Menu Close
Bulusu-Sarojini-Devi
గాలి (ధారావాహిక)
-- బులుసు సరోజినిదేవి --

“ఒరేయ్ నానీ!” కొడుకు జనార్ధానాన్ని పిలిచింది తల్లి సుబ్బమ్మ.

“చెప్పవే అమ్మా!” ఇంచ్ కూడా కదలకుండా అడిగాడు ఆ కొడుకు.

‘మందులయిపోయాయి రా!”

“ఇంక రెండు రోజులేనే అమ్మా! అప్పుడు నెలకి సరిపడా తెచ్చేస్తాను. ఈ రెండు రోజులకి కాస్సేపాగి తెస్తాలే!” అన్నాడు నీరసంగా.

“సర్లే నాయనా.. . నా మందులకే డబ్బులుండవ్!” అంది కరుగ్గా కోడలు వినాలని. అంతే! సర్రున వచ్చేసింది కమల అత్తగారి ముందుకి.

“ఆహా! సతాయింపు. మీరు చదివించిన చదువుకి గుమాస్తా గిరే మరి!” అంది.

“నువ్వు నోరుమూసుకో. నీ జోలికి రాలేదు నేను. నా కొడుకుని అనుకున్నాను!” అంది సుబ్బమ్మ.

“ఇన్ స్టాల్ మెంట్ లో చీర కొనుక్కున్నాననేగా ఈ మూలుగు? పండగ వస్తోంది. మీ చిన్న కొడుక్కి పెళ్లి, పెటాకులూ లేవు గనక ఎక్కడో ‘సేల్’ లో నాలుగు చీరలు కొనేసి మరో నాలుగు కబుర్లు చెప్పి పోతాడు. ఖర్చులకి నాలుగు రూపాయిలు ఏనాడైనా ఇచ్చాడా? మళ్ళీ కనిపిస్తాడా? మరి మేము అన్నీ చూసుకోవొద్దూ?” అంది ఏడుస్తూ, దెప్పుతూ.

“అబ్బో! రాని ఏడుపొకటి!” అంది ముసిలావిడ.

“మీరు కాదూ నన్నది?” రెట్టించింది కమల.

“ఛస్తేకాదు. నాకొడుకు. నాయిష్టం. సవాలక్ష అనుకుంటాను. నీ దిక్కున్న చోట చెప్పుకో!” అంది.

“రానివ్వండి. రానివ్వండి తేలుస్తాను!” అరుస్తోంది కమల. వినినా పట్టనట్టు జనార్ధన్ ని. “వినపడినా వెళ్ళిపోతారా? ఇంటికి రాకపోతారా? తేల్చుకోలేకపోతానా?” చేతిలో ఉన్న ఖాళీ గిన్నెలన్నీ ఎత్తి పడేసింది. అన్నీ బడబడ మంటూ కిందపడి అటోమూలా, ఇటోమూలా ఎగిరెగిరి పడ్డాయి. బాంబుల్లాంటి శబ్దాలొచ్చాక.. . కోడలికి బాగా తిక్క ఎక్కించినందుకు సంబరపడుతూ మంచం మీద హాయిగా పడుకున్నప్పుడు వచ్చాడు రాకీ. అన్నీ విన్నాడు కూడా. వాణ్ని చూడగానే కమలకి చిర్రెత్తుకొచ్చింది.

“ఓరి పాపిష్టి సచ్చినాడా! తండ్రి చెప్పులేసుకుపోతే ఎలారా వెధవా! నీ వల్ల కదరా నాకిన్ని తిప్పలు?” శోకాలు తీస్తోంది కమల.

“నోర్ముయ్! వాడు నా వంశాంకురం! ఒక్క మాటంటే ఒప్పేది లేదు! తరతరాలుగా స్త్రీని తమకు కావలిసినట్టు మలుచుకున్న సమాజంలోని అధికార వర్గం.

“బామ్మా! నువ్వూరుకోవే!” అని మరింత గట్టిగా అరిచాడు రాకీ.

“నా చెప్పులు తెగిపోయాయే అమ్మా! కుట్టించుకొచ్చా!” అన్నాడు.

“చూశావా! వాడికింకా చెత్త అబద్దాలు అలవడలేదు. నువ్వు నేర్పకు మహాతల్లీ!” అంది ముసిలావిడ. ఆవిడకి కోడలంటే అకారణమైన కోపం. ఒక్క నిముషం పడదు ఇద్దరికీ.

