మహాలక్ష్మి ఇల్లు! బాల్కనీ లో నించుని తీవ్రంగా ఆలోచిస్తోందామె! ఏదో చెయ్యాలి. భర్త మనసు మళ్ళించి బాధ్యతల ఊబిలో కూరాలి. లేదా పరువు గంగలో కలిసిపోతుంది. తన ఫ్రెండ్ సుందరి గంట క్రితం కాల్ చేసి చెప్పింది. ఇక్కడ మనోహర్ లానే ఒకాయన ఉన్నాడనీ పక్కన ఎవరో ఆమె భుజం మీద చెయ్యెసి తమాషా చేస్తున్నాడని. కాదని దబాయించింది తను! ఇంకా ఇంకా ముందు ముందు ఇంకెన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో? కుటుంబ గౌరవం పోగొట్టుకోని ప్లాన్ వెయ్యాలి. మనోహర్ మత్తులో ఉన్నాడు. ఇప్పుడేమన్న అతను వినిపించుకోడు. మొదటికే మోసం వస్తుంది. ఏ మాత్రం తొందర పడకుండా, యాగీ చేయకుండా కట్టడి చేసే మార్గం వెదకాలి. ఇంక లౌక్యం ప్రదర్శించక తప్పదు. మర్నాడు మహాలక్ష్మి నిజంగా మహాలక్ష్మిలా వెలిగిపోయింది.
మనోహర్ కి ఎదురెళ్లి మునుపటిలా చాలా ఆదర పూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానించింది. తనకీ నటన తప్పదు. అతడితో నవ్వుతూ కబుర్లు చెప్పడం మొదలెట్టింది. ‘అంతా ఓకే కదా?’ అంటూ శశికళ విషయాల్ని కదిపీ కదపనట్టు కదపడం… చెప్పీ, చెప్పనట్టు చెప్తున్న మనోహర్ మాటలు ప్రశాంతవదనం తో వినడం, శశికళ తన ఆడపిల్లల్తో పడే కష్టాలు, హింసించి తరిమిన భర్త గురించీ చెప్తుంటే —
“పాపం! ఆడదానికి కష్టాలు ఎన్నటికీ తప్పవు కదా?” అంది సానుభూతిగా.
అదే విషయాన్ని శశికళ కి చెప్పి మహాలక్ష్మి నిండు మనసు గురించి పొగిడితే, సహించలేక అరికాలి మంట నెత్తికెక్కింది శశికి.
“నువ్వు అక్కడి విషయాలు నాకు చెప్పకు!” అనేసింది తొందరపడి.
మనోహర్ విస్తుపోయాడు. మహాలక్ష్మి కి, శశికళకి స్వభావాల్లో ఎంత తేడా? అనుకున్నాడు మొదటిసారిగా. మనోహర్ పెద్దకూతురు తల్లిని చూడాలనిపించి వారం కిందట వచ్చిందట. వెళ్తున్నప్పుడు తన దగ్గర మనుమడు బాగా మాలిమి అయ్యాడనీ వాడి ముద్దుమాటలు వింటానంటూ ఉంచేసి తాతయ్యకి దగ్గర చేసింది. మనోహర్ తరుపు బంధువుల్ని ఎవర్నో ఒకర్ని ఎప్పుడూ బంధుత్వాలు, రాకపోకలూ అంటూ ఆహ్వానించి ఇంట్లో ఉండేట్లు చేస్తోంది. మనోహర్‌కి చాలా చిక్కొచ్చి పడింది.
సాయంత్రం అయ్యేసరికి చుక్క పడని తాగుబోతులా శశి దగ్గరికి వెళ్ళకపోతే గిలగిల లాడుతున్నాడు. ఏదో బజారు పని ఉందని సిద్దమయితే బంధువు కూడా చెప్పులేసుకుని రెడీ గా ఉంటాడు. లేదా మనవడు ‘తాతా’ అంటాడు చేతులు చాస్తాడు. శశికి పీకల్దాక కోపం వచ్చేస్తోంది మనోహర్ మీద. ఎలాగో ఒకలా కేంప్ లంటూ రావడం మానేస్తున్నాడు.
