూచన ప్రకారం ఓటు వేయటం ప్రతి నాగరికుడి బాధ్యత, హక్కు. ఒక్కసారి మన ఎంపిక గెలవకపోతే ఏమీ ఫరవాలేదు. ప్రపంచం ఏమీ ఆగిపోదు. ఆకాశం ఏమీ విరిగి మనమీద పడదు. అందుకని మనం ఏం కోరుకున్నా, అది ఇప్పుడు ఈ నిముషంలో మనకి దొరక్కపోయినా ఫరవాలేదు. దొరికినదాన్నే స్వీకరిద్దాం. మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మన ఇష్టాయిష్టాలను పక్కకు నెట్టి గెలిచినవారికి అధికారాన్ని అందించటంలో పూర్తి సహకారాన్ని మనస్ఫూర్తిగా అందిద్దాం. మనసులలో ఎటువంటి కల్మషాలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఏ దేశమైనా సరే, ఎన్నికలు జరిగాయంటే ఆ ఫలితాలు చాలా ముఖ్యమైనవి. నిజమే. కానీ ఆ దేశంలోని ప్రజల శారీరక క్షేమం, మానసిక ఆరోగ్యం అంతకంటే కూడా ముఖ్యమైనవి అని George Washington University లోని Clinical Psychology లో అసిస్టెంటు ప్రొఫెసర్, కేథరిన్ మార్షల్ అన్నారు.
మరి మీరు కూడా ఒప్పుకుంటారు కదూ? వచ్చే సంచికలో మరో అంశంతో మిమ్మల్ని పలుకరిస్తాను.