రాకీ బామ్మ దగ్గర చాలా గారాలు పోతాడు. ఆవిడ భద్రంగా దాచుకున్న ప్రతీ రూపాయి వాడిదే! అన్నీ లాగి పారేస్తాడు. ఒక్క ఆ ట్రంకు పెట్టె తప్ప. ఆవిడ ట్రంకు పెట్టెలో ఏముందో ఇంతవరకు ఎవరూ చూడలేదు. ఆవిడ ఆ విషయం లో ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. పిడిరాయిలా ఉండేది సుబ్బమ్మ. అందుకే గట్టి కాపలా ట్రంకు కి.

జనార్ధనానికి ఇద్దరు చెల్లెళ్ళు. పెద్దది అమాయకురాలు. చిన్నది గొప్ప గడుగ్గాయి. ఆమెకి డబ్బు పిచ్చి, నగల పిచ్చి. ప్రతీ పండక్కి వచ్చి.. . రాలినంత గుంజుకుని సంవత్సరానికి సరిపడా దెబ్బలాటలు పెట్టేసి అన్నకి శాంతి లేకుండా చేసి చెక్కేస్తుంది. చిన్నదాని ఆగడాలంటే సుబ్బమ్మకి ముద్దు. కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి వెయ్యడం చిన్నకూతురి పనయితే దేన్నయిన సమర్ధించి కోడలి మొహంలో నీలినీడలు చూసి ఆనందపడటం ఆవిడకిష్టం. ఎంత వయసొచ్చినా పెద్దరికం తెచ్చుకోలేని ఇలాంటి వాళ్ళుంటారని కోడలి గొణుగుడు.

ఇంటర్ రిజల్ట్స్ వచ్చి కొడుకు డిస్టింక్షన్లో పాస్ అయితే ఆ రాత్రంతా దిగులు పడ్డాడు జనార్ధనం. బీటెక్ లో సీటు ఈజీగానే వచ్చినా సీటుకి ఫీజు కట్టాల్సిన అవసరం లేకపోయినా ఖర్చులకేం ఇస్తాడు? హాస్టల్ లో ఎలా ఉంచుతాడు? అదే అతడి దిగులు, టెన్షన్. బంధువులంతా వచ్చి అభినందించి జనార్ధనం దిగులు విని తమ మీద ఏం భారం పడుతుందో అని జారుకున్నారు. స్నేహితుడు కామేశం మాత్రం లక్ష చేతిలో పెట్టి వీలుని బట్టి తీర్చమన్నాడు.

******

వారం రోజుల్లోనే రాకీ మోటర్ సైకిల్ కొన్నాడు. కేష్ ఇచ్చి మరీ బయల్దేరేముందు సుబ్బమ్మ ట్రంకు పెట్టి తాళం బద్దలు కొట్టేశాడు. జిగేల్ మనే నగలు. ఒక్క వడ్డాణం చాలురా దేవుడా... చదువు అయ్యేవరకు కూడా మొత్తం చిల్లరమల్లర ఖర్చులకి. ఖుషీ ఖుషీగా విజిల్ కొట్టాడు. ‘అవెలాగైనా తనకే. తానొక్కడే వారసుడు’ అని తనని తానే సమర్దించుకుని అన్నీ అమ్మేసి సగం బాంకులో వేసి మిగతా సగం బైకు గియ్ కు వగైరాలు, సోకులు. దొంగలు పడ్డారని ఒక్క ఏడుపు ఏడ్చి ఊరుకుంటుందిలే ముసిల్ది అనుకున్నాడు ముసలమ్మని తలుచుకుని. ‘ఏ మాట కామాటే చెప్పుకోవాలి. తనంటే ప్రాణం దానికి. ఇదుగో ఇలా స్తుతి దొరికాక ఇంకా పెద్ద పన్నాగం వేసి బూరెలబుట్టలో చటుక్కున కూర్చుండి పోదామనుకున్నాడు. దీని దుంపతెగ! వెనకేం లేనట్టుంది. మరో పిట్టని వెదుక్కోవాలి తను!’ నిట్టూర్చాడు.

రాకీ వైపే చూస్తున్న స్తుతి మంచి మంచి కలల్లో విహరిస్తూ ఒకసారి తన గతంలోకి జారిపోయింది.

******

“ఏయ్! ఇలారా! ఈ కూరలు తరిగెయ్!”కుక్కర్ పెడుతూ ఆజ్ఞ జారీ చేసింది స్తుతి తల్లి సుందరి.

తండ్రి శేషగిరి పేపరంతా చదివి ఇంకా ఏ మూలయినా ఏదైన మిగిలిందేమోచూస్తున్నాడు. కూర తరిగాక మూకుడు కాలేసి నూనె మరిగాక కూరముక్కలు మూకుట్లో వెయ్యబోతుంటే బాగా కాలిన చివర్లు తగిలి కాలి బొబ్బ కట్టేసింది. ‘అబ్బా! అనుకుంది  స్తుతి. నొప్పికి కళ్ళల్లో నీళ్ళు నిండాయి.