ఆ వేళ శశికళ చిన్నకూతురు వారం రోజులు శలవిస్తే తల్లి దగర ఉండాలని “బడ్డీఎన్ క్లేవ్’ కి వచ్చింది. ఫ్లాట్ ఎంతో బాగుందని గెంతులేసింది చిన్నపిల్లలా. శశి మనోహర్ కి కాల్ చేసింది వచ్చి వెళ్తుంటే పిల్లలకి అలవాటు అవుతుందని, మనోహర్ వచ్చి పది నిముషాలు కూర్చుని ఆ అమ్మాయి తిరిగి హాస్టల్ కి వెళ్ళే వరకు మళ్ళీ రాలేదు. కూతురొస్తే తండ్రి ఇంట్లో ఉండకపోవడమేమిటి? అని లక్ష్మణ్ కి ‘డౌట్’ వచ్చి ఏదో ఉందని తీర్మానించుకున్నాడు. అప్పటి నుంచే మహేంద్రకి చీమ చిటుక్కుమన్న చేరవేస్తాడు.
శశికళ మనోహర్ దగ్గర తరచుగా ఏడవడం మొదలెట్టింది. పాపం! శశి ఏడుపులోనూ అర్ధం ఉంది. మనోహర్ బొత్తిగా నల్లపూసయిపోయాడు. ‘తనకీ గొడవేంటీ?’ అనిపిస్తోంది మనోహర్ కి.
తనేం చెయ్యగలడు? మహాలక్ష్మి, శశికళల మధ్య అతడు సతమతమవుతుంటే మనోహర్ చిన్న కూతురికి నెల తప్పిందంటూ విజయవాడ బయల్దేరింది మహాలక్ష్మి. ఈ సారి మాత్రం ఆమెకి వెళ్ళడం చాలా దు:ఖంగా ఉంది.
పైసా పైసా కూడబెట్టిన ధనం మూటగట్టి సముద్రంలో విసిరేస్తున్నట్టు ఇవ్వాళ తన జాగ్రత్తలన్నీ వృధాగా పోయి మళ్ళీ భర్త శశికళ దగ్గరకు చేరుతాడు. తనకి మళ్ళీ ఎన్ని పాట్లో?
ఆమె ఊహించినట్టుగానే మహాలక్ష్మిని బండెక్కించి హుషారుగా శశికళ ఒళ్లోవాలాడు. నెల రోజులపాటు లాంగ్ డ్రైవ్ లకి వెళ్ళి వచ్చారు. విచ్చలవిడిగా షికార్లు కొట్టారు. మహాలక్ష్మి తిరిగి వచ్చిందని కాల్ చేసినా మరో పదిహేను రోజులవరకు ఇంటి గుమ్మం తొక్కలేదు మనోహర్. తోడుగా ఉంటుందని వంటమనిషి కాంతం ని రమ్మంటే వెంటనే రైలెక్కి వచ్చేసింది. ఆవిడకి ఇల్లిల్లు తిరుక్కుని వంటలు చేసుకుంటూ బతకాలని లేదు...కొడుకు,కోడలు పెట్టే ఆరళ్ళు భరిస్తూ ఉండడం కంటే మనోహర్ గారింట్లో అయితే హాయిగా ఉండొచ్చని వచ్చేసింది. మనోహర్ భార్య వచ్చిందని తెలిసి కూడా ఇంటికి రాకపోవడం బొత్తిగా నచ్చలేదు.