“అరెరె! కాలిందా?” నొచ్చుకున్నాడు శేషగిరి.

“కాలదూ? ఒళ్ళు దగ్గరుంటేగా? బర్నాల్ రాసి తగలడు!” మొట్టింది సుందరి.

అసలే కాలిన వేలు, చీవాట్లు, మొట్టినందుకు తలనొప్పి. మళ్ళీ కళ్ళల్లో నీళ్ళు ఉబికుబికి వచ్చాయి. అది చూసి-కాస్తంత కరిగి, నీరయి –మళ్ళీ-

‘అదిగో! బండరాయిలా కూర్చున్నాడు మహానుభావుడు. కదలడు, మెదలడు. వండితే తిని పెడతాడు. ఏం? నేను చేయట్లా అతగాడితో సరిసమానంగా...ఉద్యోగం?” ఈసడింపుగా అంది కూర అట్లపుల్లతో దబదబా అటూ ఇటూ తిప్పేస్తూ.

“నువ్వు రుబ్బు రోల్లా లేవూ? నేను మగాణ్ణి. వంట చేయాల్సింది ఆడది!” అన్నాడు శేషగిరి.

“’ఎక్కువ మాట్లాడావంటే జాగ్రత్త!” అంది సుందరి.

“పోవే!” అన్నాడు శేషగిరి!”

“ఉతికి ఝాడిస్తా!” అంది సుందరి పులుసు లో పోపు వేస్తూ. మౌనంగా ఇద్దరికీ కేరెజ్ లు పాక్ చేసింది స్తుతి. స్తుతికి తెలిసీ తెలియని వయసులో డబ్బు కోసం కొట్టుకున్నారు ఆ దంపతులు. ఇప్పుడు తమతమ ప్రియుల కోసం కొట్టుకుంటున్నారు.

తండ్రికి కారున్నా పంతంతో ఆ కారెక్కదుతల్లి. తల్లి వీధి మలుపు దాకా నడుస్తుంది. అక్కడికో స్కూటర్ వస్తుంది. ఆ స్కూటరెక్కి ఎవడో అతగాడి భుజం మీద చెయ్యెసి వెళ్తుంది. ఒక్క సారంటే ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడదు. చూసి ఉంటే గుడ్లప్పగించి చూస్తున్న కూతుర్ని చూసి ఉండేది. తల్లి వెళ్ళిన పది నిముషాలకి తండ్రి కారు స్టార్ట్ చేసి మెయిన్ రోడ్డు మీద చివర్నకాస్త పక్కగా ఆపుతాడు. ఇవన్నీ పక్కింటి చింపు గాడు చెప్పాక గమనించింది. ఆ పిల్లకి ఏదో అర్ధమయీ, అర్ధం కానట్టు ఉంటుంది. ఓ సారి నాన్న కార్లో ఎక్కే ఆవిడ శలవు పెట్టడం వల్ల ‘పొన్లే! పెళ్ళాం’ అని తల్లిని ఆఫీస్ కి వెళ్లాడట. ఆ రోజు అమ్మ ఆఫీస్ కే వెళ్ళలేదట.

ఆరోజు జరిగిన గొడవ అంతా ఇంతా కాదు. స్తుతికి బాగా గుర్తుంది. అమ్మ ఆలస్యంగా రాత్రి పదింటికి వచ్చింది. నాన్న బాగా తాగినట్లున్నాడు. బండ బూతులు తిట్టాడు రాగానే. తానా రోజు ఏమితినలేదు. ఆ రాత్రి తాను నిద్రపోతోంది అనుకుని హాల్లో అమ్మ ని బెల్టుతో కొట్టీ కొట్టీ బెల్ట్ పాడయ్యాక విసిరేశాడు. అమ్మ చెప్పుతో నాన్నని కొట్టడం తను చూసింది. అప్పుడు నాన్న జుట్టు పట్టుకుని బాదాడు. అమ్మ ఎలాగూ సెకండ్ సెటప్ తెచ్చుకుంది గనుక తానూ తెచ్చుకుంటానన్నాడు. ‘నువ్ చూశావా? పళ్ళు రాల్తాయ్’ అంది అమ్మ. తనకి నిద్ర పట్టేసింది. పొద్దున్న తనకి మెలుకువ వచ్చేసరికి ఇల్లంతా మామూలుగా ఏమి జరగనట్టుగా ఉంది. అమ్మ తనేదో పని చేయబోతుంటే వారించి-

“నీ కారణంగానే నేను ఇంకా ఇలా ఉన్నది!” అంది. నాన్న దగ్గరగా తీసుకుని, తలనిమిరి-

“నువ్వు లేకపోతే ఇంత కష్టం నాకెందుకు?” అన్నాడు. అర్ధమయింది. తన కారణంగా వాళ్ళిద్దరూ కలిసి ఉంటారన్నమాట.