******
మహాలక్ష్మి ఓపిక పట్టేదే గానీ కాంతం మాత్రం.. .ఓ ఊదరగొట్టేసింది. తను తోడొస్తానని చీల్చి చెండాడదామని నస పెట్టింది. ఇంకా ఆలోచించటమేమిటని తొందర పెట్టగానే నిజమేననిపించింది మహాలక్ష్మి కి. పెద్దకూతురు విడిచి పెట్టిన స్కూటీ ని చూసి కాంతం ఎవ్వరూ నడపకపోతే పాడయిపోతుందని వాపోతుంటే తనకి డ్రైవింగ్ వచ్చని చెప్పి చకచకా తీసేసి శుభ్రం చేసి నడిపేస్తోంది. మర్నాడు-
మనోహర్ ఆఫీస్ కి వెళ్ళాడని తెలిసాక కచ్చితంగా తెలిసాక ‘బడ్డీ ఎన్ క్లేవ్‘ కి బయల్దేరారిద్దరూ. కాంతం యమా స్పీడుగా నడిపిస్తోంది స్కూటీ. గేట్ దగ్గర స్కూటీ ఆగగానే లక్ష్మణ్ ‘ఎక్కడికి?’ అని నిలదీశాడు కాంతం ఆవేశం చూసి.
‘సుందరి మనోహర్ ని ఈ అపార్ట్మెంట్ లోనే కదా చూసిందని’ చెప్పింది! అవునో, కాదో అనుకుంటూ మహాలక్ష్మి నెమ్మదైన స్వరం తో శశికళ తన మిత్రురాలని చెప్పి ఫ్లాట్ నెంబర్ కనుక్కుంది. వాళ్ళిద్దరూ వెళ్ళాక ‘విషయమేమిటా?’ అని వెనకే వెళ్ళాడు లక్ష్మణ్!
శశికళ ఫ్లాట్ నుంచి కాంతం అరుపులు తీవ్రంగా వినిపిస్తున్నాయి. తిట్టితిట్టి పోస్తోంది. మహాలక్ష్మి గుమ్మం బయటే ఉంది. లక్ష్మణ్ ని చూసి తిరిగి వచ్చేస్తున్నట్టు ముందుకి అడుగేసింది. లిఫ్ట్ లోకి వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ లోకి వచ్చింది. కాంతం తిరిగి వస్తుంటే ఏంటి సంగతన్నట్టు చూసాడు. అదోలా నవ్వింది కాంతం. అర్ధమయిపోయింది లక్ష్మణ్ కి.
******
శశికళ మహాలక్ష్మిఇచ్చిన ‘రెండో అటాక్’ కి ఆవాక్కయిపోయింది. మొదటి సారి తను చూస్తుండగానే జుట్టు పట్టుకు కొట్టేసినా ఒక్క మాట మాట్లాడలేకపోయాడు మనోహర్. అసలు తనదే పొరపాటు. ‘మహా’ వచ్చి అన్నిరోజులయినా ‘ఇంటికెళ్లివస్తాను’ అన్నప్రతిసారీ మొహం ముడుచుకుంది. అలా రోజులు గడిచిపోయి ఇప్పుడు నెత్తి మీదకి తెచ్చుకుంది. అదే మాట అన్నాడు శశి తో మనోహర్. ‘ఏం చెయ్యగలదింక?
మరో పది రోజుల తర్వాత ఇంకో అటాక్, మరో పదిహేను రోజుల తర్వాత మరొకటి! అలా ఆటాక్స్ ఇచ్చి శశికళ కి శాంతి లేకుండా చేసింది మహాలక్ష్మి. తను ఒక్కమాటా మాట్లాడదు. కాంతం గోల చేసి పోతుంది. ఏమనగలదు శశి?
మనోహర్ బావమరిది చుట్టపుచూపుగా వచ్చి –
“ఏదోలే బావా? అయిందేదో అయింది. ఇక వదిలేయ్! మనది పరువుగల కుటుంబం కదా? నిన్ను నలుగురూ నాలుగు మాటలూ అంటే తట్టుకోగలవాచెప్పు!” అనునయిస్తూనే కాషన్ ఇచ్చాడు. శశికళ దగ్గరకు రాగానే శశి ఏడుపు. సహనం కోల్పోతున్నాడు మనోహర్. శశికళకి మహాలక్ష్మి ద్వారా కాంతం చేసే ఛీత్కారాలు, విదిలింపులు భరింపరానివిగా తయ్యారయ్యాయి.