ఒక రోజు కాలేజీ నుంచి తను ఇంటికొచ్చేసరికి అమ్మ తన ఫ్రెండ్ తో అంటోంది.

“సుమిత్రా! మా నాన్న ఈ గుదిబండ కిచ్చి చేశాడు నన్ను. ఓ శుభ్రమూ లేదు, ఓ సున్నితమూ లేదు. అదే శ్రీనాధ్ ఏ పని చేసినా అందులో ఒక విశేషమూ, కోమలత్వమూ ఉంటుంది!” అంది.

“ప్చ్! ఏం చేస్తాం?” అంది సుమిత్ర.

తను చేస్తున్న పనిని ఒప్పుగా చూపిస్తోంది తల్లి. ఎందుకో తలెత్తి స్తుతిని చూసింది సుమిత్ర.

“రా స్తుతీ! నీ కోసం వేడి వేడి సమోసాలు తెచ్చామ్!” అంది.

తల్లి చటుక్కున సద్దుకుంది. ‘ఈ పాపం లో ఈవిడకీ భాగమే!’ అనుకుంది స్తుతి. తండ్రి వచ్చాడు కాస్సేపటికి. వస్తూనే-

“స్తుతీ! రెండు రోజుల్లో రాబోయే నీ బర్త్ డే కి ఇదుగో నీకు మంచి డ్రెస్!” అని ఇస్తూ తల నిమిరి –

“రా వసంతా!” అంటూ ఒకామెని లోపలికి ఆహ్వానించి భార్యకి ఆమెని పరిచయం చేశాడు. ఈ మధ్యే ఆమెకి ఈ వూరు ట్రాన్సఫర్ అయిందని చెప్పాడు. వసంత సుందరిని చూసి-‘పాత సినిమాలో ఏడుపు పాత్రలా ఉంది’ అనుకుంది. చాలా మోడ్రన్ గా ఉన్న ఆమెని చూస్తుంటే స్తుతికి ఎక్కడో చూసినట్టు అనిపించింది. వెంటనే తట్టింది. రోజూ నాన్న కార్లో వెళ్తున్నది ఈమె అని. తండ్రిని స్తుతిని వెళ్ళి చదువుకోమన్నాడు. తల్లి అక్కడే ఉండమంది. సుమిత్ర తనని తాను పరిచయం చేసుకుంది వసంతకి. వచ్చిన అతిధి ఎవరో అర్ధమయినా తెలియనట్టు కాఫీ అందిస్తోంది సుందరి. అందుకే మరీ ఇంట్రస్ట్ గా ఉంది సుమిత్రకి. కాసేపయ్యాక ఇల్లంతా చూసి వెళ్ళివస్తానని బయలు దేరింది వసంత. సుందరి బ్లౌస్ పీస్, పండుతో బొట్టు పెట్టింది. సుందరి మొహం లోకి చూస్తూ అదోలా నవ్వింది సుమిత్ర.

మళ్ళీ ఆ రాత్రంతా గొడవ.

“వసంత నా కీప్ అనుకుంటున్నావా... ఓన్లీ ఫ్రెండ్!” అన్నాడు తండ్రి.

“శ్రీనాథ్ కూడా నాకంతే!” అంది తల్లి.

“మీ సుమిత్ర అదోలా నవ్వింది ఎందుకు వసంత ని పరిచయం చేస్తుంటే?”అడిగాడు తండ్రి.

“అదోలా అంటే?” అడిగింది సవాలులా. తండ్రి పళ్ళు పటపట లాడించాడు.

స్తుతి అయోమయం లో ఉండగా ఇంటర్ పూర్తయింది. ఎం.సెట్. రిజల్ట్స్ వచ్చాక నాన్ పెయిడ్ సీట్ వచ్చినందుకు తండ్రి పొంగిపోయాడు. తల్లి  ‘స్కూటి’ కొనిచ్చింది. వైజాగ్ లో జిఒన్ చేసి వెళ్తున్నా తండ్రి మొహంలో ఏ భావమూ లేదు. తల్లి మాత్రం కన్నీళ్ళు పెట్టుకుంది.