మనోహర్ కి చెప్పుకుని ఏడుస్తుంటే –
“చస్తున్నాను శశీ! కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం. నా మర్యాద, పరువు మంట గలిసి నన్ను కాల్చుకు తినేట్టు ఉన్నాయి. మనమింక విడిపోక తప్పదు!” అనేశాడు.
నిశ్చేష్ట అయింది శశి. ఆమెకి కోపం తన్నుకు వచ్చింది.
“నేనంటే ప్రాణమన్నావ్! ఇదా? నన్నొదిలి ఉండలేనన్నావే!” అరిచి గుండెపట్టేసినట్టయింది శశికి. మనోహర్ చిరాగ్గా లేచి వెళ్ళిపోయాడు. పోతూ పోతూ లక్ష్మణ్ ని పక్కకు పిలిచి కొన్ని భారీ నోట్లు అతడి చేతిలో కుక్కి కాస్త కనిపెట్టుకు ఉండమనీ ముఖ్యమైన పనులమీద ఢిల్లీ వెళ్తున్నానని జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని ఆ కబురూ ఈ కబురూ చెప్తూ మహేంద్ర కి ఈ విషయాన్ని తెలియజేశాడు లక్ష్మణ్.
మొదటిసారిగా శశికళ ని పలుకరిస్తూ ఆమె ఫ్లాట్ కి వచ్చాడు మహేంద్ర. కళ్ళు తుడుచుకుంటూ ఆహ్వానించిందామె!
గంటన్నర తర్వాత మహేంద్ర ఫ్రెండ్ లాయర్ ‘స్వరజిత’ ని పరిచయం చేసుకుంది శశికళ. పరిస్థితుల్ని అతి జాగ్రత్తగా గమనించాలని హెచ్చరించాడు. లక్ష్మణ్ ని మహేంద్ర. ఇప్పుడతను శశికళ ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందో అనే అనుమానం తో “స్వరజిత’తో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాడు.
******
“ఇప్పుడింక స్టోరీ నెంబర్ 3. మూడో ఫ్లోర్. టూ బెడ్ రూమ్ ఫ్లాట్.” అన్నాడు లక్ష్మణ్ మహేంద్ర తో!
నవ్వాడు మహేంద్ర.
సాయంత్రపు నీరెండలో నిల్చుంది కవిత మెయిన్ గేటు దగ్గర. లక్ష్మణ్ పనేమీ లేక తన గాడి బయటే నించుని ఉన్నాడు. బయట రోడ్డు మీద పిల్లలందరూ అరుపుల్తో, కేకల్తో ఆడుకుంటూ గట్టిగా అరుస్తూ పగలబడి నవ్వుకుంటున్నారు. వాళ్ళ ఆటలు చూస్తూ నవ్వుకుంటున్న కవితని ఇంత తీరిగ్గా చూసి ఎరగడు లక్ష్మణ్.
“ఈ మొక్కలు ఎండిపోయి ఉన్నాయి. నీళ్ళు పొయ్యి!” అంది మూలగా ఉన్న ఎండిపోతున్న మొక్కల్ని చూపించి. నీళ్ళు పోసాడు. బ్లాక్ జీన్స్, పొట్టి ‘టీ ‘షర్ట్ లో ఉందామె. బాక్ పాకెట్ లోనుంచి సిగరెట్ పెట్టె తీసి, లేటర్ తో వెలిగించి దమ్ములాగి పొగ ని వదిలింది.
కళ్ళప్పగించి ‘ఒర్నీ యవ్వ!” అని మనసులో అనుకుంటుండగానే కారు తీసి సర్రున బయిటికి వెళ్ళి పోయింది. ఆమె ఎవ్వరితోనూ కలవదు. తన పని తను చేసుకుపోతుంది.
******
ఇప్పుడు స్టోరీ నెంబర్ 4. ఫోర్త్ ఫ్లోర్. టూ బెడ్ రూమ్ హౌస్!
“మీకు లెటర్ ఉందండీ!” రాకీ వెళ్తుంటే చెప్పాడు లక్ష్మణ్.
నిర్లక్ష్యంగా లెటెర్బాక్స్ డోర్ లాగి లెటర్ అందుకుని లోపలికి నడిచాడు. టి.వి. దగ్గర పెట్టి పేపర్ వెయిట్ పెట్టాడు.
“నా బుల్లి తుర్రు పిట్ట ఎక్కడికి వెళ్ళిందబ్బా తనకి చెప్పకుండా?” అనుకున్నాడు. స్తుతి ఫోటో చిన్న ఫ్రేమ్ లో అక్కడున్న టేబుల్ మీద ఉంది.
“నా చెక్కుబుక్కూ! ఏం చేస్తున్నావ్?” అనుకున్నాడు. ఈదురు గాలొచ్చినట్టు జూయ్ మంటూ వచ్చింది స్తుతి.
“ఎక్కడికి పోయావే పిట్టా?” అన్నాడు.
“అట్టా ఎగిరెగిరి ఇట్టా వచ్చాను పిట్టడా!” అంది.
“పోదామా గువ్వ పిట్టల్లా?”
“ఎడకేడికి?”
“సిద్దార్థ బర్త్ డే యార్! మరిచిపోయావ్వా?”
“అవును కదా? రెడీ అవు. ఇద్దరం ఒకేసారి. నువ్వటూ, నేనిటు!” అంటూ బెడ్ రూమ్ లో ఉన్న బాత్ రూమ్ లోకి వెళ్ళింది. ఆమె తీరుబాటుగా తయారయింది.
ఆమె గది తలుపు బయట గడియ వేసి తన వాష్‌రూమ్ లోకి వెళ్ళిపోయాడు. శాటీన్ రోజ్ కలర్ ఫుల్ గౌను, మేకప్ తో తలుపు తియ్యబోయింది. బోల్ట్ వేసి ఉండడం తో-
“కొంటె పిలగాడా!” పిలిచింది.
“అడిగిందిస్తావా?తీస్తా!”అడిగాడు.
‘ఇస్తా! ఇస్తా! తియ్ ముందు!” అంది.
కవ్వించి కవ్వించి తీశాడు. తీశాక స్తుతిని చూసి రెప్పవేయ్యలేదు. ‘పొగిడితే నెత్తి కెక్కుతుంది పోరి! గమ్మునుండడమ్ బెస్ట్!’ అనుకున్నాడు.
“ఇంత బాగా మేకప్ వేసుకోవడం ఎలా వచ్చు నీకు? ఇంతకు ముందు బ్యూటీ పార్లర్ లో పని చేశావా?” అన్నాడు వెక్కిరింతగా. ఆట పట్టిస్తున్నాడని గ్రహించి –
“చంపుతాన్రోయ్!” అంది.
తాను నక్కని తొక్కి పుట్టాడు. యమాలక్కీ! దీన్ని గానీ పెళ్లి చేసుకుంటే తన జీవితానికి తిరుగుండదు. ఆ గౌనేంటి... అయిదువేలో, ఆరువేలో ఉండదూ!” అనుకున్నాడు.
వాళ్ళిద్దరూ బైక్ మీద సర్రుమంటూ వెళ్తుంటే ‘మాయదారి సంత!’అన్నాడు లక్ష్మణ్. గట్టి నవ్వు వినిపించి చూస్తే చక్కని పైజామా కుర్తా తో ప్రశాంతంగా మహేంద్ర!
“అరె! ఇప్పుడే వచ్చాడు. అప్పుడే వెళ్తున్నాడా?” అనుకుంటూ నవ్వాడు.
“ఇప్పటి జనరేషన్! దేన్నీ, ఎవర్నీ లెక్కచేయ్యరు!” అన్నాడు వెళ్తూ. తల ఊపాడు వాచ్‌మేన్ లక్ష్మణ్!!