రాకీతో తన బంధం బలపడి, తనని అర్ధం చేసుకుని పెళ్ళాడితే ఇంక తనకేమీ లోటుండదు. తన కుటుంబం తో అతనికేం పని? తను ప్రేమించిన అమ్మాయి నమ్మకస్తురాలయితే చాలు కదా? ఇదీ స్తుతి ఆలోచన.

నెమ్మదిగా రాకీ రూమ్ నెత్తి చూసింది. రాకీ ఫ్రెండ్ తో ఎక్కడికో వెళ్ళాడు. అతడి గది అంతా నీట్ గా సద్దింది. అందంగా అమర్చింది. కొక్కానికి ఉన్న ఫాంటు బాగా మాసి ఉంటే ఉతకడానికి వేస్తూ జేబు చెక్ చేసింది.

ఏదో ఉత్తరం!

చాలా ఆతృతగా ఏముందో తెలుసుకోవాలని చదివింది. రాకీ తండ్రి ఆర్ధిక పరమైన కష్టాలు రెండు పేరాలు రాశాడు. ఈ పేదరికంలో తన కున్న ఒకే ఒక్క ఆశ తన కొడుకే అంటూ. మిగిలినవి కూడా చదివాక స్తుతి ఒక్కసారిగా గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయింది. ఉత్తరాన్ని మళ్ళీ జేబులోనే ఉంచేసి తన గదిలోకి వెళ్ళి వెక్కివెక్కి ఏడ్చింది. డబ్బు విషయం లో తన పేరెంట్సే ఇంకా నయం. ఇతడికి చిల్లిగవ్వ లేదు. బామ్మ దగ్గర కొట్టేసిన నగలు తెగనమ్మి ఎంజాయ్ చేస్తున్నాడంటే వీడి కేరక్టర్ ని అంచనా వెయ్యొచ్చు. స్తుతికి తన ముందు పరుచుకున్నదంతా ఎడారిలా, అయోమయంగా తోచింది.

******

లక్ష్మణ్ మహేంద్ర ఎదురుగా మఠం వేసుకుని కూర్చుని –

ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో సిరీన్ టూ బెడ్రూం ఫ్లాట్! అన్నాడు లక్ష్మణ్! మహేంద్ర కి అతడు చెప్పే విధానం చూస్తే నవ్వొస్తుంది.

‘సిరీన్ ట్రయినింగ్ పూర్తి చేసుకు వచ్చిన సంజనని చాలా ఆనందంగా రిసీవ్ చేసుకున్నాడు. అతడు ఈ మధ్య కాలం లో చాలా శాంతిగా ఉన్నాడు. ‘బడ్డీ ఎన్ క్లేవ్’ కి వచ్చాకే! ఇక్కడ ఎవరి గొడవ వారిదే!

“వాచ్మేన్ లక్ష్మణ్ చాలా మోడ్రన్, అండ్ స్టయిలిస్ట్! అనవరమైన విషయాల్లో తల దూర్చడు!” అన్నాడు తన వైపు చూపించుకుంటూ, గట్టిగా నవ్వేశాడు మహేంద్ర.

సంజన చాలా చలాకీ. నవ్వుతూ, నవ్విస్తూ ఉంటుదెప్పుడూ!

సిరీన్ సంజన విషయాల్లో తల దూర్చడు, అలాగే తన విషయాలేవీ చర్చించడు. సిరీన్ ఇటీవల తను క్లబ్ లో పబ్ లో పాడడం మానేశానని చెప్పాడు. అతడికి మ్యూజిక్ తో పాటు ఉన్న మరో పిచ్చి పిల్లల్తో గేమ్స్ ఆడడం. లక్ష్మణ్ ని, సిరీన్ ని దగ్గర చేసింది మ్యూజిక్. లక్ష్మణ్ మంచి పల్లె పదాలు పాడుతూ ఉంటే సంజనని లాక్కుపోయి వినిపిస్తాడు సిరీన్.

సంజన లేనప్పుడు ఒకసారి ప్లే గ్రౌండ్ లో ఎవరో స్టూడెంట్స్ రెండు పార్టీలుగా విడిపోయి కొట్టుకుంటుంటుంటే సిరీన్ చాలా జాగ్రత్తగా డీల్ చేసి రెండు గ్రూప్ లనీ ఒక్కటిగా చేసిన దగ్గర్నుంచి సిరీన్ కుర్రాళ్ళకి హీరో అయిపోయాడు.

ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే సిరీన్ ఒక  రోజు మాత్రం ముభావంగా, బాధతో ఉన్నట్టు కనిపించాడు. కారణం! ఆ రోజు అతని తల్లి పుట్టినరోజు! లక్ష్మణ్ ని పిలిచి చుట్టుపక్కల పేదవాళ్ళని పిలుచుకు రమ్మని కొత్త బట్టలిచ్చాడు. ఆ రోజంతా అతడు అవుటాఫ్ మూడ్ లో ఉన్నాడు.

******

చీకటి పడుతుండగా మసక వెలుతురులో సంజనా దివాన్ కాట్ మీద వాలి ఉంది. సిరీన్ ఫ్రెష్ అయి హాలుమధ్య నేల మీద కూర్చున్నాడు. ఒక దిండు అందించింది. అందుకుని మోకాళ్ళమీద పెట్టుకుని మొహం దాన్లో పెట్టుకున్నాడు. చాలా నిశ్శబ్దం తరువాత లైట్ వెయ్యబోతుంటే వారించాడు. మళ్ళీ కూర్చుంది. నెమ్మదిగా _

“సంజనా! అమ్మ గుర్తొస్తోంది. అమ్మ లేదనీ, ఇంకెప్పుడూ రాదనీ నాకనిపించదు. ఇంకా నా దగ్గరే ఉన్నట్టుంటుంది. నాన్న అప్పట్లో చాలా పెర్వర్టెడ్. అయినదానికీ కానిదానికీ తప్పు పట్టేవాడు. డబ్బు తెమ్మని వేధించేవాడు. రాత్రి అయితే చాలు అమ్మ ఎలారా?” అంటూ వణికిపోయేది. నాన్న తాగొచ్చి అల్లరి చేసేవాడు. నిలబడమనీ, నిలబడితే కూర్చోమనీ కూర్చుంటే అన్నం పెట్టమనీ, వద్దనీ, గుంజీలు తియ్యమనీ, అర్ధరాత్రి ఉతికిన బట్టల్ని ఉతకమనీ.. . ఇలా ఎన్నెన్నో!

“మనం పూర్వజన్మలో చేసిన పాపం ఏదీ వదిలి పెట్టదు” అనేది అమ్మ. ఆమె గొంతు కోమలంగా, మృదువుగా సన్నగా ఉండేది. ఆ గొంతు లో బాధ నన్ను గిలగిల లాడేట్టు చేసేది.

‘పాపాత్ములు తమ పుణ్యం పండేవరకు సుఖపడతారు. పుణ్యాత్ములు తమ పాపం పండేవరకు దు:ఖపడతారురా సిరీన్!” అనేది.

నేను చిన్నవాడిని. ఆ మాటలు నాకు అర్ధం అయ్యేవి కావు.  ఒకసారి నాన్న నన్ను కూర్చోబెట్టి – అమ్మకి తన ఫ్రెండ్ తో సంబంధం ఉందని చెప్తుంటే-అమ్మ అంతటి అభాండాలు వినలేనని బాగా ఏడ్చింది. ఆ రాత్రి కరంట్ లేకపోతే వెన్నెల్లో ముద్దలు తినిపించింది. అమ్మ ఏదోలా ఉందనిపించింది. మర్నాడు నేను నిద్ర లేచేసరికి అమ్మ చనిపోయిందని అన్నారు. ఆత్మహత్య అంటే ఏమిటో నాకు తెలియదు. అమ్మ ఇకలేదని మాత్రం తెలిసింది.

నాన్న గుండెలు పగిలేలా ఏడిచాడు. తనకసలు అనుమానమే లేదనీ ఏ శాడిజం తనని అలా చేసిందో, కనీసం కౌన్సిలింగ్ కి వెళ్ళాల్సిందనీ అమ్మే తన సర్వస్వం అనీ ఈ తాగుడు తనని సర్వనాశనం చేసిందని కన్నీరు మున్నీరు గా ఏడ్చాడు. ఏం లాభం? అమ్మ తిరిగి రాదుగా? అనుమాన రోగం చాలా భయంకరమైనది, భార్యాభర్తల మధ్య ఈ రోగం ప్రవేశించి జీవితాల్ని అల్లకల్లోలం చేస్తోంది. నమ్మకం, విశ్వాసం ల మధ్య జీవించి ఉండాల్సిన ప్రేమ పిచ్చి వాడి చేతిలో రాయిలా మారిపోతోందని అనేవాడు. అందుకే నాకు రోతగా ఉంటుంది. ఈ ప్రేమ, పెళ్లి, సెక్స్ అంటే!” అన్నాడు సిరీన్.

అతడి గొంతులో బాధ వినడానికి వేదనగా ఉంది. ఏమి మాట్లాడలేదు సంజన.