******
రాకీ, స్తుతి ల క్లాస్ మేట్ సిద్దార్థ పుట్టినరోజు పార్టీ గొప్ప ఊపందుకుంది. లిక్కరు కూడా ఉందక్కడ! సిద్ధార్థ తండ్రి మోడ్రన్ బిజినెస్ మాన్. తాగడం, దానికి తగ్గ డాన్స్ ఇప్పటి ఫాషన్ అంటాడు అతను సింపుల్ గా. తిన్నంత తింటున్నారు. తాగినంత తాగుతున్నారు. అదుపులేని స్వేచ్చ అక్కడ. ఎవ్వరేం మాట్లాడినా జోకే! పగలబడి ఎందుకు నవ్వుతారో తెలియదు.
“తాగనా?” అడిగింది స్తుతి. వద్దని పెదవి విరిచాడు రాకీ. ఈ లోపలే సుఖేందర్ ఫాస్ట్ గా వచ్చి స్తుతిని లాక్కెళ్ళాడు. మ్యూజిక్ సౌండ్ హఠాత్తుగా పెంచారు. సుఖేందర్ పెద్ద బిజినెస్ మాగ్నెట్ కొడుకు. ఈ రోజున్నట్టు రేపు ఉండడు. కొత్తగా వచ్చి కాలేజ్ లో జాయిన్ అయ్యాడు. వచ్చిన రోజు నుంచి స్తుతిమీదే కన్ను!
ఎంత బలవంతం చేసినా తాగనంది స్తుతి. సుఖేందర్ –
“రేప్పొద్దున్న మన పెళ్ళయ్యాక కూడా ఇలాగే ఉంటే బాగుండదు స్తుతీ!” అన్నాడు. అందరూ వింటున్నారు. ఆశ్చర్యం తో నోరు వెళ్ళబెట్టారు. స్తుతి ఏమి మాట్లాడలేదు. ‘ఆ అమ్మాయి పిచ్చి పిచ్చి గా ఉంది. అంతా పెద్దోడు పెళ్ళిదాకాఎలా వచ్చేశాడా?’ అని ఆశ్చర్యం, ఆనందం సంభ్రమం. వెంటనే రాకీ వైపు చూసింది. రాకీ నవ్వాడు. స్తుతి ఆ నవ్వుకి అర్ధం ఏమిటా? అని ఆలోచిస్తోంది. ఇంటికి వచ్చాక చెప్పాడు. ‘తాగి పేలుతున్నాడు’ అని. నిరాశగా అనిపించిదామెకి తన అందం మీద ఎంతో నమ్మకం స్తుతికి. ఎవడో ఆకాశరాజ కుమారుడు హంసవాహనం మీద మేఘాల దారిలో తన సామ్రాజ్యానికి ఎత్తుకుపోతాడని గాఢంగా నమ్మింది. లెటర్ బాక్స్ తీసి చూసింది. ఏదో ఉత్తరం వచ్చిందనీ టేబుల్ మీద పెట్టానని చెప్పాడు రాకీ. నిద్రపోయే ముందు లెటర్ తీసుకుని వెళ్ళిపోయింది.
మర్నాడు నిద్ర లేచాక స్తుతి మొహం లో ‘కళ’ లేకపోడాన్ని చూశాడు రాకీ. ఆమె కాలేజీకి తయారయి వెళ్తుంటే ఫాస్ట్ గా స్తుతి బెడ్ రూమ్ లోకి వెళ్ళి ఆమె తలగడ కింద లెటర్ ని కాలేజ్ వెయిటింగ్ రూమ్ లో కూర్చుని చదివాడు. స్తుతి తల్లి రాసిన ఉత్తరం అది!
తనని వాట్స్ ప్ లో బ్లాక్ చేసినా నువ్వెక్కడ ఉన్నావో మెసేజ్ ఇచ్చినందుకు సంతోషం. అసలు విషయం ఏమిటంటే – ‘తమ ఉద్యోగాలే తమ రెక్కలని, మీ నాన్నకి ఆడాళ్లతో తిరిగే రోగం ఉంది గనక, నీ చదువు నువ్వు శ్రద్దగా చదివేస్తే తప్ప నా ఒక్కదాని ఉద్యోగం మీదా ఆధారపడితే కష్టమనీ, ఎన్నో కష్టాలకోర్చి చదివిస్తున్నందుకు వెర్రి వేషాలెయ్యకుండా చదువు వెలగబెట్టమనీ సారాంశం.