“నిప్పు కాలుతుందని తెలిసి దానితో ఎంత జాగ్రత్తగా ఉంటాం? కానీ జీవితం చేజారిపోతుందేమో అనే అవగాహన తెచ్చుకోం! ప్రేమంటే ఆంతరంగికమైన బాంధవ్యం. ఇరు హృదయాల ఏకత్వం. మనుషులు ఈ సున్నితత్వాన్ని ఎందుకు కోల్పోయారు? కోల్పోతున్నారు? ప్రాణం విలువ సహితం ఈ శాడిజానికి బలి అయిపోతోంది. అమ్మ లేనప్పుడే నాన్నకి మనిషి విలువ తెలియడం ఎంత దారుణం? అమ్మని కోల్పోయిన బిడ్డని చూశాక కానీ నా మీద ప్రేమ ఉందని తెలియలేదంటే మనం ఎటువంటి వ్యతిరేకశక్తులకి బానిసలు అవుతున్నాం? మనిషి సహజ గుణాలకి అతీతంగా ఎందుకు బతుకుతున్నాడు? అమ్మ ప్రాణం పోతే తప్ప నాన్న తాగుడు మానలేదు. ఇవేనా జీవిత విలువలు? ఇదంతా వెర్రి వ్యామోహాల కొరకు పరుగు. నాన్న నావైపు దీనంగా చూస్తున్నప్పుడు నాన్న చేసిన తప్పు నేను చేయకూడదనుకున్నాను. మనిషి విలువ బతికున్నప్పుడే తెలుసుకున్నాను. కానీ ఈ లోపలి దు:ఖాన్ని మరిచే దారేది?

నాన్నకి నేనంటే ప్రాణమని కూడా తెలుసుకున్నాను. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న ఆయనని ఇప్పుడు నేనేమనగలను? గొంతులో దు:ఖం సుడులు తిరిగి మాట్లాడడం ఆపేశాడు. సంజన లేచి అతని దగ్గరగా వెళ్ళి రెండు చేతుల్ని ఓదార్పుగా పట్టుకుంది. ఆమె భుజం మీద తల పెట్టుకుని చాలాసేపు ఉండిపోయాడు శిరీన్.

ఆ సంఘటన తో సిరీన్ బాగా దగ్గరయ్యాడు సంజనకి!

ఇంత మెత్తని వాడు భార్యని ఇంకెంత బాగా చూసుకుంటాడో అనిపించింది. వారిద్దరి మధ్య చక్కని స్నేహం ఏర్పడింది.

సిరీన్ సంజన ఇంటి సంగతులు తెలుసుకున్నాడు మాటల మధ్యలో.

సంజన తండ్రి బాధ్యతారాహిత్యం, తల్లి నిస్సహాయత, విశాఖ లోనే హాస్టల్ లో ఉంది చదువుకుంటున్న తమ్ముడి చదువు పూర్తి అయితే, తన బాధ్యత కూడా పూర్తి అవుతుందని చెప్పింది.

సిరీన్ తనకి చేతనయినంతగా ఆమెని ఆదుకుంటానని మాట ఇచ్చాడు.

“ఒక్క రిక్వస్ట్ సిరీన్. నేను నీతో ఈ ఇల్లు షేర్ చేసుకున్నది డబ్బు ఇబ్బందుల వల్లే. అంత ‘రెంట్’ ఒక్కదాన్నీ భరించలేక. ప్లస్ సెక్యూరిటీ! ఇదంతా అమ్మ, నాన్నగార్లకి తెలిస్తే నన్ను అపార్ధం చేసుకునే అవకాశం ఉంది. నేను తమ్ముడిని కూడా ఇంతవరకు ఏదో ఒక రీజన్ చెప్పి ఇక్కడికి రానివ్వడం లేదు. వాడితోనే ఉందామంటే వాడి చదువుకి ఆటంకం! కాలేజ్ దగ్గర్లో ఉండే హాస్టల్ లో ఉండడమే వాడికి కన్వీనియంట్!” అంది. పెద్దగా నవ్వేస్తూ తాను చూసుకుంటానని భరోసా ఇచ్చాడు సీరీన్. మర్నాడు తమ్ముడు రవి హఠాత్తుగా ఇంట్లోకి వచ్చి ఆశ్చర్య పరుస్తుంటే సీరీన్ నవ్వొచ్చేలా అభయం పొజిచ్చాడు!

క్రమంగా సంజన తనతో కంటే తన తమ్ముడితో నే క్లోజ్ గా ఉండడం చూసి ఉడుక్కుంటుంటే అల్లరిగా నవ్వేవాడు. రవితో పరిచయం పెరిగి దగ్గరతనం కూడా వచ్చింది సిరీన్ కి. తరచుగా ఫోన్ చేసి బాగా చదవాలని చెప్తూ క్లోజ్ అయ్యాడు.

సంజన తోనూ చనువు పెరిగింది సిరీన్ కి. ఎందుకో సిరీన్ తన వాడనే నమ్మకాన్ని గట్టిగా ఏర్పరుచుకుంది సంజన! కానీ అతన్నే గమనిస్తూ ఉంటే మనుషుళ్ళందరితోనూ అతను అదే విధంగా ఉంటాడని తెలిసింది. ఎప్పుడూ నవ్విస్తూ, జోక్స్ వేస్తూ ఉంటాడు. కాలనీ లో చిన్న, పెద్దా అందరూ ఫ్రెండ్సే. అయిదేళ్ళ చిన్న పిల్లాడు కూడా ‘ఒరే సిరీన్!’ అనడం వింతగా ఉంటుందామెకి.

****సశేషం****

రచయిత్రి పరిచయం ..

Bulusu-Sarojini-Devi పేరు: బులుసు సరోజినిదేవి

ప్రకాశం జిల్లా, దరిశిలో...జూన్ 29, 1956 లో జన్మించిన పట్టిసపు సరోజినీ దేవి, వివాహానంతరం బులుసు సరోజినీ దేవి అనే పేరుతో రచనలు మొదలుపెట్టారు. వీరి తల్లిదండ్రులు పట్టిసపు ఉమామహేశ్వరరావు గారు జోగులాంబ గారు . ఈమె 2010లో తన మొదటి కవితతోనే జాతీయస్థాయి రంజని కుందుర్తి అవార్డు సొంతం చేసుకొని రచనలను మొదలుపెట్టారు. 2011లో మరో జాతీయస్థాయి ఎక్స్ రే అవార్డును పొందారు. వీరి మొదటి కథ రంజని వారు సాధారణ ప్రచురణకి తీసుకున్నారు. తర్వాత నాలుగు కథలకు ప్రైజులని రంజని వారిచే పొందారు.  వీరు రాసిన "శ్రీముఖి" అనే నాటిక జాతీయస్థాయి రెండవ బహుమతి పొందింది. సంగీత స్రష్ఠ శ్రీశ్రీ శ్రీ  మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసి ఎంతో అదృష్టాన్ని కూడగట్టుకున్నారు. నాలుగు గురజాడ పురస్కారాలను అందుకున్నారు. వీరు 'కళామిత్ర' అనే బిరుదును పొందారు. ఉన్నత ప్రమాణాలు విలువలు కలిగిన రచనలు చేయడం వీరికి ఇష్టం. నాలుగు నవలలు, నాలుగు నాటికలు, దాదాపు 500 కథలు, 300 కవితలు, కొన్ని వ్యాసాలు రాశారు. వీరికి రచనలు చేయడం అంటే ఎంతో ఇష్టం.

ప్రముఖుల ప్రశంసలు: తెలుగు సాహిత్య ప్రపంచంలో బులుసు సరోజినీ దేవి గారి పేరు వినని వారు ఉండరు. ఆమె రాసిన ఈ మూడు కథలు వైవిధ్యవంతమైన జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. 'రెండో పెళ్లి', 'బొంకుల దిబ్బ' అనే కథలు స్త్రీల వైపు నుంచి జీవితాన్ని చూడడానికి... పారాహుషార్ అనే కథ నన్ను నివ్వెరపరిచింది. ఒకప్పుడు టిప్పు సుల్తాన్ దాడికి గురైన ఆ కథ ఇప్పుడు చెప్పటంలో మరొక కొత్త సత్యం ఆవిష్కరణ ఆవిష్కారమవుతోంది. చరిత్రల్ని సాధారణంగా మనం స్థూలంగా దేశానికో,  ప్రాంతానికో, రాష్ట్రానికో సంబంధించినవిగా చెప్పుకుంటాము.విభేదనలకు గురికాబడ్డ కారణంగా మనం ఒక జాతిగా, రాష్ట్రంగా, ప్రాంతంగా రూపొందే క్రమంలో చరిత్రను స్థూలంగా చెప్పుకునే క్రమంలో, చాలాసార్లు సూక్ష్మ చరిత్రల్ని మనకు తెలియకుండానే తుడిచేస్తుంటాము. అలా తుడిచి పెట్టబడటానికి ఇష్టపడని ఒక సూక్ష్మ చరిత్ర స్థూల చరిత్రకు ఎదురు తిరిగిన ఈ కథ  చదివితే పాఠకుడికి ఆ వివేకం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. -వాడ్రేవు చినవీరభద్రుడు

Posted in December 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!