అది చదివాక ‘మైగాడ్.. .మైగాడ్! అనుకున్నాడు రాకీ. మర్నాడు మరో ఉత్తరం వచ్చింది. స్తుతి చదివాక రాకీ కాలేజ్ వెయిటింగ్ రూమ్ లో చదివాడు. స్తుతి తండ్రి ఉత్తరం అది. అదే మేటర్!
ఆడదానికి తిరుగుళ్లు ఉన్నా భరిస్తున్నానని, శ్రద్దగా చదవకపోతే కుదరదన్నది దాన్లోని మేటర్. కళ్ళు బైర్లు కమ్మాయి రాకీ’కి. ‘ఓహో! ఇద్దరికీ వేరువేరు సెటప్ లు కాబోలు.. మళ్ళీ కలిసి సంసారం. ఆహా!ఓహో! అనుకున్నాడు. నయం! తాను ఇంకా తొందరపడలేదు. స్తుతి తండ్రి కారూ, గీరు చూసి మోసపోబోయాడు. దేవా!దేవా! ఏం సంసారం రా బాబూ! అనుకున్నాడు. ఇంటికెళ్ళి స్తుతి వేపు తేరీ, పారా చూశాడు. మాడిపోయేముందు బల్బులా ఉంది. ఏ మాత్రం తెలియనివ్వకుండా జారిపోదామని నిర్ణయించుకున్నాడు.
******
తనలో మార్పు కనబడకుండా మేనేజ్ చేస్తున్నాడు రాకీ. ఆ రోజు గమ్మత్తైన సంఘటన జరిగింది. కెవ్వుమనలేక తేలు కుట్టిన దొంగలా లోలోప ఏడ్చుకున్నాడు. రాకీకి ఓ ఉత్తరం వచ్చింది. అది ఎక్కడెక్కడో తిరిగి తిరిగి రాకీని వచ్చి చేరింది. ‘నాన్న ది ఏమి లక్కీయో!’ అనుకున్నాడు రాకీ. ఆ ఉత్తరం తెలుగులోనే ఉంది. తిట్టిన తిట్టు తిట్టకుండా బహు చక్కగా రాసిన తేట తెలుగు. ఒక సేఫ్టీ పిన్ను గుచ్చి పోష్ట్ చేయబడి, పార్వతీపురం నుంచి వచ్చినట్టు పైన రాయబడి ఉంది. ఆ పిన్నుకి మూడు ఉత్తరాలు గుచ్చబడి ఉన్నాయి. తల్లి “ఆరోగ్యం జాగ్రత్త!’ అని ఎంతో ప్రేమగా రాసింది. తండ్రీ, నాన్నమ్మల ఉత్తరాలు చదవదలుచుకోలేదు రాకీ. కానీ సరదాగా చదివితే ఏం పోయిందిలే! అనుకుంటూ విప్పాడు. నాన్న భలే రాస్తాడు. సంభోదనే అద్భుతం.
“ఒరే చెత్త నాయాల! దేభ్యమ్ మొహమా! ఎక్కడ చచ్చావో చెప్పి తగలడి చావు.” అంటూ ఎన్నెన్నో స్తుతులు స్తుతించాడు. “అడ్రసు కూడా ఇవ్వకుండా పోయావు గనక ఏదో ఒక రహస్యం ఉండే తీరుతుందని అది గనక తెలిస్తే చీల్చి చెండాడేస్తా”నని వార్నింగ్ ఇచ్చాడు.
ఇక నాన్నమ్మ ఉత్తరం.
“ఓరి గాలి నా కొడకా!” అని ఉంది. అబ్బాబ్బబ్బ! ‘ఏమి పిలిసావు ముసిలీ!’ అనుకున్నాడు.
అదిలా ఉంది.
“నా నగలన్నీ కాజేసిన సెత్త ఎధవ్వే అయినా మీ తాత పోలికలు అచ్చు గుద్దినట్టు వచ్చినందుకు మీ అబ్బకి చెప్పకుండా రాస్తున్న. నువ్ కనిపిస్తే నీకుంటుందిరా గాడిదా!”
అంది చివరిగా.
కళ్ళముందు ఇల్లు, అమ్మా, బామ్మ మెదిలారు. ఆలోచనల్లో అక్కడికి వెళ్ళిపోయాడు రాకీ.
****సశేషం****
రచయిత్రి పరిచయం ..పేరు: బులుసు సరోజినిదేవిప్రకాశం జిల్లా, దరిశిలో...జూన్ 29, 1956 లో జన్మించిన పట్టిసపు సరోజినీ దేవి, వివాహానంతరం బులుసు సరోజినీ దేవి అనే పేరుతో రచనలు మొదలుపెట్టారు. వీరి తల్లిదండ్రులు పట్టిసపు ఉమామహేశ్వరరావు గారు జోగులాంబ గారు . ఈమె 2010లో తన మొదటి కవితతోనే జాతీయస్థాయి రంజని కుందుర్తి అవార్డు సొంతం చేసుకొని రచనలను మొదలుపెట్టారు. 2011లో మరో జాతీయస్థాయి ఎక్స్ రే అవార్డును పొందారు. వీరి మొదటి కథ రంజని వారు సాధారణ ప్రచురణకి తీసుకున్నారు. తర్వాత నాలుగు కథలకు ప్రైజులని రంజని వారిచే పొందారు. వీరు రాసిన "శ్రీముఖి" అనే నాటిక జాతీయస్థాయి రెండవ బహుమతి పొందింది. సంగీత స్రష్ఠ శ్రీశ్రీ శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసి ఎంతో అదృష్టాన్ని కూడగట్టుకున్నారు. నాలుగు గురజాడ పురస్కారాలను అందుకున్నారు. వీరు 'కళామిత్ర' అనే బిరుదును పొందారు. ఉన్నత ప్రమాణాలు విలువలు కలిగిన రచనలు చేయడం వీరికి ఇష్టం. నాలుగు నవలలు, నాలుగు నాటికలు, దాదాపు 500 కథలు, 300 కవితలు, కొన్ని వ్యాసాలు రాశారు. వీరికి రచనలు చేయడం అంటే ఎంతో ఇష్టం. ప్రముఖుల ప్రశంసలు: తెలుగు సాహిత్య ప్రపంచంలో బులుసు సరోజినీ దేవి గారి పేరు వినని వారు ఉండరు. ఆమె రాసిన ఈ మూడు కథలు వైవిధ్యవంతమైన జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. 'రెండో పెళ్లి', 'బొంకుల దిబ్బ' అనే కథలు స్త్రీల వైపు నుంచి జీవితాన్ని చూడడానికి... పారాహుషార్ అనే కథ నన్ను నివ్వెరపరిచింది. ఒకప్పుడు టిప్పు సుల్తాన్ దాడికి గురైన ఆ కథ ఇప్పుడు చెప్పటంలో మరొక కొత్త సత్యం ఆవిష్కరణ ఆవిష్కారమవుతోంది. చరిత్రల్ని సాధారణంగా మనం స్థూలంగా దేశానికో, ప్రాంతానికో, రాష్ట్రానికో సంబంధించినవిగా చెప్పుకుంటాము.విభేదనలకు గురికాబడ్డ కారణంగా మనం ఒక జాతిగా, రాష్ట్రంగా, ప్రాంతంగా రూపొందే క్రమంలో చరిత్రను స్థూలంగా చెప్పుకునే క్రమంలో, చాలాసార్లు సూక్ష్మ చరిత్రల్ని మనకు తెలియకుండానే తుడిచేస్తుంటాము. అలా తుడిచి పెట్టబడటానికి ఇష్టపడని ఒక సూక్ష్మ చరిత్ర స్థూల చరిత్రకు ఎదురు తిరిగిన ఈ కథ చదివితే పాఠకుడికి ఆ వివేకం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. -వాడ్రేవు చినవీరభద్రుడు |